Suryaa.co.in

Devotional

విష్ణు నాభి..వైజ్ఞానిక విశ్లేషణ

విశ్వంలో నక్షత్ర మండలాలు అనబడే గెలాక్సీలు ఎన్నో ఉన్నాయి. సూర్యుడు, గ్రహాలూ కలిసిన మన సౌరకుటుంబం ఉన్నది. ఇవన్నీ”పాలపుంత” అనబడే ఒకగెలాక్సీలో ఉన్నాయని మనకు తెలుసు. ఈ పాలపుంతలో మన వంటి సౌరకుటుంబాలు ఎన్నున్నాయో లెక్కేలేదు. సూర్యులు ఎందరున్నారో లెక్కే లేదు. ఈ పాలపుంతకు ఒక కేంద్రం ఉంది. దానిని గేలాక్టిక్ సెంటర్ అంటారు. ఈ గెలాక్టిక్ సెంటర్ అనేది ఊహించనలవి గాని శక్తి కేంద్రం.

అది ప్రస్తుతం ధనూరాశిలో ఉంది. ఈ ధనూరాశిలోనే గేలాక్టిక్ సెంటర్ దగ్గరగా, మూలా నక్షత్రం ఉంది. ఈప్రాంతంలో ఒక పెద్ద బ్లాక్ హోల్ ఉన్నదని సైన్సు అంచనా వేసింది. ఆ బ్లాక్ హోల్ ఒక పెద్ద నక్షత్రం సైజులో ఉండి, కొన్ని మిలియన్ల సూర్యుల సాంద్రతను కలిగి ఉంది. ఇది ఊహించనలవి గానంత రేడియో తరంగాలను వెదౙల్లగల శక్తిని కలిగి ఉంది. మన సూర్యునినుంచి ఇది దాదాపు 30,000 కాంతి సంవత్సరాల దూరంలో ఉంది.

మన సూర్యుడు తన సౌర మండల గ్రహాలతోసహా ఈ గెలాక్టిక్ సెంటర్ చుట్టూతా, 200మిలియన్ సంవత్సరాలలో ఒకసారి ప్రదక్షిణంచేస్తాడు. దీనికోసం ఆయన శూన్యంలో సెకనుకు 200 మైళ్ళ వేగంతో ప్రయాణం చేస్తూ ఉన్నాడు. ఇంకొక విచిత్రం ఏమిటంటే- ఈ “విష్ణు నాభి” అనేప్రాంతం ఒక ఎక్కుపెట్టబడిన విల్లువంటి ఆకారంలో, ధనుస్సులాగా ఉండి “ధనూ రాశి” అనే పేరుకు సరిగ్గా సరిపోతూ ఉంటుంది.

“విష్ణునాభి”
మన పురాణాలు విశ్వం మొత్తాన్నీ విష్ణుస్వరూపంగా వర్ణించాయి. విశ్వం విష్ణు: అంటూ విష్ణు సహస్ర నామం కూడా చెప్పింది. విష్ణునాభి నుంచి ఉద్భవించిన కమలంలో సృష్టిమూలమైన బ్రహ్మ జననం
a5b717a494238dba60dbd773488e54c2 జరిగిందని పురాణాలు చెప్పాయి. మన గెలాక్సీకి కేంద్ర స్థానం అయిన ఈ సెంటర్ ను మన భాషలో నాభి అనవచ్చు. నాభి అనగా కుదురు, కేంద్రం అని అర్ధాలున్నాయి. అంటే విష్ణునాభి అయిన గెలాక్టిక్ సెంటర్ సృష్టికి మూలం అవడానికి ౘాలా దగ్గరి పోలికలు ఉన్నాయి.ఇక్కడే ఉన్నటువంటి “మూలా” నక్షత్రమండలం ఈ ఊహకు ఆధారాన్ని కలిగిస్తున్నది. ఇందులో ౘాలా రహస్యాలు దాగి ఉన్నవి. సృష్టిమూలమైన మహాశక్తి ఇక్కడే ఉన్నదని మనకు సూచనప్రాయంగా తెలుస్తున్నది.

ఇదే ప్రాంతంలో ఉన్నదని సైన్స్ ఊహిస్తున్న బ్లాక్ హోల్ ఆ శక్తి స్వరూపం కావచ్చునా? ఈ విషయం పురాణాలు వ్రాసిన మహర్షులకు ఎలా తెలిసి ఉండవచ్చో, ఈనాడు రేడియో టెలిస్కోపులకు కూడా లీలగా మాత్రమే అందుతున్న ఈ రాశికి, వాళ్ళు ఆనాడే కళ్లతో ౘూచినట్లు “ధనూరాశి” అని ఎలా నామకరణంచేశారో, అందులో బ్లాక్ హోల్ సమీపంలోని నక్షత్రానికి “మూలా నక్షత్ర మండలం” అని ఎలా పేరు పెట్టారో మన ఊహకు అందదు.

