Suryaa.co.in

Andhra Pradesh

గత ప్రభుత్వ అహంభావం, కక్షతో పోలవరం ప్రాజెక్టుకు నష్టం

పోలవరం నా సెంటిమెంట్… 2019 తర్వాత ప్రాజెక్టు దుస్థితి చూసి బాధపడ్డాను
– రివర్స్ టెండర్ వల్ల రూ.2,782 కోట్లు అదనపు భారం పడింది
– పరిస్థితులు చక్కదిద్ది 9 నెలల్లోనే ప్రాజెక్టును గాడినపెట్టాం
– 2027 డిసెంబర్ నాటికి పోలవరం పూర్తి చేస్తాం
– పోలవరం-బనకచర్ల అనుసంధానం చేపడతాం
– మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు
– పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనుల పరిశీలన అనంతరం అధికారులతో సమీక్ష

పోలవరం: పోలవరం ప్రాజెక్టు విషయంలో గత ప్రభుత్వం క్షమించరాని తప్పులు చేసింది. కక్ష, అహంభావంతో ఇష్టానుసారంగా వ్యవహరించింది. ప్రాజెక్టు విషయంలో తొందరపడొద్దని పోలవరం ప్రాజెక్టు అథారిటీ, కేంద్రం చెప్పినా వినకుండా వారికి నచ్చినట్లు ప్రవర్తించారు. రివర్స్ టెండర్ పేరుతో రాజకీయం చేశారు. దీని వల్ల రూ.2,782 కోట్లు అదనపు భారం పడింది. కాంట్రాక్టర్లను మార్చారు. 6 నెలల పాటు ప్రాజెక్టును పట్టించుకోలేదు. ప్రాజెక్టు దుస్థితి చూసి రాష్ట్రంలో బాధపడిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది నేనే. పోలవరం ప్రాజెక్టు నా సెంటిమెంట్’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను గురువారం సీఎం పరిశీలించారు. అనంతరం అక్కడే అధికారులతో సమీక్ష నిర్వహించి, మీడియాతో మాట్లాడారు.

9 నెలల్లోనే 3 సార్లు పరిశీలించా

‘ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక 3వసారి పోలవరం ప్రాజెక్టును పరిశీలించడానికి వచ్చాను. 9 నెలల్లోనే ప్రాజెక్టును గాడినపెట్టాం. సులభంగా పూర్తవ్వాల్సిన ప్రాజెక్టును నాశనం చేశారు. 2019లో మేం మళ్లీ అధికారంలోకి వచ్చి ఉండుంటే 2020 ఆగస్టు నాటికి ప్రాజెక్టును పూర్తి చేసి జాతికి అంకితం చేసేవాళ్లం. పోలవరం ఏపీకి జీవనాడి. ఇది పూర్తైతే 7.20 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు, 23.50 లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించడంతో పాటు 28.5 లక్షల మంది ప్రజలకు తాగునీరు అందించవచ్చు. 960 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి, విశాఖపట్నంలోని ప్రజలు, పరిశ్రమలకు 23 టీఎంసీల నీటిని అందించవచ్చు. ఈ ఏడాది 4 వేల టీఎంసీల నీరు సముద్రంలో కలిసింది. ఈ నీళ్లలో కనీసం నాలుగైదు వందల టీఎంసీల నీళ్లు వినియోగించుకున్నా రాష్ట్రంలో కరువు అనేది లేకుండా చేయవచ్చు.’ అని అన్నారు.

ప్రాజెక్టు పూర్తికి రాష్ట్ర ప్రభుత్వమే శ్రద్ధ తీసుకోవాలని నీతి ఆయోగ్ తెలిపింది

ఏపీ విభజన చట్టంలో పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా చేర్చారు. ఆ సమయంలో ముంపునకు గురయ్యే 7 మండలాలు తెలంగాణలో ఉన్నాయి. దీని వల్ల ప్రాజెక్టు ముందుకు సాగదని కేంద్రానికి తెలిపి, ఆ 7 మండలాలు ఏపీలో కలపాలని అడగడం వల్ల పార్లమెంట్ సమావేశాలకంటే ముందుగానే కేబినెట్‌లో ఆమోదించి ఆర్డినెన్స్ ఇచ్చారు.

