– మీడియా సమావేశంలో స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్
మంగళగిరి : జగన్ పేద విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేస్తున్నారని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ఆరోపించారు. బుధవారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. అసెంబ్లీకి రాకుండా కుర్చీ కావాలంటూ చిన్న పిల్లాడు లాలీపాప్ కోసం ఏడ్చినట్లు, జగన్ తన ప్యాలెస్‌లో కూర్చుని డ్రామాలు ఆడుతున్నారు… రాష్ట్ర ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నా, అతను మాత్రం ప్యాలెస్‌లో రాజకీయ నాటకాలు ప్రదర్శిస్తున్నారు… నర్సీపట్నం వెళ్తారట.. మెడికల్ కాలేజీలను చూస్తారట. కానీ ఈ రాష్ట్రంలో జగన్ చేత కట్టిన ఒక్క మెడికల్ కాలేజ్ కూడా లేదని ఆయన విమర్శించారు. అయినా కూడా తనే కట్టానని, ప్రజలు చూసి ఆహా ఓహో అంటారని తెగ ప్రగల్భాలు పలుకుతున్నారన్నారు. ఇంకా, ఏమన్నారంటే…
కొంచెమైనా సిగ్గు ఉండాలి జగన్‌కి. ఉత్తరాంధ్ర గురించే మాట్లాడదాం. నర్సీపట్నం మెడికల్ కాలేజ్ అంచనా వ్యయం 500 కోట్లు. కానీ ఖర్చు చేసింది కేవలం 11.7 కోట్లు మాత్రమే. పార్వతీపురం కాలేజ్‌కి 600 కోట్ల అంచనా అయితే కనీసం టెండర్లు కూడా పిలవలేదు. విజయనగరం కాలేజ్‌కి 500 కోట్లు అంచనా.. ఖర్చు 84 కోట్లు మాత్రమే. పాడేరు కాలేజ్‌కి 500 కోట్లు అంచనా.. ఖర్చు 116 కోట్లు మాత్రమే. మొత్తంగా ఈ నాలుగు కాలేజీలకు అంచనా వ్యయం 2100 కోట్లు అయితే ఖర్చు చేసింది కేవలం 212 కోట్లు, అంటే 10 శాతం మాత్రమే.
ఈ స్థాయిలో అసలు పనులేం జరగకపోయినా జగన్ మాత్రం నేను అద్భుతం చేశానంటూ ప్రచారం చేస్తూ .. ఇప్పుడు ఏకంగా ఫోటోషూట్ల కోసం నర్సీపట్నం వెళ్తున్నాడు. అక్కడ జగన్ ఏం చూపిస్తాడు. అక్కడున్నది ముళ్లకంచెల మధ్య నిలిచిన నిర్మాణాలే! వాటిలో ఐసీయూలు లేవు, క్లాస్‌రూములు లేవు, బోధన సదుపాయాలు లేవు. అలాంటి ముళ్లకంపల్లోనే ఇప్పుడు ప్రజలు ట్రీట్మెంట్ తీసుకుంటారా జగన్? ఇదేనా మీ నిర్వాకం. మీరు చూపించాల్సినది నర్సీపట్నం కాదు, మీ రిషికొండ ప్యాలెస్‌నే! అదే నీ నిజమైన అద్దం.
నేడు పేద విద్యార్థులు చదవడానికి కాలేజీలు పూర్తి కాకపోయినా, జగన్ మాత్రం ప్రజల డబ్బుతో తన కోసం స్నానాల ప్యాలెస్ కట్టించుకున్నారు. అదే రిషికొండ ప్యాలెస్! దానికి మాత్రం 500 కోట్లు ఖర్చు చేశాడు. అందులో మసాజ్ టేబుల్లు, స్నానాల తొట్టెలు, లక్షల కబోర్డులు.. అబ్బో చూడ్డానికి రెండు కళ్లూ చాలవు. ఎందుకంటే జగన్ వాటికే ఎక్కువ ప్రాధాన్యతనిస్తాడు మరి. ప్రజలు మొన్న ఎన్నికల్లో మీ అహంకారానికి, మీ అవినీతికి సరైన సమాధానం ఇచ్చారు. అయినా సిగ్గు లేకుండా మాట్లాడుతున్నావా జగన్?
పీపీపీ విధానం చాలా దుర్మార్గమని నేడు చెప్పే జగన్, ఆరోగ్యశ్రీ ప్రారంభించినప్పుడు తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూడా పీపీపీ మోడల్లోనే ప్రైవేట్ హాస్పిటల్స్‌తో ఒప్పందాలు చేసుకున్నారని తెలుసుకోవాలి. అప్పుడు అది మంచి మోడల్. ఇప్పుడు చంద్రబాబు చేస్తే మాత్రం చెడ్డదట! ఇంకా వాస్తవం ఏంటంటే, జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2021–22లో తానే స్వయంగా రాష్ట్రవ్యాప్తంగా 16 మెడికల్ హబ్బులు పీపీపీ మోడల్లో నిర్మించడానికి టెండర్లను పిలిచారు. 13 ఉమ్మడి జిల్లాలు, 3 కార్పొరేషన్లు కలిపి మొత్తం 16 లొకేషన్లు.. ఇవన్నీ పీపీపీ పద్ధతిలో చేద్దాం.. రండి నిర్మిద్దాం.. అంటూ జగన్ టెండర్లను పిలిచినా ఒక్కరు కూడా రాలేదు. ఎందుకంటే పెట్టుబడిదారులు అడిగిన మొదటి ప్రశ్న “మా జె టాక్స్ ఎంత కడతావ్ జగన్? అని. కానీ జగన్ తాడేపల్లిలో కూర్చొని వ్యాపారులను బెదిరిస్తే, ఎవరు వస్తారు పెట్టుబడులు పెట్టడానికి? ఇదే నమ్మకం కోల్పోయిన జగన్ పాలన ఫలితం.
ఇక ఇప్పుడు చంద్రబాబు ప్రారంభించిన పీ4 పథకానికి రాష్ట్రవ్యాప్తంగా అద్భుత స్పందన వస్తోంది. ఇది చంద్రబాబు ఇమేజ్, క్రెడిబిలిటీ, విజన్ ఫలితం. అంతేకాక ఎయిర్‌బస్, టీసీఎస్, విశాఖ పట్నం ఇన్వెస్టర్లు ముందుకు వస్తున్నారు ఎందుకంటే వారికీ చంద్రబాబు నాయకత్వంపై, విశ్వసనీయతపై నమ్మకం ఉంది.
పేదవాడికి మెరుగైన వైద్యం అందించాలన్న ఆలోచన చంద్రబాబుదే. పేద విద్యార్థులకు మెడికల్ ఎడ్యుకేషన్ చేరువ చేయడమే ఆయన ధ్యేయం. పేదరికం లేని సమాజం కోసం ఆయన కృషి చేస్తుంటే, జగన్ మాత్రం పాపాల బురదలో మునిగి పేద విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేశారు. మీ నిర్వాకం, మీ అవినీతి పాలన… ఇవే మీ ఓటమికి కారణం అని తెలుసుకో జగన్!