Suryaa.co.in

Andhra Pradesh

లఘు ఖనిజ విధానం 2025

– మైనింగ్ రంగానికి ఊరట, ఎంఎస్‌ఎంఈలకు లాభం చేకూర్చేలా కేబినెట్ ఆమోదం

– పునరుజ్జీవన దిశగా కీలక అడుగు:
గనుల శాఖ కార్యదర్శి ప్రవీణ్ కుమార్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్ర బాబు నాయుడు నేతృత్వంలో మంగళ వారం జరిగిన రాష్ట్ర కేబినెట్ సమావేశంలో, ఖనిజ రంగాన్ని పునరుజ్జీవింపజేయడమే లక్ష్యంగా లఘు ఖనిజాలపై రూపొందించిన “ఏపీ మైనర్ మినరల్స్ పాలసీ 2025” ను ఆమోదించింది. రాష్ట్ర స్థూల జాతీయోత్పత్తిలో (జీడీపీ) ఒకప్పుడు 3.53 శాతం వంతు ఇచ్చిన మైనింగ్ రంగం 2023-24 నాటికి 2.71 శాతానికి పడిపోవడంతో, ఈ రంగాన్ని బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని ప్రభుత్వం గుర్తించింది.

2022లో వచ్చిన విధానంలో గవర్నమెంట్ భూములపై లీజుల కోసం దరఖాస్తుల ప్రాతిపదికను రద్దు చేయడంతో 6,000 పైగా దరఖాస్తులు అనర్హమయ్యాయి. కొత్త విధానంలో, మార్చి 2022 నాటికి పెండింగ్‌లో ఉన్న ఈ దరఖాస్తులను “ఫస్ట్ కమ్ – ఫస్ట్ సర్వ్” ఆధారంగా పరిష్కరించాలని కేబినెట్ నిర్ణయించింది. ఇవి ఒక్క సంవత్సరం పాటు మాత్రమే అర్హత కలిగి ఉంటాయి.

సమతుల్యమైన లీజు మంజూరు విధానం

ఇల్లు నిర్మాణం, నీటి ప్రాజెక్టులు, రహదారి అభివృద్ధి కోసం అవసరమైన గ్రానైట్, రోడ్ మెటల్ వంటి బిల్డింగ్ మెటీరియల్స్‌కు దరఖాస్తు విధానం కొనసాగుతుంది. సిలికా శాండ్, డోలోమైట్ వంటి ఇండస్ట్రియల్ ఖనిజాలకు ఉత్పత్తితో అనుసంధానించిన ప్రీమియంతో వేలం విధానాన్ని ప్రవేశపెట్టనున్నారు. పట్టా, డీకేటీ, అటవీ భూములపై దరఖాస్తుల ద్వారా లీజుల మంజూరు కొనసాగుతుంది.

ఫీజులు, ప్రీమియంపై సవరణలు, లీజు గడువు పెంపు

లీజు మంజూరుకు సంబంధించిన ప్రీమియాన్ని డెడ్ రెంట్ పై 10 రెట్లు నుంచి 5 రెట్లకు తగ్గించారు. ఈ మొత్తాన్ని 2–3 ఏళ్లలో రెండు ఈజీ ఇన్‌స్టాల్‌మెంట్లుగా చెల్లించవచ్చు. లేబర్ ఇంటెన్సివ్ పరిశ్రమల సహాయార్థం స్లాబ్‌లకు మరింతగా తగ్గించి 3 రెట్లు చేశారు. డెడ్ రెంట్లు ఇకనుంచి త్రైమాసికంగా కాకుండా వార్షికంగా సీజినియరేజ్ ఫీపై సర్దుబాటు చేయనున్నారు. కొత్తగా మంజూరు అయ్యే గ్రానైట్, ఇండస్ట్రియల్ మినరల్స్ లీజులు 20 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాలకు పెంచారు. రోడ్ మెటల్ (క్యాప్టివ్ క్రషింగ్ యూనిట్ల కోసం) లీజులు 15 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాలకు, మిగిలిన ఖనిజాల కోసం 5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాలకు పెంచారు. గతంలో 10 రెట్లు డెడ్ రెంట్ చెల్లించి లభించిన లీజులకు కూడా ఈ కొత్త గడువులు వర్తింపజేయబడతాయి.

