Suryaa.co.in

Andhra Pradesh

రేపటి రాష్ట్రానికి జగన్ పీడ విరగడ కాబోతుంది

-సభను విజయవంతం చేయాలని కూటమి పిలుపు
-సువర్ణాక్షరాలతో లిఖించేలా బొప్పూడి “ప్రజాగళం”

చిలకలూరిపేట: టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ఆధ్వర్యంలో ఈ నెల 17న చిలకలూరిపేట బొప్పూడిలో నిర్వహించనున్న చారిత్రాత్మక ప్రజాగళం బహిరంగ సభకు మూడుపార్టీల ముఖ్యనేతల సారధ్యంలో విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. సభా ప్రాంగణంలో పనులను టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు, జనసేన పిఎసి చైర్మన్ నాదెండ్ల మనోహర్, బిజెపి రాష్ట్ర కార్యదర్శి పాతూరి నాగభూషణం శుక్రవారం సాయంత్రం పరిశీలించారు.

ప్రధాని మోడీ హాజరుకానున్న ఈ సభను విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరు కదలిరావాలని ముఖ్యనేతలు పిలుపునిచ్చారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు మాట్లాడుతూ… ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో రాష్ట్రం కోసం టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పనిచేయాలని నిర్ణయించాయి. ఈనెల 17వ తేదీ జరగనున్న ప్రజాగళం సభకు ప్రధాని మోడీ హాజరువుతున్నారు. బొప్పూడి ప్రజాగళం సభ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడుతుంది. మూడు పార్టీల ఆధ్వర్యంలో మొదటిసారి ఈ సభ జరుగుతోంది. ఏపీ చరిత్రలో అనేక పార్టీలు పొత్తులు పెట్టుకున్నాయి.

రాష్ట్ర భవిష్యత్ కోసమే మూడు పార్టీలు పొత్తుపెట్టుకున్నాయి. కుల, మతాలకు అతీతంగా ప్రజలు పొత్తును ఆశీర్వదించాలి. రాష్ట్రాభివృద్ధిని కాంక్షించే వారంతా ప్రజాగళం సభలో పాల్గొని విజయవంతం చేయాలి. ప్రజలకు కావాల్సిన రవాణ, భోజనం, తాగునీరు వంటి అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతోంది. జగన్ పాలనలో ప్రజలు 5 కోట్ల మంది ప్రజలు నరకయాతన అనుభవిస్తున్నారు. ప్రజల హక్కులను కాలరాశారు. రేపు మధ్యాహ్నం 3 గంటలకు ఎన్నికల షెడ్యూల్ వెలువడనుంది. దీంతో జగన్ పీడ రాష్ట్రానికి విరగడ కాబోతోంది. అధికారులు స్వేచ్ఛగా పనిచేయాలి. రేపు సాయంత్రం నుంచి ప్రజాస్వామ్యాన్ని పునరుజ్జీవింపచేసుకుని ఎన్నికలకు సన్నద్ధమవుదాం.

రాష్ట్రప్రజలు మార్పు కోరుకుంటున్నారు: మనోహర్
జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ.. 17న తేదీన చిలకలూరిపేట సమీపంలోని బొప్పూడిలో నిర్వహించే సభకు ప్రధాని నరేంద్ర మోడీ హాజరవుతున్నారు. రాష్ట్రంలో చంద్రబాబునాయుడు, పవన్ కల్యాణ్, బీజేపీ నేతృత్వంలో ఏర్పాటయ్యే ప్రజా ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికీ న్యాయం జరుగుతుంది. బొప్పూడి సభలో రాష్ట్రంలోని అన్నివర్గాల ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలి.

జాతీయస్థాయిలో నరేంద్ర మోడీ నాయకత్వాన్ని ప్రజలు కోరుకుంటున్నారు. సభా ఏర్పాట్లకు పోలీసు డిపార్ట్ మెంట్ కూడా సహకరించాలి. రేపు ఎన్నికల కోడ్ వస్తుంది. ఇప్పటివరకు వైసీపీ ప్రభుత్వం ఎన్నో ఇబ్బందులకు గురిచేసింది. ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి సభను విజయవంతం చేస్తారని భావిస్తున్నాం.

సింగిల్ సింహం కథ తేలబోతోంది: నాగభూషణం
బీజేపీ రాష్ట్ర కార్యదర్శి పాతూరి నాగభూషణం మాట్లాడుతూ.. కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో మూడో సారి అధికారం చేపట్టబోతున్నారు. ఏపీలో కూడా 2014లో ఏవిధంగా మోడీ, చంద్రబాబు, పవన్ కల్యాణ్ నేతృత్వంలో అభివృద్ధి సాధించామో.. మళ్లీ అది పునరావృతం అవుతుంది. దేశ అభివృద్ధి కోసం బీజేపీ పనిచేస్తుందని మోడీ చెప్పారు. అందుకే ఎన్డీయేలో వివిధ పార్టీలను ఆహ్వానించడం జరిగింది.

సింహం సింగిల్ గా వస్తుందని వైసీపీ నేతలు చెబుతున్నారు. 17వ తేదీన తర్వాత ఏం జరుగుతుందో మీరే చూస్తారు. ప్రజాగళం సభ వైసీపీకి విషగళంగా మారుతుంది. రాష్ట్రాభివృద్ధి కోసం 17న జరగనున్న సభను ప్రజలంతా విజయవంతం చేయాలని కోరారు. మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ.. వైసీపీకి అభ్యర్థులు కూడా దొరకడం లేదు. వైసీపీ ఇంఛార్జ్ లు దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నారు. ఓటమి ఖాయమనే భయందోళనలో ఆ పార్టీనేతలు ఉన్నారు. గతంలో ఎప్పుడూ ప్రజలు ఎన్నికల కోడ్ కోసం ఎదురుచూడలేదు. ప్రజాస్వామ్య పాలన కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారు.

175కి 175 సీట్లలో కూటమి విజయం సాధిస్తుంది. చిలకలూరిపేట సభ చరిత్ర సృష్టిస్తుంది. 2014లో నా ఆధ్వర్యంలో సభ నిర్వహించి విజయదుందుభి మోగించాం. ఇప్పుడు అదే సెంటిమెంట్ రిపీట్ కాబోతోంది. పండుగ వాతావరణంలో జరిగే ప్రజాగళం సభకు ప్రతి ఒక్కరు తరలిరావాలని పుల్లారావు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు, టిడిపి సీనియర్ నాయకులు టీడీ జనార్థన్, నన్నపనేని రాజకుమారి, కొమ్మారెడ్డి పట్టాభిరాం, జనసేన నాయకులు కళ్యాణం శివశ్రీనివాస్ (కెకె) తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE