Suryaa.co.in

Andhra Pradesh

కుప్పానికి నీళ్లంటూ జగన్‌ నోట అబద్ధాల వరద

పులివెందులలో ఎండిపోతున్న పైర్లకు నీళ్లివ్వలేని సీయం కుప్పానికి మేలు చేస్తాడా?
13 శాతం కాలువ పనులకు 5 ఏళ్లు తీసుకున్న జగన్ కుప్పాన్ని ఉద్ధరిస్తాడా?
దేశంలో మోడల్ నియోజకవర్గమైన కుప్పంలో వైసీపీ వచ్చాక హింసా రాజకీయాలు
ప్రాజెక్టుల గేట్లకు గ్రీజు రాయలేని ప్రభుత్వం…సాగునీటి ప్రాజెక్టులు కడుతుందా?
బాబాయి హత్యపై 5 ఏళ్లుగా సమాధానం చెప్పని జగన్ హత్యారాజకీయాలని మాట్లాడుతున్నాడు
టీడీపీ-జనసేన పొత్తుతో జగన్‌రెడ్డికి వణుకు, భయం

– టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు

అమరావతి: కుప్పంలో అభివృద్ధి ముద్ర తెలుగుదేశానిది అయితే….వైసీపీది రక్తపు మరక అని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. దేశంలోనే కుప్పం ఒక మోడల్ నియోజకవర్గం…జగన్ దాన్నీ నాశనం చేయాలని చూశాడని అన్నారు. జగన్‌ సీఏం అయ్యాకే ప్రశాంతమైన కుప్పంలో హింసా రాజకీయాలు, సహజవనరుల దోపిడీ మొదలైందని మండిపడ్డారు. పులివెందులకు నీళ్లు ఇవ్వలేని జగన్ కుప్పానికి నీళ్లు తెచ్చాను అంటూ షో చేశాడని అన్నారు.

కుప్పంకు 672 కి.మీ. నుండి కృష్ణా జలాలు తానే తెచ్చినట్టు చెప్పడం జగన్‌ అబద్ధాలకు పరాకాష్ట అన్నారు. 13 శాతం కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులు పూర్తికి 5 ఏళ్లు తీసుకున్న జగన్…తానో అపర భగీరధుడిని అనేలా డైలాగ్ లు కొడుతున్నాడన్నారు. ఎన్నికల ముందు డ్రామాలు చేస్తున్నాడని, కాలువలో చెంబుడు నీళ్లు పెట్టి ఫోటోలు దిగేందుకు పడిన ప్రయాస తో జగన్ నవ్వుల పాలు అయ్యాడని ఎద్దేశా చేశారు. కుప్పం బ్రాంచి కాలువకు టీడీపీ రూ.400 కోట్లకుపైగా ఖర్చు చేసి 87 శాతం పనులు పూర్తి చేస్తే..జగన్‌ రూ.30కోట్లు ఖర్చు చేసి కేవలం 10 శాతం పనులు మాత్రమే పూర్తి చేశారన్నారు.

రాయలసీమలో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి టీడీపీ 5 ఏళ్ల పాలనలో రూ.12,500 కోట్లు ఖర్చు చేయగా జగన్‌ ప్రభుత్వం ఇప్పటికి ఖర్చు చేసింది రూ.2వేల కోట్లు మాత్రమే అని వివరించారు. సాగునీటి రంగంపై జగన్ ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది అని హితవు పలికారు. పులివెందులలో నీళ్లివ్వలేక పంటలు ఎండబెట్టిన జగన్…కుప్పంలో నీళ్లంటూ షో చేస్తున్నాడన్నారు. సొంత జిల్లాలో అన్నమయ్య డ్యాం కోట్టుకుపోతే బాధితులను ఆదుకోని నువ్వు కుప్పాన్ని ఉద్దరిస్తావా అని ప్రశ్నించారు. ఇప్పుడు రిజర్వాయర్లు కడతాను అని చెపుతున్న జగన్…5 ఏళ్లు ఏం పొడిచాడు అని ప్రశ్నించా రు.

సాగునీటి ప్రాజెక్టుల గేట్లకు గ్రీజు రాయలేని జగన్….ప్రాజెక్టులు కడతాను…నీళ్లు ఇచ్చాను అంటే నమ్ముతారా అని నిలదీశారు. జగన్ ప్రాజెక్టులు కట్టడం కాదు….వైసీపీ ప్రభుత్వం సాగునీటి రంగంలో చేసిన ద్రోహానికి ఆ పార్టీకి సీమ ప్రజలే సమాధి కట్టబోతున్నారని అన్నారు. సాగునీటి రంగంలో నాడు-నేడు జరిగిన పనులపై శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు ఏ ప్రాజెక్టు పై అయినా చర్చకు టీడీపీ సిద్ధం అని సవాల్ విసిరారు. సొంత జిల్లాలో ఇసుక మాఫియాకు అన్నమయ్య డ్యాం కొట్టుకుపోయి 42 మంది ప్రాణాలు కోల్పోయారని, పింఛా ప్రాజెక్టు దెబ్బతిందన్నారు. అన్నమయ్య డ్యామ్ బాధితులకు జగన్ ఇల్లు కూడా కట్టలేదు అన్నారు.

బాబాయి వివేకా హత్య విషయంలో అయిదేళ్లుగా సమాధానం చెప్పలేని జగన్‌ హత్యా రాజకీయాల గురించి కుప్పం వెళ్లి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు. టీడీపీ-జనసేన పొత్తుతో జగన్‌రెడ్డికి వణుకు, భయం మొదలైందని.. అందుకే కులాల కుంపట్లను రాజేసి నీచ రాజకీయాలకు ప్రయత్నిస్తున్నారు విమర్శించారు.

అసత్య ప్రచారాలతో రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారని, ఉమ్మడి అభ్యర్థుల ప్రకటనపై అన్ని వర్గాల నుంచి సానుకూల స్పందన వస్తోందన్నారు. దీన్ని చెడగొట్టేందుకు ఫేక్‌ ప్రచారం ద్వారా సోషల్‌ మీడియా, అనుకూల మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తూ ప్రజలను నమ్మించడానికి ప్రయత్నిస్తున్నాడన్నారు. జగన్ ప్రయత్నాలన్నీ పగటి కలలుగా మిగిలిపోతాయని చంద్రబాబు అన్నారు.

 

LEAVE A RESPONSE