Suryaa.co.in

Andhra Pradesh

ఉత్తరాంధ్ర కేడర్ కు ఊపునిచ్చిన శంఖారావం

-10రోజులు, 31 నియోజకవర్గాల్లో సాగిన పర్యటన
-కార్యకర్తలు, ప్రజలకు భరోసా ఇచ్చిన యువనేత నారా లోకేష్

విశాఖపట్నం: రాష్ట్రంలో అరాచకపాలనను అంతమొందించడమే లక్ష్యంగా యువనేత నారా లోకేష్ చేపట్టిన తొలివిడత శంఖారావం యాత్ర ఉత్తరాంధ్ర పార్టీ కేడర్ లో నూతనోత్సాహాన్నినింపింది.

ఈనెల 11వతేదీన ఇచ్చాపురం నుంచి ప్రారంభమైన యాత్ర… ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో 31 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 10 రోజులపాటు 1225 కి.మీ.లు నిర్విరామంగా సాగింది. ప్రతిరోజూ 3 అసెంబ్లీ నియోజకవర్గాల్లో శంఖారావం సభల్లో పాల్గొన్న యువనేత… 19వతేదీన నాలుగు సభలకు హాజరయ్యారు. రాబోయే ఎన్నికలకు పార్టీ కేడర్ ను సంసిద్ధం చేయడంతోపాటు బాబు సూపర్ -6 కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంపై కేడర్ కు దిశానిర్దేశం చేస్తూ సాగిన శంఖారావం యాత్రలో జనసేన నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున తరలివచ్చారు.

కేవలం పార్టీకేడర్ లో మనోస్థయిర్యం నింపేందుకు ఉద్దేశించిన చేపట్టిన సభలవద్దకు ప్రతిరోజూ వివిధవర్గాల ప్రజలు తరలివచ్చి రాక్షసపాలనలో తాము పడుతున్న అవస్థలపై పెద్దఎత్తున వినతిపత్రాలు సమర్పించారు. మరో రెండునెలలు ఓపికపడితే రాబోయే ప్రజాప్రభుత్వం అన్నివర్గాలకు న్యాయం చేస్తుందంటూ లోకేష్ భరోసా ఇచ్చారు. ఆయా నియోజకవర్గాల్లో అధికారపార్టీ శాసనసభ్యులు చేసిన అవినీతి, అక్రమాలపై ఆధారాలతో సహా తూర్పారబడుతూ యువనేత చేసిన ప్రసంగాలకు పెద్దఎత్తున స్పందన లభించింది.

నియోజకవర్గాల్లో నెలకొన్న సమస్యలపై లోతైన అధ్యయనం చేసిన లోకేష్ తాము అధికారంలోకి వచ్చాక ఏం చేయబోతున్నామో సభాముఖంగా తెలియజేశారు. ఉత్సాహంగా సాగిన యువనేత శంఖారావం యాత్రతో ఉత్తరాంధ్ర పార్టీ కేడర్ లో జోష్ నెలకొంది.

పనిచేసే కార్యకర్తలకు కొండంత అండ
గత 4.10 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి అరాచకపాలనలో తాము పడిన ఇబ్బందులను నాయకులు, కార్యకర్తలు యువనేతకు చెప్పుకున్నారు. మరో రెండునెలల్లో రాబోయే ప్రజాప్రభుత్వంలో పార్టీ కేడర్ ను వేధించిన ఏ ఒక్కరినీ వదిలేదని చెప్పడంతోపాటు ఆయా నియోజకవర్గాల్లో ఇబ్బందిపెట్టిన వారి పేర్లను రెడ్ బుక్ లో రాశారు. కార్యకర్తలు పార్టీ కార్యాలయాల చుట్టూ, తనచుట్టూ కాకుండా ప్రజలవద్దకు వెళ్లాలని, అటువంటి వారిని తానే వెదుక్కుంటూ వస్తానని చెప్పడంతో పాటు బాబు ష్యూరిటీ – భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమాల్లో మెరుగైన పనితీరు కనబర్చిన వారికి ప్రశంసా పత్రాలు అందజేసి భుజం తట్టారు.

ఈ సందర్భంగా తాము ఎదుర్కొంటున్న సమస్యలను పలువురు కార్యకర్తలు వ్యక్తిగతంగా యువనేతకు చెప్పుకున్నారు. శంఖారావం కేవలం పార్టీ కేడర్ ను చైతన్యవంతం చేయడానికి ఉద్దేశించిన కార్యక్రమమైనప్పటికీ ప్రతిరోజూ ఆయా సభా ప్రాంగణాలకు వద్దకు చేరుకున్న అభిమానులు పెద్దఎత్తున ఫోటోలు దిగేందుకు పోటీపడటం లోకేష్ పై ప్రజల్లో నెలకొన్న క్రేజ్ కు అద్దం పడుతోంది.

