Suryaa.co.in

Andhra Pradesh

క్విట్ జగన్… క్విట్ వైకాపా అనే శాంతియుత ఉద్యమాన్ని చేపడదాం

-అదే గాంధీజీకి మనం ఇచ్చే నిజమైన నివాళి
నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు

మహాత్మా గాంధీ చేపట్టిన క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో క్విట్ జగన్, క్విట్ వైకాపా అనే శాంతియుత ఉద్యమాన్ని చేపడుదామని , గాంధీజీకి మనం ఇచ్చే నిజమైన నివాళి అని నరసాపురం ఎంపీ, వైకాపా నాయకులు రఘురామ కృష్ణంరాజు అన్నారు. ఈ ప్రభుత్వాన్ని ఓటు అనే ఆయుధం ద్వారా అధికారంలో నుంచి దించడానికి, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, బిజెపి నేతృత్వంలోని కూటమికి ఓటు వేసి, ఇప్పుడు మనం మనసులో తీసుకున్న నిర్ణయాన్ని విజయవంతం చేయాల కోరారు.

రచ్చబండ కార్యక్రమంలో భాగంగా రఘురామకృష్ణం రాజు తన నివాసంలో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ… ఆంగ్లేయుల రాచరికపు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరూ మాట్లాడకూడదని ఉద్దేశంతో 1890 లో 124A సెడిషన్ చట్టాన్ని తీసుకువచ్చారు. ప్రభుత్వాన్ని కూలదోయాలని ప్రేరేపించేలా వ్యవహరించారనే ఉద్దేశంతో 1922 మార్చ్ లో మహాత్మా గాంధీ పై ఈ చట్టాన్ని ప్రయోగించి అరెస్టు చేసి, ఆరేళ్లపాటు జైలు శిక్ష విధించారు.

అయితే, జైలులో ఆయన శాంతియుత నిరసనలను చూసి భయపడి, రెండేళ్లకే విడుదల చేశారు. అత్యంత కిరాతకమైన బ్రిటిష్ రాచరికపు ప్రభుత్వమే సెడిషన్ చట్టం కింద అరెస్ట్ అయిన గాంధీజీని కొట్టేందుకు సాహసించలేదు. గాంధీజీ పై బ్రిటిష్ పాలకులు సెడిషన్ చట్టం 124A కింద కేసు నమోదు చేసిన 99 ఏళ్ల తర్వాత 100వ ఏటా, వైకాపా పాలకులు ఒక ప్రజా ప్రతినిధి నైనా నాపై ఈ చట్టాన్ని ప్రయోగించారు.

ఒక ప్రజా ప్రతినిధి పై ఈ చట్టాన్ని ప్రయోగించిన దరిద్రులు ప్రస్తుత పాలకులే. నిరంకుశ బ్రిటిష్ పాలకులు కూడా ఈ కేసులో అరెస్ట్ అయినా గాంధీజీని కొట్టేందుకు సాహసించకపోగా, ఈ దుర్మార్గ పాలకులు మాత్రం నన్ను లాకప్ లో చిత్రహింసలకు గురిచేసి, చంపాలని చూశారు. జైలులో కూడా చంపే ప్రయత్నాన్ని చేయగా ఒక మహానుభావుడి దయవల్ల బయటపడ్డాను. ఈ పనికిమాలిన పాలకుల కంటే బ్రిటిష్ పాలకులు ఎంతో నయం. అటువంటి బ్రిటిష్ వారిపై క్విట్ ఇండియా పేరిట ఉద్యమానికి మహాత్మా గాంధీ పిలుపును ఇచ్చారు.

