ఒక ‘పొత్తు’.. వంద పొలికేకలు!

– సీట్ల వరకూ వెళ్లిన టీడీపీ-జనసేన పొత్తు ఫలం
– తక్కువ సీట్లలో పోటీకి కారణాలు విశ్లేషించిన పవన్
– అసంతృప్తులను పిలిపించి మాట్లాడుతున్న బాబు
– మధ్యలో హరిరామజోగయ్య పిడ‘కుల’ వేట
– తక్కువ సీట్లు ఎందుకు తీసుకున్నావంటూ లేఖ
– పవన్‌పై విమర్శలు ఎక్కుపెట్టిన వైసీపీ
– దానికి తోడైన ఆ పార్టీ అనుబంధ మీడియా దళం
– పవన్‌ను మానసికంగా దెబ్బతీసే వ్యూహం
– దన్నుగా నిలిచిన ‘దేశం’ నేతలు
– పావు ‘షేరు’ పాలిట్రిక్స్ అంటూ పవన్‌పై కథనాలు
– అవి బ్లూమీడియా ఆర్తనాదాలేనంటూ లోకేష్ ట్వీట్
– పొత్తులో పొలికేకల హాహాకారాలు
( మార్తి సుబ్రహ్మణ్యం)

సహజంగా ఎదురింట్లో ఏం జరుగుతుందో చూసే ఆసక్తి చాలామంది మహిళలకు ఉంటుంది. అందుకే ఎప్పుడూ తమ ఇంటిపై కన్నా, ఎదురింటిపైనే ఎక్కువ కన్నేస్తూ ఉంటారు. ఎదుటివారి ఇళ్లలో శుభకార్యమైనా సరే సహించరు. పక్కనుండే అమ్మలక్కలతో పెళ్లిసందడిలో కూడా రంధ్రాన్వేషణ చేస్తారు. దానివల్ల వారికేమైనా లాభమా అంటే.. ఏమీ ఉండదు. అదో తుత్తి! అదో మానసిక ఆనందం!! ఊహల్లో కూడా దరిద్రం ఎందుకన్నట్లు.. ఎదుటివారి గురించి చెడుగా ఆలోచిస్తారు!!!

ఏపీలో ఇప్పుడు సరిగ్గా అదే జరుగుతోంది. కాకపోతే అక్కడ ఉన్నది అధికార-ప్రతిపక్షపార్టీలు. సంబరం జరిగింది ప్రతిపక్షం ఇంట్లో. దానిని చూసి గావుకేకలు, హాహాకారాలు, పెదబొబ్బలు, పొలికేకలు పెడుతుందేమో అధికార పక్షం! మిగిలినదంతా సేమ్ టు సేమ్. టీడీపీ-జనసేన చాలాకాలం నుంచి కలసి నడుస్తున్నాయి. పవన్ ఇంటికి చంద్రబాబు- బాబు ఇంటికి పవన్ రాకపోకలు కామన్ గా మారాయి.

పైగా ఇరు పార్టీలూ సంయుక్త సమన్వయ కమిటీ ఏర్పాటు చేసుకుని భేటీలు వేసుకుంటున్నాయి. ఇద్దరి మధ్యలో బీజేపీని తీసుకువచ్చేందుకు బాబు-పవన్ ఢిల్లీ కూడా వెళ్లారు. ఇవన్నీ రహస్యాలేమీ కావు. ఇంత జరుగుతున్న తర్వాత ఆ రెండు పార్టీల మధ్య పొత్తు ఉండదనుకోవడం.. ఒకవేళ అలాంటి పొత్తును ముందస్తుగా తమ రెచ్చగొట్టే మాటలతో పుటుక్కుమనిపించాలనుకోవడం అమాయకమైన మూర్ఖత్వమే.

సరే ఓ మంచి ముహుర్తంలో ఇద్దరు నాయకులు, వారి పార్టీ అగ్రనేతల సమక్షంలో ఉమ్మడిగా అభ్యర్ధుల జాబితా ప్రకటించారు. అలాంటి ఉమ్మడి ప్రకటన ఉండకూడదన్న లక్ష ్యంతోనే వైసీపీ వ్యూహకర్తలు, మొదటి నుంచీ పవన్‌పై మాటల దాడి చేస్తూనే ఉన్నారు. ఎన్ని సీట్లలో పోటీ చేస్తారని రెచ్చగొడుతూనే ఉన్నారు.