కీలక సమస్యలపై విస్పష్టమైన ప్రకటన
ఉత్తరాంధ్రలో శంఖారావం సందర్భంగా పలు కీలకమైన సమస్యలపై యువనేత లోకేష్ విస్పష్టమైన ప్రకటన చేశారు. ముఖ్యంగా తెలుగుప్రజల ఆత్మగౌరవంతో ముడివడివున్న ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కును ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటీకరణ చేయనీయబోమని తెలిపారు. అవరమైతే రాష్ట్రప్రభుత్వమే స్టీల్ ప్లాంట్ కొనుగోలు చేస్తుందని చెప్పి ఉద్యోగులు, కార్మికుల్లో మనోధైర్యాన్ని కలిగించారు. విశాఖపట్నాన్ని హైదరాబాద్ కు దీటుగా అభివృద్ధి చేస్తామని, ఇందుకు అవసరమైన ప్రణాళికలు తమవద్ద ఉన్నాయని చెప్పారు.

అదేవిధంగా విశాఖ రుషికొండపై 500కోట్లతో జగన్మోహన్ రెడ్డి కట్టుకున్నప్యాలెస్ ను ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజోపయోగ కార్యక్రమాలకు వినియోగిస్తామని సంచలనాత్మక ప్రకటన చేశారు. భోగాపురం ఎయిర్ పోర్టును పూర్తిచేస్తామని అన్నారు. ఉత్తరాంధ్రలో 8లక్షల ఎకరాలకు సాగునీరు అందించే సుజల స్రవంతిని అధికారంలోకి వచ్చాక పూర్తిచేస్తామని తెలిపారు.

గోస్తనీ-చంపావతి నదుల అనుసంధానం, రామతీర్థసాగర్, తోటపల్లి కాల్వల ఆధునీకరణ పనులు చేపడతామని చెప్పారు. పెందుర్తి నియోజకవర్గంలో దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న పంచగ్రామాల సమస్యను అధికారంలోకి వచ్చాక పరిష్కరిస్తామని అన్నారు. కీలకమైన సమస్యల పరిష్కార మార్గాలపై యువనేత లోకేష్ తమ అంతరంగాన్ని ఆవిష్కరించారు.

వైసిపి బాధిత ప్రజలకు స్వాంతన
జగన్మోహన్ రెడ్డి పాలనలో తీవ్రంగా నష్టపోయిన వివిధవర్గాల ప్రజలకు యువనేత లోకేష్ నేనున్నానని భరోసా ఇచ్చారు. జగన్మోసానికి బలైన డిఎస్సీ అభ్యర్థులు యువనేత లోకేష్ ను కలిసి తమ గోడు విన్పించారు. రెండునెలల్లో రాబోయే ప్రజాప్రభుత్వం ప్రతిఏటా జాబ్ క్యాలెండర్, డిఎస్సీ నిర్వహించడంతోపాటు అవసరైతే వయోపరిమితిని కూడా సడలించి న్యాయం చేస్తుందని భరోసా ఇచ్చారు. అడ్డగోలు పన్నులతో కుదేలైన రవాణారంగాన్ని ఆదుకునే విషయంలో కూడా విస్పష్టమైన ప్రకటనచేశారు.

దేశం మొత్తమ్మీద తక్కువ పన్నులు ఉండేవిధంగా రవాణారంగ పన్నుల విధానాన్ని సవరిస్తామని చెప్పారు. గోపాల మిత్రలకు ఉద్యోగ భద్రత కల్పించాలని జగన్ ప్రభుత్వం ఉద్యోగాలు కోల్పోయిన బాధితులు విన్నవించారు.

రాష్ట్రంలో 40 వేల మందికి పైగా ఉన్న ఆర్ఎంపీ, పీఎంపీలకు గుర్తింపు సర్టిఫికెట్లు జారీ చేయాలని ఆర్ఎంపి డాక్టర్లు కోరారు. ఎక్స్ సర్వీస్ మెన్లను అన్ని విధాలుగా ఆదుకోవాలని మాజీ సైనికులు వినతిపత్రం, మాజీ సైనికులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటుచేస్తామని యువనేత లోకేష్ హామీ ఇచ్చారు.

LEAVE A RESPONSE