– పూర్తి అధ్యయనం తరువాతే చట్ట సభ ముందుకు బిల్లు
– ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్
అమరావతి: ఆంధ్రప్రదేశ్ లిఫ్టులు మరియు ఎస్కలేటర్ల బిల్లు – 2025తో వృద్ధులు, మహిళలు, దివ్యాంగులతో పాటు ప్రజలకు మరింత భద్రత కలుగుతుందని ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు.
శాసనసభలో మంగళవారం లిఫ్టులు మరియు ఎస్కలేటర్ల బిల్లు -2025 ను ప్రవేశ పెట్టిన తరువాత ఆయన మాట్లాడుతూ…. ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న పట్టణీకరణతో పాటు వేగంగా నిర్మాణమవుతున్న బహుళ అంతస్తుల భవనాలు, ఆస్పత్రులు, వ్యాపార సముదాయాలు, హాటళ్లు, షాపింగ్ మాల్స్ ను దృష్టిలో ఉంచుకుని ఆంధ్రప్రదేశ్ లిఫ్టులు మరియు ఎస్కలేటర్లు బిల్లు – 2025ను రూపొందించినట్లు వివరించారు.
లిఫ్టులు, ఎస్కలేటర్ల వినియోగంతో ప్రమాదాలు పెరిగిపోతున్నాయని మంత్రి గొట్టిపాటి ఆందోళన వ్యక్తం చేశారు. అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు ప్రజల భద్రత చాలా ముఖ్యమని పేర్కొన్నారు. కొత్త బిల్లు చట్టరూపం దాల్చితే లిఫ్టులు, ఎస్కలేటర్ల ప్రమాదాలను చాలా వరకు కట్టడి చేయవచ్చని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో భాగంగా కేంద్ర ప్రభుత్వం లిఫ్టులు మరియు ఎస్కలేటర్ల బిల్లును 2024లోనే తీసుకొచ్చిందని మంత్రి గొట్టిపాటి ఈ సందర్భంగా గుర్తు చేశారు.
పూర్తిస్థాయి అధ్యయనం తరువాతే..
లిఫ్టులు మరియు ఎస్కలేటర్ల చట్టాన్నిదేశంలోని 15 రాష్ట్రాల్లో ఇప్పటికే అమలు చేస్తున్నారని మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. తమిళనాడు, కర్ణాటక, కేరళ, ఉత్తర ప్రదేశ్, బీహార్ వంటి రాష్ట్రాల్లో అమల్లో ఉన్న చట్టాన్నిపూర్తి స్థాయిలో అధ్యయనం చేసిన తరువాతే ఆంధ్రప్రదేశ్ లిఫ్టులు మరియు ఎస్కలేటర్ల బిల్లు – 2025 ను రూపొందించి చట్ట సభల్లో ప్రవేశ పెట్టామని ఆయన వివరించారు.
విస్తృత ప్రజా ప్రయోజనాలతో పాటు అతి ముఖ్యమైన పౌరుల భద్రత దృష్ట్యా బిల్లును చట్ట రూపంలోకి తీసుకొచ్చి అమలు చేయడానికి ప్రభుత్వం నిర్ణయించిందని ఈ సందర్భంగా మంత్రి గొట్టిపాటి స్పష్టం చేశారు.
అదే విధంగా సీసీ కెమెరాల వినియోగం, డేటాను భద్ర పరచడం వంటి వాటికి సంబంధించిన అంశాలన్నింటినీ బిల్లులో పొందుపరిచామని తెలిపారు. బిల్లుకు సంబంధించి గౌరవ సభ్యులు సూచించిన అంశాలను కూడా పరిగణనలోకి తీసుకుంటామని ఈ సందర్భంగా ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు.