Suryaa.co.in

Andhra Pradesh

ఏపీలో కూటమి గెలుపును ఎవరూ అడ్డుకోలేరు

బొప్పూడి ప్రజాగళం సభలో జనసేనాని పవన్ కల్యాణ్

పితృదేవతల ముక్తి కోసం పరితపిస్తూ వారి వారసులు హిమాలయ పర్వత శ్రేణుల్లో ఉన్న గంగోత్రి కోసం ఎలా ఎదురుచూస్తున్నారో ప్రధానమంత్రి నరేంద్రమోడీ రాక కోసం రాష్ట్రం ఎదురుచూస్తోంది.

అభివృద్ధి లేమి, అప్పులతో ఆంధ్ర ప్రజానీకం కుంగిపోతోంది, దాష్టీకం, దోపిడీతో ఆంధ్ర ప్రజానీకం, అవినీతి నలిగిపోతోంది. అప్రజాస్వామి విధానాలతో కొట్టుమిట్టాడుతున్న ఆంధ్ర ప్రజానీకానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాక గంగమ్మ తల్లి హిమాలయాల నుంచి భూమి మీదకు వచ్చి సేదతీర్చినట్లుగా ఉంది.

మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాక, ఈ ఎన్డీయే పునర్ కలయిక 5 కోట్ల మంది ప్రజలకు ఆనందాన్ని ఇచ్చింది. దేశ ప్రజల ఆశీస్సులతో మోడీజీ ముచ్చటగా మూడోసారి ప్రధానమంత్రి కాబోతున్నారు.

హ్యాట్రిక్ కొట్టబోతున్న నరేంద్రమోడీకి ఆంధ్ర రాష్ట్ర ప్రజల తరపు నుంచి, ఎన్డీయే కూటమిలో భాగస్వాములైన మూడు పార్టీలు టీడీపీ-జనసేన-బీజేపీ తరపున అభినందనలు.

2014లో తిరుపతి బాలాజీ, వేంకటేశ్వరస్వామి సాక్షిగా ఈ పొత్తు మొదలైంది. ఈ రోజు ఇక్కడ 2024న బెజవాడ కనకదుర్గమ్మ సాక్షిగా ఈ పొత్తు వేరే రూపం తీసుకోబోతోంది. ఆ దుర్గమ్మ తల్లి పొత్తును స్వయంగా ఆశీర్వదిస్తోంది.

ఆంధ్రుల రాజధాని అమరావతి దేదీప్యమానంగా వెలగాలని, దానికి నేను అండగా ఉన్నానని మోడీ గారు ఇక్కడకు వచ్చారు. మన కష్టాలకు భుజం కాయడానికి ఐదు కోట్ల మంది ప్రజల కోసం నేనున్నానని వచ్చిన మోడీ గారికి మరొక్కసారి ఘనస్వాగతం పలుకుదాం.

2014లో తిరుపతి బాలాజీ ఆశీస్సులతో ఎన్డీయే విజయాన్ని సాధించి, ప్రభుత్వాన్ని స్థాపించింది. 2024లో దుర్గమ్మ ఆశీస్సులతో మొదలుపెడుతున్నాం, అంతకుమించి ఘన విజయం సాధించబోతున్నాం. ఎన్డీయే ప్రభుత్వాన్ని స్థాపిస్తున్నాం. బిడ్డలకు అండగా ఉండే దుర్గమ్మ తల్లి మనకు ఒక్క ముద్ద ఎక్కువగానే పెడుతుంది. ఆ తల్లి ఆశీస్సులతో ప్రభుత్వాన్ని స్థాపిస్తాం.

మోడీ దేశాన్ని డిజిటల్ భారత్ గా చేస్తే.. ఇక్కడున్న వైసీపీ ప్రభుత్వం మాత్రం అవినీతి జపం చేస్తోంది. మోడీ దేశంలో అవినీతి తగ్గించేందుకు చర్యలు చేపడితే, ఏపీలో మాత్రం బ్లాక్ మనీకి గేట్లు తెరిచారు. సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తానని అధికారంలోకి వచ్చిన వ్యక్తి నేడు సారా వ్యాపారిగా మారిపోయారు.