ప్రజల మద్దతుతో స్వాతంత్రాన్ని సాధించారు. స్వాతంత్ర అనంతరం ఎన్నో ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. కేంద్రంలో ప్రస్తుతం అద్భుతమైన పరిపాలన అందిస్తున్న ప్రభుత్వం కొనసాగుతోంది . కానీ రాష్ట్రంలోనే ప్రతిపక్ష నేతల ఫోటోలను గుద్దించి, తన్నించే పాలకులు ఉండడమే దురదృష్టకరం. కన్న తల్లిని తోడబుట్టిన చెల్లిని నిర్దాక్షిణ్యంగా దుర్భాషలాడుతూ , సొంత వారిని బంధువుల చేత సంహరించే అభియోగాలను ఎదుర్కొంటున్న నేతలను ఎన్నుకోవడం మన దురదృష్టం.

ఈ పాలకులకు రానున్న ఎన్నికల్లో తగిన రీతిలో బుద్ధి చెప్పాలని రఘురామ కృష్ణంరాజు కోరారు. గాంధీజీ వర్ధంతి సందర్భంగా ఆయనకు ఘనంగా నివాళులు అర్పించిన ఆయన , ప్రస్తుత పాలకులు టోఫెల్ సబ్జెక్టులు తీసుకు వస్తున్న నేపథ్యంలో గాంధీజీ చరిత్ర నేటి తరానికి తెలుస్తుందో, లేదోననే ఆందోళన వ్యక్తం చేశారు.

గాంధీజీ ఆలస్యంగా చదువును ప్రారంభించారని, చదువులో జగన్మోహన్ రెడ్డి మాదిరిగా ఫస్ట్ క్లాస్ విద్యార్థి కాదని ఎద్దేవా చేశారు. దక్షిణాఫ్రికాలో జాతి వివక్షత పై గాంధీజీ తొలుత ఉద్యమించారని, ఆ తర్వాత స్వదేశానికి తిరిగి వచ్చి స్వాతంత్రం ఉద్యమానికి నాయకత్వం వహించారని రఘురామ కృష్ణంరాజు వెల్లడించారు.

మనసులో ఉద్దేశం ఒకటి… పైకి చెప్పేది మాత్రం మరొకటి
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటన వెనుక మనసులో ఉన్న ఉద్దేశం ఒకటైతే, పైకి చెప్పేది మాత్రం మరొకటని రఘురామ కృష్ణంరాజు అన్నారు. మంత్రివర్గ సమావేశం అనంతరం జగన్మోహన్ రెడ్డి కేంద్ర పెద్దలను కలుసుకోవాలని నిర్ణయించారు. అయితే ఇప్పటివరకు ఆయనకు కేంద్ర పెద్దల అపాయింట్మెంట్ లభయించలేదు. విభజన సమస్యల పరిష్కారానికి, ప్రత్యేక హోదా సాధనకు, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరించవద్దని కోరడానికి మాత్రమే ముఖ్యమంత్రి ఢిల్లీకి వెళ్తున్నారని సాక్షి మీడియాతో పాటు, దాని అనుబంధ నీలి చానల్స్ ప్రచారం చేస్తున్నాయి.

ఒకవేళ కేంద్ర పెద్దలు అపాయింట్మెంట్ ఇస్తే, జగన్మోహన్ రెడ్డి వారిని కలిసిన తర్వాత మీడియా కు కూడా ఇదే విషయాన్ని చెబుతారు. అయితే ఇప్పటివరకు నాకున్న సమాచారం మేరకు జగన్మోహన్ రెడ్డికి, కేంద్ర పెద్దలు అపాయింట్మెంట్ ఇవ్వలేదు … దొబ్బెయ్ అన్నట్లు తెలిసింది. అయితే గుర్రం ఎగరావచ్చు అన్నట్లుగా అపాయింట్మెంట్ దొరికినా దొరకవచ్చునేమో కానీ ఆయన కలుస్తున్న ప్రయత్నం నిజం కాదు. అది కలగానే మిగిలిపోతుంది.

ఎందుకంటే ఇప్పటికే పూర్తి రంగులన్నీ బయటపడ్డాయి. ఫిబ్రవరి 5వ తేదీన సుప్రీం కోర్టులో కడప ఎంపీ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ విచారణకు రానుంది. ఈ నేపథ్యంలోనే కేంద్ర పెద్దలను కలుసుకోవాలని జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నారు. ఆయన మనసులో ఉన్న ఉద్దేశం ఒకటి అయితే, పైకి మాత్రం మరొకటి చెబుతారని రఘురామ కృష్ణంరాజు ఎద్దేవా చేశారు.

అలాగే, పొత్తు పొడుపును ఎలాగైనా అడ్డుకోవాలనే ప్రయత్నాన్ని చేస్తున్నారు. కానీ పొత్తు పొడుపు అన్నది జరుగుతుందనేది నా ఆశ, కోరిక, ఆశయం కూడా అని రఘు రామకృష్ణంరాజు స్పష్టం చేశారు. కూటమితో బిజెపి పొత్తు కు వ్యతిరేకంగా సాక్షి దినపత్రికలో వార్త కథనాన్ని ప్రచురించడం పరిశీలిస్తే, పొత్తు కంపల్సరీ కుదురుతుందనేది నా నమ్మకం. దేశంలో సుస్థిరత ప్రభుత్వమే ఏర్పాటు లక్ష్యంగా భావ సారూప్యత కలిగిన పార్టీలతో కలిసి వెళ్లాలని నిర్ణయించిన బిజెపి నాయకత్వం, గతంలో తమను మోసగించిన నితీష్ కుమార్ తో మళ్ళీ దోస్తీ కట్టేది లేదని గతం లో తేల్చి చెప్పింది.

కానీ మళ్ళీ బీహార్లో నితీష్ కుమార్ ను ముఖ్యమంత్రి కుర్చీపై కూర్చోబెట్టింది. కర్ణాటక ఎన్నికల్లో ఒకరిని ఒకరు నిందించుకున్నప్పటికీ, కుమారస్వామిని ఎన్డీఏలోకి ఆహ్వానించారు. అద్భుత దేశాన్ని నిర్మించాలని, రాష్ట్రాలన్నీ సుభిక్షంగా ఉండాలంటూ కోరుకుంటున్న బిజెపి నాయకత్వం, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని దుర్భిక్షంలోకి నెట్టి వేయబడిన ఈ ప్రభుత్వాన్ని కచ్చితంగా అధికారంలో నుంచి దించి వేయాలని భావిస్తుంది.

ప్రజా సౌభాగ్యాన్ని కోరుకునే పార్టీ, అద్భుత విజయం సాధించబోయే కూటమితో జత కడుతుందనే నేను ఆశిస్తున్నాను. అయినా కూటమిలోని ఒక పార్టీ ఎన్డీఏలో భాగస్వామిగా ఉండడం గమన్హారం. భాగస్వామ్య పార్టీ నిర్ణయాన్ని గౌరవిస్తూ, గతంలో చంద్రబాబు నాయుడు చేపట్టిన అభివృద్ధిని కొనసాగించాలనే ఉద్దేశంతో పొత్తుకు సుముఖత వ్యక్తం చేస్తుందని భావిస్తున్నాను. ఈ చెలిమి కొనసాగాలన్నదే నా భావన అని రఘురామ కృష్ణంరాజు అన్నారు.

జగన్మోహన్ రెడ్డికి కేంద్ర ప్రభుత్వ పెద్దల అపాయింట్మెంట్ దొరకకపోతే నేను చెప్పిందే నిజమని అభిప్రాయం అందరిలోనూ వస్తుంది. అందరికీ తెలిసిన నిజాలను నోటిలోని నొక్కి పెట్టడం మంచిదని ఒక ప్రశ్నకు సమాధానంగా ఆయన వెల్లడించారు. సాక్షిలో సగం వాటా నాదే నని షర్మిల చేసిన వ్యాఖ్యలపై అందుకే సగం పేజీలను ఆమె వ్యక్తిత్వ హననానికి పాల్పడే వార్తలను ప్రచురిస్తున్నామని సాక్షి యాజమాన్యం చెప్పినట్లుగా ఈనాడు దినపత్రికలో వేసిన కార్టూన్, సాక్షి యాజమాన్య ఆలోచన ధోరణిని తెలియజేస్తోంది.

