– త్యాగాల పునాదులపై ఆశల సౌధంలో కదలిక
( బాబు)
పోలవరం… కేవలం ఒక ప్రాజెక్టు కాదు, ఇది లక్షలాది మంది ఆశలకు ప్రతిరూపం. తరతరాలుగా జీవించిన నేలను, ఇళ్లను, బంధాలను వదులుకొని, రేపటి తరం కోసం త్యాగాలు చేసిన నిర్వాసితుల కన్నీటి గాథ. ఈ ప్రాజెక్టు కోసం సర్వం కోల్పోయిన ఆ కుటుంబాల వేదన వర్ణనాతీతం. గత ప్రభుత్వం నిర్లక్ష్యం, ఆలస్యం వారి జీవితాలను దుర్భరం చేశాయి.
కానీ, చీకటిని చీల్చుకుంటూ వెలుగు రేఖలా పోలవరం మొదటి కూలీ.. చంద్రబాబు నాయుడు వారి జీవితాల్లోకి వచ్చారు. పోలవరం ప్రాజెక్టును ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించి, నిర్వాసితులతో ముఖాముఖి సమావేశం నిర్వహించి, వారి కష్టాలను స్వయంగా తెలుసుకున్నారు. “పోలవరం ప్రాజెక్టు నుంచి నీళ్లు విడిచిపెట్టకముందే నిర్వాసితులందరికీ పునరావాసం పూర్తి చేస్తాం. ఆ తర్వాతనే ప్రాజెక్టును ప్రారంభిస్తాం” అని హామీ ఇవ్వడం వారి జీవితాల్లో కొత్త ఆశలు చిగురింపజేసింది.
“ఖర్చుచేసే ప్రతి పైసా నిర్వాసితులకే చెందాలి. ఇది మీ ప్రభుత్వం… మనందరి ప్రభుత్వం” అని చంద్రబాబు చెప్పిన మాటలు నిర్వాసితుల్లో భరోసాను నింపాయి. గతంలో జరిగిన అన్యాయాలను సరిదిద్ది, అర్హులైన ప్రతి ఒక్కరికీ న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. దళారులకు, మోసగాళ్లకు తావు లేకుండా, పారదర్శకంగా పరిహారం అందిస్తామని భరోసా ఇచ్చారు.
“మాది మాయ మాటలు చెప్పే ప్రభుత్వం కాదు.. చెప్పింది చేసి చూపించే ప్రభుత్వం” అని చంద్రబాబు చెప్పిన మాటలు, గతంలో మోసపోయిన నిర్వాసితుల్లో నమ్మకాన్ని కలిగించాయి. “పునరావాసం కల్పించిన తర్వాత మీ ఆదాయ మార్గాలు, జీవన ప్రమాణాలు పెరగడానికి చర్యలు తీసుకుంటాం” అని చెప్పడం వారి భవిష్యత్తుపై కొత్త ఆశలను రేకెత్తించింది.
పోలవరం నిర్వాసితులు ఎన్నో త్యాగాలు చేశారు. వారి త్యాగాలకు ప్రతిఫలంగా, వారికి న్యాయం జరగాలి. వారి కష్టాలు తీరాలి. వారి జీవితాల్లో వెలుగులు నిండాలి. చంద్రబాబు నాయుడు నాయకత్వంలో, పోలవరం నిర్వాసితుల కలలు నిజం కావాలని ఆశిద్దాం.