జనసేన ఆఫీసు వద్ద నిఘా కూడా ఉంచారు. తమ మాటలకు పవన్ కల్యాణ్ రెచ్చిపోయి.. అంటే తమ ట్రాప్‌లో పడి, తాను ఒంటరిగానే పోటీ చేస్తానని ప్రకటిస్తారన్నది వైసీపీ ఆశ. అప్పుడు ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలి, మళ్లీ గద్దెనెక్కాలన్నది వైసీపీ అసలు ఆశ. ఆరకంగా పొత్తును పెటాకులు చేసేందుకు చేయని ప్రయత్నాలు లేవు. వేయని ఎత్తుగడలు లేవు. చేయని ప్రటనలు లేవు.

కానీ వైసీపీ స్కూలేమిటో ఇప్పుడు జనాలకు తెలిసింది కాబట్టి, సిలబస్-పరీక్ష పేపర్ లీకయినట్లు.. జనాలకు ఆ పార్టీ ఎత్తులేమిటో అర్ధమయింది. చివరాఖకు మాత్రం వైసీపీ వ్యూహకర్తలకు మిగిలింది విషాదం. దాని తాలూకు ఆర్తనాదాలు, హాహాకారాలే. ఇప్పుడు ప్రెస్‌మీట్లు-యూట్యూబ్-మిత్రమీడియాలో వినిస్తున్న విషాదరోదన అదే.

అష్టావధానంలో అప్రస్తుత ప్రసంగం అందరినీ ఆకట్టుకుంటుంది. అంటే సీరియస్‌గా సాగుతున్న పండితుడి ప్రసంగం మధ్యలో ఒక వ్యక్తి ప్రవేశించి, అసందర్భ-అప్రస్తుత ప్రసంగం చేసి, సమాధానం చెప్పాలని కోరతారన్నమాట. ఇప్పుడు కుల రాజకీయాల్లో అలాంటి అప్రస్తుత ప్రసంగీకులు చాలామంది ఉన్నారు. కాపు సంక్షేమ సమితి అన్న బోర్డు పెట్టుకున్న, మాజీ మంత్రి హరిరామజోగయ్య అనే వృద్ధ నేతాశ్రీ, గత కొద్దికాలం నుంచి పవన్ కల్యాణ్ బాగోగులు చూడాలని ‘అనుకుంటారు’. పోనీ ఆయనను తన బాగోగులు చూడమని పవన్ ఏమైనా చెప్పారా అంటే అదీ లేదు. జోగయ్య ఒక అలౌకిక ఆనందుడు.

తానే జనసేనకు సిద్ధాంతకర్త-పవన్‌కు మార్గదర్శి, రాజకీయ రాజగురువు అని జోగయ్య ఫీలవుతుంటారు. ఇంతా చేస్తే ఆయనకు జనసేనలో ప్రాధమిక సభ్యత్వం కూడా లేదని జనసైనికుల ఉవాచ. అయినా సరే తన పెద్దరికాన్ని అడ్డుపెట్టుకుని, రాష్ట్రంలోని కాపులందరి పక్షాన అన్నట్లు.. బహిరంగలేఖలు సంధిస్తుంటారు. జనసేన ఎక్కువ సీట్లు తీసుకోవాలని, చెరి రెండేళ్లు సీఎం పదవిని పంచుకోవాలని జోగయ్య చాలాకాలం నుంచీ జోరీగలా పోరుతూనే ఉన్నారు.