వైయస్ షర్మిల కు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో కామెంట్లు చేయడం, ఎక్స్ వేదికగా ట్వీట్లు చేయడం, మంత్రి రోజా ఏకంగా ప్యాక్ చేస్తామని హెచ్చరించిన విషయాన్ని ప్రస్తావించిన రఘురామకృష్ణంరాజు, షర్మిల భద్రత పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో అనంత బాబు అనే ఎమ్మెల్సీ తన వద్ద డ్రైవర్ గా పని చేస్తున్న దళితుడు అయిన సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసి ఇంటికి శవాన్ని పార్సిల్ చేశారని గుర్తు చేశారు. ఇక పులివెందులలో వైఎస్ వివేకానంద రెడ్డిని గొడ్డలితో హత్య చేసిన అనంతరం ఊరిలోని బ్యాండేజీ అంతా పోగు చేసి ప్యాక్ చేశారని పేర్కొన్నారు.

ప్యాకేజీ సర్వీసులో వైకాపా నాయకులు దిట్ట అని అన్నారు. వైకాపా ప్రభుత్వంలో మంత్రిగా కొనసాగుతున్న రోజా చేసిన హెచ్చరికలను షర్మిల తీవ్రంగా తీసుకోవాల్సిందేనని ఆయన సూచించారు. కేంద్ర ప్రభుత్వాన్ని తక్షణమే అదనపు రక్షణ కల్పించాలని ఆమె కోరాలి . జగన్మోహన్ రెడ్డి తన కుటుంబ సభ్యులకు 600 మందితో రక్షణ కల్పించే ఏర్పాట్లను చేసుకున్నారు.

తనతో పాటు తన భార్యకు, విదేశాలలో విద్యాభ్యాసం చేస్తున్న కూతుళ్లకు, తనకు దూరంగా ఉంటున్న తల్లికి ప్రజాధనంతో రక్షణ ఏర్పాట్లను చేసుకున్న ఆయన, చెల్లికి రక్షణను కల్పించకపోగా, బావకు ఉన్న రక్షణ సిబ్బందిని తొలగించారు. వైయస్ జగన్మోహన్ రెడ్డి కుటుంబ రక్షణ నిమిత్తం 200 నుంచి 300 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఖర్చు చేయడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.

లండన్ లో అక్కడి ప్రధాన మంత్రికి లేని సెక్యూరిటీని వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూతురుకు కల్పించడం విడ్డూరం. మరో రెండు నెలపాటు ప్రజలు ఈ ఖర్చును భరించక తప్పదు. అధికారంలో నుంచి దిగిపోయిన తర్వాత దోచుకున్న సొమ్ము లో నుంచి డబ్బులు ఖర్చు చేసి కూతుళ్లకు సెక్యూరిటీని జగన్మోహన్ రెడ్డి ఏర్పాటు చేయిస్తారా? అంటూ రఘురామకృష్ణంరాజు ప్రశ్నించారు. తనది కాకపోతే ఏమైనా చేయవచ్చుననే ధోరణితో వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.

నిజాయితీపరులైన పోలీసు అధికారులకు ప్రాధాన్యత లేని పోస్టులు… అడుగులకు మడుగులోత్తే వారికి మాత్రం కీలక పదవులు
రాష్ట్రంలో 30 మంది ఐపీఎస్ అధికారులను జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం బదిలీ చేసింది. నిజాయితీపరులైన పోలీసు అధికారులకు పెద్దగా ప్రాధాన్యత లేని పోస్టులలో నియమించగా, అడుగులకు మడుగులోత్తే వారికి మాత్రం కీలకమైన పదవులలో నియమించారని రఘురామ కృష్ణంరాజు వెల్లడించారు. ప్రధాన ప్రతిపక్ష నాయకుడు నారా చంద్రబాబు నాయుడు ని అక్రమ కేసులలో ఇరికించాలని చూసిన రఘురామిరెడ్డి అనే పోలీసు అధికారికి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ వంటి కీలకమైన పదవి కట్టబెట్టారు.

