Suryaa.co.in

Andhra Pradesh

పేదలకు కార్పొరేట్ వైద్యం దూరం చేసిన జగన్ రెడ్డి

• ఆరోగ్యశ్రీ కింద పేదలకు వైద్య సేవలు జగన్నాటకమే
• ఉచిత వైద్యం రూ. 25 లక్షలకు పెంపు ఎన్నికల జిమ్మిక్కులో భాగమే
• తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు డోలా బాలవీరాంజనేయ స్వామి

నాలుగున్నరేళ్లుగా ప్రజారోగ్యాన్ని గాలికొదిలేసిన జగన్ రెడ్డి ఎన్నికలు సమీపిస్తుండటంతో జిమ్మిక్కులు చేస్తున్నారు. ఇకపై ఆరోగ్యశ్రీ కింద రూ. 25 లక్షల వరకూ ఉచిత వైద్యం అందిస్తామని ముఖ్యమంత్రి చెప్పడం విడ్డూరంగా ఉంది. నెట్ వర్క్ ఆస్పత్రులకు రూ. 1000 కోట్ల బకాయిలు చెల్లించకుండా పేదలకు కార్పొరేట్ వైద్యం దూరం చేసిన జగన్ రెడ్డి ప్రచారార్భాటాలు చేసుకోవడం సిగ్గుచేటు. ప్రాణాపాయ స్థితిలో ఆరోగ్యశ్రీ కింద వైద్యం అందనప్పుడు ప్యాకేజీ రూ. 25 లక్షలు పెంచితే ఏంటి ? కోటికి పెంచితే ఏంటి? అక్కరకు రాని జగన్ రెడ్డి గొప్పలు పేదల ప్రాణాలు నిలబెడతాయా? మాటలు కోటలతో ఆరోగ్య విప్లవం వచ్చేస్తుందా?

ఆరోగ్యశ్రీ కింద వైద్యం అందక పేదలు ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లాల్సి వస్తోంది. దొరికిన చోటల్లా డబ్బులు తీసుకుని అప్పులపాలవుతున్నారు. ఇవేమీ జగన్ రెడ్డి కళ్లకు కనిపించడంలేదా? తెలుగుదేశం హయాంలో ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా , సీఎమ్ ఆర్ ఎఫ్ ద్వారా పేదలకు మెరుగైన వైద్యం అందించాం. పథకాలను పారదర్శకంగా అమలు చేశాం. మరి జగన్ రెడ్డి చేసిందేంటి? ఆరోగ్యశ్రీని అనారోగ్యశ్రీగా మార్చింది నిజం కాదా?ప్రభుత్వాసుపత్రులను నరకకూపాలుగా తయారుచేసింది వాస్తవం కాదా ? ఇకనైనా జగన్ రెడ్డి బూటకపు మాటలు కట్టిపెట్టాలి. ముఖ్యమంత్రి గారికి పేద ప్రజల ప్రాణాలపై ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా తక్షణమే ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించాలి. ప్రతి పేదవాడికి కార్పొరేట్ వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలి.

LEAVE A RESPONSE