– సీనియర్ల కంట్లో నలుసులా మారిన టీపీసీసీ చీఫ్ రేవంత్
– కోమటిరెడ్డి భుజంపై రేవంత్‌కు గురిపెట్టిన సీనియర్లు
– రేవంత్ స్పీడు అందుకోలేకనే ఫిర్యాదులు?
– ఫిర్యాదుదారుల్లో జనాలకు దూరమైన నేతలే ఎక్కువ
– వయసుడిగినా ఇంకా పెత్తనం కోసం వృద్ధనేతల యావ
– మూడేళ్ల నుంచి పత్తాలేని సీనియర్లు మళ్లీ తెరపైకి
– కాంగ్రెస్‌ను ప్రాంతీయ పార్టీ స్థాయిలో నడిపిస్తున్న రేవంత్
– రేవంత్ వచ్చిన తర్వాతనే కాంగ్రెస్‌లో పెరిగిన జోష్
– సీనియర్లకు నచ్చని రేవంత్ సొంత పబ్లిసిటీ
– జనం నమ్మకాన్ని సొమ్ము చేసుకోలేని తె లంగాణ కాంగ్రెస్
– నేతల కుమ్ములాటలే కాంగ్రెస్‌కు శాపాలు
( మార్తి సుబ్రహ్మణ్యం)
కాంగ్రెస్ పార్టీ అంటేనే పీతల వ్యవహారం. ఒకరు పైకి వెళుతుంటే మరొకరు కాళ్లుపట్టుకుని లాగేస్తుంటారు. తెలంగాణ కాంగ్రెస్‌లో అయితే మరీనూ. అందరూ పేరుకు ఏఐసీసీ స్థాయి నాయకులే. బుస్కోట్లకు, కడక్ ఇస్త్రీ బట్టలకు తక్కువుండదు. ఈ బాపతు నేతలకు ఇంట్లో కూడా ఓట్లు వేయరు. అయినా ఒక్కోరు ఒక్కో రాహుల్‌గాంధీ, ఒక్కో ప్రియాంక మాదిరిగా బిల్డప్పులు. జనం దూరమయిన వారు తళుక్కున మీడియాలో మెరిసి, పార్టీ భ్రష్టుపట్టిపోతోందంటూ వాపోయి చటుక్కున మాయమవుతుంటారు. మళ్లీ ఎప్పుడో గానీ మీడియా ముందుకు రారు.
ఇంకొంతమంది అసలు మీడియా కోసమే పుట్టిన నేతాశ్రీలున్నారు. ఈ బాపతు నేతలకు సొంత గల్లీల్లోనూ ఠికాణా ఉండదు. మరికొందరు నేతాశ్రీలకు గల్లీలో దిక్కు లేకపోయినా, ఢిల్లీలో బోలెడు బిల్డప్పులు. కొందరు ఇప్పుడే సోనియాతో మాట్లాడి వచ్చామంటారు. ఇంకొందరు ఇప్పుడే రాహుల్‌కు నివేదిక ఇచ్చామంటారు. మరికొందరు ఫలానా నేతపై ఫిర్యాదు చేసి వచ్చామని ఆంధ్రాభవన్‌లో సుష్టుగా టిఫిన్ చేసి, మీడియాకు చెబుతుంటారు. ఏతావాతా.. నూటికి 90 శాతం కాంగ్రెస్ నేతలు ‘నేను లేస్తే మనిషిని కాద’నే బాపతే. అసలు నిజమేమిటంటే.. వారు అసలు లేవలేరన్నది మనం మనుషులం అన్నంత నిఝం.
ఇప్పుడు ఈ బాపతు నేతలతోనే పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డికి కష్టాలొచ్చి పడ్డాయి. కొద్దికాలం క్రితమే పార్టీలోకి వచ్చిన రేవంత్‌రెడ్డి, తమపై పెత్తనం చేయడం మెజారిటీ సీనియర్లకు సుతరామూ ఇష్టం లేదన్నది బహిరంగమే. భూమి పుట్టిన నాటి నుంచి కాంగ్రెస్‌లో పనిచేస్తూ, పీసీసీ అధ్యక్ష పదవి కోసమే బతుకుతున్న చాలామంది ముదురు నేతలకు, రేవంత్ నియామకం సహజంగానే నచ్చదు. తమ ఇంటికొచ్చి, తమ సలహా తీసుకుని, తాము సూచించినవారికి పదవులివ్వాలనేది ఈ బాపతు నేతల సైకాలజీ. దశాబ్దాల నుంచి దానికే అలవాటు పడ్డ జీవులు వారంతా. అలాంటి వారికి స్వతంత్రంగా వ్యవహరించే రేవంత్, అధ్యక్షుడిగా రావడం సహజంగా మింగుడుపడని వ్యవహారమే.
