Home » కేసీఆర్….బీసీలకిచ్చిన హామీల సంగతేంది?

కేసీఆర్….బీసీలకిచ్చిన హామీల సంగతేంది?

– రూ.20 వేల కోట్లతో బీసీలకు ప్రత్యేక బడ్జెట్ ఊసేది?
– ఆత్మగౌరవ భవనాలేమైనయ్?
– బీసీ కులాల ఫెడరేషన్లకు నిధులేవి?
– రజకులకు దోభీఘాట్ల నిర్మాణాలేమైనయ్?
-బీసీలు కేసీఆర్ పల్లకీ మోయాల్సిందేనా…వాళ్లకు రాజ్యాధికారం వద్దా?
– బీసీలకు సముచిత స్థానం కల్పిస్తున్నది బీజేపీ మాత్రమే
– బీసీని ప్రధానిగా చేసిన ఘనత బీజేపీదే
ముఖ్యమంత్రి కేసీఆర్…బీసీలకు ఇచ్చిన హామీలన్నీ తుంగలో తొక్కారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రూ.20 వేల కోట్లతో బీసీలకు ప్రత్యేక బడ్జెట్ ను కేటాయించాలనే అంశాన్ని పక్కన పెట్టారని మండిపడ్డారు. బీసీలకు ఆత్మగౌరవ భవనాలను నిర్మిస్తామని హామీనిచ్చి ఏళ్లు గడుస్తున్నా ఇప్పటి వరకు ఒక్క భవనం కూడా నిర్మించలేకపోయారని విమర్శించారు. బీసీ కులాలకు ప్రత్యేక ఫెడరేషన్లు ఏర్పాటు చేసినా ఇప్పటి వరకు ఆయా కులాలకు నయాపైసా రుణాలివ్వలేదని, ఆయా ఫెడరేషన్లకు నిధులు కూడా కేటాయించలేదని పేర్కొన్నారు.
ఈ మేరకు బండి సంజయ్ కుమార్ గురువారం విడుదల చేసిన మీడియా ప్రకటనలో బీసీలకిచ్చిన హామీలను తుంగలో తొక్కారని విమర్శించారు. టీఆర్ఎస్ లో బీసీలను కేసీఆర్ పల్లకీ మోసేందుకే ఉపయోగిస్తున్నారే తప్ప రాజ్యాధికారం మాత్రం అప్పగించడం లేదని మండిపడ్డారు. రాష్ట్రంలో బీసీ కమిషన్ కు రాజ్యాంగబద్ద హోదా కల్పించాలని డిమాండ్ చేశారు. దేశంలో బీసీలకు సముచిత స్థానం కల్పిస్తున్న ఏకైక పార్టీ బీజేపీ అని పేర్కొన్నారు. సామాన్య కుటుంబంలో పుట్టిన బీసీ వ్యక్తి నరేంద్ర మోదీని ప్రధానమంత్రిని చేసిన పార్టీ బీజేపీ అనే విషయాన్ని గుర్తు చేశారు. చరిత్రలో ఎన్నడూ లేనంతగా నరేంద్ర మోదీ కేబినెట్ లో ఏకంగా 27 మంది బీసీలకు స్థానం కల్పించారని పేర్కొన్న బండి సంజయ్ కేసీఆర్ ప్రభుత్వంలో 8 మంది బీసీలకు స్థానం కల్పించాల్సి ఉండగా.. తీవ్ర అన్యాయం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.గురువారం బండి సంజయ్ బీసీ కులాలకు ఇచ్చిన హామీలను ప్రస్తావిస్తూ…బీసీలను కేసీఆర్ ప్రభుత్వం ఏ విధంగా వాడుకుని మోసం చేస్తోందనే అంశాలను వివరిస్తూ మీడియాకు ప్రకటన విడుదల చేశారు. ఆ ప్రకటనలోని ముఖ్యాంశాలిలా ఉన్నాయి….
బీసీ ప్రణాళిక కోసం ప్రభుత్వం బీసీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతో బీసీ కమిటీ వేసి ఆర్భాటం చేసింది. రూ.20 వేల కోట్లతో బీసీలకు ప్రత్యేక బడ్జెట్ పెట్టాలని, చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్ల అమలుకు కేంద్రంపై ఒత్తిడి తేవాలని, విద్య, ఉద్యోగాల్లో 52 శాతం రిజర్వేషన్ల అమలుతోపాటు క్రీమిలేయర్‌‌ తొలగించాలని, స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లను 32 నుంచి 52 శాతానికి పెంచాలనే డిమాండ్లు ఉన్నాయి. వీటిలో ఏ ఒక్కటీ అమలు కాలేదు.. ఈ ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌‌‌‌లో బీసీ సంక్షేమ శాఖకు రూ. 5,522 కోట్లు కేటాయించారు.
