Suryaa.co.in

Andhra Pradesh Features

మొక్కుబడిగా పబ్లిక్‌ గ్రీవెన్స్‌?

వారసత్వంగా వచ్చిన భూమి మ్యూటేషన్ కోసం అల్లూరి సీతారామరాజు జిల్లాకు చెందిన రైతు నర్సిమయ్య నెలలు నెలలుగా రివెన్యూ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నాడు. అయినా పని కావడంలేదు. ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు కదా అనే ఆశతో పబ్లిక్ గ్రీవెన్స్‌లో మళ్లీ ధరఖాస్తు చేసి మరోమారు మొరపెట్టుకున్నాడు. నిర్ణీత సమయం గడిచినా అధికారుల నుంచి స్పందన లేదు.

అనంతపురం జిల్లాకు చెందిన మరో ఫిర్యాదుదారుడికి సమస్య పరిష్కరించినట్లు మెసేజ్ వచ్చింది. అయితే సమస్య మాత్రం అలాగే వుంది. ఏంటని అడిగితే చెప్పేవారే లేరు.

అన్నమయ్య జిల్లా అయినా, ఎన్టీఆర్ జిల్లా అయినా అన్ని జిల్లాలలో ఇదే పరిస్థితి నెలకొంది. ప్రతి సోమవారం ప్రజా సమస్యల వేదికకు వెళ్లి ఫిర్యాదులు చేసే వారి సంఖ్య మాత్రం పెరుగుతోంది. సమస్యలు మాత్రం పరిష్కరించబడడం లేదు. దీంతో మొక్కబడిగా పబ్లిక్ గ్రీవెన్స్ సిస్టం తయారయిందా అన్న అనుమానం ప్రజలకు కదులుతోంది.

80 శాతం 90 శాతం సమస్యలకు పరిష్కారం ఇచ్చేశామంటూ అధికారుల వద్ద నుంచి ప్రభుత్వానికి నివేదికలు వెళుతున్నాయి. కానీ క్షేత్ర స్థాయిలో పరిస్థితి వేరుగా వుంది. సీఎం చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్, ఇతర మంత్రులు ఎవరికి వారే సమీక్షలు నిర్వహిస్తూ అధికారులను హడావుడి చేస్తున్నారు. అయితే ప్రజా సమస్యల పరిష్కారంలో మాత్రం కొందరు అధికారుల తీరు మాత్రం మారడం లేదు.

ముఖ్యంగా రెవెన్యూ శాఖలో అసలు పనులు త్వరగా కావడం లేదని, చేయి తడపనిదే పని ఫైల్‌ కదలడం లేదని రైతులు గగ్గోలు పెడుతున్నారు. ప్రభుత్వం ఇస్తున్న పథకాల కోసం ధరఖాస్తులు వెల్లువెత్తున్నాయి. కొందరు తమ పెన్షన్లు ఆగిపోయాయని దరఖాస్తు చేస్తున్నారు. మరికొందరు రేషన్ కార్డుల కోసం ధరఖాస్తులు ఇస్తున్నారు. అన్ని సమస్యలపై ధరఖాస్తులు ఇబ్బడిముబ్బడిగా వచ్చిపడుతున్నాయి.

అసలేంటీ ‘పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెస్సల్ సిస్టమ్‘?

ఏపీ ప్రభుత్వ ప్రక్షాళన విషయంలో తన వైఖరి ఏంటో సీఎం చంద్రబాబు పలుమార్లు సృష్టం చేశారు. ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలుపై వేగంగా పని చేయాలని ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ పాలసీల ప్రకటనకు ముందే కసరత్తు జరగాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. పాలనలో తన మార్క్ చూపిస్తానని అధికారులను హెచ్చరిస్తూ వచ్చిన చంద్రబాబు అధికారం చేపట్టిన వెంటనే ప్రజా సమస్యల పరిష్కారం వైపు దృష్టి పెట్టారు.

గత ప్రభుత్వం హయాంలో జరిగిన అరాచక పాలన, అవినీతి పరిపాలనను ప్రక్షాళన చేసేందుకు అంటూ , ప్రజా ఫిర్యాదుల స్వీకరణ కోసం వైసీపీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకువచ్చిన ‘స్పందన’ కార్యక్రమానికి ప్రక్షాళన చేశారు. స్పందన పేరు తొలగించి ‘ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ’గా కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నారు. ‘పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెస్సల్ సిస్టమ్’ పేరుతో ఫిర్యాదుల స్వీకరణకు కలెక్టర్లకు ఆదేశాలను జారీ చేశారు.

