– రెండు కీలక డిమాండ్లకు సంబంధించి ఉత్తర్వులు జారీ
– వర్కర్లు,హెల్పర్లకు టీఏ, డీఏ లు చెల్లించేందుకు ఉత్తర్వు
కొన్ని రోజులుగా ఆందోళనలు చేస్తున్న అంగన్ వాడీ హెల్పర్లు,వర్కర్లకు వైసీపీ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. తాజాగా అంగీకరించిన రెండు కీలక డిమాండ్లకు సంబంధించి ఇవాళ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో అంగన్ వాడీ హెల్పర్లను వర్కర్లుగా ప్రమోషన్లు ఇచ్చేందుకు వయో పరిమితి పెంపుతో పాటు మరో ఉత్తర్వు కూడా ఉంది. తాజాగా మంత్రుల కమిటీతో జరిపిన చర్చల మేరకు ప్రభుత్వం ఈ ఉత్తర్వులు జారీ చేసింది.
ఏపీలో అంగన్ వాడీ హెల్పర్లకు అంగన్వాడీ వర్కర్లుగా ప్రమోషన్ ఇచ్చేందుకు వయోపరిమితి పెంచుతూ ప్రభుత్వం ఇవాళ ఉత్తర్వులు జారీ చేసింది. దీని ప్రకారం ఇకపై అంగన్ వాడీ హెల్పర్లకు అంగన్వాడీ వర్కర్లుగా ప్రమోషన్ ఇచ్చేందుకు ప్రస్తుతం ఉన్న వయో పరిమితిని 45 ఏళ్ల నుంచి 52 ఏళ్లకు ప్రభుత్వం పెంచింది. అలాగే అంగన్వాడీ వర్కర్లు,హెల్పర్లకు టీఏ, డీఏ లు చెల్లించేందుకు ఉద్దేశించిన మరో ఉత్తర్వు కూడా జారీ చేసింది…
రాష్ట్రంలో ఇప్పటికే పలు డిమాండ్ ల సాధన కోసం అంగన్వాడీ వర్కర్లు,హెల్పర్లు ఆందోళన చేస్తున్నారు. ఇవి తీవ్రతరం అవుతున్న క్రమంలో ప్రభుత్వం తాజా ఉత్తర్వులు జారీ చేసింది. మిగిలిన డిమాండ్లపైనా ప్రభుత్వం చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో అంగన్ వాడీ కేంద్రాలకు వేసిన తాళాలు పగులగొడుతుండటంపై ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో సర్కార్ తాజా ఉత్తర్వులు ఊరటగా చెప్పుకోవచ్చు