కానీ రేవంత్‌రెడ్డి చిన్న సన్నోడు కాదు. తెలుగుదేశం స్కూలు నుంచి వచ్చినోడు. జనం-మీడియాలో ఎలా చోటు సంపాదించాలన్న అంశంపై, పీహెచ్‌డీ చేసిన నాయకుడు. రాజకీయాల్లో ఆయన ‘బాలమేధావి’.ప్రాంతీయ పార్టీ టీడీపీలో తన మాట సాగించుకున్న రేవంత్, జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్‌లోనూ తన మాట సాగాలని కోరుకోవడం సహజం. అది సీనియర్లకు నచ్చదు. అలాగని రేవంత్ ఏదీ గాలికి మాట్లాడరు. చాలా కసరత్తు చేస్తారు. ఆర్టీఐని బాగా వాడే ఈ తరం నేతల్లో ఆయనొకరు. దానితో ఏం చేస్తారన్నది పక్కనపెడితే, సమాచార సేకరణలో మొనగాడు. ఆయనకో సొంత నెట్‌వర్క్. టీఆర్‌ఎస్ గుట్టుమట్లు తెలియడంతోపాటు, ఆ పార్టీలో ‘రహస్య మిత్రులు’న్న అతి తక్కువమంది నేతల్లో ఆయనొకరు.
తెలంగాణలో కేసీఆర్ తర్వాత క్రౌడ్‌పుల్లర్లలో రేవంత్‌రెడ్డి, బండి సంజయ్ ముందుంటారు. యూట్యూబ్ చానెళ్లు, ఫేసుబుక్కులు ఓపెన్‌చేస్తే రేవంత్‌రెడ్డికి లక్షల సంఖ్యలో క్లిక్కులు, లైకులూ కనిపిస్తుంటాయి. సోషల్‌మీడియాలో రేవంత్‌రెడ్డికే ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ కనిపిస్తుంటుంది. ‘కాంగ్రెస్ పుట్టినప్పటి నుంచీ’ ఆ పార్టీలో కొనసాగుతున్న సీనియర్లలో, ఎవరికీ ఇంత ఫాలోయింగ్ భూతద్దం పెట్టి వెతికినా కనిపించదు. అందుకే కాంగ్రెస్‌లో రేవంత్ ఇప్పుడు సూపర్‌స్టార్. మాటల మాంత్రికుడు. ఆ పార్టీలో జనాకర్షణ ఉన్న నేత. ఆయన ప్రసంగిస్తే చప్పట్లే చప్పట్లు. రాహుల్ ఉన్న సభలోనూ ఆయనకంటే రేవంత్‌రెడ్డి ప్రసంగానికే ఎక్కువ చప్పట్లు వినిపిస్తాయంటే, జనంతో ఆయన ఏ స్ధాయిలో కనెక్టయ్యారో స్పష్టమవుతుంది.
కాకపోతే ఆయన పోషిస్తున్న సొంత సైన్యమే, రేవంతుకు ఇప్పుడు సమస్యగా మారింది. సొంత సోషల్‌మీడియా బృందం ఆయనను ఆకాశానికెత్తేస్తుంటుంది. రేవంత్‌ను పులి, సింహంగా కీర్తిస్తుంటుంది. కాంగ్రెస్‌లో ఆయనక్కొడు తప్ప, మిగిలిన వారెవరూ లేరన్నంత స్థాయిలో ప్రచారం చేస్తుంటుంది. టీడీపీలో ఉన్నప్పటి ఫార్ములా, కాంగ్రెస్‌లోనూ అమలు చేయాలనుకోవాలనుకోవడమే ఆయనకు చిక్కులు తెస్తోంది.
