-
బదిలీలు భారీనా? పరిమితమా?
-
సీఎంఓ కీలక అధికారి పనితీరుపై సీఎం అసంతృప్తి?
-
ఆయన పనితీరు వల్ల మైలేజీ రావడం లేదన్న భావన?
-
ఉత్తరాంధ్రలో ఒకే కులానికి ప్రోత్సాహమంటూ ఇతర బీసీ కులాల అసంతృప్తి?
-
తనకు పోటీ వచ్చే అధికారులపై నిఘా వేస్తున్నారంటూ చర్చ
-
సీఎంఓలో వివాదాస్పద మరో అధికారికీ బదిలీ తప్పదా?
-
సీఎంఓ కీలక అధికారిగా ముఖేష్‌కుమార్ మీనా?
-
ప్రద్యుమ్న స్థానంలో యువరాజ్?
-
శిశోడియా అగ్రికల్చర్, కృష్ణబాబును రెవిన్యూకు సిఫార్సు చేసిన సీఎంఓ కీలక అధికారి?
-
ఢిల్లీ వైపు కార్తికేయ మిశ్రా, సురేష్‌కుమార్ చూపు?
-
దాదాపు 25 మంది ఐఏఎస్‌లకు స్థాన చలనం?
-
పల్నాడు, బాపట్ల, కడప, అనకాపల్లి, కాకినాడ, విజయనగరం, అనంతపురం, ఏలూరు, రాజమండ్రి కలెక్టర్లకూ స్థానచలనం?
-
గుంటూరు కలెక్టర్‌గా చెరుకూరి శ్రీధర్?
-
పదిమంది వరకూ ఐపిఎస్‌ల బదిలీలు?
-
గుంటూరు రేంజ్ ఐజీగా రాజశేఖర్‌బాబు?
-
విశాఖ ఐజీగా సర్వశ్రేష్ఠ త్రిపాఠీ?
( మార్తి సుబ్రహ్మణ్యం)
సీఎంఓ సహా భారీ స్థాయిలో ఐఏఎస్, ఐపిఎస్‌ల బదిలీలకు రంగం సిద్ధమవుతోంది. సీఎంఓ కీలక అధికారి, మరో ఐఏఎస్ బదిలీ ఖాయమన్న ప్రచారం జరుగుతోంది. అదేవిధంగా 10 నుంచి 15 మంది జిల్లా కలెక్టర్లు, 6 నుంచి 10 మంది ఐపిఎస్ అధికారుల బదిలీ కూడా ఉంటుందని తెలుస్తోంది. ఈ వారం చివరలో దీనికి సంబంధించి ఉత్తర్వులు వచ్చే అవకాశం ఉందన్నది సచివాలయ వర్గాల సమాచారం.
అయితే ఈ విషయంలో భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఈ అధికారులను తానే నియమించినందున, వారికి ఒక ఏడాది సమయం ఇవ్వకుండా మార్చడమంటే తన నిర్ణయాన్ని తప్పు పట్టే అవకాశం ఉందని సీఎం భావిస్తున్నట్లు ఒక వర్గం కథనం. అందువల్ల సీఎంఓతోపాటు, కొద్దిమందిని పరిమితంగా బదిలీ చేయచ్చన్నది మరో వర్గం కథనం. దీనిపై ఇంకా స్పష్టత రాలేదు.
సీఎంఓలోని ఒక కీలక అధికారి, వివాదాస్పదంగా మారిన మరో ఐఏఎస్ అధికారిని అక్కడి నుంచి తప్పిస్తారన్న ప్రచారం జరుగుతోంది. ఆ కీలక అధికారి పనితీరు వ ల్ల ప్రభుత్వం ఆశించినంత స్థాయిలో మైలేజీ రాకపోగా, ఆయన సూచిస్తున్న అధికారుల జాబితాపై స్వయంగా సీఎం కూడా తీవ్ర అసంతృప్తితో ఉన్నారంటున్నారు. గతంలో సతీష్‌చంద్ర తరహా చొరవ, పార్టీని సొంతం చేసుకునే చిత్తశుద్ధి, సమస్యలను పరిష్కరించే నేర్పు, మంత్రులు-అధికారుల సమన్వయంలో చొరవ ఈ అధికారిలో లేవన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
అదీకాక, తనకు పోటీ వచ్చే అధికారులపై నిఘా ఉంచుతున్నారన్న కొత్త చర్చకు తెరలేచింది. ప్రధానంగా ఉత్తరాంధ్రలో తూర్పు కాపు, కళింగ, యాదవ, గవర, మత్య్సకారుల వంటి బీసీలు ఆ అధికారి పనితీరుపై ఫిర్యాదులు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఉత్తరాంధ్రలోని తన కులానికి చెందిన వారినే ప్రోత్సహిస్తున్నారన్నది వారి ప్రధాన ఫిర్యాదు. దాని వల్ల టీడీపీకి మిగిలిన బీసీ కులాలు దూరమవుతాయన్నది వారి ఆందోళన. ముఖ్యంగా తనకు అనుకూలంగా ఉండే వారందరినీ విశాఖకు బదిలీ చేస్తున్నారని, ఓ మంత్రి బంధువుకు ఇటీవల విజిలెన్స్ ఓఎస్డీగా పోస్టింగ్ ఇచ్చారని గుర్తు చేస్తున్నారు. సదరు అధికారిపై ఎన్ని అవినీతి ఆరోపణలున్నా వాటిని పట్టించుకోలేదని చెబుతున్నారు.
