Suryaa.co.in

Andhra Pradesh

పీ4 గురించి తెలియని వాళ్లే ఏదో మాట్లాడుతున్నారు

– మీ జీవితంలో ఒక్క కుటుంబాన్నైనా బాగు చేశారా?
– ఆర్థిక అసమానతలు లేకుండా చేయడం నా జీవితాశయం
– తిరుమలలో గోవులు చనిపోయాయని అబద్ధాలు వల్లిస్తున్నారు
– దేవుళ్లపై దాడులు చేసిన వారికి ఇంత భక్తి ఎక్కడి నుంచి వచ్చింది.?
– కుట్రలను ప్రజలకు తెలిసేలా చేయకుంటే సమాజానికే నష్టం
– ‘మార్గదర్శి-బంగారు కుటుంబం’ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు
– పేదలను ఆదుకునేందుకు వచ్చిన మార్గదర్శులకు సీఎం సన్మానం

తాడికొండ : ‘మార్గదర్శి-బంగారు కుటుంబం’ కార్యక్రమం గురించి తెలియని కొంతమంది మాత్రమే ఏదేదో మాట్లాడుతున్నారని, ఇలా మాట్లాడేవారు మీ జీవితంలో ఒక్క కుటుంబాన్ని అయినా బాగు చేశారా.? అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు. గత ప్రభుత్వంలో పాలకులు అధికారంలో ఉన్నన్నాళ్లూ మంచి పనులు చేయకపోగా, రాష్ట్రాన్ని నాశనం చేశారని అన్నారు. రాజకీయం అంటే అబద్ధాలు చెప్పడమా అని నిలదీశారు.

డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా తాడికొండ నియోజకవర్గం, పొన్నెకల్లులో అంబేద్కర్ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ప్రజావేదిక సభలో మార్గదర్శి-బంగారు కుటుంబం కార్యక్రమంలో భాగంగా బంగారు కుటుంబాలకు ఎంపికైన వారి సమస్యలు విన్నారు. కుటుంబాలను దత్తత తీసుకున్న మార్గదర్శులను సన్మానించారు. పొన్నెకల్లులో ప్రజల ఆదాయం పెరిగేందుకు కార్యాచరణ రూపొందిస్తామని, ఈ గ్రామంలో 369 పేద కుటుంబాలను దత్తత తీసుకునేందుకు 11 మంది ముందుకు వచ్చారని వివరించారు.

దేవుళ్లపై దాడులు చేసి నీతులు మాట్లాడుతున్నారు

తిరుమల గోశాలలో ఆవులు చనిపోయాయని అబద్ధాలు చెప్తున్నారు. దేవుళ్లపై దాడులు చేసిన మీకు వెంకటేశ్వరస్వామిపై ఇంత భక్తి ఎక్కడి నుంచి వచ్చింది.? తిరుమలకు వెళ్లినప్పుడు సాంప్రదాయాలు పాటించని మీరు దేవుళ్ల గురించి మాట్లాడటమా.? గతంలోనూ అంతే… అసలు పింక్ డైమండ్ లేకపోయినా మా ఇంట్లో ఉందని చెప్పి ప్రజల్ని మభ్యపెట్టి అధికారంలోకి వచ్చారు. నేను రూ.100 కోట్లకు పరువునష్టం దావా వేస్తే అధికారంలోకి వచ్చాక అసలు పింక్ డైమండ్ లేదని కోర్టులో కేసు వెనక్కి తీసుకున్నారు.

బాబాయిని గొడ్డలితో వేసేసి గుండెపోటు అని చెప్పి, తర్వాత నేను చంపించినట్లు ప్రచారం చేసి ఓట్లు వేయించుకున్నారు. ఈ హత్య గురించి ప్రశ్నించిన చెల్లి, అడిగిన వారిపై తప్పుడు కేసులు పెట్టి వేధించారు. వివేకా హత్యలో సాక్ష్యాలు తారుమారు చేయడంతోపాటు సాక్షులను చంపేస్తున్నారు. ఇప్పటికే ఆరుగురు సాక్ష్యులు చనిపోయారు. నేను కూడా గొడ్డలిపోటును గుండెపోటుగా నమ్మి ఒకసారి మోసపోయా.? ఆరోజే ఆలోచించి నిందితులను అరెస్టు చేసి ఉంటే ఏమయ్యేదో ఆలోచించుకోండి. మాటలు చెప్పడం సులభమైన పని… మంచి పనులకు నలుగురిని ఒప్పించడం, పేద ప్రజలకు దారి చూపించడం ఒక చరిత్ర సృష్టించడమే.’ అని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు.

అసమానతలు రూపుమాపడం నా జీవితాశయం

2004 ముందు జన్మభూమి కార్యక్రమాన్ని గ్రామాల అభివృద్ధి కోసం తీసుకొచ్చాను. అప్పట్లో అక్కినేని నాగేశ్వరరావు, దాసరి నారాయణరావు జన్మభూమి పిలుస్తోందని ఒక పాట కూడా రాశారు. జన్మభూమి పిలుపునందుకుని ఎంతోమంది ఎన్ఆర్ఐలు గ్రామాలకు వచ్చి స్కూల్ బిల్డింగుల నిర్మాణాలు చేపట్టారు. పేదరికం తగ్గించి, ఆర్థిక అసమానతలు లేకుండా చేయాలని నా జీవిత ఆశయంగా పెట్టుకున్నా. ఈ సంకల్పాన్ని సాధించి తీరుతా. నా ఆలోచన ముందు అర్థంకాదు… అర్థం చేసుకుంటే భవిష్యత్ బంగారమవుతుంది. 2004, 2019లో టీడీపీ గెలిచి ఉంటే మనం ఎక్కడికో వెళ్లేవాళ్లం… కానీ నాడు ప్రజలు పొరపాటు చేశారు. అవతలి వ్యక్తులు చేసే కుట్రలు, కుతంత్రాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలి. లేదంటే సమాజానికి నష్టం జరుగుతుంది.’ అని సీఎం చంద్రబాబు అన్నారు.

