జేపీ నడ్డాకు ఏపీ గురించి మాట్లాడే అర్హత లేదు

-అసలు మీరు మాకేమిచ్చారు?
-పోలవరం పనుల్లో చంద్రబాబుది అవినీతి అన్నారు
-అమరావతిని ఒక అవినీతి, అక్రమ రాజధాని అన్నారు
-మరి ఆ దిశలో ఏం చర్యలు తీసుకున్నారో చెప్పండి
-ఆంధ్రప్రదేశ్‌ గురించి మాట్లాడే హక్కు మీకు లేదు..అర్హత అంత కంటే లేదు. అసలు మాకేమిచ్చారు?
-విభజన చట్టంలో ఉన్నవైనా అమలు చేశారా?
-ప్రత్యేక హోదా ఏమైంది? ఇక్కడ శాంతి భద్రతలు లేవా?
–మూడేళ్లుగా రాష్ట్రంలో మతాల మధ్య చిచ్చుకు యత్నం
-ఆ ప్రయత్నం చేయకుండా ఒక్క రోజు కూడా లేరు
-ఏ ఒక్క పథకానికి కేంద్రం నిధులు ఇవ్వడం లేదు
-పీఎం కిసాన్‌లో అంతా అరకొరనే. బియ్యం కూడా లేవు
-ఆయుష్మాన్‌ భారత్‌లో ఈసారి ఇచ్చింది రూ.230 కోట్లు
-మేము ఆరోగ్యశ్రీ కింద ఖర్చు చేసింది రూ.2400 కోట్లు
-అదేనా మీ కేంద్ర సాయం? ఎందుకీ అనైతిక వ్యాఖ్యలు
-బీజేపీ జాతీయ అధ్యక్షుడిని సూటిగా ప్రశ్నించిన పేర్ని నాని

మీరా అప్పు గురించి మాట్లాడేది?:
నడ్డాగారు ఎన్నో అబద్ధాలు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం 8 లక్షల కోట్లు అప్పు చేసిందని అన్నారు. మీరే కేంద్రంలో అధికారంలో ఉన్నారు. కానీ మాకు ఎంత అప్పు ఉన్నదన్నది మీకు తెలియదా? ఒకవేళ మేము పరిమితికి మించి అప్పులు చేస్తుంటే, మీ ఆర్థిక విభాగం, కేంద్ర ఆర్థిక మంత్రి ఏం చేస్తున్నారు?
నిజానికి కేంద్రంలో మీకు అధికారం కట్టబెట్టినప్పుడు 2014లో భారత్‌ అప్పు 53 లక్షల కోట్లు. దాన్ని మీరు ఈ 8 ఏళ్లలో ఏకంగా రూ.1.30 లక్షల కోట్లకు చేర్చారు. అంటే ఏకంగా 80 లక్షల కోట్లకు పైగా అప్పులు చేశారు. మరి ఏం సాధించారు?

ఒక్క హామీ అయినా నెరవేర్చారా?:
కులం, మతం పేరుతో తగవులు తప్ప. మసీదులు కూలగొట్టి, గుడులు కడతాం. మసీదులు తవ్వి శివలింగాలు తీస్తాం అనడం తప్ప.
ఇంటికో ఉద్యోగం ఇస్తానని మోదీగారు చెప్పారు. ఇప్పటి వరకు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు? రాష్ట్రంలో దాదాపు 1.70 కోట్ల కుటుంబాలు ఉన్నాయి. ఎన్ని కుటుంబాలకు ఉద్యోగాలు ఇచ్చారో చెప్పండి.
జనధన్‌ ఖాతాలు. ప్రతి ఖాతాలో రూ.15 లక్షలు వేస్తామన్నారు. ఎక్కడైనా వేశారా? రోజూ దేవుడికి కొలిచే మీరు ఈ స్థాయిలో మాట తప్పితే ఎలా?.

ఇష్టానుసారం మాట్లాడతారా?:
దేశ అప్పును ఏకంగా రూ.1.30 లక్షల కోట్లకు తీసుకుపోయిన మీరు, మాపై విమర్శలు చేస్తున్నారు. అసలు కేంద్రం దృష్టికి రాకుండా, ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా అప్పు చేయగలుగుతుందా? బ్యాంకులు ఎవరి చేతిలో ఉన్నాయి. ప్రధాని మోదీకి, దేశ ఆర్థిక మంత్రికి తెలియకుండా రాష్ట్రాలు అప్పులు చేయగలుగుతాయా? ఓట్ల కోసం ఏది పడితే అది మాట్లాడతారా? దేశంలో అసలు శాంతి భద్రతలు లేకుండా చేస్తోంది ఎవరు?

