Suryaa.co.in

Andhra Pradesh

యువతకు స్ఫూర్తి నేతాజీ : టీడీపీ నేతలు

– టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలు

మంగళగిరి: స్వాతంత్ర్య సమరయోధుడు, అజాద్ హింద్ ఫౌజ్ వ్యవస్థాపకుడు సుభాష్ చంద్రబోస్ జయంతిని పురస్కరించుకుని, టీడీపీ కేంద్ర కార్యాలయంలో నేతాజీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా టీడీపీ నేతలు మాట్లాడుతూ, “నేతాజీ” గా ప్రజల హృదయాల్లో నిలిచిపోయిన సుభాష్ చంద్రబోస్ ధైర్యం, కృషి, త్యాగం భారత స్వాతంత్ర్య పోరాట చరిత్రలో చిరస్థాయిగా నిలిచిందని పేర్కొన్నారు. ఇండియన్ సివిల్ సర్వీసెస్ ఉద్యోగాన్ని వదలిపెట్టి, దేశ స్వాతంత్ర్య సాధనకోసం కదనరంగంలోకి దూసుకెళ్లిన ఆయన ధైర్యం అందరికీ ఆదర్శప్రాయమని అన్నారు.

ఇండియన్ నేషనల్ ఆర్మీని స్థాపించి బ్రిటిష్ పాలకులను మనదేశం నుంచి తరిమికొట్టడంలో సుభాష్ చంద్రబోస్ తెగువను కొనియాడారు. మీ రక్తాన్ని ఇవ్వండి.. నేను మీకు స్వాతంత్య్రం ఇస్తానని నేతాజీ నినాదం దేశ ప్రజలను ఉర్రూతలూగించిందని నేతలు అభిప్రాయపడ్డారు. సుభాష్ చంద్రబోస్ నడిపించిన ఉద్యమం ఎందరో యువతను స్వాతంత్ర్య పోరాటంలో భాగస్వాములుగా మార్చిందని, ఆయన చూపిన స్వయం శక్తి, ఐక్యత, ధైర్యం నేటి యువతకు శాశ్వత ప్రేరణగా నిలుస్తుందని అన్నారు.

ఈ సందర్భంగా నేతాజీ ఆశయాలను ఆచరిస్తూ, ఆయన ఆత్మకు నిజమైన గౌరవం ఇచ్చేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని టీడీపీ నేతలు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య, ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి, టీడీపీ అధికార ప్రతినిధి పాతర్ల రమేష్, టీడీపీ సీనియర్ నాయకులు ఏవీ రమణ, కోడూరి అఖిల్ కుమార్, పర్చూరి కృష్ణ, హసన్ బాషా, ఎస్.పి సాహెబ్ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE