Suryaa.co.in

National Political News

పాకిస్తాన్ ను గౌరవించాలి.. లేకపోతే భారత్‌పై అణుబాంబులు వేస్తుంది

– మణిశంకర్ అయ్యర్

భారతీయుల్లో ఇంకా బానిసత్వం ఉందా..? భయపెట్టే వాళ్లను చూసి ఇంకా భయపడుతున్నారా..? మోడీ రాజ్యంలో కూడా ముష్కరులకు తలవంచాలా..? ఇలా ఎన్నో ప్రశ్నలు వేసుకోవాల్సిన దుస్తితి మరోసారి వచ్చింది. కాంగ్రెస్ పాలకుల మనస్థత్వం ఎలా ఉంటుందో నిరూపించే ఘటన.. మరొకటి బయటపడింది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ మణిశంకర్ అయ్యర్.. పాకిస్తాన్ ను గౌరవించాలని దేశ ప్రజలకు సూచించారు. లేకపోతే భారత్ పై పాకిస్తాన్ అణుబాంబు వేస్తుందని భయపెట్టే ప్రయత్నం చేశారు.

లోక్ సభ ఎన్నికల వేళ.. కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు.. ఆ పార్టీ నైజాన్ని వెలుగులోకి తీసుకొస్తున్నాయి. మొన్నటివరకు ఆ పార్టీ ఇండో ఓవర్సీస్ అధ్యక్షుడిగా ఉన్న శ్యాంపిట్రోడా భారతీయుల మనోభావాలను కించపర్చేలా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఏకంగా ఉత్తర, దక్షిణ భారత ప్రజల మధ్య అత్యంత దారుణమైన పోలికను తీసుకొచ్చి అబాసుపాలయ్యారు. అంతలోనే ఆ పార్టీ సీనియర్ లీడర్ మణిశంకర్ అయ్యర్ మరోసారి తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ ను భారతీయులంతా గౌరవించాలని.. లేకపోతే ఆ దేశం దగ్గర అణుబాంబులున్నాయంటూ బెదిరింపులకు పాల్పడ్డారు.

“పాకిస్థాన్‌తో మనం చర్చలు జరపాలి. అంతేగానీ సైన్యంతో రెచ్చగొట్టొద్దు. అలా జరిగితే ఉద్రిక్తతలు పెరిగి మనమే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. ఆ దేశం వద్ద అణుబాంబులు ఉన్నాయి. అందువల్ల ఆ దేశాన్ని మనం గౌరవించాలి. వారిని గౌరవించకపోతే భారత్‌పై అణు బాంబులు ఉపయోగించాలని ఆలోచన చేస్తారు. మనవద్దా ఆ అస్త్రాలు ఉన్నాయి. కానీ లాహోర్‌పై మనం ప్రయోగిస్తే.. దాని తాలూకు రేడియేషన్‌ అమృత్‌సర్‌ను చేరడానికి 8 సెకన్లు కూడా పట్టదు” అని మణిశంకర్ అయ్యర్‌ అన్నారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి.. ప్రస్తుతం ఇంటర్నెట్ లో వైరల్ అవుతోంది.

మణిశంకర్ అయ్యర్ పాకిస్తాన్ కు మద్దతుగా మాట్లాడటం ఇదే తొలిసారి కాదు. మోడీ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన కొత్తలో.. అప్పటి పాకిస్తాన్ ప్రభుత్వంలో కీలక పదవిలో ఉన్న ఓ అధికారితో మణిశంకర్ అయ్యర్ మాట్లాడిన విషయం తీవ్ర వివాదాస్పదమైంది. పాకిస్తాన్ ప్రభుత్వం.. భారత్ లోని కాంగ్రెస్ పార్టీ కలిస్తే మోడీని తప్పించడం చాలా సులువు అని వ్యాఖ్యలు చేశారు. దీనిపై అప్పట్లో బీజేపీ ప్రభుత్వం తీవ్రమైన చర్య తీసుకునేందుకు సిద్దమైంది. కానీ ఆ విషయాన్ని అప్పుడు వదిలేసింది.

ఇటీవల మణిశంకర్ అయ్యర్ కుమార్తె కూడా అయోధ్య రామమందిరం ప్రాణప్రతిష్ట సమయంలో ఫేస్ బుక్ లో చేసిన పోస్ట్.. తీవ్ర వివాదాస్పదమైన విషయం తెలిసిందే. అయోధ్య ప్రాణప్రతిష్ట అంశం.. దేశంలో విభిన్న వర్గాల మధ్య చిచ్చు పెడుతుందనే అర్థం వచ్చేలా ఆమె పోస్ట్ చేశారు. దీనిపై ఢిల్లీలో ఆమె నివసించే కాలనీ వాసులు తక్షణం ఆమెను అక్కడి నుంచి ఖాళీ చేయాలని డిమాండ్ చేశారు.

– కట్టా రాజగోపాల్

LEAVE A RESPONSE