టీడీపీలో ఉన్నప్పుడు కూడా ఆయన తన సొంత ఎలివేషన్ తప్ప, పార్టీ ఎలివేషన్ గురించి ప్రయత్నించలేదన్న విమర్శలు ఎదుర్కొన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ లోనూ అలాంటి విమర్శలు వస్తున్నాయంటే, రేవంత్ సొంత పబ్లిసిటీ కోసమే పాకులాడుతున్నారని అర్ధం చేసుకునేందుకు ఆస్కారం ఏర్పడింది.
కాంగ్రెస్ జాతీయ పార్టీ. ప్రస్తుత తెలంగాణ కాంగ్రెస్ నేతలలో 90 శాతం పేపర్ టైగర్లే అయినప్పటికీ.. కాలం చెల్లిన నేతలే అయినప్పటికీ.. జనజీవనం నుంచి దూరం జరిగిన వారే అయినప్పటికీ.. ‘మన’ అనే బదులు, ‘నేను’ అని ప్రచారం చేసుకునే రేవంత్ శైలి, వారిని శత్రువులుగా మారుస్తోంది. ఈ త రహా కాంగ్రెస్ తత్వాన్ని ‘బాలమేధావి’ రేవంత్ తెలుసుకోకపోవడమే ఆశ్చర్యం.
రెడ్లతోనే అన్నీ సాధ్యమన్న రేవంత్‌రెడ్డి నోరు దురుసు వ్యాఖ్యలు, నిజానికి కాంగ్రెస్ అనే సెక్కులర్ పార్టీ ఒంటికి పడదు. అసలు అలాంటి వ్యాఖ్యలు చేసే వారిపై సహజంగా వేటు పడుతుంది. సీనియర్ బీసీ నేతలు అప్పటికీ, రేవంత్ వ్యాఖ్యలపై విరుచుకుపడ్డారు. కానీ రేవంత్‌రెడ్డి ఇంకా నిక్షేపంగా పదవిలో ఉన్నారంటే, ఢిల్లీలో ఆయనకు ఆశీస్సులిచ్చే చేతులు బలమైనవేనని అర్ధమవుతుంది.
ఏదేమైనా.. రేవంత్‌రెడ్డి పీసీసీ పగ్గాలు అందుకున్న తర్వాతనే, ఐసియులో ఉన్న కాంగ్రెస్‌కు ఊపిరి వచ్చిందన్నది మనం మనుషులం అన్నంత నిజం. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆరేళ్ల వైఫల్యాలను ఎవరైనా ఒక్కసారే చక్కదిద్దడం కష్టం. ప్రస్తుతం రేవంత్ పార్టీ రిపేరు పనిలో ఉన్నట్లు కనిపిస్తోంది. ఆ ప్రయత్నంలో భాగంగా సీనియర్ల నుంచి సమస్యలు ఎదుర్కొంటున్నారు.
తాజాగా కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి నిష్క్రమణ వ్యవహారం సీనియర్లకు అందివచ్చినట్లు కనిపిస్తోంది. వారంతా కోమటిరెడ్డి భుజంపై తుపాకి పెట్టి, రేవంత్‌ను పేల్చే పనిలో ఉన్నట్లు శశిధర్‌రెడ్డి వంటి నేతల వ్యాఖ్యలే స్పష్టం చేస్తున్నాయి. అసలు రేవంత్ వ్యవహారశైలి కారణంగానే, కోమటిరెడ్డి సహా ఎమ్మెల్యేలంతా వెళ్లిపోతున్నారన్న ప్రచారానికి పదునుపెడుతున్నారు. కాంగ్రెస్ ఇన్చార్జి మాణిక్యం ఠాకూర్‌తో, రేవంత్ కుమ్మక్కయారంటూ కోమటిరెడ్డి నుంచి శశిధర్‌రెడ్డి వరకూ విమర్శిస్తున్నారు. అంటే చావుకేస్తే లంఖణానికి వచ్చినట్లు.. ఠాకూర్‌పై ఒత్తిడి పెంచితే, రేవంత్ ఉక్కిరిబిక్కిరి అవుతారన్న వ్యూహం అందులో కనిపిస్తోంది. కానీ ఆ పప్పులు పెద్దగా ఉడికిన దాఖలాలు కనిపించడ, లేదు.
