– కార్యకర్తలతో పోటెత్తిన తెలంగాణభవన్
– తలసాని నేతృత్వంలో ఏర్పాట్లు జోర్దార్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు జన్మదిన వేడుకలు మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో పండుగ వాతావరణం లో ఘనంగా జరిగాయి. జన్మదిన వేడుకలకు హాజరైన అతిథులకు డప్పు చప్పుళ్ళు, గిరిజన మహిళల నృత్యాలతో ఘన స్వాగతం పలికారు.
కేసీఆర్ 71 వ జన్మదినాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన 71 కిలోల భారీ కేక్ ను బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ , శాసనమండలి లో ప్రతిపక్ష నాయకులు మధుసూదనాచారి, మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్, మాజీమంత్రులు హరీష్ రావు లు ఎమ్మెల్సీ మహమూద్ అలీ, శ్రీనివాస్ గౌడ్, సత్యవతి రాథోడ్, రాజ్యసభ సభ్యులు రవిచంద్ర, ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు, RS ప్రవీణ్ కుమార్, ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్, మాజీ ఎంపి కవిత, తెలంగాణ భవన్ ఇంచార్జి రావుల చంద్రశేఖర్ రెడ్డి, బీఆర్‌ఎస్ యువనేత తలసాని సాయి కిరణ్ యాదవ్ తదితరు లతో కలిసి కట్ చేశారు.
ముందుగా తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కేసీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ ఉద్యమం, రాజకీయ నేపద్యాన్ని వివరించేలా ఏర్పాటు చేసిన ఫోటో ప్రదర్శన, వీడియో ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. తెలంగాణ ఉద్యమం, తెలంగాణ ప్రభుత్వం లో అభివృద్ధి కార్యక్రమాల గురించి వివరించే వీడియో ను నేతలు ఎంతో ఆసక్తితో తిలకించారు. కళాకారుల ఆటపాట ఆహుతులను ఆకట్టుకుంది.
జన్మదిన వేడుకలకు వివిధ నియోజకవర్గాల ఇంచార్జి లు, మాజీ చైర్మన్ లు ఎర్రోళ్ల శ్రీనివాస్, రజిని, గజ్జెల నాగేష్, కార్పొరేటర్ లు, మాజీ కార్పొరేటర్ లతో పాటు నగరం నుండే కాకుండా రాష్ట్రంలో ని వివిధ ప్రాంతాల నుండి బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ఉద్యమకారులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.