Suryaa.co.in

National

ఒలెక్ట్రా ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించిన కర్ణాటక సీఎం

⦁ కేఎస్ఆర్టీసీకి 25 ఎలక్ట్రిక్ బస్సులను విజయవంతంగా సరఫరా చేసిన ఒలెక్ట్రా
⦁ విధానసౌధ ఆవరణలో ఈ-బస్సులను ప్రారంభించిన కర్ణాటక సీఎం
⦁ కాంట్రాక్ట్ వ్యవధిలో 65,000 టన్నులకు పైగా కార్బన్ ఉద్గారాలను తగ్గిస్తామన్న ఒలెక్ట్రా ఛైర్మన్

హైదరాబాద్, మార్చి 20 : కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై విధానసౌధ ఆవరణలో 25 విద్యుత్ బస్సులను సోమవారం జెండా ఊపి ప్రారంభించారు. ఈ బస్సులను కర్ణాటక రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు(కేఎస్ఆర్టీసీ) ఒలెక్ట్రా గ్రీన్ టెక్ లిమిటెడ్ అందించింది. ఇవి కర్ణాటకలోని వివిధ నగరాల మధ్య సేవలు అందించనున్నాయి. భారతదేశంలోనే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సెక్టార్లో అత్యధిక సంఖ్యలో 25 టైప్ lll ఇంటర్సిటీ కోచ్ ఎలక్ట్రిక్ బస్సులను వినియోగిస్తున్నట్లు కేఎస్ఆర్టీసీ తెలిపింది.

ఒలెక్ట్రా ఎలక్ట్రిక్ బస్సుల ప్రారంభ కార్యక్రమంలో కర్ణాటక ముఖ్యమంత్రితో పాటు.. మంత్రులు, కేఎస్ఆర్టీసీ ఛైర్మన్ ఎమ్.చంద్రప్ప ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. ఈ ఇంటర్సిటీ కోచ్ ఎలక్ట్రిక్ బస్సులు బెంగళూరు, మైసూరు, షిమోగా, దావణగెరె, చిక్కమంగళూరు, విరాజపేట, మడికేరి వంటి ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో నడవనున్నాయి. వీటి నిర్వహణకై ఈవీ(EVEY) ట్రాన్స్.. కర్ణాటకలోని ఏడు నగరాల్లో ఛార్జింగ్ పాయింట్లను ఏర్పాటు చేసింది. బెంగళూరు నగరంలోని కెంపేగౌడ, మైసూరు, షిమోగా, దావణగెరె, చిక్కమంగళూరు, విరాజాపేట, మడికేరిలలో ఛార్జింగ్ పాయింట్లు ఏర్పాటు చేశారు.

ఒలెక్ట్రా రూపొందించిన ఈ ఎలక్ట్రిక్ బస్సులను ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే.. 300 కి.మీ ప్రయాణించగలవు. 12 మీటర్ల పొడవున్న ఎలక్ట్రిక్ కోచ్ బస్సులు పూర్తిగా ఎయిర్ కండిషన్తో వస్తాయి. అంతేకాకుండా ఎలక్ట్రానిక్ కంట్రోల్డ్ ఎయిర్ సస్పెన్షన్, ఈబీఎస్తో కూడిన డిస్క్ బ్రేక్లు వంటి మరిన్ని ఆకట్టుకునే సౌకర్యాలతో సేవలు అందించనున్నాయి. పర్యావరణహితంగా.. మండే వేసవిలో కూడా ప్రయాణికులకు సౌకర్యవంతమైన ప్రయాణాన్ని ఇవ్వనున్నాయి.

కేఎస్ఆర్టీసీకి ఒలెక్ట్రా ఎలక్ట్రిక్ బస్సులను అందించిన సందర్భంగా.. ఆ కంపెనీ ఛైర్మన్ కె.వీ ప్రదీప్ మాట్లాడుతూ.. ” ప్రజారవాణా వ్యవస్థలో పర్యావరణాన్ని రక్షిస్తూ సేవలు అందించడంలో మా కంపెనీ గణనీయమైన పాత్ర పోషిస్తుంది. ఈ 25 ఎలక్ట్రిక్ కోచ్ బస్సులు కాంట్రాక్ట్ వ్యవధిలో 65,000 టన్నుల కార్బన్ ఉద్గారాలను తగ్గించి పర్యావరణానికి సహాయం చేస్తుంది.” అని పేర్కొన్నారు.

ఇప్పటివరకు ఒలెక్ట్రా ఎలక్ట్రిక్ బస్సులు భారతదేశంలోని తొమ్మిది రాష్ట్రాల్లో, ఒక కేంద్రపాలిత ప్రాంతంలో సేవలు అందిస్తున్నట్లు ప్రదీప్ తెలిపారు. 1,100 పైగా ఎలక్ట్రిక్ బస్సులు ఇండియాలో 10 కోట్ల కి.మీలకు పైగా ప్రయాణించి.. కర్బన ఉద్గగారాలను గణనీయంగా తగ్గించాయని వెల్లడించారు. ప్రయాణికులకు సురక్షితమైన, స్వచ్ఛమైన ప్రయాణాన్ని అందించడంలో ఇవి ముఖ్యపాత్ర పోషిస్తున్నాయన్నారు.

LEAVE A RESPONSE