కొద్దికాలం క్రితం రాహుల్, రేవంత్ బహిరంగసభలు, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాదయాత్ర, సమస్యల పరిష్కారం కోసం ఎన్‌ఎస్‌యుఐ ఆందోళన, నేతల మెరుపు ధర్నాలతో కాంగ్రెస్‌లో నయా జోష్ కనిపించింది. ఇటీవలి కాలంలో రైతుల పక్షాన కాంగ్రెస్ చేసిన ఆందోళనలు ఆ పార్టీని రైతాంగానికి దగ్గరచేసింది. సీఎం కేసీఆర్, కేటీఆర్‌పై రేవంత్ సంధించిన విమర్శనాస్త్రాలు, కింది స్థాయి క్యాడర్‌లో సమరోత్సాహం నింపాయి. ఇటీవల రైల్వేస్టేషన్‌లో విధ్వంసం సృష్టించిన అభ్యర్ధుల పక్షాన న్యాయపోరాటం చేసి, వారికి బెయిలు వచ్చే వరకూ పోరాడిన వైనం బాధితులను కాంగ్రెస్ వైపు మళ్లేలా చేసింది. అయితే ఆ ఉత్సాహాన్ని సీనియర్లు కావలసినంత మేరకు విజయవంతంగా చల్లారుస్తుండటం కాంగ్రెస్ క్యాడర్‌నూ కుదేలు చేస్తోంది.
ఈ నేపథ్యంలో జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్, ప్రాంతీయ పార్టీ మాదిరిగా శరవేగంగా, స్థానికంగా కఠిన నిర్ణయాలు తీసుకుంటే తప్ప పార్టీ మనుగడ కష్టమన్న వ్యాఖ్యలు యువనేత ల నుంచి వినిపిస్తున్నాయి. పార్టీకి నయాపైసా ఫాయిదా లేని వృద్ధ నేతలు, ఓడిపోయి తెరమరుగయిన వారిని నిర్దాక్షిణ్యంగా పక్కనపెట్టి, యువరక్తాన్ని ఎక్కిస్తే తప్ప, తెలంగాణలో పార్టీ అధికారంలోకి రావడం కష్టమన్నది యువనేతల వాదన.
నిజానికి జనంలో.. టీఆర్‌ఎస్‌కు కాంగ్రెస్ పార్టీనే ప్రత్యామ్నాయంగా కనిపిస్తున్న్పటికీ, ఆ పార్టీ సీనియర్ల కుమ్ములాటలు, బహిరంగ విమర్శలు కాంగ్రెస్ పురోగతికి అడ్డుగోడగా మారుతున్నాయి. ‘రేవంత్ వచ్చిన తర్వాత కాంగ్రెస్ పుంజుకున్న మాట నిజమే. బీజేపీ కంటే కాంగ్రెస్ పార్టీనే టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయంగా కనిపిస్తోంది. మేం కాంగ్రెస్‌కే ఓటేయాలనుకుంటున్నాం. కానీ కాంగ్రెస్‌లో సీనియర్లు కొట్టుకుంటున్నారు. సరైన లీడర్లు లేరు. మేం ఒకవేళ కాంగ్రెస్‌ను గెలిపించినా వాళ్లు మళ్లీ గతంలో మాదిరిగా టీఆర్‌ఎస్‌లో చేరరన్న నమ్మకం ఏమిటి?’’ అన్న ప్రశ్నలు జనక్షేత్రం నుంచి వినిపిస్తున్నాయి.
ప్రధానంగా కింది స్థాయి వర్గాల నుంచి ఈ తరహా వ్యాఖ్యలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. తెలంగాణలోని వివిధ జిల్లాల నుంచి హైదరాబాద్‌కు జీవనం కోసం వచ్చిన అనేకమంది, ఇలాంటి అభిప్రాయం వ్యక్తం చేస్తుండటం ప్రస్తావనార్హం. ఈ అభిప్రాయాన్ని మార్చినప్పుడే, రేవంత్‌రెడ్డికి రాజకీయ భవిష్యత్తు ఉంటుంది. లేకపోతే ఆయన లక్ష్యంగా, ఆయన చుట్టూనే పార్టీ రాజకీయాలు తిరుగుతుంటాయి.