ఇక సీఎంఓలోని మరో అధికారిపైనా చాలారోజుల నుంచి ఆరోపణలు వస్తున్నాయి. జగన్ జమానాలో మంచి పోస్టింగులు అనుభవించిన ఈ అధికారిని, తిరిగి సీఎంఓలోకి తీసుకోవడంపై అప్పట్లోనే విమర్శలు వెల్లువెత్తాయి. తర్వాత వైసీపీకి చెందిన నాయకులకు టిటిడి సిఫార్సు లేఖలు ఇవ్వడం, సోషల్‌మీడియాలో పెద్ద దుమారమే రేగిన విషయం తెలిసిందే. ఆయనను కూడా తప్పిస్తారన్న ప్రచారం జరుగుతోంది.
కాగా జగన్ సీఎంగా ఉన్నప్పుడు జీఏడీ, సీఎంఓలో జమిలి బాధ్యతలు చేపట్టిన ప్రవీణ్ ప్రకాష్ తరహాలోనే.. వివాదరహితుడు, సాత్వికుడయిన అధికారిగా పేరున్న ముఖేష్‌కుమార్ మీనాను, ముద్దాడ రవిచంద్ర స్థానంలో తీసుకుంటారన్న ప్రచారం జరుగుతోంది. అప్పుడు ముద్దాడను ఆయన అమితంగా ఇష్టపడే వైద్య,ఆరోగ్యశాఖకు బదిలీ చేయవచ్చంటున్నారు. ప్రద్యుమ్న స్థానంలో యువరాజ్‌ను తీసుకుంటారని చెబుతున్నారు. నిజానికి యువరాజ్ సీఎంఓలోకి రావాలని చాలాకాలం నుంచి ప్రయత్నిస్తున్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి.
ఇదిలాఉండగా ప్రస్తుతం సీఎంఓలో ఉన్న యువనేత లోకేష్‌కు అత్యంత సన్నిహితుడైన కార్తికేయ మిశ్రాను, ఢి ల్లీ ఏపీభవన్ ఇన్చార్జిగా నియమిస్తారన్న ప్రచారం జరుగుతోంది. ఒకవేళ అది కుదరకపోతే, ఆయనను ఐటి కార్యదర్శిగా నియమించే అవకాశాలు కూడా లేకపోలేదంటున్నారు. అటు ఎంఏయుడి కార్యదర్శి సురేష్‌కమార్ చాలాకాలం నుంచి, ఢిల్లీకి వెళ్లేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. కార్తికేయ మిశ్రాను ఢిల్లీకి పంపించకపోతే, ఆ స్థానంగా సురేష్‌కుమార్‌ను పంపించడం ఖాయమంటున్నారు.
కాగా సీనియర్ ఐఏఎస్ శిశోడియాను వ్యవసాయ శాఖకు, కృష్ణబాబును రెవిన్యూకు పంపించాలని సీఎంఓలోని కీలక అధికారి సిఫార్సు చేసినట్లు అధికార వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అయితే కృష్ణబాబు ఎంఏయుడికి వెళ్లేందుకు ఇష్టపడుతున్నట్లు చెబుతున్నారు. ప్రస్తుతం వైద్యశాఖలో కృష్ణబాబు-మంత్రికి మధ్య సమన్వయం లేదన్న ప్రచారం జరుగుతోంది.
ఇదిలాఉండగా దాదాపు 10 మంది ఐపిఎస్‌లను బదిలీ చేయవచ్చన్న ప్రచారం జరుగుతోంది. అందులో భాగంగా విజయవాడ కమిషనర్‌గా ఉన్న రాజశేఖర్‌బాబును గుంటూరు రేంజ్ ఐజీగా.. అక్కడ ఉన్న సర్వశ్రేష్ఠ త్రిపాఠీని విశాఖకు బదిలీ చేయవచ్చంటున్నారు.
అదే సమయంలో కొంతమంది జిల్లా కలెక్టర్లకూ స్థానచలనం ఉండవచ్చంటున్నారు. అందులో భాగంగా పల్నాడు, బాపట్ల, కడప, అనకాపల్లి, కాకినాడ, విజయనగరం, అనంతపురం, ఏలూరు, రాజమండ్రి కలెక్టర్లకూ బదిలీలు ఉండవచ్చంటున్నారు. కొంతమంది మహిళా కలెక్టర్లు ఆశించినంత వేగంగా పనిచేయడం లేదన్న ఫిర్యాదులు వచ్చినట్లు చెబుతున్నారు.
వీరిలో బాపట్ల కలెక్టర్ పనితీరుపై టీడీపీ ఎమ్మెల్యేలే ఫిర్యాదు చేస్తుండటం ప్రస్తావనార్హం. ఇక విజయనగరం జిల్లా కలెక్టర్ పనితీరుపై జిల్లా మంత్రి, అసంతృప్తితో ఉన్నారంటున్నారు. అదీకాక సీఎంఓలోని ఓ కీలక అధికారి కూడా ఆయనపై గుర్రుగా ఉన్నారన్న ప్రచారం అధికారవర్గాల్లో జరుగుతోంది. పల్నాడు జిల్లా కలెక్టర్ పనితీరుపై కూడా, టీడీపీ ఎమ్మెల్యేలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారన్న ప్రచారం జరుగుతోంది. కడప కలెక్టర్‌గా ఉన్న చెరుకూరి శ్రీధర్, గుంటూరు జిల్లాకు బదిలీ అవకాశం ఉందంటున్నారు.
ఇక సమాచారశాఖ కమిషన్‌ను కూడా మార్చవచ్చంటున్నారు. ఆయన ఆ పదవి తీసుకున్న తర్వాత, కార్యాలయానికి వచ్చిన సందర్భాలు బహు తక్కువంటున్నారు. కాగా ఎన్టీఆర్, కృష్ణాజిల్లా కలెక్టర్లుగా వచ్చేందుకు ఇద్దరు ఐఏఎస్‌లు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.