నేడు రాష్ట్రపతి అభ్యర్థిని ఖరారు చేయనున్న ఎన్డీఏ?

రాష్ట్రపతి ఎన్నిక నేపథ్యంలో అభ్యర్థి ఎంపికపై ఎన్డీఏ ముమ్మర కసరత్తు చేస్తోంది. రాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి ఇప్పటికే నోటిఫికేషన్‌ విడుదల అయిన విషయం తెలిసిందే. అయితే ఇప్పటివరకు అధికార, ప్రతిపక్ష కూటముల నుంచి రాష్ట్రపతి అభ్యర్థి పేరు ఖరారు కాలేదు. విపక్షాలు ఇంకా తమ అభ్యర్థిని ఎన్నుకోనప్పటికీ మంగళవారం ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి పేరును మంగళవారం ఖరారు చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. అధికార పక్షం తర్వాతే విపక్షాలు అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం. భాజపా పార్లమెంటరీ బోర్డు నేడు సమావేశాన్ని నిర్వహించనుంది. ఈ సమావేశంలో రాష్ట్రపతి అభ్యర్థిపై ఉత్కంఠకు తెరదించే అవకాశం ఉంది. ఈ భేటీలో ప్రధాని మోదీ వర్చువల్‌గా పాల్గొనే అవకాశం ఉంది.

ఎన్నికలను పర్యవేక్షించేందుకు బీజేపీ ఇప్పటికే 14 మంది సభ్యులతో కూడిన నిర్వహక బృందాన్ని ఏర్పాటు చేసింది. ఈ బృందానికి కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ కన్వీనర్‌గా ఉన్నారు. రాబోయే ఎన్నికలపై మేధోమథనం చేయడానికి బీజేపీ చీఫ్ జేపీ నడ్డా ఆదివారం కీలక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి సీనియర్ నేతలు గజేంద్ర సింగ్ షెకావత్, అశ్విని వైష్ణవ్, జి కిషన్ రెడ్డి, అర్జున్ రామ్ మేఘ్వాల్, వినోద్ తావ్డే, సిటి రవి, సంబిత్ పాత్ర తదితరులు హాజరయ్యారు.

మరోవైపు రాష్ట్రపతి అభ్యర్థిపై ఏకాభిప్రాయం కోసం భాజపా కమిటీ వేసింది. జేపీ నడ్డా, రాజ్‌నాథ్‌ సింగ్‌ నేతృత్వంలో ఈ కమిటీ ఏర్పాటు అయింది. అయితే విపక్షాలతో చర్చింది ఏకాభిప్రాయ సాధనకు కృషి చేయాలని ఈ కమిటీకి భాజపా అధిష్టానం సూచించింది. దీంతో పలువురు ప్రతిపక్ష నేతలతో కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ సంప్రదింపులు జరిపారు. మరోవైపు అభ్యర్థి ఎంపిక కోసం మంగళవారం సాయంత్రం విపక్ష పార్టీల నేతలు భేటీ కానున్నారు. ఎన్‌సీపీ అధినేత శరద్‌ పవార్‌ నేతృత్వంలో ఈ సమావేశం జరగనుంది. నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ ఈ నెల 29 కాగా.. పోలింగ్ జులై 18న, ఓట్ల లెక్కింపు జులై 21న జరగనుంది.

Leave a Reply