కోవిడ్ లెవీ రద్దు: ప్రవీణ్ కుమార్

2021లో కోవిడ్ ఖర్చుల నిమిత్తం విధించిన “కన్సిడరేషన్ అమౌంట్” ను పూర్తిగా రద్దు చేస్తున్నట్లు మైనింగ్ శాఖ కార్యదర్శి ప్రవీణ్ కుమార్ తెలిపారు. కొత్త విధానంలో స్పష్టమైన టన్నేజ్ ఆధారిత సీజినియరేజ్ ఫీ విధానం అమలు చేయబడుతుంది. ప్రత్యేకంగా డోలమైట్, షేల్, స్లేట్‌లపై ఎలాంటి అదనపు భారాలు ఉండవు, పోటీతత్వం ఉన్న రాష్ట్రాల నుంచి పరిశ్రమలు వలసకు గురికాకుండా చూస్తారు.

పూర్తి డిజిటలైజేషన్

లీజు దరఖాస్తు నుంచి సర్ధుబాటు, ట్రాన్స్ఫర్, పునరుద్ధరణ, మరియు కంప్లయన్స్ వరకు అన్నీ డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లో చేయనున్నారు. డ్రోన్లు, సీసీటీవీలు, వెయ్‌బ్రిడ్జులు, మైన్ సర్వైలెన్స్ సిస్టమ్‌ ద్వారా మైనింగ్‌ను రియల్ టైంలో మానిటర్ చేస్తారు.

వ్యర్థాల నిర్వహణ, శాస్త్రీయ ముగింపు

డంపింగ్ కోసం అదనపు భూమిని లీజులో భాగంగా మంజూరు చేస్తారు. లైమ్‌స్టోన్ లేదా గ్రానైట్ వ్యర్థాల డంపింగ్‌కు అనుమతి ఉంటుంది. అలాగే, ఖాళీ గవర్నమెంట్ భూముల్లో లేదా ముగిసిన లీజుల్లో ఉన్న ఓవర్‌బర్డెన్ డంప్స్‌కి వేలం ద్వారా వినియోగం కల్పించనున్నారు.

పాత సమస్యల పరిష్కారానికి ఓటీఎస్

గత సంవత్సరాల్లో పెండింగ్‌లో ఉన్న లీజు వివాదాలు, పద్ధతులు పరిష్కరించేందుకు ఒక సంవత్సరం పాటు ఒకసారి మాత్రమే లభించే ఓటీఎస్ పథకాన్ని ప్రవేశపెట్టారు. జరిమానాలను 10 రెట్ల నుంచి 2 రెట్లు, 5 రెట్ల నుంచి 1 రెట్టుకు తగ్గించారు. మైనింగ్ కార్యాలయాల ముసుగులో ఉన్న గనులు మళ్లీ తెరవడానికి ఇది దోహదపడుతుంది. ఈ నిర్ణయం వల్ల ప్రభుత్వానికి రావలసిన రాబడులు సమర్థవంతంగా వసూలు చేయగలుగుతారు.

బాధ్యతాయుతమైన మైనింగ్ – ప్రభుత్వ సంకల్పం

ముందస్తు క్లియరెన్స్‌ కోసం ఖనిజ, రెవిన్యూ, అటవీ, పర్యావరణ, కాలుష్య నియంత్రణ వంటి శాఖలతో కూడిన ఇంటర్ డిపార్ట్‌మెంటల్ కమిటీ ఏర్పాటు చేస్తారు. కుటుంబ సభ్యులకు లీజు బదిలీపై ఫీజును మాఫీ చేస్తారు. గత పాలనలో చిన్న మైనర్లకు తలుపులు మూసివేయగా, ఇప్పుడు వారి కోణంలో చక్కటి విధానం తీసుకొచ్చామని గనుల శాఖ కార్యదర్శి ప్రవీణ్ కుమార్ తెలిపారు. భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని ఈ విధానం కు శ్రీకారం చుట్టామని తెలిపారు.

ఏపీ మైనర్ మినరల్స్ పాలసీ 2025 అనేది లీజుదారుల కేంద్రంగా, పారదర్శకంగా, ప్రగతిశీలంగా రూపొందించబడిందని ప్రవీణ్ కుమార్ చెప్పారు. ఇది స్థానిక ఉద్యోగావకాశాలు, బాధ్యతాయుత మైనింగ్, పెట్టుబడిదారుల నమ్మకాన్ని పెంపొందించడానికి బలమైన అడుగుగా నిలుస్తుందన్నారు.

LEAVE A RESPONSE