ధనూరాశి బాణం ఎక్కుపెట్టిన ఒక విలుకాని రూపంలో ఉంటుంది. ఆ బాణం సరాసరి ఎదురుగా ఉన్న మిధునరాశి వైపు గురి పెట్టి ఉంటుంది. ఈవిధంగా ధనూరాశి నుంచి మిధునరాశి వరకు ఒకగీత గీస్తే, అది జ్యోతిశ్చక్రాన్ని రెండుగా విభజిస్తుంది. మిధునరాశిలో రాహువుదైన ఆర్ద్రా నక్షత్రం ఉన్నది. ధనూరాశిలో కేతువుదైన మూలా నక్షత్రం ఉన్నది. మిధునరాశి జంట మిధునానికి సూచిక. అనగా స్త్రీపురుషులు జంటగా ఉన్న బొమ్మ ఈ రాశిని సూచిస్తుంది.

దీన్ని బట్టి ఏం అర్ధం అవుతున్నది? మూలానక్షత్రం ఉన్న ధనూరాశి నుంచి స్త్రీ పురుషుల సృష్టికి అవసరమైన శక్తి ప్రసారం మిధునరాశి వైపు జరుగుతున్నది అని తెలుస్తున్నది. అంటే ప్రథమంగా విశ్వంలో జీవావిర్భావానికి మూలం అయిన శక్తి ప్రసారం ధనూరాశిలో ఉన్న మూలానక్షత్ర ప్రాంతం నుంచి మిధునరాశి వైపుగా జరిగి ఉండవచ్చు.

ఇక్కడే ఇంకొక విచిత్రం ఉన్నది. ఈ నాటికీ శిశుజననం జరిగినప్పుడు బొడ్డు కోయడం జరుగుతుంది. గర్భస్థశిశువుకు బొడ్డు(నాభి) ద్వారానే తల్లినుంచి పోషణ అందుతుంది. అలాగే విశ్వం మొత్తానికీ శక్తిప్రసారం విశ్వనాభి అయిన గెలాక్టిక్ సెంటర్లో ఉన్న మూలానక్షత్రం నుంచి జరుగుతూ ఉండవచ్చు. ఆ శక్తి కేంద్రంతో బంధం తెగిన మరుక్షణం జీవి మాయామోహాలకు లోబడి మానవ జన్మలోకి ఆడుగు పెట్టటం జరుగుతుండవచ్చు.

శిశు జననానికి పట్టే తొమ్మిది నెలలు-ఇంకో రహస్యం:
శిశు జననానికి తొమ్మిది నెలలు పడుతుంది.అలాగే రాశి చక్రంలో ధనూ రాశి తొమ్మిదవది. అంటేమేష రాశిలో తలతో మొదలైన శిశువు రూపం తొమ్మిది నెలలు నిండిన తరువాత ధనూరాశి చివరలో ఈ భూమ్మీదకు వస్తున్నది. తొమ్మిది రాశులను అధిగమించి, పదవ రాశి మరియు కర్మస్థానం అయిన మకర రాశిలోకి అడుగు పెడుతూ మకరం వలె పాకుతూ ఈ కర్మల లోకంలోకి ఆడుగుపెడుతున్నది. మూడో నెలలో పిండంలోనికి ఆత్మప్రవేశం జరుగుతుందని యోగ విదులు చెబుతారు. మూడోనెలలో పిండం ఆడో, మగో స్ఫుటంగా తెలుస్తుంది.

అందుకనేమో, మూడవ రాశి అయిన మిధునం యొక్క గుర్తు- స్త్రీ, పురుషులుగా ఉంటుంది. అంటే లింగనిర్ధారణ ఆ సమయంలో జరుగుతుంది అని రహస్యసంకేతంగా సూచితం అవుతున్నది. మూడో రాశి అయిన మిధునం లో ఉన్నపుడు, మూడవ నెలలో, దానికి సూటిగా ఎదురుగా ఉన్న ధనూరాశినుంచి, బాణం లాగా ఆత్మ వచ్చి ఈ పిండంలో కుదురుకుంటుందని భావం. ఈ క్రమాన్ని రహస్యంగా సూచిస్తూ ధనూరాశి నుంచి ఎక్కుపెట్టిన బాణం దానికి ఎదురుగా ఉన్న స్త్రీపురుషుల సంకేతరాశి అయిన మిథునం వైపుగాచూస్తూ ఉంటుంది.

అంటే ఆత్మల పుట్టుక మూలా నక్షత్ర మండలప్రాంతంలో జరుగుతుందా? లేక మరణం తర్వాత ఆత్మగా విశ్రాంతి తీసుకునే స్థానం ధనూరాశిలో ఉన్న మూలా నక్షత్ర ప్రాంతంలోని విపరీతమైనమహా శక్తి కేంద్రం అయిన బ్లాక్ హోల్ కావచ్చునా? మనమందరమూ మరణం తర్వాత చేరవలసిన స్థానం ఇదేనా? ఇదొక పరమ శాంతిమయ, తేజోమయ లోకం కావచ్చునా?

LEAVE A RESPONSE