Suryaa.co.in

Editorial

‘ స్టీరింగ్‌’ మార్చిన కేసీఆర్‌

– నాడు టీఎస్‌ఆర్టీసి విలీనం కుదరదన్న కేసీఆర్‌
– డిమాండ్‌ చేసిన వారిపై కన్నెర్ర చేసిన కేసీఆర్‌
– వారికి తెలివిలేదని తిట్టిపోసిన వైనం
– వందశాతం అసంభవమని వాదించిన సీఎం కేసీఆర్‌
– ఆంధ్రా సర్కారు ప్రయోగం సక్సెస్‌ కాదని స్పష్టీకరణ
– ఇప్పుడు టీఎస్‌ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తూ నిర్ణయం
– నాటి కేసీఆర్‌ వీడియో ఇప్పుడు సోషల్‌మీడియాలో వైరల్‌
– ఎన్నికల వేళ ఆర్టీసీ గుర్తుకొచ్చిందంటూ విపక్షాల విమర్శలు

( మార్తి సుబ్రహ్మణ్యం)

తెలంగాణ సీఎం కేసీఆర్‌ ఏది చేసినా విచిత్రమే. ఆయనకు ఆగ్రహం వస్తే ప్రపంచం మొత్తానికి ఆయనతోపాటు ఆగ్రహం రావాలి. అనుగ్రహం వస్తే లోకమంతా ఆయన బాట పట్టాలి. ఒక సందర్భంలో కుదరదని వాదించిన ఆయనే.. మళ్లీ కొద్ది కాలం తర్వాత కుదురతుందని చెబితే, అందరూ అవునని తీరాలి. ఇదీ కేసీఆర్‌ ఫిలాసఫి. కాదన్నవాడికి తల లేదన్నట్లే లెక్క.

ఇప్పుడు టీఎస్‌ఆర్టీసి కథ కూడా అంతే. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని రాజకీయనేతలు, ఆర్టీసీ నేతలు అప్పట్లో డిమాండ్‌ చేశారు. ఏపీలో జగన్‌ సర్కారు కూడా ఆర్టీసిని విలీనం చేసిన వైనాన్ని గుర్తు చేశారు.

అయితే అప్పుడు దానిని కేసీఆర్‌ కొట్టిపారేశారు. ఆంధ్రా ప్రయోగం సక్సెస్‌ కాదని తేల్చేశారు. విలీనం డిమాండ్‌ చేసిన వారిపై కన్నెర్ర చేశారు. ‘‘ అసలు ఆర్టీసీని ప్రభుత్వంలో కలపాలన్న డిమాండ్‌ అర్ధంపర్ధం లేనిది. అసంబద్ధమైనది. అసంభవమైనది. తెలివితక్కువ నినాదం. ఆ తెలివితక్కువ నినాదం పట్టుకుని రాజకీయ నాయకులు మాట్లాడుతున్నారు. తలకు మాసినోళ్లు, నెత్తిమాసినోళ్లు, వీళ్లానయ మాట్లాడేది

నాకర్ధం కాదు? ఇది వంద శాతం అసంభవం. ఇది భూగోళం ఉన్నంత కాలం జరిగేది కాదు. అక్కడ ఆంధ్రాలో ఒక ప్రయోగం చేశారు. అక్కడ మన్ను కూడా జరగలేదు.కమిటీ వేశారట. మూడు నెలలకో, ఆరునెలలకో ఒక కథ చెబుతారట.ఏం చెబుతారో చూద్దాం. ఏమవుతుందో దేవుడికెరుక’’ మీడియాతో మాట్లాడిన కేసీఆర్‌ కస్సుమన్నారు. గతంలో ఈ అంశంపై మీడియాతో మాట్లాడిన కేసీఆర్‌ వీడియో, ఇప్పుడు సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతోంది.

కానీ ఇప్పుడు ఎన్నికల నేపథ్యంలో కేసీఆర్‌ మాటే కాదు, మనసు కూడా మార్చుకున్నారు. టీఎస్‌ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఈ అంశాన్ని ఆర్టీసీ కార్మికలోకం వద్దకు తీసుకువెళ్లి, దాన్నొక ఉత్సవంగా చేయాలని బీఆర్‌ఎస్‌ నేతలు యోచిస్తున్నట్లు తెలుస్తోంది.

ఈ నిర్ణయం వల్ల 43,378 మంది కార్మికులకు మేలు జరగనుంది. ఇకపై వారంతా సర్కారీ ఉద్యోగులవుతారు. టీఎస్‌ఆర్టీసీ అలాగే ఉండనుంది. ఉద్యోగులు మాత్రం ఇకపై ప్రభుత్వ ఉద్యోగులవుతారన్నట.

అయితే 43 వేలమందిని ప్రభుత్వ ఉద్యోగులుగా మార్చిన కేసీఆర్‌ సర్కారు.. వారికి రావలసిన దాదాపు 2500 కోట్ల రూపాయల బకాయిల విషయంలో మాత్రం, మౌనం వహించడం విమర్శలకు దారితీసింది. పీఆర్‌సీ నిధులు 500 కోట్లు, ఎస్‌బీటీ 500 కోట్లు, ఎస్‌ఆర్‌బీఎస్‌ కింద రావలసిన 500 కోట్లు, ప్రధానంగా సీసీఎస్‌ నిధులు 1150 కోట్ల రూపాయలు, ఆర్టీసీ కార్మికులకు చెల్లించాల్సి ఉంది. దీనిపై మంత్రివర్గంలో ఎలాంటి నిర్ణయం జరగకపోవడం ప్రస్తావనార్హం.

అయితే రెండుసార్లు అధికారంలో ఉన్న కేసీఆర్‌కు, ఎన్నికలప్పుడే ఆర్టీసీ కార్మికులు గుర్తుకొచ్చారా అని విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. ఆర్టీసీ ఆస్తులను అమ్మేందుకే ఈ నిర్ణయం తీసుకున్నారని ఆరోపిస్తున్నాయి. ఇప్పటిదాకా ప్రభుత్వంలో విలీనంపై ఎందుకు నిర్ణయం తీసుకోలేదని ప్రశ్నిస్తున్నాయి. ఇవన్నీ ఎన్నికల తాయిలాలేనని, నిజంగా కేసీఆర్‌కు ఆర్టీసీ కార్మికులపై ప్రేమ ఉంటే.. వారికి రావలసిన కోట్లాదిరూపాయల బకాయిలు చెల్లించాలని విపక్షాలు డిమాండ్‌ చేస్తున్నాయి.

LEAVE A RESPONSE