– కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారం
– హాయ్ హైదరాబాద్ అనే ఎక్స్ ఖాతాలో సబర్వాల్ రీట్వీట్
హైదరాబాద్: కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంలో ఐఏఎస్ అధికారిణి, పర్యాటక శాఖ కార్యదర్శి స్మితా సబర్వాల్‌కు పోలీసులు నోటీసులు జారీ చేశారు. కంచ గచ్చిబౌలి ప్రాంతంలోని 400 ఎకరాల అడవి విధ్వంసానికి సంబంధించిన ఏఐ చిత్రాన్ని ఆమె పంచుకున్నారని చెబుతూ పోలీసులు ఈ నోటీసులు అందించారు.
బీఎన్ఎస్ఎస్ 179 సెక్షన్ కింద స్మితా సబర్వాల్‌కు నోటీసులు ఇచ్చినట్లు గచ్చిబౌలి పీఎస్ ఎస్‌హెచ్ఓ మహ్మద్ హబీబుల్లా ఖాన్ తెలిపారు. బీఎన్ఎస్ఎస్ సెక్షన్ 179 కింద ఒక కేసును దర్యాప్తు చేస్తున్న అధికారి సాక్షులను పోలీస్ స్టేషన్‌కు పిలిపించి వారి వాంగ్మూలాన్ని నమోదు చేసే అవకాశం ఉంది.
మార్చి 31వ తేదీన “హాయ్ హైదరాబాద్” అనే ఎక్స్ ఖాతాలో పోస్టు చేసిన చిత్రాన్ని స్మితా సబర్వాల్ రీట్వీట్ చేశారు. అందులో హెచ్‌సీయూ మష్రూమ్ రాక్ వద్ద చాలా బుల్డోజర్లు ఉన్నట్లుగా ఉంది. వాటి ముందు నెమలి, జింక ఉన్నాయి. ఈ చిత్రంపై విచారణ జరిపిన పోలీసులు అది నకిలీ చిత్రమని నిర్ధారించారు.