‘భగవద్గీతను జాతీయ గ్రంథంగా ప్రకటించాలి. విలువలు తరగిపోకుండా ఆపేందుకు భగవద్గీత బోధనను, అభ్యాసాన్ని దేశంలోని అన్ని స్థాయిల విద్యల్లోనూ తప్పనిసరి చేయాలి’ అనే డిమాండ్ తో విశ్వహిందూ పరిషత్ (వీహెచ్‌పీ) కార్యాచరణకు సమాయత్తం అవుతున్నది. అధికారులు అంకితభావంతో కర్తవ్యాన్ని నిర్వహించేందుకు ప్రభుత్వ కార్యాలయాల్లో భగవద్గీత పఠన కార్యక్రమాలు ఏర్పాటుచేయాలని కూడా స్పష్టం చేస్తున్నది.
ఈ విషయమై, 15 మంది ఎంపీల బృందం త్వరలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌లను కలిసి వినతిపత్రం సమర్పించనున్నట్లు వీహెచ్‌పీ జాతీయ కార్యదర్శి ఆచార్య రాధాకృష్ణ మనోడి వెల్లడించారు. గీత బోధనలు సార్వత్రిక స్వభావం కలిగినవాని పేర్కొంటూ, వాటి బోధనల ప్రయోజనాల గురించి ఇప్పటికే స్పష్టమైన ఆధారాలు ఉన్నాయని తెలిపారు.
“భగవద్గీత మన దేశ సామాజిక, సాంస్కృతిక, ఆధ్యాత్మిక విలువలను కాపాడగలదు. మన సమాజంలో విభజనలను అంతం చేస్తుంది భారతదేశాన్ని మరింత బలోపేతం చేస్తుంది. భగవద్గీతను భారతదేశ జాతీయ గ్రంధంగా ప్రకటించాలని మేము డిమాండ్ చేస్తున్నాము” అని వీహెచ్ పేర్కొంది.
ప్రభుత్వ సంస్థలలో నైతిక విలువల నిరంతర పతనం చూస్తున్నందున ఈ సంస్థలలో పక్షం రోజులకోసారి విధి నిర్వహణ పట్ల బలమైన కర్తవ్య భావనను పెంపొందించడానికి గీత క్రమానుగత పఠనాన్ని నిర్వహించాలని కూడా వీహెచ్‌పీ కోరుతున్నది. మైనారిటీ వర్గాల ఉపాధ్యాయులను కూడా భగవద్గీత బోధన-అభ్యాసం పరిధిలోకి తీసుకురావాలని మనోడి స్పష్టం చేశారు.
“ఉపాధ్యాయుల విద్య, శిక్షణ పొందుతున్న వారందరికీ భగవద్గీత అధ్యయనం తప్పనిసరి చేయాలి. భగవద్గీతపై విద్యను భారతదేశంలోని ముస్లిం, క్రిస్టియన్ వర్గాలకు చెందిన ఉపాధ్యాయులందరికీ తప్పనిసరి చేయాలి ” అని ఆయన సూచించారు. ప్రతి ఉపాధ్యాయుడు తప్పనిసరిగా గీత అధ్యాయాలను అధ్యయనం చేయాలని, ఆయా అంశాలను వారు విద్యార్థులకు అందించాలని కూడా ఆయన పేర్కొన్నారు.
వీహెచ్‌పీ విశ్వ గీత సంస్థాన్ కు నాయకత్వం వహిస్తున్న మనోడి, భగవద్గీత లోని 18 అధ్యాయాలు కూడా ఉపాధ్యాయుల శిక్షణా పాఠ్యాంశాలలో భాగం కావాలని చెప్పారు. భగవద్గీత సమాజంలో విభజనను అంతం చేయడం ద్వారా సామాజిక, సాంస్కృతిక, ఆధ్యాత్మిక విలువలను కాపాడగలదని, భారతదేశం బలోపేతం కావడానికి సహాయపడుతుందని కూడా ఆయన తెలిపారు.
“విశ్వ గీత సంస్థాన్ సమాజానికి మేధోపరమైన సామర్థ్యాన్ని అందించడంలో గీత ఉపయోగం గురించి ప్రభుత్వం దృష్టిని ఆకర్షించడానికి ప్రయత్నిస్తుంది. గీతకు గుర్తింపు పొందడంలో మా ముఖ్య అంశాలపై విస్తృత చర్చల కోసం మేము రాష్ట్రపతి, ప్రధానమంత్రిల ను కలవడానికి సమయం కోరాము, ”అని ఆయన చెప్పారు.
వరల్డ్ గీతా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు అయిన వి హెచ్ పి నాయకుడు, తగిన వేతనం చెల్లించినప్పటికీ ఉపాధ్యాయులలో తమ విధుల నిర్వహణ పట్ల తగిన అంకిత భావన లేకపోవడం ఆందోళన కలిగిస్తుందని తెలిపారు. “నైతిక విలువలలో క్షీణత, విద్యలో సహితం ఇదే తరహా ధోరణి భారతదేశ వ్యవస్థీకృత మేధో వారసత్వానికి అవమానికరంగా ఉంటున్నది. విద్యార్థుల పట్ల తమ విధుల గురించి వారిలో అవగాహన కల్పించడానికి ఉపాధ్యాయుల శిక్షణలో గీతను తప్పనిసరి చేయాలి “అని మనోడి స్పష్టం చేశారు.