– కావాలనే టిడిపి వారు సచివాలయ ఉద్యోగులను రెచ్చగొడుతున్నారు
– ఒకేసారి 4 లక్షల మందికి ఉద్యోగాలు ఇప్పించిన ఘనత సీఎం వైయస్ జగన్ కే దక్కుతుంది.
– సచివాలయ ఉద్యోగులు బాగా పనిచేస్తున్నారు
– వారి పనితీరును గమనించిన సీఎం ప్రొబేషన్ పై ఇప్పటికే ప్రకటన చేశారు
– రెండు విడతల్లో 6778 గ్రేడ్-5 పంచాయతీ కార్యదర్శి పోస్టుల భర్తీ
– 9376 గ్రేడ్-6 డిజిటల్ అసిస్టెంట్ పోస్టులు భర్తీ
– : మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా సచివాలయ ఉద్యోగులకు జూన్ నెలలో ప్రోబెషన్ ను అమలు చేస్తామని ఇప్పటికే ముఖ్యమంత్రి వైయస్ జగన్ ప్రకటించారని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు.
అసెంబ్లీలో సభ్యులు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ సచివాలయాల్లో ఉద్యోగులు బాగా పనిచేస్తున్నారని, వారి పనితీరును గమనించిన సీఎం వైయస్ జగన్ వారికి జూన్ నెలలో ప్రొబేషన్ డిక్లేర్ చేస్తామని ప్రకటించారని గుర్తు చేశారు. ఈ అంశాన్ని తెలుగుదేశం పార్టీ కావాలనే రాజకీయం చేస్తోందని, ఈ మధ్య కొంతమంది కార్యదర్శులను, సచివాలయ ఉద్యోగులను రెచ్చగొట్టారని అన్నారు.
వారికి ప్రోబెషన్ ఇవ్వడం లేదని, జీతాలు పెంచడం లేదంటూ కొందరు నిరసనలు కూడా తెలిపారని అన్నారు. ఇదే క్రమంలో సీఎం వైయస్ జగన్ ఒక సమావేశం ఏర్పాటు చేసి ప్రొబేషన్ పై స్పష్టమైన ప్రకటన చేశారని అన్నారు. సచివాలయ ఉద్యోగుల గురించి తమకే బాధ్యత ఉన్నట్లుగా, తమ హయాంలో ఉద్యోగాలు ఇచ్చినట్లు తెలుగుదేశం రాజకీయం చేస్తోందని విమర్శించారు.
జూన్ తరువాత యథాప్రకారం నిబంధనల మేరకు సచివాలయ ఉద్యోగులకు జీతాలు వస్తాయని చెప్పారు. సీఎం వైయస్ జగన్ కారణంగానే సచివాలయ ఉద్యోగాలు వచ్చాయని, వారి పట్ల ఈ ప్రభుత్వం బాధ్యతగా ఉందని అన్నారు. దీనిపై తెలుగుదేశం అతిగా స్పందించాల్సిన అవసరం లేదని హితవు పలికారు.
దేశంలో మరే రాష్ట్రంలోనూ లేని విధంగా మన రాష్ట్రంలో సీఎం వైయస్ జగన్ ముందుచూపుతో సచివాలయ వ్యవస్థను తీసుకువచ్చారని అన్నారు. ఏ ప్రభుత్వం చేయని విధంగా ఏకకాలంలో నాలుగు లక్షల మంది యువతకు ఉద్యోగాలు కల్పించిన ఘనత కూడా సీఎం కే దక్కుతుందని పేర్కొన్నారు. సచివాయాల ద్వారా ప్రజలకు పారదర్శకమైన పాలనను అందిస్తున్నామని తెలిపారు.
పంచాయతీ రాజ్ లో సీఎం అనేక సంస్కరణలను తీసుకువచ్చారని అన్నారు. గతంలో పంచాయతీ కార్యదర్శలు గ్రేడ్ వన్ నుంచి గ్రేడ్ 4 వరకు ఉండేవారని తెలిపారు. అయితే సీఎం వైయస్ జగన్ సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసిన తరువాత గ్రేడ్ 5 కింద రెండు విడతల్లో మొత్తం 7040 పోస్టులకు గానూ 6778 పోస్ట్ లను భర్తీ చేశామని తెలిపారు.
అలాగే గ్రేడ్ 6 కింద 11,150 డిజిటల్ అసిస్టెంట్ పోస్ట్ లకు గానూ 9376 పోస్ట్ లు భర్తీ చేయడం జరిగిందని వెల్లడించారు. సర్వీస్ కమీషన్ కు ఇవ్వకుండా పంచాయతీరాజ్ శాఖ ద్వారానే రెండు విడతల్లో ఈ పోస్ట్ లను అత్యంత పారదర్శకంగా భర్తీ చేశామని అన్నారు.