బంగారు కుటుంబానికి ఎంపికైన లబ్ధిదారులు మాట్లాడుతూ…సరిగల నీలిమ: నా భర్త చనిపోవడంతో ప్రస్తుతం పుట్టింట్లోనే ఉంటున్నాను. సొంత ఇల్లు లేదు, స్థలం లేదు. మా నాన్న విద్యుత్ పని చేస్తూ మమ్మల్ని పోషిస్తున్నారు. ఇద్దరు బిడ్డలు ఉన్నారు. నెలకు రూ.8 వేలకు కిరాణా షాపులో పని చేస్తున్నాను. పదవ తరగతి వరకు చదువుకున్నాను.

సీఎం : ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా సాయం అందించి నీలిమ కుమారుడు చెవిని బాగు చేయిస్తాం.
గొడవర్తి స్వప్న: నాకు ఇద్దరు పిల్లలున్నారు. నాకు మా మామయ్య కట్టించిన ఇంట్లోనే నాలుగు కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. నేను డిగ్రీ వరకూ చదువుకున్నాను. మాకు ఆస్తులు, పొలాలేమీ లేవు. నాకు ఉద్యోగం ఇవ్వాలని కోరుకుంటున్నాను. నా భర్త సెంట్రింగ్ వర్క్ చేస్తున్నారు. నెలలో కొన్ని రోజులు మాత్రమే పని ఉంటోంది. నా భర్తకు సెంట్రింగ్ సామాగ్రిని సమకూర్చాలని కోరుతున్నా.

ప్రజావేదిక సభలో మార్గదర్శులు మాట్లాడుతూ…

ముప్పనేని కళ్యాణ్, PI డేటా సెంటర్ అధినేత : 20 ఏళ్లు అమెరికాలో పని చేసి స్థిరపడ్డాను. భారతదేశానికి వచ్చి ఏదో ఒకటి చేయాలనుకున్న సమయంలో చంద్రబాబు గారెని 2014 అక్టోబర్‌లో కలిశాను. డేటా సెంటర్ పెడతానని చెప్తే ప్రోత్సహించారు. ప్రపంచంలోనే మంచి డేటా సెంటర్‌ను అమరావతిలో ఏర్పాటు చేసి వేల మందికి ఉద్యోగాలు ఇచ్చాం. మా కంపెనీలో ఉద్యోగాలు చేశాక మంచి కంపెనీలకు వెళ్లి పెద్ద జీతాలు తీసుకుంటున్నారు. సీఎం చంద్రబాబు గారు తీసుకొచ్చిన ఐటీ విప్లవంతో లక్షల మంది మంది ఉద్యోగాలు చేస్తున్నారు. వీరంతా పీ4లో పాలుపంచుకోవాలి. స్వర్ణాంధ్ర విజన్ 2047 సాధనకు పీ4 ఒక మైలురాయిగా నిలిచిపోతుంది. పీ4 కేస్ స్టడీగా మిగులుతుంది. పొన్నెకల్లు గ్రామంలో 100 కుటుంబాలను దత్తత తీసుకుంటాను. స్వప్నను మా సంస్థలోకి తీసుకుని నైపుణ్యం పెంచి క్లౌడ్ ఇంజినీర్ చేసే బాద్యత నేను తీసుకుంటాను.

సూర్యప్రకాశ్ రావు, శ్రీలతా పరమేశ్వరి స్పిన్నింగ్ మిల్ అధినేత
మీ స్ఫూర్తితో స్పిన్నింగ్ మిల్ పరిశ్రమను స్థాపించాం. మీ ప్రభుత్వంలో పరిశ్రమలకు సబ్సిడీలు రావడంతో అభివృద్ధి చేసుకున్నాం. ప్రస్తుతం ఐదు వందల కుటుంబాలు ఉపాధి పొందుతున్నాయి. టీటీడీ, ఇస్కాన్, పలు సేవా సంస్థలకు విరాళాలు అందిస్తున్నాం. సరిగల నీలిమకు ఉద్యోగం ఇస్తాం. ట్రైనింగ్ ఇచ్చి ఇల్లు, భోజనం వసతి కల్పించి మంచి జీతం ఇస్తాం. ఆమె ఇద్దరి పిల్లల చదవు బాధ్యతను తీసుకుని ప్రయోజకులు అయ్యే దాకా చూసుకుంటాం. పొన్నెకల్లులో 50 పేద కుటుంబాలు పైకి తీసుకొచ్చేలా చొరవ తీసుకుంటాం.

ప్రసాద్, కెకె స్పింటెక్స్ : సీఎం చంద్రబాబు స్ఫూర్తి చూస్తే మాలాంటి వారికి ఆనందంగా ఉంది. సీఎం పిలుపునిచ్చిన పీ4 కార్యక్రమంలో భాగంగా నైపుణ్యం పెంచి 10 కుటుంబాలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తాం.

రాజేష్, సుదర్శిని ఐ హాస్పిటల్ : పేద కుటుంబాలకు సీఎం చంద్రబాబు ఇచ్చిన అవకావాన్ని సద్వినియోగం చేసుకోవాలి. మార్గదర్శులు ఇచ్చిన చేయూతను అందిపుచ్చుకుని పైకి రావాలి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేసేందుకు మేం ముందుకు వస్తాం. మా డాక్టర్స్ అందరం గుంటూరు బ్రాంచ్ తరపున 50 కుటుంబాలను దత్తత తీసుకుంటాం.

LEAVE A RESPONSE