మూడేళ్లుగా చిచ్చుకు యత్నం:
కులం, మతం పేరుతో విధ్వంస రాజకీయాలు చేస్తోంది మీరు కాదా? రాష్ట్రంలో గత మూడేళ్లుగా మత చిచ్చు పెట్టడానికి ప్రయత్నించని రోజు కనీసం ఒక్కటైనా ఉందా? మీరా ఇక్కడ శాంతి భద్రతల గురించి మాట్లాడేది.
రాష్ట్రంలో పెట్టుబడులు రావడం లేదా? విషయం తెలుసుకుని మాట్లాడవచ్చు కదా? రాజమహేంద్రవరంలో అడ్డంగా మాట్లాడడం కాదు. మాటల్లో నిజాయితీ ఉండాలి. మేము కేంద్ర సంక్షేమ పథకాల నిధులు మళ్లిస్తున్నామా?

పోలవరానికి ఏం చేశారు?:
చివరకు పోలవరం ప్రాజెక్టుకు నిధులైనా ఇస్తున్నారా? కనీసం బిల్లులు అయినా ఇస్తున్నారా? 75 లక్షల మంది ఇళ్లు తొలగించడానికి ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజీ ఇస్తామని చెప్పారా. పోలవరం ప్రాజెక్టుకు నిధులివ్వరు. విభజన చట్టంలో దాన్ని కడతామని ఉన్నా, మీరు ఆ బాధ్యత తీసుకోలేదు. పనులు చేయరు. నిధులు ఇవ్వరూ. మీకు దాని గురించి నిజాయితీగా మాట్లాడే ధైర్యం ఉందా?

విపక్షాలను వేధిస్తోంది ఎవరు?:
మేము ఇక్కడ విపక్షం గొంతు నొక్కుతున్నామా? ప్రతిపక్షాలను వేధించడంలో, ఈడీలు, సీబీఐ పేరుతో పూవు పార్టీ ఏం చేస్తోంది? అంటే ఎవరైనా దేశంలో చెబుతారు.
రాష్ట్ర ప్రజల చెవిలో పూలు పెడదామని వచ్చావు. కానీ మిమ్మల్ని ప్రజలు నమ్ముతారా? అసలు దేశంలో విపక్షాలను వేధిస్తోంది, కాల్చుకు తింటోంది ఎవరు? మీరు ఎంత మందిని ఈడీ పేరుతో వేధించారు. ఎంత మందిని జైళ్లకు పంపించారో తెలియదా?

ఆరోగ్యశ్రీకి ఎంతిస్తున్నారు?:
ఇక్కడ 108 సర్వీస్‌ను వైయస్సార్‌గారు ప్రారంభిస్తే, దాన్ని కాపీ కొట్టి గుజరాత్‌లో ప్రారంభించారు. ఆరోగ్యశ్రీ పథకం కూడా ఇక్కడే మొదలైంది. మీ ఆయుష్మాన్‌ భారత్‌ కింద ఆరోగ్యశ్రీ లేదు. ఏటా రూ.2200 కోట్ల నుంచి రూ.2400 కోట్లు ఈ ప్రభుత్వం ఖర్చు చేస్తుండగా, కేంద్ర రీయింబర్స్‌మెంట్‌ కింద ఇస్తోంది ఎంతో తెలుసా? గత ఏడాది రూ.300 కోట్లు ఇస్తే, ఈ ఏడాది కేవలం రూ.230 కోట్లు మాత్రమే ఇచ్చారు. మీరు ఇచ్చే ఆ రూ.230 కోట్లతో ఆరోగ్యశ్రీ పథకం అమలవుతోందా.
వైద్యం తర్వాత రోగి వైద్యుల సూచన మేరకు ఇంట్లో విశ్రాంతి తీసుకున్నంత కాలం ఆరోగ్య ఆసరా కింద సహాయం చేస్తున్నాం. ఒక్క దాని కిందే మా ప్రభుత్వం రూ.365 కోట్లు ఖర్చు చేస్తోంది.
మేము దాదాపు 1.47 కోట్ల కుటుంబాలకు ఆరోగ్యశ్రీ పథకం వర్తింప చేస్తుంటే, మీరు బేరం చేస్తూ అన్ని కుటుంబాలకు ఇవ్వలేమని అంటున్నారు. మీ ఆయుష్మాన్‌ భారత్‌ నియమాలు అమలు చేస్తే, ఎవరికీ ఆ పథకం ఇక్కడ అమలు కాదు.

