– ఒక శకం ముగిసింది
భారత తపాలా శాఖకు విస్తృతమైన వ్యవస్థ ఉంది.. ‘ దేశంలో 19,101 పిన్ కోడ్ లతో 1,54,725 పోస్టాఫీసులను కలిగి ఉంది. ఈ నెట్ వర్క్ తో సమర్ధవంతమైన సేవలు అందిస్తోంది. బుక్ చేసిన పార్ట్ళిళ్లు వారం లోపు బట్వాడా అవుతున్నాయి. నగర పరిధికి పరిమితమైన స్థానిక బట్వాడాలు ఆమరుసటి రోజుకే చేర్చ గలుగుతున్నారు.
ఇంతటి ఘన చరిత్ర కలిగిన తపాలా శాఖ 2024 డిసెంబర్ 18 వ తేదీనుంచి బుక్ పోస్ట్ సర్వీసును ఉపసంహరించుకుంది.ఇది పుస్తక ప్రియులను, మొత్తం పుస్తక పరిశ్రమను దిగ్భ్రాంతికి గురి చేసింది.
బుక్ పోస్ట్ సర్వీసును ఉదాత్తమైన ఆలోచనతో మొదలు పెట్టారు.విద్యను ప్రోత్సహించడం, పఠనాభిలాషను పెంపొందింప చేయడం,దేశ వ్యాప్తంగా జ్ఞానాన్ని పరివ్యాప్తి చేయడం అనే విశాలదృష్టితో ఈసర్విసును ప్రారంభంచారు.
రిజిస్టర్డ్ బుక్ పోస్ట్ (ఆర్.బి.పి.)సర్వీసు ద్వారా 5 కిలోల బరువున్న పుస్తకాలను దేశంలోని ఏమారు మూల ప్రాంతానికైనా కేవలం రూ80 లకు పంపించ గలిగేవారు. మరే ఇతర కొరియర్ సర్వీసు ఇంత చౌకగా ఈరకమైన సేవలు అందించడంలేదు. పుస్తకాలు చదివే అలవాటును ప్రోత్సహించడమే లక్ష్యంగా ఈ సబ్సిడీ రేట్లను అందుబాటులోకి తెచ్చారు. పుస్తకాలు, మాగజైన్లు, పీరియాడికల్స్ ఈ రాయితీలకు అర్హమైనవి.
అయితే ముందుగా పుస్తక పరిశ్రమ, చదువరుల అభిప్రాయాలను తెలుసు కోకుండా, ఏవిధమైన చర్చ, సమాచారం లేకుండా కేంద్ర ప్రభుత్యం ఈ నిర్ణయాన్ని హఠాత్తుగా, ఏకపక్షంగా అమలు చేసింది. రిజిస్టర్ బుక్ పోస్ట్ కేటగిరిని తపాలా శాఖ సాఫ్ట్ వేర్ నుంచి గుట్టుచప్పుడు కాకుండా తిసివేశారు. తపాలా శాఖ సిబ్బందికి కూడా ముందుగా ఈ విషయం తెలియ పరచలేదు.
ఈ హఠాత్ నిర్ణయం వారందరినీ కూడా విస్మయానికి గురి చేసింది. దేశ వ్యాప్తంగా పోస్టాఫీసుల్లో పుస్తకాలను రిజిస్టర్ బుక్ పోస్టులో పంపడానికి వెళ్లిన వందలాది మంది ప్రచురణ సంస్థల సిబ్బంది ఇక ఈ సర్వీసు అంగుబాటులో లేదని తెలుసుకుని ఆశ్యర్యంతో పాటు ఆశాభంగానికి లోనయ్యారు. నిలదీసిన సందర్భాలు, వాగ్వాదానికి దిగిన సంఘటనలు లేకపోలేదు.
ఈ సర్వీసును రద్దు చేయడం ప్రచురణ రంగంలో ప్రకంపనలు సృష్టించింది. రిజిస్టర్ బుక్ పోస్టు ద్వారా 200 పేజీల పుస్తకాన్ని జి.ఎస్.టి.తో కలిపి రూ 25 కు పంపేవారు. ఇప్పుడు ఈ సర్వీసు రద్దు కావడంతో తప్పని సరిగా రిజిస్టర్డ్ పార్సిల్లో మాత్రమే పుస్తకాలను ఎక్కువ చార్జీలు భరించి పంపక తప్పని పరిస్థితి ఏర్పడింది.వంద రూపాయల ఖరీదు చేసే పుస్తకాన్ని ఎవరైనా పాఠకుడు పోస్టులో తెప్పించు కోవాలంటే షిప్పింగ్ చార్చిల కింద రూ 78 భరించాల్చి వస్తుంది. ఇంత భారం భరించి పుస్తకాలను ఎంతమంది తెప్పించు కోగలరు?.
