Suryaa.co.in

Political News

నక్కలని చేరదీస్తే .. ముంచేయరా?

-బ్రిటీషోడికున్న తెలివి కూడా లేకపోతే ఎట్టా పాలిస్తారయ్యా ?
( వాసిరెడ్డి అమర్నాథ్ )

1857 – బ్రహ్మాండం బద్దలయ్యింది . వాడు ఊహించని రీతిలో తిరుగుబాటొచ్చింది .
కేవలం సిపాయిలేనా ? అనేక ప్రాంతాల్లో .. ప్రజా తిరుగుబాటయ్యింది .

కస్టపడి ఎట్టాగో అణిచేసాడు .
ఆలోచనలో పడ్డాడు…

మన పరిపాలన పై ప్రజల్లో ఇంత వ్యతిరేకత ఉందా ?
అరెరే .. ముందే తెలిసుంటే బాగుండేది .

ప్రెషర్ కుక్కర్ కు సేఫ్టీ వాల్వ్ ..అంటే రక్షక కవాటముంటుంది. అది లేక పొతే… లోపల నీటి ఆవిరి ఒత్తిడి ఎక్కువయ్యి పేలే ప్రమాదముంది .

ప్రజల్లో ఉన్న అసంతృప్తి ఎప్పటికప్పుడు తెలియాలి .. దానికి ఒక వ్యవస్థాగతమయిన సేఫ్టీ వాల్వ్ ఉండాలి అని కాంగ్రెస్ స్థాపనకు అల్లెన్ ఆక్టావియాన్ హ్యూమ్ లాంటి బ్రిటిష్ పాలక వర్గం వాడు సాయం చేసాడు ….
ఇది చరిత్ర .

కాలం మారింది .
ఇప్పుడు..
రాజకీయ పార్టీ లు .
ప్రజల్లో అసంతృప్తి తెలియాలి . తెలిస్తే ఎప్పటికప్పుడు దానికి ఉపశమన చర్యలు చేపట్టొచ్చు .

రాజకీయాల్లో పుట్టి పెరిగిన మేధావులకు ప్రజల నాడి తెలియదా? తెలుసు ..
కానీ సమాజం లో భిన్న కోణాలు . అధికారంలో ఉన్నప్పుడు.. అన్ని కోణాల నుంచి సరైన ఫీడ్ బ్యాక్ వస్తుంది అనే గ్యారెంటీ లేదు .

అనగనగా ఒక ప్రభుత్వం .
ప్రభుత్వ పాఠశాలలు బాగుపడితే బడుగు బలహీన వర్గాలకు లబ్ది కలుగుతుంది .. అని .. నిధులు కేటాయించి అనేక చోట్ల భవనాలు… టాయిలెట్ లు లాంటి సౌకర్యాలు కలిగించింది.
మంచి విషయం కదా?
కేవలం బిల్డింగ్ తో నాణ్యమయిన విద్య అందుతుందా ?
విద్య అంటే టీచర్ లు .
ప్రభుత్వ టీచర్లు .. అందరూ కాదు .. కొంత శాతం .. సరిగా పని చేయరు . పాఠం చెప్పరు .

ఇప్పుడేమి చెయ్యాలి ?
క్లాస్ రూమ్ ఇన్స్పెక్షన్ ..
పని చేసే వారిని అభినందించాలి .
చేయని వారిని మందలించాలి .

దీని కోసం ఒక అధికారిని రంగం లోకి దింపింది .

పాపం మనిషి మంచోడే .
కానీ .. అతి .. మహా అతి …
అసలే తిరుగు లేని అధికారం .. వాస్తవ పరిస్థితులని బేరీజు వేసుకోకుండా .. టీచర్ లను తిట్టడమే పనిగా పెట్టుకొన్నాడు ..
టీచర్ అంటేనే ఆత్మాభిమానం ..
రెండు పూట పస్తులుంటాడు కానీ… అవమానాన్ని భరించలేడు.
పిల్లలకెదురుగా తిడితే… వారిలో కసి పుట్టదా ?