అసలు బియ్యం ఇస్తున్నారా?:
ఇంకా పేదలకు బియ్యం ఇస్తున్నామంటున్నారు. మేము ఇక్కడ 1.47 కోట్ల కుటుంబాలకు బియ్యం ఇస్తుంటే, మీరు సబ్సిడీ కింద కేవలం 50 లక్షల కుటుంబాలకే ఇస్తున్నారు. నిజానికి అది కూడా మా మొత్తమే. మీ ప్రభుత్వం వచ్చాక ఈ ఏడాది మాకు రూ.77 వేల కోట్లు ఇచ్చామన్నారు. అది మీ దయ, దాక్షిణ్యం కాదు. కేంద్ర ఆర్థిక సంఘం సిఫార్సు, కేటాయింపుల మేరకే ఆ నిధులు ఇచ్చారు.

ఆనాడు ఏం చేశారు?:
రాష్ట్రంలో ప్రజలు శాంతియుతంగా ఉంటే, రోజూ మతచిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తోంది ఎవరు? ఎక్కడ ఏం జరిగినా దాన్ని మతానికి ఆపాదిస్తున్నారు. అసలు మీకు మతం గురించి మాట్లాడే అర్హత ఏముంది?
మీరు ఇక్కడి ప్రభుత్వంలో ఉన్నప్పుడు, పైగా మీ పార్టీ నాయకుడు దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు, ఏకంగా ఒక దేవాలయ రథం తగలబడిపోయింది. దానిపై కనీసం కేసు కూడా లేదు.
రాజమండ్రిలో మాట్లాడిన నడ్డా, కోనసీమకు అంబేడ్కర్‌ పేరు పెట్టిన దానిపై ఒక్క మాట కూడా ఎందుకు మాట్లాడలేదు?

ఆ పథకాలకు డబ్బులేమైనా ఇచ్చారా?:
జగన్‌గారి పథకాలు మీవా? ఇళ్ల స్థలాలకు డబ్బులేమైనా ఇచ్చారా? మా ప్రభుత్వం ఇక్కడి నిరుపేదలకు 31 లక్షలకు పైగా ఇళ్ల స్థలాలు ఇచ్చి, ఇళ్లు కూడా కట్టించి ఇస్తున్నాం.
ఏ పథకంలో మీ డబ్బులున్నాయి. అమ్మ ఒడి, నాడు–నేడు కార్యక్రమాల్లో ఉన్నాయా? కోవిడ్‌ కష్టకాలంలో కోట్లాది కుటుంబాకు వైద్యం అందించినందుకు దాదాపు రూ.30 వేల కోట్లు ఖర్చు చేశాం. మరి అందులో మీరు ఏమైనా ఇచ్చారా?. పీఎం కిసాన్‌ అంటున్నారు. ఆ పథకంలో మీరు 40 లక్షల మందికి ఇస్తుంటే, మేము దాదాపు 53 లక్షల రైతులకు ఇస్తున్నాం. మరి మీరు మాతో పోటీగా ఎందుకు ఇవ్వలేకపోతున్నారు.
60 లక్షల కార్డులకు మీరు బియ్యం ఎందుకు ఇవ్వలేకపోతున్నారు. ఆ ఇస్తున్న బియ్యం కూడా పూర్తిగా ముతక, మట్టిగడ్డలు, నూక ఉన్న బియ్యం.
కానీ ఇక్కడ జగన్‌గారి ప్రభుత్వం సార్టెక్స్‌ బియ్యం, నాణ్యమైన బియ్యం తినడానికి ఉండే విధంగా ఇస్తోంది.