ప్రజా ఫిర్యాదుల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్లకు సూచించారు. తమ ప్రభుత్వం ప్రజలకు మరింత అందుబాటులో ఉండేలా తీర్చిదిద్దాలని పేర్కొన్నారు. ప్రతి సోమవారం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో కలెక్టర్లు, అధికారులు ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరిస్తారు. దానికి తోడుగా గ్రామ సభలు నిర్వహిస్తూ ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తున్నారు. ఇదంతా బాగానే వుంది. కానీ సమస్యల పరిష్కారం త్వరగా కావడం లేదనీ ప్రజలు వాపోతున్నారు.

చంద్రబాబు నేరుగా ప్రజల నుంచి తెప్పించుకున్న ఫీడ్ బ్యాక్‌లోనూ ప్రజల నుంచి అసంతృప్తి వ్యక్తమయినట్లు చెబుతున్నారు. కూటమి అధికారంలోకి వచ్చి సంవత్సరం అవుతున్నా, కొందరి అధికారుల తీరు మారకపోవడంపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.

లెక్కలేంటి- వాస్తవాలేంటి?

వివిధ రూపాల్లో ప్రభుత్వానికి ఇప్పటివరకు 8,44,933 ఫిర్యాదులు అందాయి. అందులో 7,75,660 సమస్యలకు పరిష్కారం లభించినట్లు గ్రీవెన్స్ సెల్ వెబ్ సైట్ తెలుపుతోంది. కేవలం 69వేల 273 ఫిర్యాదులు పెండింగులో వున్నాయని పేర్కొన్నారు.

ఒకసారి లెక్కలు చూస్తే..

రీసర్వే గ్రామ సభల ద్వారా 2,59,642 దరఖాస్తులు ప్రభుత్వ అధికారులకు అందాయి. రెవెన్యూ సదస్సుల ద్వారా 2,34,944 దరఖాస్తుదారులు దరఖాస్తు చేసుకున్నారు. ప్రతి జిల్లా కలెక్టరేట్ల వద్ద ఆయా జిల్లా కలెక్టర్లు సోమవారం పిజిఆర్‌ఎస్‌ను నిర్వహిస్తారు. ఆ వేదికల ద్వారా 99,510 దరఖాస్తులు అధికారులకు అందాయి. మండల స్థాయిలో నిర్వహించే పిజిఆర్‌ఎస్‌ ద్వారా 72,403, ఆన్‌లైన్‌ ద్వారా 52,475 దరఖాస్తుదారులు దరఖాస్తు చేసుకున్నారు.

ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, మంత్రుల ద్వారా 19,581, ఎస్‌పి కార్యాలయాల నుంచి 14,889, ముఖ్యమంత్రి రాష్ట్ర కేంద్రంలో నిర్వహించిన పిజిఆర్‌ఎస్‌ ద్వారా 10,664, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ నిర్వహించిన ప్రజాదర్బార్‌ ద్వారా 9,610, ఇతర 18,734 చొప్పున అధికారులకు దరఖాస్తులు అందాయి.

అయితే 2024 జూన్‌ 15 నుంచి ఈ ఫిర్యాదులను స్వీకరిస్తున్నారు. 8లక్షల 50 వేల వరకు అర్జీలు అందితే అందులో ఒక లక్షా 75 వేల దాకా ఆడిట్‌ పూర్తిచేయకుండా పూర్తిచేసినట్లు లెక్కలు చెబుతున్నారని, వీటిల్లో 29,400 ఫిర్యాదులను మళ్లీ ఓపెన్‌ చేసినట్లు చెబుతున్నారు.

90 శాతం పరిష్కారమంటూ ప్రభుత్వం లెక్కలు చెబుతున్నా, రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక మొక్కుబడి తంతులా మారిందన్న విమర్శలు వస్తున్నాయి. ప్రజల ఫిర్యాదులను పరిష్కరించకుండానే పరిష్కరించామని లెక్కలు చూపుతున్నారు. వచ్చిన దరఖాస్తుల్లో కొన్నింటిని అసలు ఆడిట్‌ కూడా చేయలేదంటే ప్రజా సమస్యల పట్ల ప్రభుత్వానికి, అధికారులకు ఉన్న బాధ్యత ఏంటో అర్థమవుతోంది. సమస్య పరిష్కారం కాకపోయినా ప్రభుత్వం నుంచి పరిష్కరించినట్లు సందేశాలు రావడంతో ఫిర్యాదుదారు లకు ఏం చేయాలో అర్థం కావడం లేదు.

ఒకచోట పరిష్కారం దొరక్కపోవడంతో కూటమి పార్టీలు, తమ కార్యాలయంలో నిర్వహిస్తున్న గ్రీవెన్స్‌ల చుట్టూ ప్రజలు తిరుగుతున్నారు. టిడిపి, జనసేన, బిజెపి కార్యాలయాలలో నిర్వహించిన గ్రీవెన్స్ సెల్‌లకు తాకిడి ఎక్కువైంది. విద్యాశాఖ మంత్రి లోకేష్ ప్రజాదర్బార్‌ నిర్వహించి సమయంలోనూ ప్రజల ఫిర్యాదులు అధిక సంఖ్యలో అందాయి. అయితే పార్టీ కార్యాలయాలలో, లోకేష్ ప్రజాదర్బార్‌లోనూ అందిన ఫిర్యాదులను, ఆ తరువాత అధికారులు పట్టించుకోవడం లేదన్న అనుమానం కలుగుతోంది.

మరోవైపు ఫిర్యాదులను న్యాయబద్ధంగా పరిష్కరించకుండా బలవంతంగా వాటిని రాజీ కుదిర్చి ఆ ఫిర్యాదును బలవంతంగా మూసివేసేలా కొందరు అధికారులు చూస్తున్నట్లు ప్రభుత్వం కూడా గుర్తించింది. అనంతపురం జిల్లాలోని ఎటిపి 20241026350 నెంబర్‌ ఫిర్యాదులో ఇలానే జరిగినట్లు ప్రభుత్వానికి నివేదిక అందింది. ఫిర్యాదుదారుడు ఆమోదం లేకుండానే మూసివేసిన ఫిర్యాదులను ఎన్‌టిఆర్‌, అన్నమయ్య జిల్లాల్లో గుర్తించారు.

ఐవిఆర్‌ఎస్‌లో 78 శాతం అసంతృప్తి..

పిజిఆర్‌ఎస్‌పై రాష్ట్ర ప్రభుత్వం 1100 ద్వారా ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించింది. పరిష్కారం పూర్తయినట్లు చెబుతున్న 33,538 మందిలో 15,953 మందికి ఫోన్‌ చేసి వారి అభిప్రాయాలు సేకరించింది. ఈ సేకరణలో కేవలం 3,515 మంది అంటే 22 శాతం మంది మాత్రమే ఫిర్యాదుల పరిష్కారం పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. మిగిలిన 78 శాతం ఫిర్యాదుల పరిష్కారం పట్ల అసంతృప్తిగా ఉన్నారని తెలుస్తోంది. వీటిలో సీఎం చంద్రబాబు నేరుగా స్వీకరించిన 6,542 ఫిర్యాదులు ఉన్నాయి.

ఆ ఫిర్యాదుదారుల నుంచి అభిప్రాయం సేకరించారు. వీరిలో కేవలం 1,293 మంది సంతృప్తి వ్యక్తం చేయగా, 80 శాతం మంది అసంతృప్తి వ్యక్తం చేశారు. జిల్లాల్లో స్వీకరించిన ఫిర్యాదుదారుల్లో 71 శాతం, సీఎం కార్యాలయం ద్వారా అందించిన ఫిర్యాదుదారుల్లో 81 శాతం మంది ఫిర్యాదులు పరిష్కారంలో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

ఉప ముఖ్యమంత్రి కార్యాలయంలో స్వీకరించిన ఫిర్యాదుదారుల్లో 81 శాతం మంది, జిల్లాల్లో స్వీకరించిన వారిల్లో 90 శాతం మంది అసంతృప్తిగా ఉన్నట్లు చెబుతున్నారు. మంత్రి నారా లోకేష్‌ ఫిర్యాదుదారుల్లో పరిష్కారం లభించక 81 శాతం మంది అసంతృప్తిగా ఉన్నారంటే పరిస్థితి అర్థం అవుతోంది.

ప్రభుత్వం నేరుగా ఐవిఆర్‌ఎస్‌లో ప్రజల నుంచి అభిప్రాయం సేకరిస్తుండటంతో అధికారులపై వత్తిడి పెరుగుతోంది. ముఖ్యంగా సీఎం పేషీ, డిప్యూటీ సీఎం పేషీ లకు చేరిన ఫిర్యాదులపై అధికారులు దృష్టి పెడుతున్నారు.

ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రక్షాళన అంటూ తీసుకొచ్చిన ‘పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెస్సల్ సిస్టమ్’ ఎంతో ఉపయోగంగా వున్నా, ఫిర్యాదుల పరిష్కారంలో అధికారులు ఇంకా ఎక్కువ చొరవ చూపాల్సివుంది. నేరుగా, మంత్రులు, అధికారులకే ఇచ్చిన ధరఖాస్తుల విషయంలో స్పందన కరువైతే, ఇక ఆన్లైన్, వాట్సప్ గవర్నెన్స్‌లో ప్రజల ఫిర్యాదులకు అధికారులు ఎంత వరకూ స్పందిస్తారన్నది ప్రశ్నగా మారింది.

ఏదైనా ఎంతో ఆశతో ప్రజలు పెట్టుకొనే ధరఖాస్తులు, ఫిర్యాదులపై అధికారులు మరింత దృష్టిపెట్టేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాల్సివుంది.

– కెఎస్

LEAVE A RESPONSE