ఇప్పటికే పఠనాసక్తి కొరవడి, పుస్తక పరిశ్రమ నష్టాల్లో కునారిల్లుతోంది. మూలిగే నక్కపై తాటిపండు చందంగా ఇప్పుడు తపాలాశాఖ తీసుకున్న నిర్ణయం పబ్లిషింగ్ ఇండస్ట్రీని పూర్తిగా సంక్షోభంలోకి నెట్టింది.
చార్జీలు వ్యత్యాసం ఇదీ
రిజిస్టర్ బుక్ పోస్ట్ కి రిజిస్టర్ పార్శిల్ కి చార్జీల్లో తేడా ఇలా ఉంది.రిజిస్టర్ బుక్ పోస్టులో కిలో బరువున్న పుస్తకాలను రూ 32 కే పంపేవారు. ఆవే పుస్తకాలను ఇప్పుడు రిజిస్టర్డ్ పార్శిల్లో పంపటానికి రూ78 అవుతుంది.2 కిలోల పుస్తకాలకు బుక్ పోస్ట్ లో రూ 45 అయితే పార్శిల్ లో రూ 116 అవుతుంది. 5కిలోల పుస్తకాలు బుక్ పోస్టలో రూ80 అయితే పార్శిల్ లో రూ 229 అవుతుంది.
దీనికి తోడు తపాలాశాఖ మరొక అవాంఛనీయ నిర్ణయమూ తీసుకుంది. శాంపిల్ పుస్తకాలపై 5 శాతం దిగుమతి సుంకం విధించారు. మన పుస్తకాలను విదేశీ బాషలోకి అనువాదం చేసి ప్రచురిస్తుంటారు. ఇలాంటి సందర్భాల్లో విదేశీ పబ్లిషర్లు, ఆపుస్తకాల కాంప్లిమెంటరీ కాపీలను మనకు పంపుతుంటారు. ఇలా విదేశాల నుంచి వచ్చే పుస్తకాలపై మొదటి సారిగా ప్రభుత్వం దిగుమతి సుంకం విధించింది. వాణిజ్య ప్రయోజనాలతో విక్రయించేందుకు ఉద్దేశించిన పుస్తకాల మీద సుంకం విధించడాన్ని సమర్థించవచ్చేమో కానీ కాంప్లీమెంటరీగా ఉచితంగా పంపే పుస్తకాలపై కూడా సుంకంపేరిట అదనపు భారం మాపడం ఏమాత్రం సమర్ధనీయం కాదు. ఇది విరుద్ధ ఫలితాలను ఇస్తుంది.
కేంద్ర ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయాల పర్యవసానాలు తీవ్రంగా ఉండనున్నాయి. దేశ విద్య,సాహిత్య లక్ష్యాలను ఇది విఘాతం కల్గిస్తుంది. అక్షరాస్యత, విద్య,మేధో వికాసాలకు నిబద్ధమై దేశం సాగిస్తున్న కృషిని లక్ష్యాలను బుక్ పోస్ట్ సర్వీసు ఉపసంహరణ పూర్తిగా నీరుగారుస్తుంది.
ఆలోచనలు,విజ్ఞానమే దేశపురోగతికి పునాదులు. దేశం నలుమూలలకు వీటిని చేరవేయడానికి ఉద్దేశించిన బుక్ పోస్ట్ సర్వీసును నిలిపివేయడానికి మించిన ట్రాజడీ ఏముంటుంది?
— మనీష్ మోది
( రచయిత, ప్రచురణ కర్త. 1912 నుంచి కార్యకలపాలు సాగినన్ని హిందీ గ్రంథ్ కార్యాలయ సంస్థ సారధి..)
@ఫ్రీ ప్రెస్ జర్నల్ వెబ్ సైట్ సౌజన్యంతో…