Suryaa.co.in

Telangana

కాంగ్రెస్‌కు ‘కేకే’సిన కేశవరావు!

– కారు దిగుతున్నానని వెల్లడి
– కేసీఆర్‌కు కలిసిన కేకే
– కేసీఆర్‌కు ఒకేరోజు రెండు షాకులు
( అన్వేష్)

హైదరాబాద్: కాలం కలసివచ్చినంత వరకే ఎవరి చక్రమైనా తిరిగేది. తెలంగాణలో పదేళ్లు నిర్నిరోధంగా సాగిన బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌కు.. ఓటమి తర్వాత శరపరంపరగా అవిఘ్నాలు, అపశృతులు, చేదువార్తలే. అన్నీ ఎదురుదెబ్బలే. తాజాగా ఒకే రోజు రెండు షాకులు. ఆయన సొంత ఇలాకాలో సొంత పార్టీ ఎంపీపీపై కాంగ్రెస్ పెట్టిన అవిశ్వాసం నెగ్గి, అక్కడ కారు కూలిపోయింది. అదేరోజు.. కేసీఆర్‌కు అత్యంత నమ్మకస్తుడు, రెండుసార్లు రాజ్యసభ సీటు తీసుకున్న కే కేశవరావు సైతం, కేసీఆర్ సారుకు ఝలక్ ఇచ్చారు. కారు దిగి కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు ప్రకటించారు.

అంతకుముందు ఆ విషయాన్ని ఆయన స్వయంగా సారుకు బరాబర్ చెప్పేశారు. దానితో ఖిన్నుడైన కేసీఆర్.. పార్టీలో నీకేం తక్కువ చేశాన. నీ బిడ్డకు మేయర్ ఇచ్చా అని వాపోయారట. విశ్వాసాలు, విధేయతలు, నమ్మకంతో పనిలేని కాలమిది. అందునా పార్టీలు మారటం ఇప్పుడు కొత్తేమీ కాదు. అయినా.. విపక్షం లేని తెలంగాణ నిర్మించాలన్న తెలంగాణ జాతిపిత కేసీఆర్ బాటలోనే ఇప్పుడు కేకే నడిచారు. ఆయనకు కాంగ్రెస్ సిద్ధాంతాలు మళ్లీ గుర్తుకువచ్చి నచ్చాయట. పైగా తన సొంతింటికే వెళుతున్నానని కేకే నిస్సంకోచంగా చెప్పారు. తాను కాంగ్రెస్‌లోనే చనిపోతానని పదేళ్ల తర్వాత సెలవిచ్చారు. ఇంతకూ మీడియాతో కేకే ఏమన్నారంటే..

కాంగ్రెస్ పార్టీ నాకు సొంత ఇల్లు .తీర్థ యాత్రలకు వెళ్లిన వారు ఎప్పటికైనా ఇంటికే చేరుతారు. నేను కూడా నా సొంత ఇల్లు కాంగ్రెస్ లో చేరత. 53 ఏళ్లు కాంగ్రెస్ పార్టీలో పని చేశాను. బిఆర్ఎస్ లో నేను పని చేసింది కేవలం పదేళ్లు మాత్రమే. తెలంగాణ కోసమే బిఆర్ఎస్ లో చేరిన. కాంగ్రెస్ పార్టీయే తెలంగాణ ఇచ్చింది.

నేను మొదటిసారి కాంగ్రెస్ రెండో ప్రాధాన్యత ఓట్లతోనే రాజ్యసభకు ఎన్నికయ్యా. నేను పుట్టింది, పెరిగింది, కాంగ్రెస్ లోనే.. ఆ పార్టీలోనే చనిపోవాలని అనుకుంటున్న.నేను బిఆర్ఎస్ కు ఇంకా రిజైన్ చేయలేదు. నా కూతురు చేరిన రోజు నేను కాంగ్రెస్ లో చేరడం లేదు. ఏ రోజు కాంగ్రెస్లో చేరేది తేదీ ఖరారు అయిన తర్వాత చెబుతా.నా కుమారుడు మాత్రం బిఆర్ఎస్ లోనే ఉండాలి అనుకుంటున్నారు. ఇంద్రకరణ్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు.

LEAVE A RESPONSE