Home » పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లు రేవంత్, ఈటెల రెండు చోట్ల పోటీ చేస్తున్నారు

పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లు రేవంత్, ఈటెల రెండు చోట్ల పోటీ చేస్తున్నారు

వారికి వాతలే మిగులుతాయి తప్ప ఫలితం ఉండదు
వారు ఎన్ని చోట్ల పోటీ చేసినా గెలుపు మాత్రం బీఆర్ఎస్ పార్టీదే
బీసీలపై ప్రేమ ఉంటే కేంద్రం తక్షణమే ప్రత్యేక మంత్రిత్వ శాఖ ప్రకటించాలి
కాంగ్రెస్ హయాంలో చేపట్టిన కులగణన నివేదికను ఎందుకు బహిర్గతం చేయలేదో రాహుల్ గాంధీ సమాధానం చెప్పాలి
ఎన్నికలు వచ్చాయి కాబట్టి బిజెపి, కాంగ్రెస్ నాయకులు ఉట్టి మాటలు చెప్పి వెళ్తారు
బోధన్ కుల సంఘాల గర్జనలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

బోధన్ : రకరకాల వ్యూహాల్లో భాగంగా సీఎం కేసీఆర్ రెండు చోట్ల పోటీ చేస్తున్నారని, పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లు కాంగ్రెస్ నాయకుడు రేవంత్ రెడ్డి, బీజేపీ నాయకుడు ఈటల రాజేందర్ రెండు చోట్ల పోటీకి దిగుతున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఎద్దేవా చేశారు. వారికి వాతలు మిగులుతాయని, ఫలితం రాదని స్పష్టం చేశారు. సోమవారం నాడు బోధన్ లో బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే షకీల్ నిర్వహించిన కుల సంఘాల గర్జన సభలో పాల్గొని మాట్లాడుతూ….

“సీఎం కేసీఆర్ ఒక పార్టీ అధ్యక్షుడు, జాతీయ నేత రకరకాల వ్యూహాలు ఉంటాయి కాబట్టి ఆయన రెండు చోట్ల పోటీ చేస్తున్నారు. పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లు… ఒక పక్క రేటెంత రెడ్డి, ఈటల రాజేందర్ కూడా రెండు చోట్ల పోటీ చేస్తామంటున్నారు. పులిని చూసి నక్క వాత పెట్టుకుంటే వాతలు మాత్రం కచ్చితంగా మిగులుతాయి కానీ ఫలితం మాత్రం ఏం ఉండదు. మిగిలేది వాతలే కాబట్టి వారు మూడో చోట్ల పోటీ చేసినా నాలుగు చోట్ల పోటీ చేసినా అంతిమంగా గెలిచేది మాత్రం బీఆర్ఎస్ పార్టీ మాత్రమే” అని వ్యాఖ్యానించారు.

తెలంగాణకు వస్తున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి స్వాగతమని, వచ్చి తెలంగాణలో జరిగిన అభివృద్ధిని చూడాలని సూచించారు. బీజేపీకి నిజంగా బీసీలపై ప్రేమ ఉంటే తక్షణమే కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటును ప్రకటించాలని, తక్షణమే బీసీలకు ప్రత్యేక బడ్జెట్ ను కేటాయించాలని, బీసీ కులగణనపై సానుకూల ప్రకటన చేయాలని డిమండ్ చేశారు. అంతేకానీ ఎన్నికలు ఉన్నాయని తెలంగాణకు వచ్చి ఉట్టి మాటలు చెప్పి వెళ్లవద్దని అన్నారు. ప్రధాన మంత్రి వచ్చిపోయిన తర్వాత ఎల్లుండి రాహుల్ గాంధీ వచ్చి మళ్లీ అవే మాటలు చెప్పిపోతారని విమర్శించారు.

రూ. 4 వేల కోట్లు ఖర్చు చేసి కాంగ్రెస్ హయాంలో చేపట్టిన కులగణన నివేదికను ఆ పార్టీ బయటపెట్టలేదని, బయటపెట్టాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కూడా అడగలేదని తెలిపారు. కాంగ్రెస్, బీజేపీ నాయకులవి ఉట్టుట్టి మొసలి కన్నీళ్లే తప్పా నిజమైన మాటలు కావని స్పష్టం చేశారు. 2014లో సమగ్ర కుటుంబ సర్వే చేపట్టి అందరి వివరాలు సేకరించాము కాబట్టే కళ్యాణ లక్షీ, షాదీ ముబారక్, ఆసరా పెన్షన్లతో సహా వందలాది కార్యక్రమాలనే చేసుకుంటున్నామని వివరించారు. మంచి పనులు చేస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వానికి మద్ధతివ్వాలని పిలుపునిచ్చారు.

సీఎం కేసీఆర్ కు కులం లేదు, మతం లేదని, సబ్బండవర్గాలు బాగుండాలన్న ఆలోచన మాత్రమే ఉందని తెలిపారు. రాష్ట్రానికి సీఎం కేసీఆర్ బలమైన పునాది వేశారని, దేవంలో రాష్ట్రం మరింత ఎదిగే రోజులు ముందున్నాయన్నారు. విద్యుత్తు, నిధులు, నీళ్లలో మిగులు సాధించామని వివరించారు. పిల్లల విద్యపై కేసీఆర్ ప్రభుత్వం దృష్టి పెట్టిందన్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 19 పాఠశాలలు ఉంటే, గత పదేళ్లలో సీఎం కేసీఆర్ 63 పాఠశాలలు నిర్మించారని అన్నారు. దాంతో ఉమ్మడి జిల్లాలో పాఠశాలల సంఖ్య మొత్తం 82కు చేరిందని చెప్పారు. ఇదొక చిన్న ఉదాహరణ మాత్రమేనని చెప్పారు. బీసీలకు 2 పాఠశాలలు మాత్రమే ఉండేవని, ఇప్పుడు 23 పాఠశాలలకు చేరాయని చెప్పారు.

షకీల్ కష్టమొచ్చినా బోధన్ లోనే ఉంటారని, ఏ పండగ అయినా బోధన్ లోనే ఉంటారని, కానీ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత మళ్లీ ఎన్నికలు వస్తే తప్పా కాంగ్రెస్ అభ్యర్థి సుదర్శన్ రెడ్డి బోధన్ కు రారని విమర్శించారు. మరి ఎన్నికలప్పుడు వచ్చిపోయే ఎన్నికలు రెడ్డీలు, ఎన్నికల గాంధీలతో మనకు ఏం పని అని అన్నారు. కాబట్టి ఎప్పడూ అందుబాటులో ఉండే షకీల్ కావాలా లేదా సుదర్శన్ రెడ్డి కావాలా అన్నది ప్రజలు ఆలోచించుకోవాలని పిలుపునిచ్చారు.

దసరా పండగ వస్తే హిందూ ఆడబిడ్డలకు షకీల్ చీరలను పంచుతారని, రంజాన్ కు కొత్తబట్టలు పంచుతారని, క్రిస్మస్ కు ప్రతీ చర్చికి కేక్ పంపిస్తారని, ఇంత మంచి నాయకుడు దొరుకుతాడా అని అన్నారు. అన్ని వర్గాల గురించి ఆలోచించే షకీల్ వంటి వారిని పోగొట్టుకుంటే ఇబ్బంది అవుతుందని, కాబట్టి ఓటు వేసే ముందు ఆలోచన చేయాలన్నారు.

Leave a Reply