మామిడి రైతుల జీవితాల్లో చేదుని నింపిన అకాల వర్షాలు
పండ్ల తోటల్లో మామిడి పంట చాలా ప్రముఖమైనది. అందుకే దీనిని పండ్లలో రారాజు అని పిలుస్తారు. మన భారతదేశంలో చాలా రకాల మామిడి వంగడాలు / రకాలు వివిధ ప్రాంతాలలో సాగవుతున్నాయి. కొన్ని వందల సంవత్సరాల నుండి ఈ పంటను సాగుచేస్తున్నారు. ప్రపంచంలోనే మామిడిని పండించడంలో మన భారత దేశం ప్రథమ స్థానంలో ఉంది.
ప్రపంచం మొత్తంలో సగం వరకు మామిడి ఉత్పత్తి మన భారత దేశంలో జరుగుతోంది. మామిడి పండులో అధిక పోషకాలు, విటమిన్-ఎ, సి, అలాగే మంచి రుచి ఉండడం వలన, చాలా మంది ప్రజలు ఈ పండును ఇష్టపడతారు. అలాగే మామిడిలో కొన్ని ఔషధ గుణాలు కూడా ఉన్నాయి. మామిడి పంటను చాలా మంది రైతులు ముఖ్యమైన ఉద్యాన వాణిజ్య వంటగా సాగుచేస్తున్నారు.
మామిడిని మన ఉభయ తెలుగు రాష్ట్రాలలో ప్రధానంగా కృష్ణా, ఖమ్మం, విజయనగరం, పశ్చిమ గోదావరి, తూర్పుగోదావరి, శ్రీకాకుళం, కరీంనగర్, విశాఖపట్నం, చితూరు, కడప, అదిలాబాదు, నల్గొండ జిల్లాల్లో సాగుచేస్తున్నారు. మామిడిని పండించడానికి అన్ని రకాల నేలలు అనుకూలంగా ఉంటాయి. కానీ లోతైన నేలల్లో వేర్లు బాగా వ్యాపించి, చెట్టు అభివృద్ధి చెంది చాలా కాలం ఫలాలనిస్తాయి. సంవత్సరంలో ఒక్కసారి వచ్చే మధురమైన పంట మామిడి పంట.
వేసవిలో మామిడి పచ్చడి, ఊరగాయలు, మాగాయ, మామిడి పులిహోర మామిడి పండ్లు పండ్ల రసాలు తినడానికి ప్రతి ఒక్కరూ ఉవ్విళ్లూరుతుంటారు. ఈ సంవత్సరం కాపు సంతృప్తికరంగా ఉన్నా మార్కెట్లో ధర లేకపోవడంతో, అకాల వర్షాలతో పంట దెబ్బతీసింది, అలాగే ఉన్న కోయకుండా చెట్టుపైన ఉన్న కాయలకు ఉజి ఈగ బెడద ఎక్కువగా ఉంది. నిండా కాపు ఉన్న చెట్టు కాయలు ఐదు వందల నుంచి ఏడు వందల వరకు వ్యాపారస్తులు పెడుతున్నారు.
మూడు వందల చెట్లకు లక్షా డెబ్భై వేలు రెండు లక్షలు మించడం లేదు. సంవత్సర కాలం కంటికి రెప్పలా చూసుకున్న కాపలాదారుడు జీతానికి సరిపోయేటట్లు ఉంది. రైతుకు పెట్టుబడి రాక చెట్లు తీసివేసే ప్రమాదం ఉంది. గత దశాబ్ద కాలంగా కోల్డ్ స్టోరేజ్ యూనిట్స్, ధాన్యం నిలువ చేసుకోవడానికి వేర్ హౌస్ లు లేక రైతులు తీవ్ర ఇబ్బందికి గురవుతున్నారు. ప్రతి ప్రభుత్వం రైతు సంక్షేమం కోసం పనిచేస్తున్నట్లు ప్రకటిస్తున్నారు. కానీ ఎక్కడా మార్కెట్ సౌకర్యం, సరకు నిల్వ సౌకర్యం, గిట్టుబాటు ధర, రవాణా సౌకర్యం కల్పించడంలో పూర్తిగా విఫలమైంది.
వేరుశెనగ వేసుకుంటే గిట్టుబాటు లేదని పత్తికి మారి, పత్తికి గిట్టుబాటు లేదని, టమోటా, టమోటా నుండి మిర్చీ మిర్చీ నుండి ఫలసంప్రదాయంకు మారినా నష్టాలు వెన్నంటుతున్నాయి. దేనికి మారిన అదృష్టం మారక అప్పుల ఊబిలో కొట్టుకు పోతున్నారు. అది తెలంగాణ అయినా ఆంధ్రాలో అయినా రైతు గోస ఒక్కటే. అకాల వర్షాలకు పిందెలు, కాయలు రాలిపోయి చాల చోట్ల ఇరవై కిలోల బాక్స్ మార్కెట్ ధర కేవలం యాభై రూపాయల మార్కెట్ ధర. సహజంగా ఇంట్లో పండడానికి ఎక్కువ సమయం పడుతుంది అలాగే ఎక్కువ కాయలు కుళ్లిపోతున్నాయి.
సాధారణంగా మామిడి, అరటి, బొప్పాయి పళ్ళను పూర్తిగా పండకుండానే చెట్లనుండి కోసి, తర్వాత వాటిని మగ్గ బెడతారు . సహజసిద్ధంగా పండటానికి ఎక్కువ సమయం పడుతుంది. పండు బరువు తగ్గిపోతుంది, ఎండిపోతుంది మరియు పండటం కూడా సమంగా ఉండదు. ‘తైవాన్ రెడ్ లేడీ’ వంటి కొన్ని వాణిజ్య రకాల బొప్పాయి పళ్ళు అంచుల్లో బాగా గట్టిగా ఉండి మధ్యలో మెత్తబడుతుంది. సాధారణంగా పళ్ళను మగ్గ పెట్టడానికి ఎథ్రెల్ స్ప్రే చేయడం గానీ, వాటిని ఎథ్రెల్ ద్రవంలో ముంచడం గానీ చేస్తారు. అయితే అది శ్రమతో కూడిన పని. అదీకాక బయట అమ్మే ఎథ్రెల్ లో కల్తీ రసాయనాలు ఉంటే సమస్యలొస్తాయి. దీనికి ప్రత్యామ్నాయంగా, పళ్ళను మగ్గబెట్టే గోదాములలో ఇథిలీన్ గ్యాస్ ఉపయోగిస్తారు. అయితే దీనికి ఎక్కువ పెట్టుబడి అవసరమవుతుంది.
రైతులకు, చిన్న వ్యాపారులకు ఆర్ధికంగా గిట్టుబాటు అవదు. కాబట్టి తక్కువ పెట్టుబడితో పళ్ళను మగ్గించడానికి ప్లాస్టిక్ టెంట్లలో ఇథలీన్ గ్యాస్ ను వదిలి పళ్ళను పండబెట్టడం రూపోందించారు. ఇతర ఉద్యాన పంటలలో లాగానే, మామిడిని కూడా చాలా రకాల పురుగులు ఆశించి నష్టాన్ని కలిగిస్తాయి. వాటిలో ప్రధానమైనవి తేనెమంచు పురుగు, టెంక పురుగులు, వండు ఈగ, పిండిపురుగులు. ఈ ప్రధాన పురుగుల వలన కలిగే నష్టం అపారం.
ఎన్ని ఎత్తులు వేసి మార్కెట్టుకు కాయలు తరలించినా మార్కెటులో రేటు లేక చివరికి రోడ్డున పడేసిన సంగతి అన్నమయ్య చిత్తూరు కరీంనగర్ జిల్లాలో ఉంది. తక్షణం రైతులను ఆదుకొని రెండు రాష్ట్రాల వ్యవసాయ శాఖల మంత్రులు నిర్దిష్ట ప్రణాళికతో సత్వరమే మార్కెటు, నిల్వ సౌకర్యం, గిట్టుబాటు ధర కల్పించాల్సిన అవసరం ఉంది. ప్రజలకు మంచి ఫలాన్ని ఇచ్చి వారి ఆరోగ్యాన్ని కాపాడిన వారవుతారు.
