క్రిస్టియన్ మైనారిటీలను మోసగించిన జగన్మోహన్ రెడ్డి!

– క్రిస్టియన్ కార్పొరేషన్ ఏర్పాటుచేస్తాం, పాస్టర్లకు గుర్తింపు కార్డులు ఇస్తాం
– బాడంగిలో యువనేత లోకేష్ తో భేటీ అయిన క్రిస్టియన్ మైనారిటీలు

బొబ్బిలి: అరకు పార్లమెంట్ పరిధిలోని 32 మండలాల పరిధిలోని పాస్టర్ హెడ్ లు ఆయన్ను కలిసి సమస్యలను విన్నవించారు. జగన్ రెడ్డి పాలనలో క్రిష్టియన్ మైనార్టీలను అన్ని విధాలుగా వంచనకు గురిచేశారని యువనేత నారా లోకేష్ పేర్కొన్నారు. బొబ్బిలి నియోజకవర్గం బాడంగి శంఖారావం సభకు ముందు చర్చి ఫాదర్లు, పాస్టర్లు యువనేత లోకేష్ తో భేటీ అయి, వారు ఎదుర్కొంటున్న సమస్యలను విన్నవించారు.

ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ… మణిపూర్ లో క్రిష్టియన్ మైనార్టీలపై పెద్దఎత్తున దాడులు జరిగితే జగన్ రెడ్డి కనీసం స్పందించకపోవడం దారుణమన్నారు. పాస్టర్లు మాట్లాడుతూ… రాబోయే తెలుగుదేశం ప్రభుత్వంలో పాస్టర్లకు తమకు గుర్తింపు కార్డులు ఇవ్వాలని, అసెంబ్లీలో తమ వాణి వినిపించేందుకు అవకాశం ఇవ్వాలని కోరారు. క్రిష్టియన్ మైనార్టీలకు ప్రత్యేక కార్పోరేషన్, బైబిల్ కాలేజి ఏర్పాటుచేయాలన్నారు. వచ్చే ఎన్నికల్లో క్రిస్టియన్లు టీడీపీకి అన్ని విధాలుగా మద్దతు ఇస్తామని తెలిపారు.

లోకేష్ మాట్లాడుతూ… యువగళం పాదయాత్రలో క్రిష్టియన్ మైనార్టీలు సమస్యలను స్వయంగా చూశానని, తెలుగుదేశం పార్టీకి కులం,మతం, ప్రాంతంతో సంబంధం లేదన్నారు. తెలుగువారందరి సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని తెలిపారు. గతంలో తమపై దుష్ప్రచారంతో పాటు అనేక ఆరోపణలు చేశారని, వాటిని తిప్పికొట్టలేకపోయామని, చేసిన మంచిని తాము చెప్పుకోలేకపోయామన్నారు. ఇతర మతాలను కించపరిచే విధంగా ఎప్పుడూ వ్యవహరించలేదన్నారు. అందరినీ కలుపుకుని వెళ్లాల్సిన అవసరం ఉందన్నారు.

సమాజంలో విధ్వేషాలు రగల్చిన జగన్!
జగన్ రెడ్డి పాలనలో సమాజంలో విద్వేషాలు పెరిగాయని, ఇది మంచిది కాదని లోకేష్ చెప్పారు. రాజకీయాలు కలుషితమైపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయంగా విభేదించుకున్నా చంద్రబాబు, వైఎస్ మధ్య సాన్నిహిత్యం ఉండేదన్నారు. జగన్ రెడ్డి వెనుక క్రిష్టియన్ మైనార్టీలు ఉన్నారని తాను నమ్మడం లేదన్నారు. రామతీర్థంలో రాముడి తల తీసివేస్తే చంద్రబాబు స్వయంగా వెళ్లారని, రేపు చర్చి, మసీదులపై దాడులు జరిగినా ఇదే విధంగా తెలుగుదేశం స్పందిస్తుందన్నారు.

తెలుగుదేశం పాలనలో క్రిస్మస్ కానుక ఇవ్వడంతో పాటు చర్చిల నిర్మాణాలకు నిధులు మంజూరు చేశామని, చర్చి భూములు ఆక్రమణకు గురికాకుండా కాపాడామన్నారు. విజయవాడ బరియల్ గ్రౌండ్ ఆక్రమణకు గురికాకుండా చంద్రబాబు చర్యలు తీసుకోవడాన్ని ఈ సందర్భంగా గుర్తుచేశారు. క్రిష్టియన్ కాలనీల్లో పెద్దఎత్తున రోడ్లు వేశామన్నారు. ప్రతి ఒక్కరిని గౌరవించడం తన తల్లి తనకు నేర్పిందని చెప్పారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే మ్యారెజ్ సర్టిఫికెట్ ఇచ్చే విషయంలో పాత విధానాన్ని తీసుకువస్తామని తెలిపారు.

క్రిస్టియన్ కార్పొరేషన్ ఏర్పాటుచేస్తాం!
పాస్టర్లకు గుర్తింపు కార్డులు మంజూరు చేయడంతో పాటు క్రిష్టియన్ మైనార్టీలకు ప్రత్యేక కార్పోరేషన్ ఏర్పాటుచేస్తామని హామీ ఇచ్చారు. చర్చిల నిర్మాణాలకు సహకారం అందిస్తామన్నారు. అందరం కలిసికట్టుగా ఉండాలని, ఎక్కడా విద్వేషాలు రెచ్చగొట్టుకోకూడదన్నారు. బరియల్ గ్రౌండ్స్ ఏర్పాటుతో పాటు ప్రహరీలు నిర్మిస్తామన్నారు. నేను మంత్రిగా ఉన్నప్పుడు గ్రామాల్లో 25వేల కి.మీల సీసీ రోడ్లు నిర్మించామని, జగన్ రెడ్డి వచ్చిన తర్వాత ఉపాధి హామీ పథకాన్ని నీరుగార్చారన్నారు.

వచ్చే తెలుగుదేశం ప్రభుత్వంలో క్రిష్టియన్ మైనార్టీల జెరూసలేం యాత్రకు సబ్సీడీని పెంచుతామని, పాస్టర్లకు ఇళ్లు కట్టించే బాధ్యత టీడీపీ తీసుకుంటుందని హామీ ఇచ్చారు. బైబిల్ కాలేజికి సహకరిస్తామని చెప్పారు. తమపై అపోహలు పెట్టుకోవద్దని, ఏవైనా సమస్యలు ఉంటే నేరుగా తన దృష్టికి తీసుకురావాలని భరోసా ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తాను 4 దశాబ్దాలు ఉంటానని, ప్రజలకు సేవ చేస్తానని లోకేష్ తెలిపారు.

Leave a Reply