“భారత దేశంలో మావోయిస్టు తీవ్రవాదం ముగింపుదశకు వచ్చింది “… అని అన్ని పత్రికల్లో మొదటి పేజీ విశ్లేషణలు .
ఈ పోస్ట్ మావోయిస్టు తీవ్రవాదం : మంచి- చెడు గురించి కాదు. అటు అమెరికా నుంచి… ఇటు మనదేశం దాకా … ప్రపంచమంతా బలంగా వేళ్ళూనుకొంటున్న సరి కొత్త తీవ్ర వాదం గురించి .
ఎప్పుడు ఎవరి ప్రాణం తీస్తుందో తెలియదు. ఎవరూ సేఫ్ కాదు. పోలీస్ .. మిలిటరీ … ఏమీ చేయలేవు. నానాటికీ బలోపేతం అవుతోంది.
ఈ సంవత్సరం లోనే ఇప్పటిదాకా… అమెరికా లో ఈ కొత్తరకం తీవ్రవాదం నలభై వేలమందిని పొట్టనపెట్టుకొంది. ఇండియా లో అయితే లెక్క లేదు .
ఈ తీవ్రవాదం పేరు నిహిలిజం .
ఎవరీ నిహిలిస్ట్ హింసా తీవ్రవాదులు ?
వీరి లక్ష్యం ఏంటి ?
వీరి పొలిటికల్ ఫిలాసఫి ఏంటి ?
చదవండి …
1 . తల్లితండ్రి పై కసి .. బంధువుల పై కసి .
2 . సమాజం పై కసి .
౩. ఒక నిర్దిష్ట రాజకీయ భావజాలం అంటూ ఉండదు .
4 . సమాజాన్ని నాశనం చేసేయాలి ..
.. చంపేయాలి అనే ఉన్మాదం .
కారణాలు :
1 . సామాజిక ఒంటరితనం :
ఐసోలేషన్ ..
కరోనా కాలంలో తరచూ విన్నారు కదా ?అటుపై ఇది బాగా అలవాటైపోయింది. ఉమ్మడి కుటుంబాలు ఎప్పుడో అంతరించిపోయాయి. కేంద్రక కుటుంబాల్లో ఇప్పుడు ఎవరికీ వారే .. యమునా తీరే ! తండ్రి వాట్సాప్ గ్రూప్ లో .. తల్లి రీల్స్ లో.
కొడుకు హింసాత్మక వీడియో గేమ్ లో. కూతురు ఇంస్ట్గ్రామ్ లో.
మాటల్లేవు .
మాట్లాడుకోడాలు లేవు .
ఒంటరి తనం ..
మంచిచెడు చెప్పేవారే తప్పుదారిలో వెళుతుంటే పిల్లలకు ఎవరు చెప్పాలి ?
బడి లో విదేశీ పెట్టుబడి .
దండుకోవడమే .
దండించడం కాకపోయినా మంచిచెడు సిలబస్ లేదు
ఇంట్లో అమ్మ నాన్న కీచులాటలు..
విర్చువల్ మాయలోకంలో పిల్లలు .
వారి ఆలోచనల్ని ఎప్పుడో కిడ్నాప్ చేశారు .
అందుకే ఎవరి పైనో కోపం .. కసి ..
2 . టీనేజ్ వయస్సు ..
శరీరం పై హార్మోన్స్ పట్టు .
వర్చువల్ మాయాప్రపంచంలో..
తాము చూసిందే నిజమని నమ్మే కాలం.
ఒకరిని చూసి మరొకరు .
తమ వయస్సు వారు ఏమి చేస్తుంటే… అదే గొప్పని నమ్మే మానసిక స్థితి .
15 దాటకముందే .. బహుళ వ్యక్తులతో లైంగిక సంబంధాలు..
తమ నగ్న చిత్రాలను వీడియోలను పంచుకోవడం..