తొలి నుంచి చంద్రబాబంటే గిట్టని జోగయ్య, కాపునేత ముసుగులో పొత్తు పిడ’కుల’వాదం వినిపించి అలసిపోయారు. చివరాఖరకు పవన్ తాను అనుకున్న మార్గాన్నే ఎంచుకుని, బాబుతో కలసి అడుగులేశారు. మరి జోగయ్య ఊరుకోరు కదా? ఆఫ్టరాల్ 24 సీట్ల కోసం పొత్తు పెట్టుకుంటావా? అంటూ స్కూల్లో హెడ్మాష్టరు మాదిరిగా లేఖలో గద్దించారు. పాపం జోగయ్య కడుపునొప్పి ఇంకా తగ్గనట్లు లేదు. పోలింగు సమయానికి మరో లక్ష లేఖలు రాసినా ఆశ్చర్యం లేదు.

అవి పవన్ చెవులకు చేరకపోయినా, పొత్తును పెటాకులు చేసేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్న వైసీపీకి చేరిపోయాయి. ఇంకేముంది? జోగయ్య లేఖకు కొంచెం ఉప్పు-కారం, మరికొంత మసాలా దట్టించి, సోషల్‌మీడియాలో వదిలింది. దానితో కాపులు రెచ్చిపోవాలన్నది వారి కవిభావన అన్నమాట. ఇప్పుడు ఆ పొలికేకలను వైసీపీ అందుకుని, హాహాకారాలు మొదలుపెట్టడం ఆసక్తికరం. నిజానికి సీట్లు దక్కక టీడీపీ నేతలు విలపిస్తుంటే, ఇన్చార్జిలు దక్కించుకున్న అధికార పార్టీ నేతలు విలపిస్తున్న పరిస్థితి.

చంద్రబాబు పార్టీ పగ్గాలు అందుకున్న తర్వాత పెట్టుకున్న పొత్తుల్లో, ఇవి ఎప్పుడూ కనిపించే దృశ్యాలే. టికెట్ రాని వారిని పిలిపించి మాట్లాడటం చంద్రబాబు సంప్రదాయం. వైసీపీ అధినేతలో అలాంటి మర్యాద భూతద్దం వేసి వెతికినా కనిపించదు. పైగా చంద్రబాబు తన ఇన్నేళ్ల రాజకీయ చరిత్రలో, ఎప్పుడూ ఇంత ముందస్తుగా సీట్లు ప్రకటించిన అలవాటు లేదు. నామినేషన్లకు ఒకరోజు ముందు వరకూ ‘కాలిపోయేంత వడపోత’చేసి గానీ అభ్యర్ధులను ప్రకటించరు. ఉమ్మడి రాష్ట్రంలోనయితే అర్ధరాత్రి-అపరాత్రి కూడా, టికెట్లు ప్రకటించిన సందర్భాలున్నాయి. అంటే పేపర్ ఎడిషన్ సమయానికి ముందుగా అభ్యర్ధుల పేర్లు ప్రకటించేవారు. ఆ లెక్కన చూస్తే చంద్రబాబు చాలామారినట్లే లెక్క.

ఇక పొత్తులో జనసేన చాలా నష్టపోయిందని, కేవలం 24 తీసుకుని టీడీపీ పల్లకీ మోస్తున్నారంటూ జోగయ్య అండ్ వైసీపీ నేతలు చేసే వేళాకోళ మే వింత. పవన్ నిస్సందేహంగా క్రౌడ్‌పుల్లర్. అందులో ఎలాంటి సందేహం లేదు. డబ్బులు, బిర్యానీ పొట్లాలూ, బూమ్‌బూమ్ బీర్లూ ఇవ్వకుండానే పదివేల మంది సులభంగా ఆయన మీటింగులకు పోగవుతారు. గతంలో అలాంటి ఇమేజ్ వైఎస్-చిరంజీవి ఉండేది. ఇప్పుడు తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి-ఏపీలో పవన్‌కు మాత్రమే ఆ జనాకర్షణ శక్తి ఉంది. అది కాదన్నవారు మూర్ఖుల కిందే లెక్క.

కానీ జనసేనకు కర్త-కర్మ-క్రియ అన్నీ పవన్ మాత్రమే. ఆయన తర్వాత ఆ స్థాయిలో కాదు కదా.. కనీసం సగంలో సగం కూడా జనాకర్షణ ఉన్న నేత, జనసేనలో కనిపించరన్నది నిష్ఠుర నిజం. జనసేన కేవలం పవన్ ఆకర్షణ-ఇమేజ్ మీద ఆధారపడిన పార్టీ. టీడీపీ మాదిరిగా బలమైన యంత్రాంగం ఉన్న పార్టీ కాదు. ఆమేరకు పవన్ దానిని నిర్మించుకోలేకపోయారు. ఏ పార్టీకయినా ఎన్నికల్లో పోలింగ్ బూత్ ఏజెంట్లు ముఖ్యం. జాతీయ పార్టీ అయిన బీజేపీకి సైతం, ఏపీలో అంత బలమైన యంత్రాగం లేదు. బలమైన నాయకులూ లేరు.

బీజేపీలో మొత్తం చూస్తే ఓ పది, పదిహేను మంది మాత్రమే పెద్ద నేతలు కనిపిస్తుంటారు. జనసేనకు అది కూడా ఉండరు. నాదెండ్ల మనోహర్ తప్ప మిగిలిన నాయకులెవరూ పెద్దగా కనిపించరు. నియోజకవర్గాల్లో బూత్ కమిటీలు పక్కనపెడితే మండల-గ్రామ కమిటీలు ఉండవు. రాజకీయ పార్టీకి బూత్ ఏజెంట్లే ముఖ్యం. ఆ వ్యవస్ధ కూడా జనసేనకు లేదన్నది బహిరంగం. ఏ కారణం వల్లనో తొలినుంచీ దానిపై దృష్టిపెట్టలేదు.

ముందుగానే చెప్పినట్లు జనసేన కేవలం పవన్ ఆకర్షణపై నడిచే పార్టీ. గత ఎన్నికలు-ఇటీవలి కాలం వరకూ జనసేన కార్యక్రమాలకు హాజరయ్యే కార్యకర్తలకు, భోజనం కూడా పెట్టించలేని నాయకుల తీరు పవన్ దృష్టికి సైతం వెళ్లింది. అందుకే ‘ఓట్లు కొనాల్సిన పనిలేదు. ఎన్నికల సంఘం విధించిన పరిమితికి లోబడి ఖర్చు చేయకపోతే ఎలా? కనీసం కార్యకర్తలకు భోజనం కూడా పెట్టకపూతే ఎలా?’ అని వ్యాఖ్యానించడాన్ని విస్మరించకూడదు.

ఎన్నికలంటే బరాబర్ డబ్బులతో వ్యవహారం. మహాత్మాగాంధీ బతికొచ్చి పోటీచేసినా, మందు-మనీ ఇవ్వాల్సిందే. అధికార పార్టీ ఓటుకు 2 వేలకు పైన ఇచ్చేందుకు సిద్దమవుతోంది. పైగా యంత్రాంగం దన్నుగా ఉంటుంది. ఆ క్రమంలో దానిని ఎదుర్కోవాలంటే.. కేవలం పవన్ అభిమానమో, పార్టీలో సీనియారిటీనో సరిపోదు.

టీడీపీకీ అదే సూత్రం వర్తిస్తుంది. పార్టీ జెండా మోయడమో, రోజూ ప్రెస్‌మీట్లు, ప్రెస్ రిలీజులు చేసి, యూట్యూబ్ చానెళ్లు, టీవీల డిబేట్లలో రోజూ కనిపించడమే టికెట్‌కు అర్హత కాదు. యుద్ధరంగంలో ప్రత్యర్ధిని అంగ-అర్ధబలంలో ఢీకొనే నాయకుడు కావాలి. లేకపోతే పొత్తులో ఎన్నిసీట్లు తీసుకున్నా, ప్రత్యర్థికి ఆ సీట్లను బంగారుపళ్లెంలో అప్పగించడం తప్ప..ఈ విధేయత-అభిమాన నినాదాలు పనికిరావన్నది నిష్ఠుర నిజం.

