Suryaa.co.in

Political News

ఇదీ మన సమాజం తీరు..

గుడులు, మసీదులు, చర్చ్ , మఠాలు, కుల సంఘాల పేరిట కళ్యాణమండపాల నిర్మాణానికి ప్రభుత్వ భూములను అక్రమించి, చట్టాలు – నిబంధనలను ఉల్లంఘించి, భవనాలు – భవన సముదాయాలు నిర్మించుకొన్నా ప్రభుత్వం పట్టించుకోదు! ప్రజలు కూడా పట్టించుకోరు! ఇదీ మన సమాజం తీరు.

జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తొలినాళ్లలో ఏడెనిమిది కోట్ల ప్రజా ధనంతో నిర్మించిన “ప్రజావేదిక”ను కూల్చేశారు. అది ఒక అక్రమ నిర్మాణమని, చట్టాలను – నిబంధనలను ఉల్లంఘించి కృష్ణా నది ఒడ్డున నిర్మించబడిందని సెలవిచ్చారు. నిజమే, దాని నిర్మాణం బుద్ధి తక్కువ పనే. దాన్ని ఏకపక్షంగా కూల్చివేయడం అంతకంటే తెలివి తక్కువ పని. న్యాయ సమీక్ష కోరి, న్యాయస్థానం తీర్పు పొంది, కూల్చివేసి ఉంటే దానికి ప్రజలు హర్షించేవారు. దుందుడుకుగా వ్యవహరించడంతో కక్షతో కూల్చేశారన్న భావన ప్రజల్లో బలంగా పాతుకుపోయింది.

ప్రజావేదిక కూల్చివేత ఆదేశాలతో పాటే రాష్ట్ర వ్యాపితంగా ఉన్న అక్రమ నిర్మాణాలను యుద్ధప్రాతిపదికన తొలగించాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రత్యర్థులను దెబ్బతీయడానికో, లొంగ తీసుకోవడానికో, చట్ట పరిధిలో కాకుండా అక్కడక్కడ కొన్ని చర్యలకు పాల్పడ్డారు తప్ప, ఆ ఆదేశాలు అమలుకు నోచుకోలేదు.

అసలు కరకట్టపైన్నే, ప్రకాశం బ్యారేజీకి ఎగువన ఉన్న మరే ఒక్క అక్రమ నిర్మాణాన్ని ప్రభుత్వం తొలగించలేకపోయింది. పైపెచ్చు, ఆ జాబితాలో ఉన్న విశాఖ శారదా పీఠాధిపతికి చెందిన ఆశ్రమంలో అట్టహాసంగా జరిగిన ఉత్సవాల్లో జగన్మోహన్ రెడ్డి పాల్గొన్నారు.

తాజా ఉదాహరణ ఒక్కటి ప్రస్తావిస్తాను. “మార్నింగ్ వాక్”కు వెళ్ళినప్పుడు ఒక దృశ్యాన్ని చూశాను. గత ప్రభుత్వ కాలంలో నగర సుందరీకరణలో భాగంగా విజయవాడ మధ్యలో ప్రవహిస్తున్న కృష్ణా డెల్టా కాలువల ఒడ్డున పార్కుల నిర్మాణం, పచ్చదనాన్ని పెంచడం లాంటి అభివృద్ధి పథకాన్ని చేపట్టి, కొంత మేరకు పనులు చేసింది. ఆ పనులను జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆపేసింది. ఏలూరు కాలువ ఒడ్డున పార్క్ నిర్మాణ పనులను కొన్ని నెలల క్రితం పునరుద్ధరించింది. చూసి సంతోషపడ్డాను. ఆ పనులు అరకొరా చేసి, మళ్ళీ ఆపేశారు. కానీ, నిర్మాణంలో ఉన్న ఆ పార్క్ స్థలంలో ఒక చివరన కొద్ది రోజుల నుండి చకచకా ఒక భవన నిర్మాణ పనులు జరుగుతున్నాయి.

నాతో పాటు ఆ పార్క్ లో మార్నింగ్ వాక్ చేస్తున్న ఒక మిత్రుడ్ని అడిగితే, ఒక కుల సంఘం వారు కళ్యాణ మంటపం నిర్మించుకుంటున్నారని చెప్పారు. ఆ నిర్మాణ పనులు చేస్తున్న కార్మికులను అడిగితే అవునని చెప్పారు. ఆ నిర్మాణానికి విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ అనుమతి మంజూరు చేసిందో! లేదో! తెలియదు.

భారీ నీటి పారుదల శాఖ ఎందుకు స్పందించి, అక్రమ నిర్మాణాన్ని అడ్డుకోలేదో తెలియదు. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న దాని ప్రక్కనే ఒక చర్చ్ కూడా ఉంది. ఈ నిర్మాణాల నుండి మురుగు నీటిని కృష్ణా డెల్టా కాలువలోకే వదులుతారు. ఆ మురికి నీటినే దిగువ ప్రాంతాల్లోని ప్రజలు త్రాగునీరుగా వినియోగించుకోవాలి.

కుల సంఘం వాళ్ళు ఎన్నికల సమయాన్ని ఎంపిక చేసుకొని, నిర్మాణ పనులను మొదలు పెట్టినట్లుంది. ఓటు బ్యాంకు రాచకీయాలు రాజ్యమేలుతున్న ఈ కాలంలో ఏ రాజకీయ పార్టీ వ్యతిరేకించదని, అభ్యంతరం పెట్టదని వారికి ప్రగాఢ నమ్మకం ఉండవచ్చు!

– టి. లక్ష్మీనారాయణ
సామాజిక ఉద్యమకారుడు,
ఆంధ్రప్రదేశ్ సమగ్రాభివృద్ధి అధ్యయన వేదిక

LEAVE A RESPONSE