ఇందులో బీసీ కార్పొరేషన్‌‌‌‌, ఎంబీసీ కార్పొరేషన్‌‌‌‌కు రూ. 500 కోట్ల చొప్పున మొత్తం రూ. వెయ్యి కోట్లు కేటాయింపులు జరిపారు. కానీ ఇప్పటికీ పథకాల అమలుకు సంబంధించి ఏ ఒక్క కార్పొరేషన్‌‌‌‌కు కూడా పైసా విడుదల చేయలేదు. 2017లో ఎంబీసీ కార్పొరేషన్‌‌‌‌ ఏర్పడినప్పటి నుంచి ఇప్పటివరకు దానికి బడ్జెట్లో రూ. 2,500 కోట్లు కేటాయించగా.. రూ. 100 కోట్లు కూడా విడుదల చేయలేదు. ఏటా బడ్జెట్‌‌‌‌లో 500 కోట్ల పెడుతున్నట్లు చూపిస్తున్నా పైసలు మాత్రం రిలీజ్‌‌‌‌ చేయడంలేదు. బీసీ కార్పొరేషన్‌‌‌‌ పరిస్థితి కూడా ఇట్లనే ఉంది. ఏడేండ్లలో బీసీ కార్పొరేషన్కు రూ. 230 కోట్లు మాత్రమే విడుదల చేశారు.
లోన్ల కోసం అధికారులు యాక్షన్ ప్లాన్‌‌ రెడీ చేసి సర్కారుకు పంపించినా ఉలుకూ పలుకూ లేదు. ఆరు నెలల నుంచి దాన్ని పెండింగ్లో పెడుతోంది. బడ్జెట్‌‌లో మాత్రం వెయ్యి కోట్లు కేటాయించినట్లు గొప్పలు చెప్పుకుంటోంది. వాస్తవానికి 2018 అసెంబ్లీ ఎన్నికలైనప్పటి నుంచి ఒక్కరికి కూడా ప్రభుత్వం బీసీ లోన్లు మంజూరు చేయలేదు.
అధికారులు పంపిన యాక్షన్ ప్లాన్ను మూలకు పడేస్తూనే ఉంది. మొత్తంగా తెలంగాణ వచ్చినప్పటి నుంచి ఈ ఏడేండ్లలో రెండుసార్లు మాత్రమే బీసీ లోన్లు విడుదలయ్యాయి. ప్రభుత్వ తీరుపై బీసీ నిరుద్యోగ యువత మండిపడుతున్నారు. ఒక దిక్కు ఉద్యోగ నోటిఫికేషన్లు లేక.. మరో దిక్కు కరోనాతో జాబ్స్‌‌ కోల్పోయి లక్షల మంది లోన్ల కోసం ఎదురుచూస్తున్నారు. లోన్లు ఇస్తేనన్నా స్వయం ఉపాధి పొందొచ్చని భావిస్తుంటే సర్కారు మాత్రం స్పందించడం లేదు.
బీసీల్లో వివిధ కులాల అభివృద్ధి కోసం 11 ఫెడరేషన్లు ఏర్పాటు చేశారు. వీటిలో రజక, నాయీబ్రాహ్మణ, కల్లుగీత, వడ్డెర, సగర, వాల్మీకి (బోయ), కృష్ణ బలిజ (పూసల), భట్రాజు, కుమ్మరి, మేదర, విశ్వబ్రాహ్మణ ఫెడరేషన్లు ఉన్నాయి. ఆయా ఫెడరేషన్ల నుంచి సబ్సిడీ రుణాలు, కులవృత్తులపై శిక్షణ, సబ్సిడీ కింద వివిధ మెషీన్లు అందజేయాలి. కానీ గత రెండు బడ్జెట్లలో ఫెడరేషన్లకు ఒక్క రూపాయి కూడా ప్రభుత్వం కేటాయించలేదు. వీటికి పాలకమండళ్లను కూడా నియమించలేదు.
తెలంగాణ వచ్చినప్పటి నుంచి బీసీలకు రెండుసార్లు మాత్రమే స్వయం ఉపాధి లోన్లు ఇచ్చారు. 2015లో ఒకసారి, 2018లో మరోసారి ఇచ్చారు. 2018 అసెంబ్లీ ఎన్నికలకు ముందు లోన్ల కోసం దరఖాస్తులు ఆహ్వానించడంతో 5.7 లక్షల మంది అప్లై చేశారు. ఎలక్షన్‌‌‌‌ ఇయర్‌‌‌‌ కావడంతో 50 వేల మందికి లోన్లు ఇచ్చారు. 5.2 లక్షల అప్లికేషన్లు పెండింగ్లో పెట్టారు. లోన్ ఎప్పుడిస్తారని దరఖాస్తుదారులు ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకునే దిక్కు లేదు.
రాష్ట్రంలో గొర్రెల పంపిణీ కార్యక్రమం రెండేండ్లుగా నిలిచిపోయింది. 7.29 లక్షల గొల్లకురుమ కుటుంబాలకు గొర్రెల యూనిట్లు అందించాలని నిర్ణయించినా.. మొదటి విడత పంపిణీనే పూర్తి కాలేదు. గొర్రెల యూనిట్ల కోసం ఒక్కొక్కరు రూ.31,250 చొప్పున డీడీలు తీశారు. అనేక మంది బంగారం కుదువపెట్టి, ప్రైవేటు వడ్డీలు తీసుకుని డీడీలు కట్టారు. రెండో విడత గొర్రెల పంపిణీ కోసం 3.63 లక్షల మంది ఎదురు చూస్తున్నారు. ఎక్కడైనా ఎన్నికలు, ఉప ఎన్నికలు జరిగితేనే గొర్రెల పంపిణీ చేపడుతున్నారు.
చేప పిల్లల పంపిణీ చేపట్టామని ప్రభుత్వం గొప్పగా చెప్పుకొంటున్నా ఏటా టార్గెట్‌‌‌‌ను మాత్రం అందుకోవడం లేదు. రజకుల కోసం దోభీఘాట్లను ఏర్పాటు చేస్తామని 2014 అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ హామీ ఇచ్చింది. 2018 ఆగస్టులో ప్రగతి భవన్‌‌‌‌లో రజక సంఘం నేతలతో కేసీఆర్ భేటీ అయ్యారు. రజకుల కోసం ప్రత్యేక కార్యక్రమాలు చేపడతామని చెప్పారు. ప్రభుత్వ హాస్పిటళ్లు, హాస్టళ్లు, గురుకులాలు, ఇతర ప్రభుత్వ సంస్థల్లో బట్టలుతికే పనులను అప్పగిస్తామన్నారు. దోభీఘాట్లను నిర్మిస్తామని, డ్రైయింగ్ మెషీన్లను అందిస్తామని చెప్పారు. కానీ ఇప్పటిదాకా ఏవీ అమలు కాలేదు.
హెయిర్ సెలూన్లలో కావాల్సిన పరికరాల కొనుగోలు కోసం నాయీ బ్రాహ్మణులకు సబ్సిడీ ఇస్తామని 2014 ఎన్నికల మేనిఫెస్టోలో టీఆర్ఎస్ ప్రకటించింది. కానీ ఇప్పటికీ అడుగు ముందుకు పడలేదు. గ్రేటర్‌‌‌‌ హైదరాబాద్ ఎన్నికల్లో మోడ్రన్ హెయిర్‌‌‌‌ సెలూన్ల ఏర్పాటుకు హామీ ఇచ్చారు. జీహెచ్‌‌‌‌ఎంసీ ఎన్నికలు రెండోసారి జరిగినా ఆ హామీ అమలు కాలేదు. దేవాలయాల్లోని కల్యాణకట్టలో పనిచేసే క్షురకులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తామని గతంలో సీఎం కేసీఆర్‌‌‌‌ హామీ ఇచ్చినా ముందుకు క‌గదిలింది లేదు.
చేనేత కార్మికులకు 50 శాతం సబ్సిడీపై నూలు, రైతుల మాదిరి 5 లక్షల బీమా, హెల్త్‌‌‌‌కార్డులు ఇస్తామని చెప్పినా ఏవీ అమలు కావడంలేదు. తెలంగాణ వచ్చినప్పుడు 470 సహకార సంఘాలు ఉండగా, ఇప్పుడు 220కి తగ్గాయి. ఎక్స్‌‌‌‌ పోర్ట్‌‌‌‌ వ్యవస్థను తయారు చేస్తామని, హ్యాండ్లూమ్‌‌‌‌ కార్పొరేషన్, పవర్‌‌‌‌లూం కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని చెప్పినా పత్తాలేవు. వరంగల్‌‌‌‌ కాకతీయ టెక్స్‌‌‌‌టైల్‌‌‌‌ పార్క్‌‌‌‌ నిర్మాణంలోనే ఉంది. 9 నెలలు కావస్తున్నా చేనేత పొదుపు పథకాన్ని పునరుద్ధరించడం లేదు.
హైదరాబాద్‌‌లో 46 బీసీ కులాలకు ఆత్మగౌరవ భవనాలు నిర్మిస్తామని 2018 అసెంబ్లీ ఎన్నికలప్పుడు సీఎం కేసీఆర్‌‌ ప్రకటించారు. 73 ఎకరాల భూమి, రూ.53 కోట్లు కేటాయిస్తూ ఉత్తర్వులు కూడా జారీ చేశారు. కానీ మూడేండ్లు దాటినా ఒక్క భవనం కూడా పూర్తి కాలేదు. కొన్నింటికి ఇప్పటి వరకూ పునాదులే తీయలేదు. అగ్రకులాల‌ాకి జుబ్లీహిల్స్‌‌, హైటెక్‌‌సిటీల్లో స్థలాలు ఇచ్చి.. వెనుకబడిన వ‌ర్గాల‌కు మాత్రం కొండ‌ లు, గుట్టల్లో స్థలాలు ఇవ్వడం దేనికి సంకేత‌చమో మ‌సనం అర్థం చేసుకోవచ్చు.హుజూరాబాద్ ఉప ఎన్నికల నేపధ్యంలో ఎట్టకేలకు తెలంగాణలో బీసీ కమిషన్ ను ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.. హుజూరాబాద్ ఎన్నిక అయ్యాక దానిని బంద్ చేస్తారు..

Leave a Reply