– కెనడాలోని తెలుగు సీఈవోలకు ఆచార్య యార్లగడ్డ విజ్ఞప్తి
టొరంటో (కెనడా) : కెనడాలోని తెలుగు విద్యార్థులు ఉపకార వేతనాలు, ఉద్యోగాల విషయంలో ఎదుర్కొంటున్న సంక్షోభ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని, వారికి చేయూతనివ్వాలని కెనడాలోని వివిధ సంస్థల తెలుగు సీఈవోలకు విశ్వ హిందీ పరిషత్ జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ మాజీ సభ్యుడు, పద్మభూషణ్ పురస్కార గ్రహీత ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ విజ్ఞప్తి చేశారు.
టొరంటో నగరంలోని బంజారా ఇండియా రెస్టారెంట్‌లో పలువురు తెలుగు సీఈవోలతో సమావేశమైన యార్లగడ్డ, ట్రంప్ అమెరికా అధ్యక్షుడైన తర్వాత అమెరికా-కెనడా, కెనడా-భారత సంబంధాలలో వచ్చిన మార్పుల కారణంగా తెలుగు విద్యార్థులు అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నారన్నారు.
కెనడాలో ఉన్న విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్తు గురించి ఆందోళన చెందుతున్నారని, తెలుగు సంఘాలతో చర్చించి, విద్యార్థులకు ఉపకార వేతనాలు, పార్ట్ టైం ఉద్యోగాలు, అర్హతలున్న వారికి శాశ్వత ఉద్యోగాలు కల్పించాల్సిన అవసరం ఉందన్నారు.
ఈ సమావేశంలో పాల్గొన్న ప్రముఖులు సమస్యపై అవగాహన ఉందని, విద్యార్థులకు సహాయం చేయడానికి తమ వంతు సహకారం అందిస్తామని తెలిపారు. గతంలో చదువుకోసం వచ్చిన తెలుగువారిలో 80 శాతం మంది వర్క్ పర్మిట్ తో ఉద్యోగాలు పొందే వారు ఉండేవారని, అయితే ప్రస్తుతం ఈ సంఖ్య 20 శాతానికి పడిపోయిందని పేర్కొన్నారు.
చాలామంది విద్యార్థులు తమ భవిష్యత్తుపై అనిశ్చిత పరిస్థితిలో ఉన్నారని, వారికి సహాయం చేయడానికి తాము ముందుంటామని ఆ సంస్థల ప్రతినిధులు హామీ ఇచ్చారు. భారత సాంస్కృతిక రాయబారిగా కెనడాలో పనిచేసిన సమయంలో ఆచార్య యార్లగడ్డ ఏర్పరచుకున్న సంబంధాల వల్ల ఈ చర్చలు ఫలవంతంగా సాగాయి.ఈ సం
దర్భంగా “నమస్తే కెనడా” పత్రిక అధినేత , ప్రముఖ హిందీ సాహితీవేత్త శరణ్ ఘయ్, తెలుగు ఖతులు (ఫాంట్లు) రూపొందించిన తొలి విదేశాంద్రులలో ఒకరైన రచయిత శ్రీకృష్ణ దేశికాచార్యులను ఆచార్య యార్లగడ్డ విశ్వ హిందీ పరిషత్ తరఫున సత్కరించారు. విండ్సర్ నగరంలో కెనడాలో అతిపెద్ద టాక్స్ కన్సల్టింగ్ సంస్థలలో ఒకటైన 8 నగరాలలో కార్యాలయాలు కలిగిన లిబర్టీ టాక్స్ కు చెందిన తెలుగు ప్రముఖులు సూర్య బెజవాడ, విశాల్ బెజవాడలను కలిసి అక్కడి తెలుగు విద్యార్థులకు సహాయంగా నిలవాలని కోరారు.
ఈ సమావేశాల నిర్వహణ బాధ్యతలను బంజారా ఇండియా రెస్టారెంట్ అధిపతి వీరెళ్శ రాజేష్, మారియట్ హోటల్స్‌లో బాధ్యతలు నిర్వహిస్తున్న పొతకమూరి భానుకుమార్ చేపట్టారు.