– ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి ఆరోపణ
విజయవాడ: బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఉత్తరాదిన ప్రకృతి విలయాలకు వెంటనే జాతీయ విపత్తులుగా ప్రకటించుకునే ప్రధాని మోడీ… రాష్ట్రంపై మాత్రం మళ్లీ సవతి తల్లి ప్రేమను చూపిస్తున్నారని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి విమర్శించారు. మొంథా తుపాను ధాటికి జనజీవనం అల్లకల్లోలం అయితే తమకేం పట్టనట్లు చోద్యం చూస్తున్నారు. రాష్ట్ర ప్రజల మద్దతుతో మూడో సారి గద్దెనెక్కిన మోడీ.. ఆపద సమయంలో మొహం చాటేసి మరోసారి తీవ్ర అన్యాయం చేస్తున్నారని షర్మిలా ఆరోపించారు. ఇంకా ఏమన్నారంటే…
మొంథా తుపాను రైతన్నకు అపార నష్టాన్ని, తీరని శోకాన్ని మిగిల్చింది. రాష్ట్రంలో 20 లక్షల ఎకరాలకు పైగా నీట మునిగాయి. ఖరీఫ్ సీజన్ లో సాగైన పంటల్లో 30 శాతం పనికి రాకుండా పోయాయి. 10 లక్షల మంది రైతు కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఇది రాష్ట్ర రైతాంగానికి సంభవించిన మహా విపత్తు. రూ.20వేల కోట్లకు పైగానే రైతులకు జరిగిన అపార నష్టం ఇది. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ పక్షాన కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నాం. మొంథా తుపాను ను జాతీయ విపత్తుగా వెంటనే ప్రకటించాలి.
ప్రళయం మిగిల్చిన నష్టం అంచనాకు ప్రత్యేక బృందాలను రాష్ట్రానికి పంపాలి. అంచనా నివేదికలొచ్చే లోపు రాష్ట్రానికి తక్షణ సహాయం కింద రూ.10 వేల కోట్లు మోడీ ప్రకటించాలి. ఎన్డీఏ ప్రభుత్వంలో పెద్దన్న పాత్ర పోషించే చంద్రబాబు గారు.. రాష్ట్రానికిది ఆపద కాలం. రాష్ట్రంలో 20 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగితే.. కేవలం 2.88 లక్షల ఎకరాల్లోనే నష్టం జరిగినట్లు తక్కువ చేయడం భావ్యం కాదు. ఇది రైతులను కూటమి ప్రభుత్వం చేస్తున్న మోసమే.
వెన్నుముక లాంటి రైతన్నకు అండగా నిలబడే సమయం ఇది. పంటలతో పాటు ఆస్తి నష్టం అధికమే. సర్వం కోల్పోయిన వారి సంఖ్య లక్షల్లోనే. మోడీ మోసాలు చూస్తూ ఇన్నాళ్లు మోకరిల్లిన సీఎం చంద్రబాబు… ఇప్పుడైనా నోరు విప్పండి. జాతీయ విపత్తుగా గుర్తించాలని డిమాండ్ చేయండి. జరిగిన నష్టానికి కేంద్రం నుంచి పెద్ద మొత్తంలో ఆర్థిక సహాయం తీసుకురండి. తుపాను కారణంగా నష్టపోయిన ప్రతి కుటుంబాన్ని ఆదుకోండి