– రుణమాఫీ, సన్నాలకు రూ.500 బోనస్ ఇచ్చి చేతల ప్రభుత్వంగా నిరూపించుకున్నాం
– సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో ధాన్యం సేకరణకు ప్రత్యేక కార్యాచరణ
– తేమ, తాలు పేరుతో ఇబ్బంది పెట్టే మిల్లర్ల పై కఠిన చర్యలకు ఆదేశం
– సన్న వడ్ల కొనుగోళ్లకు ప్రత్యేక కొనుగోలు కేంద్రాల పై ఆరా
– సివిల్ సప్లైస్ కాల్ సెంటర్లు 24 గంటలు రైతులకు అందుబాటులో వుండాలి
– ధాన్యం కొనుగోలు తీరుతెన్నుల పై మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట కలెక్టర్లతో మంత్రి సురేఖ వీడియో కాన్ఫరెన్స్
హైదరాబాద్ : కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం రైతు పక్షపాత ప్రభుత్వమని, ఇచ్చిన మాటకు కట్టుబడి రైతు రుణమాఫీ, సన్నాలకు ఎమ్మెస్పీకి అదనంగా ఒక్కో క్వింటాల్ కు రూ. 500 ల బోనస్ ఇచ్చి చేతల ప్రభుత్వంగా నిరూపించుకున్నామని అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. నేడు ఉమ్మడి మెదక్ జిల్లా మంత్రి హోదాలో హైదరాబాద్ సెక్రటేరియట్ లోని కాన్ఫరెన్స్ హాలులో మెదక్, సంగారెడ్డి, సిద్ధిపేట జిల్లాల కలెక్టర్లు రాహుల్ రాజ్, వల్లూరు క్రాంతి, మిక్కిలినేని మను చౌదరి లతో ధాన్యం కొనుగోళ్ళ పై వీడియా కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు.
ధాన్యం కొనుగోళ్ల తీరు పై మంత్రి సురేఖ మెదక్, సంగారెడ్డి, సిద్ధిపేట జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ లో చర్చించారు. సీఎం రేవంత్ రెడ్డి మార్గదర్శకాల మేరకు ధాన్యం కొనుగోళ్ళు జరుగుతున్నాయా లేదా అని మంత్రి సురేఖ కలెక్టర్లను ప్రశ్నించారు. ధాన్యం కొనుగోళ్ళ తీరుతెన్నుల పై మంత్రి ఆరా తీశారు. ధాన్యం కొనుగోళ్ళతో బాటు రైతుల ఖాతాల్లో డబ్బులు ఎన్ని రోజుల్లో జమ అవుతున్నాయని మంత్రి సురేఖ కలెక్టర్లను అడిగి తెలుసుకున్నారు.
మద్దతు ధర, బోనస్ చెల్లింపులు ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు రైతులకు అందుతున్నదీ లేనిది నేరుగా రైతులతో మాట్లాడి, క్షేత్రస్థాయిలో పరిస్థితులను ఆరా తీయాలని మంత్రి సురేఖ అధికారులను ఆదేశించారు. సేకరించిన ధాన్యాన్ని మిల్లర్లతో మాట్లాడి వీలైనంత త్వరలో మిల్లులకు తరలించాలని మంత్రి సురేఖ కలెక్టర్లను ఆదేశించారు.
ధాన్యం నిల్వకు సంబంధించిన సమస్యలుంటే తన దృష్టికి తేవాలని మంత్రి సురేఖ కలెక్టర్లకు సూచించారు. ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు సన్న వడ్ల కొనుగోలుకు ప్రత్యేక కొనుగోలు కేంద్రాలు, ప్రత్యేక కాంటాలు వుండేలా చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్లు మంత్రి సురేఖకు తెలిపారు.
సరిహద్దు రాష్ట్రాల నుంచి ధాన్యం రాష్ట్రంలోకి అక్రమంగా ప్రవేశించకుండా తీసుకుంటున్న చర్యల పై మంత్రి సురేఖ కలెక్టర్లను ప్రశ్నించారు. పోలీస్, రెవెన్యూ, సివిల్ సప్లైస్ అధికారుల సమన్వయంతో ధాన్యం అక్రమంగా రాష్ట్రంలోకి ప్రవేశించకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నట్లు కలెక్టర్లు మంత్రికి వివరించారు.
తేమ పేరుతో మిల్లర్లు రైతులను ఇబ్బంది పెడితే వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని మంత్రి వారిని ఆదేశించారు. సివిల్ సప్లైస్ ఆధ్వర్యంలో నడిచే కాల్ సెంటర్లు 24 గంటలు రైతులకు అందుబాటులో వుండేలా చర్యలు చేపట్టాలని మంత్రి కలెక్టర్లకు సూచించారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు భోజనాలు అందించే అంశాలను పరిశీలించాలని మంత్రి.
ఈ సీజన్ లో రికార్డు స్థాయిలో 80 లక్షల టన్నుల ధాన్యం సేకరణను ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నదని మంత్రి సురేఖ స్పష్టం చేశారు. అందుచేత ప్రత్యేక కార్యాచరణతో ధాన్యం కొనుగోళ్ళను చేపట్టాలని మంత్రి సురేఖ కలెక్టర్లను ఆదేశించారు. రోజువారి ధాన్యం సేకరణ, సేకరించిన దొడ్డు రకం, సన్న రకం ధాన్యం వివరాలు, కొనుగోలు కేంద్రాలు, రైతులు, రైతులకు చేసిన చెల్లింపుల వివరాలతో కూడిన సమగ్ర నివేదికను ఏ రోజుకారోజు తన కార్యాలయానికి పంపాలని మంత్రి సురేఖ కలెక్టర్లను ఆదేశించారు.