Suryaa.co.in

Telangana

వాట్సాప్‌ గ్రూపుల్లోకి పోలీసులు?

– గ్రామాల నుంచి నగరాల్లోని వార్డుల దాకా..
– ప్రజలు ఏమనుకుంటున్నారో తెలియాలి
– ప్రభుత్వం ఆదేశం?
– రంగంలోకి ఇంటెలిజెన్స్‌?
(వాసు)

‘మన ప్రభుత్వం గురించి.. పనితనం గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు? మనకు వ్యతిరేకంగా ఎవరెవరు పోస్టులు పెడుతున్నారు? వాళ్లను కట్టడి చేయడం ఎలా? గ్రామాల్లో మన పార్టీ పరిస్థితి ఎలా ఉంది? తక్షణమే తెలుసుకోండి..’ అని సీఎం రేవంత్‌రెడ్డి సహా ప్రభుత్వ పెద్దలు అలా ఆదేశించారో లేదో.. నిఘా వ్యవస్థ ఇలా రంగంలోకి దూకినట్టు తెలిసింది.

‘బుజ్జగిస్తారో.. భయపెడతారో.. ఎలా దారిలోకి తెచ్చుకుంటారో తెలియదు. గ్రామాల నుంచి, మండలం, జిల్లా స్థాయి వరకు వాట్సాప్‌ గ్రూపుల్లో మన సిబ్బంది ఉండాలె. క్షేత్రస్థాయిలో ఏం జరుగుతున్నదో ఎప్పటికప్పుడు సమాచారం అందించాలె. మీ కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది’ అంటూ కిందిస్థాయి హోంగార్డు, కానిస్టేబుళ్ల వరకూ ఉన్నతాధికారుల నుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చినట్టు తెలిసింది. ఇప్పటికే స్టేషన్ల పరిధిలోని గ్రామాలపై కానిస్టేబుళ్లు, హోంగార్డులు వాట్సాప్‌ గ్రూపుల వేటలో నిమగ్నమైనట్టు తెలిసింది.

‘అన్నా.. మీ గ్రూప్‌లలో యాడ్‌ చేయండి..’

గ్రామాల నుంచి ఎవరైనా పోలీస్‌స్టేషన్‌కు వస్తే.. ‘మీ గ్రామంలో ఎన్ని వాట్సా ప్‌ గ్రూపులు ఉండొచ్చు. పార్టీల గ్రూపు లు, ఊరి అభివృద్ధి గ్రూపులు, కులాల వారీగా, మతాల వారీగా, యూత్‌ గ్రూప్‌ లు, ఇంటిపేర్లతో ఉన్న గ్రూపులు, దావత్‌ల గ్రూపులు ఎన్ని ఉన్నాయి? వాటి అడ్మిన్‌లు ఎవరు? కొంచెం వివరాలు చెప్పండన్నా.. వాటిల్లో మమ్మల్ని కూడా యాడ్‌ చేయండి’ అంటూ పోలీసులు బతిమాలుకుంటున్నట్టు తెలిసింది.

గ్రా మాలు, పట్టణ స్థాయి, రాష్ట్రస్థాయి గ్రూపు ల్లో ఏమేం జరుగుతున్నదో తెలుసుకునే బాధ్యతను ఆయా స్టేషన్ల పరిధిలోని కానిస్టేబుళ్లు, ఇంటెలిజెన్స్‌ సిబ్బంది, టాస్క్‌ఫోర్స్‌ సిబ్బంది భుజాన వేసుకున్నారు. వాట్సాప్‌ గ్రూపుల్లో త్వరగా చేరడానికి మండలస్థాయి, గ్రామస్థాయిలోని కాంగ్రెస్‌ నాయకుల సహకారం తీసుకోవాలని పరోక్షంగా ఆదేశాలు ఇచ్చినట్టు తెలిసింది.

టార్గెట్‌ 3 లక్షల గ్రూపులు?

తెలంగాణలో 12,848 గ్రామాలు ఉండగా.. వాటికి ఆవాస గ్రామాలు కలిపి 13వేల పైచిలుకు ఉన్నాయి. వీటిల్లో ఒక్కో గ్రామంలో కనీసం విలేజ్‌ గ్రూపు-1, కులాల వారీగా-8, పార్టీల గ్రూపులు -4, మతాల వారీగా – 2, ఇంటిపేరిట- 5-10, దావత్‌లు, ఎంటర్‌టైన్‌మెంట్‌-2-5 వరకు మొత్తంగా 20 వాట్సాప్‌ గ్రూప్‌లున్నాయి.

ఇక నగరాలు, మండలాలు, జిల్లా కేంద్రాల్లోని వార్డుల వారీగా గ్రూపులు, నిరుద్యోగుల గ్రూపులు, విద్యా సమాచారం గ్రూపులు, జర్నలిస్టుల గ్రూపులు, దినపత్రికల గ్రూపులు, ఆఖరికి డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ గ్రూపులు మొత్తం కలిపితే.. సుమారు 5.50 లక్షల పైగానే ఉంటాయని పోలీసుశాఖ అంచనాకు వచ్చినట్టు సమాచారం.

వీటిల్లో కనీసం 3 లక్షల గ్రూపుల్లోని సమాచారం హెడ్‌ ఆఫీసుకు వచ్చేలా ఏర్పాట్లు చేయాలని, అవసరమైతే ఇందుకు ప్రత్యేకంగా ఒక నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసుకోవాలని ప్రభుత్వ పెద్దలు నిర్దేశించినట్టు తెలిసింది

LEAVE A RESPONSE