మద్యం. గంజాయి చాకోలెట్స్ తో మొదలయ్యి డ్రగ్స్ దాకా ..
మొదట్లో ఇంట్లో దొంగతనం ..
అటు పై చైన్ స్నాచింగ్ .. బెట్టింగ్ ..
ఆన్లైన్ లోన్ అప్స్ ..
పదహారు పదిహేడు వయస్సు వచ్చేటప్పటికీ అన్నీ అయిపోతుంది . శరీరం డోపామైన్ హై కి అలవాటుపడింది . రోజూ కిక్కు కావాలి. ఇంకా మరింత డోసు కావాలి . కానీ ఎలా ?
ఎక్కడానికి కొత్త ఎత్తులు లేవు . దిగజారడానికి కొత్త లోతులూ లేవు . అందుకే… ఎన్ని చేసినా కిక్కు రాదు. స్ట్రెస్ మాత్రం మిగిలింది .
ఆక్సిటోసిన్ ఆవిరయ్యింది . డోపమైన్ పోయింది. సెరిటోనిన్ చచ్చింది . ఎండార్ఫిన్ ఎండింది . ఒళ్ళంతా కార్టిజాల్ కారుతోంది!
కోపం అసహనం .. కక్ష .
3. మెదడులోకి ఏమి వెళుతుందో . అదే మనం.
విపరీతమయిన హింస .. బూతులు .. తిట్లు .. శాపనార్థాలు .. లైంగిక దృశ్యాలు .. ఇవన్నీ కలిసి మనిషిని ఉన్మాదిని చేస్తుంది. ఇక్కడిదాకా చదివారా ? నమ్మ శక్యంగా లేదా ? నేను గోరంతలు కొండంతలు చేసి రాస్తున్నాను అని అనుకొంటున్నారు కదా ?
ఫుల్ బాటిల్ కొట్టి కైపులో ఉన్నోడికి “నువ్వు మత్తులో వున్నావు” అంటే అర్థం కాదు .
ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ హాట్ చర్చ.
… గబ్బు బాస్ గురించి .
అదొక సానికొంప.
మేల్ .. ఫిమేల్ సెక్స్ వర్కర్స్ .
సిగ్గు… లజ్జ … పరువు , మర్యాద లేనివారి అక్కడికి పోయి … కావాలనే చిన్న చిన్న విషయాలపై రచ్చ చేసుకుంటుంటే
… అంతకంటే సిగ్గు విడిచి మీరు చూస్తున్నారు .
ఇంతకంటే సిగ్గుమాలిన తనం .. మెంటలిజం ఉంటుందా ?
వాళ్ళు కొట్లాడుకుంటే అది కాలక్షేపమా ?
వాళ్ళ బహిరంగ కామకేళీ టైం పాస్ పళ్ళీ బఠానీలా?
మొగమాటం లేకుండా మాట్లాడుకొందాము ..
మీరు చూస్తున్నారు కాబట్టే వారు ఆడుతున్నారు. షో పేరుతొ బరితెగించి నెగెటివిటీ ని సమాజంలోకి చిమ్ముతున్నారు. ఈ ఒక్క షో మాత్రమేనా ? ఓటీటీ నిండా ఇలాంటివి వేలు.
నేడు పెద్దపెద్ద హీరో లందరూ జీరోలయి పోగా హింస అతిపెద్ద హీరో అయ్యింది.
హింస బూతు లేకుండా ఒక్క సినిమా తీసి హిట్ కొట్టమనండి .. చూద్దాము.
అయినా వారు నిమిత్తమాత్రలు. లోకం తీరే అది!
పొట్టపైకి నలబై ఏళ్ళొచ్చినవాడే తట్టుకోలేక లాప్ టాప్ ముందు చేయి ఊపుకొంటూ.. అరవై ఏళ్ళ వాడు .. పసి కందులపై కన్నేస్తూ .. పెళ్లయి ఇద్దరి పిల్లలున్న మహాసాధ్వి పిల్లని బస్టాండ్ లో వదిలి ప్రియుడి తో తుర్రు ..
