– ఇళైయరాజా పాట
1980లో వచ్చిన కొత్త జీవితాలు సినిమాలోని పాట “మనసే వెళ్లెనే మమతే మర్చి…” ఈ సినిమా 1979లో వచ్చిన తమిళ్ష్ సినిమా పుదియవార్పుగళ్ సినిమాకు రీమేక్. తమిళ్ష్లోనూ ఈ పాట ఉంది. తమిళ్ష్లో జెన్సీ అన్న గాయని, తెలుగులో పీ. సుశీల పాడారు.
తెలుగులో సిమ్ఫని (Symphony)సంగీతం తొలిసారి ఈ పాటతోనే వచ్చింది అన్నది నా ఎఱుక. తెలివిడి ఉన్నవాళ్లు కాదంటే వాళ్లకు కృతజ్ఞత చెప్పి ఉన్న విషయం తెలుసుకుంటాను.
ఆస్ట్రిఅన్ (Austrian) ధాతుకారుడు (composer) ఫ్రాన్జ్ షూబట్ (Franz Schubert) చేసిన ఒక అసంపూర్ణ సిమ్ఫని ప్రేరణతో ఈ పాటను చేసినట్టుగా ఇళైరరాజా బహిరంగంగా తెలియజేశారు. ఈ పాట నకలు, derivative కాదు. షూబట్ సిమ్ఫని ఈ పాటకు ప్రేరణ మాత్రమే. ఆ సిమ్ఫని ఛాయ లేదా పోహళింపును పుణికిపుచ్చుకుని ఇళైయరాజా ఈ పాటను చేశారు.
ఒక కళాకారుడికి ఎఱుక, పరిధి ఉండాలి. అటు తరువాత ప్రజ్ఞ, ప్రతిభ తప్పనిసరి. దక్షిణాది సినిమా సంగీత దర్శకులకు అంతగా లేని అంతర్జాతీయ ఎఱుక, పరిధి ఇళైయరాజాకు ఉన్నాయి. తెలుగులో పలువురు సంగీత దర్శకులకు అప్పటికి అసలు సిమ్ఫని అనేది ఉంది అన్న సంగతైనా తెలుసో లేదో? తాగుడు, వ్యభిచారం, చవకబారు ప్రవర్తనలతో తెలుగు సంగీత దర్శకులు ఊగిపోతున్నప్పుడు ఇళైయరాజా అభ్యాసం, సాధన, తెలివిడి, దర్శనం, పరిశ్రమ, పనిచెయ్యడం వంటి వాటిని ఆపోశన పట్టారు. అందువల్ల వచ్చిన పాటల్లో ఈ పాట ఒకటి.
ఈ మార్చ్ 8న లండన్ లో తన valiant సిమ్ఫని స్వనించిన వేదికపై ఈ పాటను స్వయంగా పాడారు ఇళైరాజా. 1980 నాటికి తెలుగు సంగీత దర్శకులు కనీసం ఇలాంటి పాట ను కనీసం కలలో కూడా ఊహించి ఉండరు. తెలుగులో గొప్ప పాటలు లేవు, గొప్ప సంగీత దర్శకులు లేరు అని నేను చెప్పడం లేదు. తెలుగు పాటల గొప్పతనం ఒక మూసలోనే ఉండి పోయింది. అంతర్జాతీయ స్థాయి సంగీతానికి మన పాటలు తులతూగలేదు అన్న వాస్తవాన్ని మనం గ్రహించడం దోషం కాదు.
మన తెలుగు అభిజ్ఞ వర్గాలు, మేధావర్గాలు (మేధోవర్గాలు కాదు) ఇంకా, ఇవాళ్టికీ ఘంటసాల, పెండ్యాల వంటి వాళ్ల దగ్గరే ఆగిపోయాయి. నిజానికి ఈ పాట వచ్చే 45యేళ్లు అయింది. మనం ఇంకా ఎక్కడో ఆగిపోతే ఎలా? మేధావుల్ని, జ్ఞానుల్ని, పెద్దల్ని పక్కకు నెట్టేసి మామూలు వాళ్లంగా మనం రసజ్ఞతలోకి వెళదాం; అంతర్జాతీయ స్థాయి రసజ్ఞతకు, కళకు మాలిమి ఔదాం. రండి.

9444012279