ఓటు అడిగే అర్హత మీకు లేదు:
అసలు మీకు బీజేపీ మేనిఫెస్టో గుర్తు ఉందా? అందులో చెప్పిన దాంట్లో ఒక్కటైనా అమలు చేశారా? 2014 నాటి మేనిఫెస్టోలో ఏం చెప్పారు? ప్రత్యేక హోదా 10 ఏళ్లు ఇస్తామన్నారు. కానీ ఏమైంది?
విభజన చట్టం, 13వ షెడ్యూల్‌ అమలు చేస్తామని మేనిఫెస్టోలో పెట్టారు. కానీ ఏం చేశారు? ఏం ఇచ్చారు? యూనివర్సిటీలు, ట్రిబుల్‌ ఐటీ, పెట్రోలియం వర్సిటీ, దుగ్గరాజుపట్నం పోర్టు, కడప స్టీల్‌ ఫ్యాక్టరీ, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతిలో అంతర్జాతీయ విమానాశ్రయాలు కడతామన్నారు. విశాఖకు మెట్రో రైలు అన్నారు. కానీ ఇచ్చారా?
అన్నింటినీ కాలగర్భంలో కలిపేశారు. ప్రత్యేక హోదా ఏమైంది?
రాష్ట్రానికి ఒక్కటంటే ఒక్క మేలు కూడా చేయలేదు. అది చేయకపోగా, ఇక్కడ అధికారం కోసం అర్రులు చాస్తూ, పతివ్రత కబుర్లు చెబుతున్నారు.
కాబట్టి మీకు ఇక్కడికి వచ్చి ఓటు అడిగే అర్హత లేదు.

జగన్‌గారి పథకాలు దేశమంతా అమలు చేయాలి:
మీరు దేశానికి ఏమైనా మేలు చేయదల్చుకుంటే, మీకు రెండుసార్లు అధికారం ఇచ్చారు కాబట్టి, ప్రజలకు మేలు చేయాలనుకుంటే.. జగన్‌గారి మాదిరిగా అమ్మ ఒడి పథకాన్ని, నాడు–నేడులో స్కూళ్లు మార్చండి. ఇక్కడి మాదిరిగా దేశమంతా ఆరోగ్యశ్రీ అమలు చేసి చూపండి. ఆ విధంగా అయినా దేశ ప్రజల రుణం తీర్చుకునే అవకాశం కలుగుతుంది.

ఆ మాటలు వెనక్కి తీసుకోవాలి:
పొట్ట నిండా ఎన్నో అసత్యాలు, విద్వేషం, విషం చిమ్మే మాటలు మోసుకొచ్చి ఇక్కడ పవిత్ర గోదావరి ఒడ్డున విషం చిమ్మే ప్రయత్నం చేసిన మాటలు వెనక్కు తీసుకోవాలి.
పోలవరాన్ని చంద్రబాబుగారు ఏటీఎంగా వాడుకుంటున్నారని 2019 ఎన్నికల్లో అన్న మీరు, ఆ తర్వాత ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలి. అమరావతి రాజధానిని ఒక అవినీతి, అక్రమ రాజధాని అన్న మీరు, ఆ దిశలో ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలని డిమండ్‌ చేస్తున్నాం.

మీడియా ప్రశ్నలకు సమాధానంగా..
అవి వారికే తెలియాలి:
ఎవరు ఎవరి ట్రాప్‌లో పడతారనేది వారి గోల. కలిసి డేక్కున్నారు. తన్నుకున్నారు. తిట్టుకున్నారు. బజారున పడ్డారు. మళ్లీ వారే ఏ మాత్రం బిడియం లేకుండా చెట్టాపట్టాలేసుకుంటున్నారు. పగలు తిట్టుకుంటున్నారు. రాత్రి వాటేసుకుంటున్నారు. అందుకే వారికే తెలియాలి. అపవిత్ర, అక్రమ కలయికల గురించి.

అధికారం కోసం ఎంతకైనా తెగిస్తారు:
పవన్‌కళ్యాణ్‌ స్వయంగా అన్నారు. పాచిపోయిన లడ్డూలు ఇచ్చారని. వెంకయ్యనాయుడినీ తిట్టాడు. మళ్లీ ఆయన చంకన ఎక్కాడు. 2014లో కాంగ్రెస్‌కో హఠావో. దేశ్‌కో బచావో. మోదీకో వోట్‌ దో అన్నారు. బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి తిరిగారు. తర్వాత ఎవరికి వారు వేరయ్యారు. మళ్లీ ఇప్పుడు అందరూ ఒకటే అంటున్నారు. అంటే అధికారం కోసం ఎంతకైనా తెగిస్తారని బీజేపీ, టీడీపీ, జనసేనను చూస్తే అర్ధం అవుతుంది.
పవన్‌కళ్యాణ్‌ ఏకైక లక్ష్యం. జగన్‌గారు పదవిలో ఉండకూడదు. చంద్రబాబు అధికారంలో ఉండాలి. తన పనులన్నీ చక్కబెట్టుకోవాలి. చంద్రబాబును మోయడమే పవన్‌కళ్యాణ్‌ పని.

Leave a Reply