– వచ్చే ఏడాది జూనియర్ కళాశాలగా జమ్మాదేవి పేట ‘ఎంజేపీ’ అప్ గ్రేడ్
– బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత
ఎల్.కోట/విజయనగరం : రాష్ట్రంలో బీసీ గురుకుల పాఠశాలలకున్న డిమాండ్ రీత్యా మరిన్ని ఎంజేపీ స్కూళ్లు ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. వచ్చే విద్యా సంవత్సరం నాటికి జమ్మాదేవి పేట ఎంజేపీ బీసీ బాలికల గురుకుల పాఠశాలను అప్ గ్రేడ్ చేయనున్నట్లు వెల్లడించారు.
విజయనగరం జిల్లా ఎల్ కోట మండలంలో ఉన్న జమ్మాదేవి పేట గ్రామంలో ఉన్న ఎంజేపీ బాలికల గురుకుల పాఠశాలను ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారితో కలిసి పరిశీలించారు. గురుకుల పాఠశాలలోని తరగతి గదులు, విశ్రాంతి గదులు, ల్యాబ్, లైబ్రరీ, మరుగుదొడ్లను పరిశీలించారు. పదో తరగతి విద్యార్థినులతో మంత్రి సవిత ముచ్చటించారు.
విద్యా మిత్ర కిట్లు అందరికీ అందాయా… సన్న బియ్యంతో భోజనం పెడుతున్నారా..? అని అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలో విద్యా వ్యవస్థ అభివృద్ధికి సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ తీసుకుంటున్న చర్యలు గురించి వివరించారు. పదో తరగతి ఫలితాల్లో వుంది శాతం ఫలితాలు సాధించడంపై ఉపాధ్యాయ సిబ్బందిని మంత్రి అభినందించారు. గురుకులం నిర్వహణపై మంత్రి సవిత సంతృప్తి వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా మంత్రి సవిత మాట్లాడుతూ, వచ్చే విద్యా సంవత్సరం నాటికి జమ్మాదేవి పేట ఎంజేపీ పాఠశాలను జూనియర్ కళాశాలగా అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో ఎంజేపీ స్కూళ్లకు ఉన్న డిమాండ్ దృష్ట్యా మరిన్ని గురుకులాల ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి సవిత ప్రకటించారు. పేద బీసీ విద్యార్థులకు ఆహార భద్రతతో కూడిన నాణ్యమైన విద్య అందించడమే సీఎం చంద్రబాబు నాయుడు లక్ష్యమని మంత్రి సవిత స్పష్టం చేశారు.
అనంతరం పలువురు విద్యార్థినులకు సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యా మిత్ర కిట్లు పంపిణీ చేశారు. ఎంజేపీ స్కూల్ ఆవరణలో మంత్రి సవిత మొక్క నాటారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారితో పాటు పలువురు కూటమి నాయకులు, కార్యకర్తలు, ఉపాధ్యాయ సిబ్బంది పాల్గొన్నారు.