– దానిని కూటమి నిర్ణయిస్తుంది
– ఎవరూ క్రమశిక్షణ దాటవద్దు
– మంత్రి భరత్‌పై బాబు ఆగ్రహం
– ఆ అంశానికి తెరదించాలని నేతలకు బాబు ఆదేశం
– నేతల నోటికి బాబు తాళం
– బాబును అభినందిస్తున్న సీనియర్లు
అమరావతి: యువమంత్రి నారా లోకేష్‌కు ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలంటూ ఇటీవలికాలంలో తెరపైకి వచ్చిన వాదనపై పార్టీ అధినేత, సీఎం చంద్రబాబునాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. అనవసర వివాదాలు తీసుకురాకుండా, ఎవరికి వారు తమకు అప్పగించిన బాధ్యతలు నిర్వర్తించి, ఇక ఆ అంశానికి తెరదించాలని ఆదేశించారు. ఆ అంశాన్ని కూటమి నిర్ణయిస్తుందని, అందులో ఎవరూ జోక్యం చేసుకోద్దని హెచ్చరించారు.
ఈ విషయంలో ఎవరికి వారు తమ వ్యక్తిగత అభిప్రాయాలపై పార్టీపై రుద్ది, మీడియాకు ఎక్కవద్దని ఆదేశించారు. కాగా దావోస్ పర్యటన సందర్భంగా తెలుగువారితో ఏర్పాటుచేసిన సమావేశంలో మంత్రి భరత్.. తన సమక్షంలోనే లోకేష్ సీఎం అవుతారంటూ చేసిన వ్యాఖ్యలపై చంద్రబాబునాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మనం ఇక్కడకు వచ్చిన సందర్భమేంటి? నువ్వు మాట్లాడుతోంది ఏమిటి? అనవసర వ్యాఖ్యలు చేసి సమస్యలు తీసుకురావద్ద’ని మందలించినట్లు సమాచారం. ఇకపై లోకేష్‌కు ఉప ముఖ్యమంత్రి డిమాండ్‌ను ఎవరూ ప్రస్తావించవద్దని బాబు ఆదేశించారు.
కాగా కూటమిలో మనస్పర్ధలకు కారణమవుతున్న ఈ అంశానికి తెరదించినందుకు, సీనియర్ నేతలు చంద్రబాబును అభినందిస్తున్నారు. నిజానికి ఎమ్మెల్సీ శ్రీనివాసరెడ్డి తన సమక్షంలోనే చేసిన వ్యాఖ్యలను, అదే వేదికపై మందలిస్తే ఈ సమస్య వచ్చేది కాదని, ఎందుకనో బాబు దానిని సీరియస్‌గా తీసుకున్నట్లు లేదని చెబుతున్నారు. లేకపోతే ప్రతి చిన్న విషయాన్ని నిశితంగా గమనించే చంద్రబాబు, ఆరోజు ఎందువల్లనో అంతగా పట్టించుకోనట్లు కనిపించిందని విశ్లేషిస్తున్నారు. కూటమిలో చర్చించి నిర్ణయం తీసుకుంటే అసలు ఎలాంటి సమస్య ఉండదని, చివరకు చంద్రబాబు సైతం అదే స్పష్టం చేయడం ద్వారా.. ఇటు తమ పార్టీ, అటు జనసేన నేతల నోటికి తాళం వేసినట్టయిందని వ్యాఖ్యానిస్తున్నారు.