పెళ్ళాన్ని నరికి ఊరేంత వేసి గెంతులేసే మొగుడు ..
తల్లిని చంపి బీర్ తాగుతూ డాన్స్ చేసే కొడుకు ..
తండ్రిని తలపై సుత్తితో కొట్టి చంపే కూతురు ..
హలో అండీ .. ఉన్నారా .. ఈ లోకంలో ..
ఇలాంటి వార్తలు జస్ట్ ఈ మూడు నెలల్లో ఎన్ని చదివారు ?
ఒకటి ?
పది ?
వంద ?
లెక్క పెట్టలేదు కదా !!
ఇప్పుడు చావుకూడా పెళ్లి లాంటిదే .
ఇదేనండి తీవ్రవాదం! నిహిలిస్ట్ తీవ్రవాదం!!
అమెరికా లో తుపాకులు దొరుకుతాయి కాబట్టి .. హింసోన్మాదిగా మారినవారు బహిరంగ స్థలం లో విచక్షణ రహితంగా కాల్పులు జరుపుతున్నారు. ఇక్కడ ఇండియా లో సొంత మనుషులనే తగలెట్టేస్తున్నారు. ఇది కాలక్షేపం కబురు కాదు .
” ఎక్కడో జరుగుతుంది .. మన ఇంటి దాక రాదు .. రాలేదు” అని అనుకొంటారు .
కొంప తగలబడి దాకా అలాగే అనుకుంటారు .
మావోయిస్టు తీవ్రవాదం సరే .. నిహిలిస్ట్ తీవ్రవాదాన్ని ఎలా ఎదుర్కోవాలి ?
ముక్కు పచ్చలారని బాబు .. పాప..
కనిపెంచిన తల్లి ..
కనిపెట్టి ఉండాల్సిన తండ్రి ..
వీరిలో ఎవరైనా నిహిలిస్ట్ తీవ్రవాది కావొచ్చు .
డబ్బులు ఇవ్వలేదని తండ్రిని కొట్టి చంపొచ్చు .
మొబైల్ వద్దన్నందుకు తల్లిని నరికెయ్యొచ్చు .
ఆన్లైన్ లో పరిచయం అయిన కండల వీరుడి కోసం మొగుడి కి విషం పెట్టి చంపొచ్చు .
హనీ ట్రాప్ లో పడి భార్య నగల కోసం ప్లాన్ ప్రకారం చంపొచ్చు .
గంజాయి కొట్టి దారిలో పోయే వారి పై అఘాయిత్యం చేయొచ్చు.
.బడిలో త్రికోణం ప్రేమ పేరుతో తోటి విద్యార్థిని కొట్టి చంపొచ్చు . తరగతి గదిలో టీచర్ ను చంపొచ్చు .
హోమ్ వర్క్ చేయలేదని చిన్నారిని తలపై బాది చంపొచ్చు .
గతం లో నేరస్తులు ఉండేవారు.. రౌడీ షీటర్స్ .. ఇలా .
ఇప్పడు ఎవడు నేరం చేస్తాడో .. ఎవడు బాధితుడు అవుతాడో తెలిసేదెలా ?
ప్రతి ఇంట్లో ఒక పోలీస్ స్టేషన్ పెట్టినా ఫలితం ఉంటుందా ?
నిద్రలేవండి.
నిహిలిజం… మనల్ని మన కుటుంబాల్ని… కబళించకముందే ..
1. మొబైల్ బానిసత్వం మానండి .
2. పిల్లల చేతిలో మొబైల్ లేకుండా చూడండి .
3. వారి తో సమయం గడపండి.
4. మంచిచెడు చెప్పండి.
5. దారి చూపండి.
6. మంచి బడిలో వెయ్యండి.
7. బతుకు పాఠాలు నేర్పండి.