Suryaa.co.in

Andhra Pradesh

ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపు కోసం జగన్ రెడ్డి నిస్సిగ్గుగా దొంగఓట్లు నమోదు చేయించాడు

– గ్రాడ్యుయేట్, ఉపాధ్యాయ పొరపాటున వైసీపీ బలపరిచిన అభ్యర్థులు గెలిస్తే ప్రజాస్వామ్యం చచ్చినట్టే
– వాలంటీర్లు, అధికారులు, వైసీపీనేతల సాయంతో 63వేల బోగస్ ఓట్లు నమోదుచేయించిన ఘనుడు ముఖ్యమంత్రి
– డిసెంబర్ 29న ఫైనల్ ఓటర్ లిస్ట్ వచ్చేనాటికి ఓటర్లనమోదులో జరిగిన అవకతవకల్ని ప్రభుత్వం సరిచేయకుంటే, న్యాయస్థానాల ద్వారా పాలకుల కుతంత్రాన్ని భగ్నంచేస్తాం.
– దొంగఓట్లతోనే వచ్చే ఎన్నికల్లో జగన్ రెడ్డి, 175కి 175 స్థానాలు గెలిచే ఆలోచన చేస్తున్నాడనిపిస్తోంది : మాజీ ఎమ్మెల్సీ ఏ.ఎస్.రామకృష్ణ.
– టీడీపీ ఎమ్మెల్సీ పరుచూరి అశోక్ బాబు, మాజీ ఎమ్మెల్సీ ఏ.ఎస్.రామకృష్ణ

మార్చి 2023లోజరగబోయే 3గ్రాడ్యుయేట్, 2 ఉపాధ్యాయఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికారపార్టీ బలపరిచిన అభ్యర్థుల గెలుపుకోసం, జగన్ రెడ్డి ఆయన పార్టీనేతలు, వాలంటీర్లు, అధికారు లు కలిసి కుయుక్తులతో కుట్రలకు పాల్పడుతున్నారని, యథేచ్ఛగా అనర్హులని గ్రాడ్యుయేట్ ఓటర్లుగా నమోదుచేయించారని టీడీపీ ఎమ్మెల్సీ పరుచూరి అశోక్ బాబు తెలిపారు. మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో శనివారం ఆయన మాజీఎమ్మెల్సీ ఏ.ఎస్. రామకృష్ణతో కలిసి విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు వారిమాటల్లోనే … “మార్చి 2023లో జరగబోయే పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధిం చిన ఓటర్ నమోదు ప్రక్రియ డిసెంబర్ 9వతేదీతో ముగిసింది. మనరాష్ట్రంతో పాటు మరికొన్ని రాష్ట్రాల్లో పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు జరగబోతున్నాయి. మనరాష్ట్రంలో తప్ప మరే రాష్ట్రంలో ఓటర్లనమోదుకు సంబంధించి ఎలాంటి ఫిర్యాదులు లేవు.

గ్రాడ్యుయేట్ ఓటర్ల నమోదులో ఏపీలోనే లెక్కకుమిక్కిలి అవకతవకలు…
ఏపీలో జరిగిన గ్రాడ్యుయేట్ ఓటర్ల నమోదులో మాత్రం లెక్కకు మిక్కిలి అవకతవకలు జరిగాయని ఎన్నికలసంఘమే అభిప్రాయపడింది. వైసీపీప్రభుత్వం వాలంటీర్ వ్యవస్థ సాయంతో ప్రతి ఇంటికి తిరిగి, పట్టభద్రుల వివరాలు సేకరించింది. 07-11-2022 నాటికి డ్రాఫ్ట్ ఓటర్ లిస్ట్ కు సంబంధించి ఓటర్ నమోదు ప్రక్రియ పూర్తైంది. డ్రాఫ్ట్ ఓటర్ లిస్ట్ ప్రకారం పట్టభద్ర ఓటర్లు 9.60లక్షల మంది నమోదయ్యారు. ఓటర్ల నమోదులో ఆన్ లైన్, ఆఫ్ లైన్ పద్ధతిని అవలంభించారు. ఆఫ్ లైన్ విధానం అంటే ప్రభుత్వకార్యాలయాల్లో అధికారుల పరిశీలనలో జరిగే ఓటర్లనమోదు ప్రక్రియ. దీనిలోనే ప్రభుత్వం భారీగా అవకతవకలకు పాల్పడింది. 7వ తేదీతో ఓటర్లనమోదు ప్రక్రియ ముగుస్తున్నందున, 6వతేదీ ఒక్కనాడే ఒక్క నియోజకవర్గం (తూర్పురాయలసీమ-నెల్లూరు, ఒంగోలు, చిత్తూరు జిల్లాలు) లోనే 85,110 దరఖాస్తులు వచ్చినట్టు ప్రభుత్వమే చెప్పింది. వాటిలో 30,423 దరఖాస్తులు ఆన్ లైన్ లో రాగా, 54,687 దరఖాస్తులు ఆఫ్ లైన్ విధానంలో వచ్చాయి. ఈ విధంగా వచ్చిన దరఖాస్తుల్లో నెల్లూరు, తిరుపతి, ప్రకాశం జిల్లాలనుంచే 78వేల దరఖాస్తులు రావడం ఆశ్యర్యాన్ని కలిగించింది. ఈవిషయాన్నే తాము ఎన్నికలకమిషన్ దృష్టికి కూడా తీసుకెళ్లా ము. దరఖాస్తులు వచ్చినంతవేగంగా, ప్రభుత్వ కార్యాలయాల్లో ఓటర్లుగా నమోదు కావడా నికి వచ్చే గ్రాడ్యుయేట్ల సందడి కనిపించకపోవడం కూడా పలు అనుమానాలకు తావిచ్చింది.