పెద్ద పెద్ద మాటలు- నినాదాలు చేసే వారు- గత ఎన్నికల్లో తన అభిమాననేత పవన్‌ను, ఒక్కచోట కూడా గెలిపించలేకపోవడాన్ని విస్మరించకూడదు. మరి అనుభవానికి మించినదేం ఉంటుంది? తన నాలుగున్నరేళ్ల అనుభవంలో పవన్ కల్యాణ్ వీటిని స్వయంగా అనుభవించి, పరిశీలించారు కాబట్టే.. తన పార్టీకి ఎన్ని సీట్లు కావాలి? ఎన్ని సీట్లలో పోటీ చేస్తే ప్రత్యర్ధులను ఢీకొనగలం? అని పరిశీలించిన తర్వాతనే టీడీపీతో పొత్తుకు సిద్ధమయ్యారు.

అయితే పార్టీ నాయకత్వాల ఆలోచన ఎప్పుడూ, అధికారంలోకి ఎలా రావాలి? అన్న కోణంపైనే ఉంటుంది. వారి అడుగులు-లక్షా ్యలు-వ్యూహాలు కూడా ఆమేరకే ఉంటాయి. నిజానికి టీడీపీ-బీజేపీ పొత్తు టీడీపీ సీనియర్లకు పెద్దగా ఇష్టం లేదు. కానీ ఎన్నికల సమయంలో.. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ అండ ఎంత అవసరమో, ఆ పార్టీతో పొత్తును వ్యతిరేకించే వారికి తెలియదు. అలాంటి అవసరాలు పోలింగ్‌కు ముందు ఇంకా అనేకం ఉంటాయి. అది అధినేతకు మాత్రమే తెలుసు. ఎందుకంటే గత ఎన్నికల సమయంలో ‘ఫలితం’ అనుభవించారు కాబట్టి!

కానీ క్షేత్రస్థాయిలో పనిచేసే కార్యకర్తల ఆలోచన, అందుకు భిన్నంగా ఉంటుంది. వారి కోణం ఎప్పుడూ స్థానికంగానే ఉంటుంది. అందుకే పొత్తుల సమయంలో కొంత సంఘర్షణ కనిపిస్తుంటుంది. టీడీపీ పొత్తు పెట్టుకున్న ప్రతిసారీ ఈ సంఘర్షణను తట్టుకుని నిలబడి విజయం సాధించింది. బీఆర్‌ఎస్‌తో మహాకూటమి సందర్భంలో తప్ప!

ఇక పవన్ కల్యాణ్‌కు తొలివిడతలో 24 సీట్లు దక్కడం, యంత్రాంగం కోణంలో చూస్తే సాధారణ విషయమేమీ కాదు. పవన్ సహా రెండు డజన్లమందికి పైగా అభ్యర్ధులు, తొలిసారి అసెంబ్లీలో కాలుపెట్టే అవకాశం దక్కనుంది. ఇది సింగిల్‌గా అయితే సాధ్యమయ్యేది కాదు. టీడీపీ ఇప్పుడున్న పరిస్థితిలో ఒంటరిగా పోటీ చేసినా 70 -80 స్థానాలకు పైగా అవలీలలగా గెలుస్తుంది.

జనసేనతో పొత్తు ఖరారు కాకముందు వెలువడిన పలు సర్వేలలో, టీడీపీ విడిగా పోటీ చేసినా విజయం సాథిస్తుందన్న ఫలితాలు వెలువడ్డాయి. ఇటీవలి వెలువడిన సర్వేలలో జనసేన బలం, గతంలో కంటే రెండు శాతం పెరిగినట్లు వెల్లడయింది. అయినా సరే.. ఈసారి ఎట్టిపరిస్థితిలో రిస్కు తీసుకోకూడదన్న ముందుజాగ్రత్త- జగన్‌ను ఎలాగైనా గద్దెదింపాలన్న పట్టుదల- మరోసారి వైసీపీ వస్తే రాష్ట్ర పరిస్థితి ఇంకా భయానకంగా ఉంటుందన్న ముందుచూపుతోనే జనసేనతో పొత్తు పెట్టుకున్నట్లు స్పష్టమవుతోంది. ఇవన్నీ పవన్‌కు స్పష్టంగా తెలుసుకాబట్టే, ఆయన సీట్ల విషయంలో స్థితప్రజ్ఞత ప్రదర్శించారని తెలుసుకోకపోవడమే విమర్శకుల అమాయకత్వం.

 

Leave a Reply