కేంద్ర ప్రాజెక్టులు పూర్తైన వాటి చరిత్ర చూస్తే ఆశాజనకంగా లేదని, ప్రాజెక్టును పూర్తి చేయాలంటే రాష్ట్రమే శ్రద్ధ తీసుకుంటే బాగుంటుందని నీతి ఆయోగ్ చెప్పింది. ఎట్టి పరిస్థితుల్లో ప్రాజెక్టును పూర్తిచేయాలన్న సంకల్పంతో పనులు చేపట్టి 2019 నాటికి 73 శాతం పూర్తి చేశాం. ఒకేరోజున 32,215 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ వేసి గిన్నీస్ రికార్డ్ సాధించాం. 414 రోజల్లో 1,397 మీటర్ల డయాఫ్రం వాల్ నిర్మించాం. నేరుగా 28 సార్లు సందర్శించా, 82 సార్లు వర్చువల్‌గా సమీక్ష చేశాను.

2026 ఫిబ్రవరి 26కి ఈసీఆర్ఎఫ్ గ్యాప్-1 పూర్తి

2019లో ప్రభుత్వం మారడంతో ప్రాజెక్టు పరిస్థితి ఏమైందో అంతా చూశారు. డయాఫ్రం వాల్‌ను దెబ్బతీశారు. కాఫర్ డ్యాం సకాలంలో పూర్తి చేసి ఉంటే డయాఫ్రం వాల్ దెబ్బతినేది కాదు. మళ్లీ మేం అధికారంలోకి వచ్చాక ప్రాజెక్టు పరిస్థితిని అధ్యయనం చేయడానికి విదేశీ నిపుణులు వచ్చి పరిశీలించారు. కొత్త డయాఫ్రం వాల్ నిర్మించాలని సూచించారు. మళ్లీ రూ.990 కోట్లతో కొత్త డయాఫ్రం వాల్ నిర్మించాల్సి వచ్చింది.

అంతకు ముందు ఖర్చు పెట్టిన రూ.440 కోట్లు వృథా అయ్యాయి. డయాఫ్రం వాల్‌ను ఈ ఏడాది డిసెంబర్ నాటికి పూర్తి చేస్తాం. ఈసీఆర్ఎఫ్ గ్యాప్-1ను 2026 ఫిబ్రవరి 26కు పూర్తి చేస్తాం. ఎడమ కాలువ 2026 జూన్‌కు పూర్తవుతుంది. ఈసీఆర్ఎఫ్ గ్యాప్-2 మాత్రం 2027 డిసెంబర్‌కు గడువు పెట్టారు. టెక్నికల్ సమస్యలు ఉంటే తప్ప 2027 ఏప్రిల్ లేదా జూన్‌కు పూర్తి చేయాలని ఆదేశించాను.

ఫేజ్-1ఏ, ఫేజ్-2 1ఏ, 1బీ పూర్తికి భూ సేకరణ ఇంకా చేయాల్సి ఉంది. దాదాపు 26 పునరావాస కాలనీలు పూర్తయ్యాయి. మరో 49 పూర్తి కావాల్సి ఉంది. ఇప్పటివరకు 14,329 మందిని పునరావాసాలకు తరలించాం, మరో 6,578 మందిని తరలించాల్సి ఉంది. ఇవన్నీ పూర్తి చేయాలంటే మరో రూ.500 కోట్లు అదనంగా ఖర్చు చేయాల్సి ఉంది. రూ.972 కోట్లు ఖర్చు చేసి ఈ ఏడాది నవంబర్‌కు ఫేజ్-1ఏలో ఉండే అందరికీ పునరావాసం కల్పిస్తాం. జూలై 2026కు ఫేజ్-1బి కింద 6 మండలాల్లో 48 పునరావాసాలు పూర్తి చేస్తాం.