ఐదేళ్లలో రూ.1,13,580 కోట్ల మద్యం విక్రయాలు జరిగితే, అధికారికంగా మాత్రం రూ. 84,050 కోట్లు మాత్రమే చూపిస్తున్నారు. 10వేల కోట్ల జీఎస్టీ ఎగవేసి అవినీతికి పాల్పడ్డారు. అలాగే బినామీ కంపెనీ జేపీ వెంచర్స్ పేరు మీద ఆ ఐదేళ్లలో ఇసుక ద్వారా రూ.40వేల కోట్లు దోచుకున్నారు. ఈ అవినీతిని ప్రశ్నించిన వారిని నిర్దాక్షణ్యంగా చంపేస్తున్నారు.

ఏపీలో లా అండ్ ఆర్డర్ లేదు. గంజాయి, డ్రగ్ కేపిటల్ ఆఫ్ ఇండియాగా మార్చేశారు. రాజ్యసభ లో హోంశాఖ సహాయమంత్రి అజయ్ కుమార్ మిశ్రా ఓ ప్రశ్నకు సమాధానం చెబుతూ.. 2019-21 మధ్య 30,196 మంది ఆడవాళ్లు ఎపిలో అదృశ్యమయ్యారని చెప్పారు.

7918 మంది 18 ఏళ్ల లోపు యువతులు, 22,278 మంది 18 ఏళ్లు దాటిన మహిళలు అదృశ్యమైతే స్పందన లేదు. విదేశాల నుంచి వివిధ సంస్థలు భారత్ లో పెట్టుబడులు పెట్టేందుకు వస్తుంటే ఏపీనుంచి మాత్రం ఉన్నవి పారిపోతున్నాయి.

2,200 కోట్ల పెట్టుబడితో వచ్చిన లులూ సంస్థ వెనక్కి వెళ్లిపోయింది. అమర్ రాజా, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్, రిలయన్స్ వెనక్కి వెళ్లిపోయాయి. పారిశ్రామిక ప్రగతి 2019లో 10.24 శాతం ఉండగా నేడు మైనస్ 3 శాతానికి పడిపోయింది. ప్రతిపక్ష నాయకులపై దాడులు చేశారు. బీజేపీ కార్యకర్తలపైనా దాడులకు పాల్పడ్డారు, పొట్టల్లో పేగులు చీల్చారు.

వైఎస్ వివేకాను కిరాతంగా మర్డర్ చేశారు, చంద్రబాబును ఇబ్బంది పెట్టారు. నన్ను అనేక పర్యాయాలు అడ్డుకున్నారు. ఈ అరాచక ప్రభుత్వం పోవాలి. డబ్బులు ఎక్కువై జగన్ అరాచకానికి అడ్డూ అదుపూ లేకుండా పోయింది.

రావణాసురుడు కూడా అదేవిధంగా అనుకున్నాడు. నార చీర కట్టుకుని సీతమ్మ తల్లి కోపంతో హతమయ్యాడు. జగన్ రాష్ట్రాన్ని రావణకాష్టం చేశాడు. అయోధ్యకే రాముడిని తీసుకువచ్చిన మోడీ ఇక్కడున్నారు. చిటికెన వేలంత జగన్ రెడ్డిని ఇంటికి పంపడం ఆయనకు కష్టమేం కాదు. ఎన్నికల కురుక్షేత్రం యుద్ధంలో నరేంద్రమోడీ పాంచజన్యాన్ని పూరించి జగన్ రెడ్డిని తరిమికొడతారు. రాబోయే ఎన్నికల్లో పొత్తుదే గెలుపు, కూటమిదే విజయం. ధర్మానిదే విజయం.

LEAVE A RESPONSE