దొంగఓటర్లను నమోదుచేయించిన అధికారుల్ని వదిలిపెట్టం…
ఒక ఏపీఎంవో 100 పట్టభద్రుల ఓటర్ నమోదు దరఖాస్తులు తీసుకెళ్లి, కొండెపి నియోజకవర్గ వైసీపీనేతకు ఇచ్చాడని ప్రముఖపత్రికలో వార్తకూడా వచ్చింది. దొంగఓట్ల నమోదులో ప్రమేయం ఉన్న ప్రభుత్వ ఉద్యోగుల్ని వదిలిపెట్టేది లేదు. వారిపై కూడా ఆధారాలతో సహా కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదుచేస్తాం. తప్పుడుసమాచారం ఇవ్వడం ఎన్నికల నిబంధనలకు విరుద్ధమని తెలిసికూడా, వైసీపీ చాలాచోట్ల ఇష్టానుసారం వ్యవహరించింది. పట్టభద్రుల్ని ఓటర్లుగా నమోదుచేయడం.. ఫైనల్ గా ఓటర్ల లిస్ట్ రావడం అంతా జరిగింది. ఓటర్ల లిస్ట్ ను పరిశీలించాక మరిన్ని విస్తుగొలిపేఅంశాలు బయటకు వచ్చాయి.

నెల్లూరు, తిరుపతి, ఒంగోలు ప్రాంతాల్లో ఇంటర్ పూర్తిచేసినవారు, 10వ తరగతి విద్యార్థుల్నికూడా ప్రభుత్వం పట్టభద్రుల ఓటర్లుగా నమోదుచేసింది. ఈ ప్రభుత్వంలో ఎవరూ స్వచ్ఛందంగా పట్టభద్ర ఓటర్లుగా నమోదుకావడానికి ఇష్టపడనందునే ప్రభుత్వం ఈ విధంగా దొడ్డిదారిలో ఓటర్లనమోదుకు శ్రీకారంచుట్టింది. ప్రభుత్వ తీరుపై ఆధారాలతో సహా ఎన్నికల కమిషన్ కు 6వ తేదీన పిర్యాదు చేశాము. తిరుపతిలో అభ్యర్థులపేర్లు, వివరాలు, అతని ఉత్తీర్ణత సమాచారం లాంటివాటిని సేకరించి, దాదాపు 51 ఓటర్ల సమాచారాన్ని అందించాము. తామిచ్చిన సమాచారంలోని గ్రాడ్యుయేట్లు అందరూ ఓట్లు వేయడానికి అనర్హులేనని కూడా తేలింది.

స్థానిక ఎన్నికల కమిషన్ జాప్యంచేస్తుండంతో, ఢిల్లీ వెళ్లి మరీ ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదుచేశాము. కేంద్రఎన్నికల సంఘం, రాష్ట్రంలో జరిగిన ఓటర్లనమోదు ప్రక్రియపై దృష్టి పెడతామని చెప్పింది. పట్టభద్రుల నమోదులో జరిగిన అవకతవకలు, దారుణాలపై కేంద్రఎన్నికల సంఘం స్పందించాలని, పూర్తిస్థాయిలో విచారణ జరపాలని కోరాము. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్లనమోదుపై తాము లేవనెత్తిన అభ్యంతరాలపై నేడు కొన్నిపత్రికల్లో కూడా కథనాలువచ్చాయి.