జరిగింది అదే .. ఒక్కో నియోగజక వర్గం లో ఈ అతి గారి వల్ల వెయ్యి రెండు వేల ఓట్లు జంప్ . ఒక్కో నియోజక వర్గంలో అంత మంది ప్రభుత్వ టీచర్స్ ఉన్నారా? అని అడగకండి .

కసి .. మహా కసి .. బంధువులకు.. మిత్రులకు చెప్పి మరీ ప్రతిపక్షాలకు వేయించారు .
జస్ట్ ఇది ఒక కోణం .. ఉదాహరణకు కోసం
ప్రజల్లో ఫీలింగ్స్ తెలియక పొతే వచ్చే నష్టం ఎలా ఉంటుందో తెలియ చెప్పడం కోసం

పైడ్ ఏజెంట్స్ ..
భారత రాజకీయ పార్టీలు ఈ విషయాన్ని ఎప్పుడో గ్రహించాయి . ఫలితమే .. ఏజెంట్ గోపి లు ..
ప్రశాంతంగా డబ్బులు తీసుకొని రాజకీయ పార్టీ లకు సూచనలు సలహాలు ఇచ్చే వారొచ్చారు .

ఇప్పుడు ఇంకో కథ చెబుతా !
అదొక రాజకీయ పార్టీ .. అధికారం కోల్పోయింది . అవతలి పక్షానికి బీహార్ నుంచి వచ్చిన ఏజెంట్ గోపి వున్నాడు .
మనకు లేకపోవడం వల్లే ఓటమి అనుకొని ఇక్కడి వాడిని ఈ పనికి కుదుర్చుకుంది .

వాడు మహా ముదురు .. వీరికి సూచనలు సలహాలు ఇస్తూనే.. ఇక్కడి విషయాలు అక్కడికి చేర వేయడం మొదలెట్టాడు . ఆరా తీసి విషయం తెలుసుకొన్న పార్టీ యువ నాయకుడు .. నువ్వు పోరా నాయినా అని సాగనంపాడు .

ఆ కోపంతో కౌటింగ్ కు రెండు రోజుల ముందు ఈ పార్టీ ఓడిపోతుంది అని బోగస్ సర్వే వదిలాడు .
తన బోగస్ సర్వే వల్ల తనను వొగ్గేసిన పార్టీ కి నష్టం కలగదు అన్న కామన్ సెన్స్ లేనోడు ..
ఇంతోసి మేధావులను సలహాల కోసం కుదుర్చుకున్న వారిని ఏమనాలి ?
ఈయన బోగస్ సర్వే వల్ల .. అధికార పార్టీ అభిమానులు బెట్టింగ్స్ లో నష్టపోయారు .
ఇది కేవలం కథ మాత్రమే .. నిజ జీవితం తో సంబంధం లేదండోయ్ ..

ఏమయ్యా రాజకీయ నాయకులూ .. మీకు ఇంత తెలివి తెలివితేటలున్నాయి కదా ? ఇంతబతుకు బతికి… అని సామెత చెప్పినట్టు .. నక్కలని చేరదీస్తే .. ముంచేయరా ?
ఇంత సువిశాల సమాజం లో సూచనలు సలహాల కోసం మంచి వారే కరువయ్యారా ?

మీరిచ్చే డబ్బులు .. బిరుదులు.. బుగ్గ కార్లు కోసం కాదు .. పిలిచి ” ఏమండీ .. ఈ విషయం పై మీ అభిప్రాయం చెప్పండి” అంటే… సొంత వాహనం లో వచ్చి ఫ్రీ గా.. సంతోషంగా సలహాలు ఇచ్చి పోతారు కదా స్వామి .
సింగపూర్ గురించి తరచూ మాట్లాడుతుంటారు ఇక్కడి నాయకులు. అక్కడి ప్రభుత్వం మేధావులను .. నిపుణులను పిలిచి సలహాలు తీసుకొంటుంది అనే విషయం తెలియదా?

LEAVE A RESPONSE