ఫేజ్-1ఏ, ఫేజ్-2 1ఏ, 1బీకి కలిసి రూ.6,270 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంది. ఫేజ్-1లో 41.15 మీటర్ల వరకు ప్రాజెక్టు నిర్మాణం ఉంటుంది. వాస్తవానికి ప్రాజెక్టు ఎత్తు 45.74 మీటర్లు. 2019కి ముందు ఈ ఫేజ్1, ఫేజ్2 ప్రస్తావన లేదు. ఇది కూడా గతపాలకుల తప్పే. కానీ మళ్లీ వెనక్కి వెళ్తే ప్రాజెక్టు ఉనికికే ప్రమాదం. అందుకే మొదట ఫేజ్1 పూర్తి చేసి తర్వాత ఫేజ్-2 మొదలుపెడతాం.

పునరావాస ప్రాంతాల్లో పరిశ్రమల ఏర్పాటు

భూసేకరణ, పునరావాసానికి కూడా అదనంగా ఖర్చు అవుతోంది. ఒక వ్యక్తి చేసిన తప్పులను రాష్ట్రం ఏ విధంగా భరించాల్సి వస్తుందనడానికి ఇదొక ఉదాహరణ. సాగునీరు వచ్చినప్పుడు రైతులు ఆనందంగా ఉంటారు. కానీ ప్రాజెక్టు కోసం తరాలుగా ఉంటున్న ప్రజలు కూడా వారి భూములు, ఆవాసాలు కోల్పోవాల్సి ఉంటుంది. వారికి న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. అదనంగా ఇంకా ఏమీ చేయగలుగుతామో ఆలోచించి, వారి జీవితాల్లో మరింత మార్పులు తీసుకురావాల్సి ఉంది. పునరావాస ప్రాంతాల్లో పరిశ్రమలు పెట్టే అంశాన్ని కూడా పరిశీలిస్తాం. ఎంఎస్ఎంఈలు పెట్టుకుంటే ప్రభుత్వ తరఫున ప్రోత్సహిస్తాం.

ప్రాజెక్టును నేనే పూర్తి చేస్తున్నందుకు సంతోషంగా ఉంది

కొన్ని సమయాల్లో కొంతమందికి అద్భుత అవకాశాలు వస్తాయి. ఉన్న ప్రతి అవకాశాన్ని వినియోగించుకుని రాష్ట్ర రూపురేఖలు మార్చాలని ఎంతో ప్రయత్నించాను. కానీ 2019లో అది సాకారం అయ్యే నాటికి పరిస్థితి మారింది. పరిశ్రమ పెట్టిన వ్యక్తి నష్టాలతో కూలిపోతే ఏ విధంగా బాధపడతారో నేను కూడా అలాగే బాధపడ్డాను. మళ్లీ భగవంతుడి ఆశీర్వాదంతో అవకాశం లభించింది. కేంద్రం, రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. కేంద్రం నుంచి అవసరమైన నిధులు వచ్చాయి.

ప్రాజెక్టును నేను పూర్తి చేస్తున్నందుకు సంతోషం కలుగుతోంది. పోలవరం నిర్మాణాన్ని ఆదర్శంగా తీసుకుని పోలవరం-బనకచర్ల అనుసంధానం చేపట్టి పూర్తి చేస్తాం. ఈ రెండూ చేయగలిగితే జీవితానికి పరమార్థం ఉంటుంది. ప్రధాని నరేంద్రమోదీ సహకారంతో నేను, నా మిత్రుడు పవన్ కళ్యాణ్ ఈ ప్రాజెక్టులను పూర్తి చేస్తాం.’ అని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు.

LEAVE A RESPONSE