1972లో బాపు గారు ‘సంపూర్ణ రామాయణం’ సినిమా తీస్తున్నారు. నటి జమున గారి దగ్గరకు వెళ్లి డేట్లు అడిగారు. ఏం వేషం అన్నారామె. ‘కైక’ అని చెప్పారు. “సీత పాత్రకు మరెవరినో పెట్టుకుని, నాకు కైక పాత్ర ఏమిటి? బాగుండదు” అన్నారావిడ. “అమ్మా! సీత పాత్ర అంటే మౌనంగా ఉండాలి. కుదురుగా కూర్చోవాలి. అంతే! కానీ కైక పాత్రలో ఎన్ని వేరియేషన్లు! ధీశాలి.
దశరథుడికి ఇష్టసఖి. భరతుడి తల్లి. రాముణ్ని కనకపోయినా కన్నంత ప్రేమగా పెంచిన అమ్మ. చెప్పుడు మాటలు విని ఆ రాముడినే అడవులకు పంపమని భర్తను కోరిన ఇల్లాలు.. ఎన్ని అంశాలు ఉన్నాయి ఆ పాత్రలో! మీరైతే ఆ పాత్రకు న్యాయం చేయగలుగుతారు” అని బాపు రమణలు ఆమెను ఒప్పించారు. జమున గారు ఆ పాత్ర చేసి మెప్పించారు.
ఆ సినిమాలోనే మరోటి! ది గ్రేట్ ఎస్వీ రంగారావు గారు రావణాసురుడు. మొదటి రోజు సెట్‌కి వచ్చారు. సీత పాత్రలో చంద్రకళ. “ఇదేమిటీ? ఈ అమ్మాయి సీతా? జమున అనుకున్నానే!” అన్నారు. “ఆమె కైక పాత్ర చేస్తున్నారు. ఈ అమ్మాయే సీత” అని సమాధానం ఇచ్చారు. “నో.. నో.. మార్చండి. సీత పాత్రకు ఈ అమ్మాయి ఏమిటి? నా పక్కన ఏమాత్రం ఆనదు. ఈమె కోసం నేను యుద్ధం చేయాలా?” అన్నారట. బాపు రమణలు ఆయనకు నచ్చజెప్పి ఒప్పించారు.
సీత పాత్రలో చంద్రకళ చక్కగా నటించారు. అయితే తెలుగు వాళ్లకు సీతమ్మ అంటే అప్పటికీ ఇప్పటికీ అంజలీదేవి గారే(ఆమె మరణించినప్పుడు ‘తెలుగింటి సీతమ్మ కన్నుమూత’ అని రాశాయి పేపర్లు). అందుకే చంద్రకళ గారు సీత పాత్ర చేశారన్న విషయం చాలామందికి గుర్తు లేదు.
మనం తెలుగువాళ్లం. పురాణ పాత్రల మీద మనకు బోలెడంత శ్రద్ధ. ఎవరు ఏ పాత్ర వేయాలో మనకో ఊహ ఉంది. శ్రీకృష్ణుడు అంటే నందమూరి తారక రామారావు, సత్యభామ అంటే జమున, శకుని అంటే ధూళిపాళ సీతారామశాస్త్రి, గాంధారి అంటే ఎస్.వరలక్ష్మి, రావణాసురుడంటే ఎన్టీయార్ లేదా ఎస్వీఆర్, కీచకుడు అంటే అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ ఎస్వీఆరే.. మనం అలా ఫిక్స్ అయ్యాం.
కారణం ఆ సినిమాలు, వాళ్ల నటన. మరొకరిని ఆ పాత్రలో ఊహించడం కష్టం. చేయలేరని కాదు. చేశారు. చూశాం! కానీ మనకై మనం గీసుకున్న ఊహల్లో ఉన్న పురాణపాత్రధారులు వాళ్లే. పురాణాలు తీయడంలో తెలుగు వాళ్లకు బోలెడంత దమ్ముంది. అంతా ఇంతా కాదు, కొండంత. అందరికీ తెలిసిన కథలే! అయినా మళ్లీ మళ్లీ తీశాం. మళ్లీ మళ్లీ చూశారు. హిట్ చేశారు. తెలుగు వాళ్లు తీసినన్ని పౌరాణిక సినిమాలు బహుశా మరే ఇతర భాషలోనూ తీయలేదు. అడపాదడపా ఆయా భాషల్లో తీసినవి ఏవీ పెద్దగా ఆడలేదు. గుర్తింపు రాలేదు.
తమిళ వాళ్ళు 1964లో ‘కర్ణ’ తీశారు. తమిళ సినీ రంగంలో మైలురాయిగా నిలిచిపోయిన సినిమా. శివాజీ గణేశన్ గారు టైటిల్ రోల్ చేశారు. కర్ణుడి కథలో శ్రీకృష్ణుడు లేకపోతే ఎలా? కానీ ఆ పాత్ర ఎవరు వేయాలి? ఇంకెవరు? ఎన్టీ రామారావే! ఆయనే ఆ పాత్ర పోషించారు. ఆ తర్వాత తమిళంలోనే ‘కన్నన్ కరుణై’ అనే సినిమా తీసి అందులో పూర్తి స్థాయిలో శ్రీకృష్ణుడి పాత్ర పోషించారు ఎన్టీఆర్. ఆ సినిమాకి ఆయనే దర్శకత్వం వహించారు.
భారతదేశంలో చాలా భాషల్లో శ్రీకృష్ణుడి గురించి సినిమాలు తీశారు. అందులో చాలామంది నటులు కృష్ణుడి పాత్ర పోషించారు. కానీ ఎన్టీఆర్ గారికి వచ్చినంత పేరు మరెవరికీ రాలేదు. అత్యధిక పౌరాణిక పాత్రలు పోషించిన నటుడిగానూ ఎన్టీఆర్ గారి రికార్డును మరెవరూ ఢీ కొనలేరు.
తెలుగువారికి పురాణాలు ఇంటి సొత్తు. నాటికలు, పాటలు, పద్యాలు, సామెతలు, జాతీయాలు, ఊతపదాలు.. అన్నింటా పురాణల ప్రస్తావన ఉండాల్సిందే! భారతాన్ని తెలుగులోకి ముగ్గురు కవులు తెలుగులోకి అనువదించారు. కవిత్రయం అనే పేరు పొందారు. పోతనగారు శ్రీమద్భాగవతం రాశారు. నేటికీ ఆ పద్యాలు మనకు వినిపిస్తున్నాయి. రామాయణాలైతే చెప్పనక్కర్లేదు. ఎందరో రామకథ రాశారు. దాని మీద విమర్శా రాశారు. పిట్ట కథల రూపంలో బోలెడన్ని సార్లు రామాయణాన్ని తల్చుకుంటూనే ఉంటాం.
ఇతర భాషల వాళ్లు పురాణాలు తీయలేరా? తీయగలరు. కానీ తెలుగు వాళ్లలా తీయలేరు. మనం తీసిన పౌరాణిక సినిమాలతో ఇతర భాషా పౌరాణిక చిత్రాలు ఏరోజూ పోటీ పడలేవు. కారణం రాముణ్ని, కృష్ణుణ్ని మనం చూసిన తీరు. ఆ పాత్రల్ని తెరపై చూపించిన తీరు. ఆ పాత్రల్ని మన ఇంటి మనుషులుగా మార్చుకున్న తీరు. నాస్తికులైనా సరే, ఆ పాత్రల్ని ఎంజాయ్ చేసేలా వాటిని మలిచిన తీరు.
ఇవన్నీ కలిసి ‘పురాణాలు తీస్తే తెలుగు వాళ్లే తీయాలి’ అనే పేరు తెచ్చాయి. ‘మాయాబజార్’ చూశారా? “ఆంధ్రమాత గోంగూర లేనిదే కౌరవ మహారాజు ముద్ద కూడా ముట్టరు” అంటారు పురోహితులు. పురాణాల స్థలజ్ఞత ప్రకారం కౌరవులది హస్తినాపురం(దిల్లీ). వాళ్లకు గోంగూర ఇష్టం కావడం ఏమిటి? పైగా 16-17వ శతాబ్దం మధ్యలో కదా గోంగూర భారతదేశానికి వచ్చింది.
అయినా సరే, పింగళి నాగేంద్రరావు గారి కలం అలా కదం తొక్కింది. మనం కాదన్నామా? పోనిద్దూ కౌరవులు తెలుగువాళ్లే అనుకున్నాం. ఇంత అనుబంధం బహుశా మరో భాషల్లోని వారికి లేదు. వారికి రాముడు, కృష్ణుడు దేవుళ్లు. తెలుగు వాళ్లకి మాత్రం ఇంటి మనుషులు.
అంతెందుకు? విశ్వనాథ సత్యనారాయణ గారు ‘శ్రీమద్రామాయణ కల్పవృక్షం’ రాస్తూ ఇద్దరు పనిమనుషుల మధ్య అలుకుగుడ్డల కోసం పేచీ వచ్చినట్టు రాశారు. ఎందుకు? సీతారాముల కళ్యాణంలో ఏదో ఒకటైనా తగవు ఉండాలని ఆయనకు సరదా పుట్టింది. రాశారు. మనకు పురాణాలు అంటే అంత ఇష్టం. అంత సరదా. అంత ప్రేమ.
ఎక్కడో చదివిన సంగతి గుర్తొస్తోంది. 1963లో కమలాకర కామేశ్వరరావు గారు ‘నర్తనశాల’ సినిమా తీశారు. ఆ సినిమా ఘనవిజయం సాధించింది. జకార్తాలో జరిగిన ఆఫ్రో-ఏషియన్ అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో ప్రదర్శితమైంది. అందులో కీచకుడి పాత్ర పోషించిన ఎస్వీ రంగారావు గారికి ఉత్తమ నటుడి అవార్డు ఇచ్చారు. దాంతోపాటు ఆ సినిమాకి కళా దర్శకుడిగా వ్యవహరించిన శర్మగారికి ఉత్తమ కళా దర్శకుడి అవార్డు ఇచ్చారు.
ఒక అంతర్జాతీయ సినీ వేదికపై తొలిసారి ఇద్దరు తెలుగు వ్యక్తులు అవార్డులు అందుకోవడం అదే ప్రథమం. ఆ తర్వాత మద్రాసులో ఒక పెద్ద వేడుక చేసి శర్మ గారిని సన్మానించారు. అందరూ ఆయన కృషి గురించి పొగిడారు. చివరకు శర్మగారిని మాట్లాడమన్నారు.
శర్మ గారు లేచి “నేను ఈ స్థితికి రావడానికి ఎంతోమంది కారణం. ఆ మహానుభావులందరికీ రెండు చేతులెత్తి నమస్కరించాలని ఉంది. కానీ ఆ పని చేయలేకపోతున్నాను” అని కళ్ల నీళ్లు పెట్టుకున్నారు. ఎందుకంటే శర్మ గారికి ఒక చెయ్యి లేదు. ఒంటి చేత్తోనో ఎన్నో సినిమాలకు ఆర్ట్ డైరెక్టర్‌గా పని చేశారు. కొందరికి వాళ్ల వృత్తి పట్ల ఉండే నిబద్ధత అది.
– సంపత్‌రాజు