ఈ ప్రభుత్వం నమోదుచేయించిన 85వేల పైచి లుకు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓట్లలో 63వేలఓట్లు బోగస్ అని, ఓటర్లుగా నమోదైన వారి వివరాలన్నీ తప్పుల తడకలని, ఎన్నికల సంఘం కార్యాలయంలోనే ఈ సమాచారం ఉందని సదరుపత్రికాకథనాల్లో పేర్కొన్నారు. 63వేల బోగస్ ఓట్లు నమోదుకావడంపై వైసీపీప్రభుత్వం సమాధానం చెప్పాలి.

వైసీపీ ప్రభుత్వం గంపగుత్తగా ఇచ్చిన 54వేల ఓటర్ నమోదు దరఖాస్తులపై ఈసీ దర్యాప్తు జరపాలి…
ఓటర్ల నమోదులో ప్రభుత్వం గ్రాడ్యుయేట్లుకానివారు, పేర్లు తప్పున్నవారు, ఇంటి చిరునామాలు సరిగా లేనివారు చాలామంది ఉన్నారు. ఓటర్లనమోదుకు సంబంధించి నవంబర్ 6న ప్రభుత్వం గంపగుత్తగా ఇచ్చిన 54వేల ఓటర్ నమోదు దరఖాస్తులపై క్షుణ్ణంగా విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా వాలంటీర్ల ప్రమేయాన్ని కూడా కట్టడిచేయాలని ఎన్నికల కమిషన్ ను కోరుతున్నాం. ఏదోరకంగా దొంగఓట్లు, ప్రలోభాలతో గ్రాడ్యుయేట్, ఉపాధ్యాయఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలవాలన్న దురుద్దేశంలో జగన్ రెడ్డి ఉన్నారు. డిసెంబర్ 29న ఫైనల్ ఓటర్ లిస్ట్ వచ్చేనాటికి ఓటర్లనమోదులో జరిగిన అవకతవకల్ని ప్రభుత్వం సరిచేయాలని డిమాండ్ చేస్తున్నాం. గ్రాడ్యుయేట్, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలను గెలవడంకోసం జగన్ ప్రభుత్వం ఇంత నీచస్థితికి దిగజారడం బాధాకరం. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్లుగా నమోదైన వారి వివరాలుసేకరించడం ప్రభుత్వానికి పెద్దపనేం కాదు. జగన్ ప్రభుత్వం ఈ విషయాన్ని తేలిగ్గా తీసుకుంటే, అన్ని పార్టీలను కలుపుకొని ఎంతదూరం వెళ్లడానికైనా సిద్ధంగానే ఉన్నాం” అని అశోక్ బాబు తేల్చి చెప్పారు.

టెర్రరిజం విధానాలతోనే వచ్చే ఎన్నికల్లో జగన్ రెడ్డి 175 స్థానాలు గెలవాలనుకుంటున్నాడా? : మాజీ ఎమ్మెల్సీ ఏ.ఎస్.రామకృష్ణ
“ఆఫ్ఘనిస్తాన్, పాకిస్థాన్, ఇరాక్, శ్రీలంక వంటి దేశాల్లో టెర్రరిజం ఎక్కువగా ఉంటుందని చెప్పుకునేవాళ్లం. కానీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ఆయన ప్రభుత్వం రాష్ట్రంలోనే టెర్రరిజాన్ని పెంచి పోషిస్తోంది. వాలంటీర్ వ్యవస్థద్వారా ఏమైనా చేయొచ్చని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే వారిద్వారా ప్రతిపక్షపార్టీలను బెదిరించడం, ప్రజలను భయపెట్టడం, ప్రభుత్వసభలకు జనాలను తరలించడం, వంటిపనులు ప్రభుత్వం చేయిస్తోంది. సాక్షి పేపర్ కు అని, మొబైల్ బిల్ అని సంవత్సరానికి ఈ ప్రభుత్వం వాలంటీర్ల కోసం రూ.1900కోట్లు ఖర్చుపెడుతోంది. ప్రజలకు అవసరంలేని ఒక వ్యవస్థను జగన్మోహన్ రెడ్డి ఎందుకు సృష్టించారో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వారిద్వారా జరిగిన ఓటర్ల నమోదు ప్రక్రియ చూస్తే అర్థమవుతుంది. ఈ ప్రభుత్వం అన్నివర్గాలకు కీడు చేసిందనే భావనలో ప్రజలు ఉన్నాకూడా తామే అధికారంలోకి వస్తామని, 175కు 175 స్థానాలు గెలుస్తామని ఎలా చెప్పగలుగుతున్నారనే సందేహాలకు వాలంటీర్ వ్యవస్థనే జగన్ రెడ్డి సమాధానంగా చూపుతున్నాడు అని చెప్పొచ్చు.

ఏం చేసైనా గెలవాలన్న కుతంత్రంతో డూప్లికేట్ ఓట్లను నమ్ముకున్న వైసీపీ బలపరిచిన అభ్యర్థులు ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిస్తే, ప్రజాస్వామ్యం చచ్చినట్టే లెక్క…
రాష్ట్రంలో మూడుచోట్ల జరిగే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు, రెండుచోట్ల జరగబోయే ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏంచేసైనా గెలవాలన్న దుర్మార్గపు ఆలోచనలో ప్రభుత్వం ఉంది. అటువంటి దుర్మార్గపు ఆలోచనలను అమలుచేసేక్రమంలోనే ప్రభుత్వం పట్టభద్రులు ఎమ్మెల్సీ ఓటర్లుగా దొంగలను, అనర్హులను నమోదుచేసింది. ఓటర్లనమోదులో పాల్గొనకుండా వైసీపీనేతలు, వాలంటీర్లసాయంతో దొంగఓటర్ల నమోదులో నిమగ్నమయ్యారు. అధికారపార్టీ ఎమ్మెల్యేలే స్వయంగా వాలంటీర్లు, స్థానిక నాయకుల్ని ఆదేశించి, దొంగఓట్ల నమోదులో తమవంతు పాత్ర పోషించారు. ఇంతకంటే దారుణం మరోటి ఉంటుందా? పొరపాటున రేపు వైసీపీ అభ్యర్థులు గెలిస్తే, ప్రజాస్వామ్యం చనిపోయినట్టే లెక్క. డిగ్రీ చదివినవారు మాత్రమే ఓటర్లుగా నమోదుకావాల్సి ఉంటే, 1, 2, 3 వ తరగతి కూడా చదవని వారిని గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటర్లుగా నమోదుచేయడం దుర్మార్గంకాదా? ఇంటర్, 10వ తరగతి పూర్తైన వారు గ్రాడ్యుయేట్లు అవుతారా? ఇలాంటి దొంగల్ని ఓటర్లుగా నమోదుచేయడం, దొంగల్ని ఓటర్లుగా నమోదుచేయడం కాక మరేమిటి? ఈ ప్రభుత్వం నిజాయితీగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలవాలనుకుంటే, అర్హులైన వారిని మాత్రమే ఓటర్లుగా నమోదుచేయించాలి.

ఒక నియోజకవర్గం పరిధిలోనే 55వేలమందిని ఫిజికల్ గా ఓటర్లుగా ఎలా నమోదు చేయగలిగారో ప్రభుత్వం చెప్పాలి. చంద్రబాబునాయుడు, ఇతర ప్రతిపక్షనేతలు ప్రజల్లోకి వెళ్లి, ప్రభుత్వవైఫల్యాలు, అవినీతిని ఎత్తిచూపుతుంటే, మరోపక్క పాలకులు దొంగఓటర్ల సాయంతో ఎన్నికల్లో గెలవడానికి ప్రయత్నాలు మొదలెట్టింది. అర్హతలేని అనామకులు, ఊరుపేరుకూడా సరిగాలేనివారు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీఎన్నికల్లో ఓటర్లుగా ఓటేస్తే, ప్రజాస్వామ్యం అభాసుపాలు కావడమే కాకుండా, రాష్ట్ర భవిష్యత్ మొత్తం అగమ్యగోచరం అవుతుంది. రాష్ట్ర ఎన్నికల సంఘం తక్షణమే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ నమోదైన దొంగఓటర్ల వివరాలు పరిశీలించి, అనర్హులను జాబితానుంచి తొలగించాలి. విశాఖజిల్లా పెందుర్తిలో ఓటర్లజాబితాలో మూడుచోట్ల ఒకేపేరుతో ఉన్న ఓటర్ వివరాలు నమోదుచేశారు. ఇలాంటి టెర్రరిస్ట్ కార్యక్రమాలు, వైసీపీ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ఇంకెన్నిచేసిందో ఎన్నికల కమిషనే తేల్చాలి” అని రామకృష్ణ విజ్ఞప్తిచేశారు.

LEAVE A RESPONSE