గతంలో సిఐడి, కౌంటర్ ఇంటెలిజెన్స్, డ్రగ్ అథారిటీ డైరెక్టర్ గా వ్యవహరించిన రఘురామిరెడ్డిని , డ్రగ్ అథారిటీ డైరెక్టర్ గా కొనసాగిస్తూనే విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ బాధ్యతలను అప్పగించడం ఆశ్చర్యాన్ని కలిగించింది. సాధారణంగా డైరెక్టర్ జనరల్ ( డి జీ )స్థాయి అధికారులకు మాత్రమే ఈ పదవి కట్టబెడతారు. రఘురామిరెడ్డి ప్రభుత్వ పెద్దలు చెప్పినట్లు చేసిన సేవలకు గాను ఇటీవల ఆయనకు తొందరగానే పదోన్నతి కల్పించారు.

రఘురామిరెడ్డికి పదోన్నతి కల్పించడం కోసం ఆయన బ్యాచ్ మేట్స్ కు కూడా పదోన్నతి కల్పించాల్సి వచ్చింది. రాజేంద్ర నాథ్ రెడ్డి డిజిపిగా పదోన్నతి చేపట్టకముందు, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ చీఫ్ గా బాధ్యతలను నిర్వహించారు. విజిలెన్స్ ఎండ్ ఎన్ఫోర్స్మెంట్ చీఫ్ గా రఘురామిరెడ్డి నియమించడం వెనక తమ మాట వినని అధికారులను రఘు అనగానే ఫసక్ అనిపిస్తాడని కాబోలు.

నెల్లూరు జిల్లా ఎస్పీగా పని చేసిన విజయ రావు అనే మరో అధికారిని కర్నూలు రేంజ్ డి ఐ జి గా నియమించారు. నెల్లూరు జిల్లా ఎస్పీగా ఆయన పని చేసిన సమయంలో దళితులు, మత్స్యకారులు అధికంగా ఆత్మహత్యలు చేసుకున్నట్లు తెలిసింది. వారు ఎందుకు అధికంగా ఆత్మహత్యలు చేసుకున్నారన్నది మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ని అడిగితే చెబుతారు. అలాగే కాకాని ఫైల్స్ కేసులో నేరం కుక్కలదనే తీర్పు చెప్పిన ఘనుడు విజయ రావు అని అన్నారు.

కర్నూలులో టిడిపి బలోపేతం కావడం, అనంతపురం జిల్లాలో క్లీన్ స్వీప్ చేస్తుందని భావించి అక్కడ విజయరావు లాంటి పోలీసు అధికారి అవసరమని, జగన్మోహన్ రెడ్డి పోస్టింగ్ ఇచ్చినట్లు స్పష్టమవుతుంది . విజయవాడ లా అండ్ ఆర్డర్ డిసిపి గా వ్యవహరించిన విశాల్ గున్నిని విశాఖపట్నం లా అండ్ ఆర్డర్ డీసీపీగా బదిలీ చేశారు.

విజయవాడలో సుదీర్ఘకాలంగా పనిచేసిన విశాల్ గున్ని ని ఎన్నికల నేపథ్యంలో బదిలీ చేశారు. లేకపోతే యధావిధిగా కొనసాగించి ఉండేవారు. అలాగే విశాఖపట్నంలో పని చేసిన తమ అనుకూలమైన అధికారులను విజయవాడకు బదిలీ చేశారు. ఈ ప్రభుత్వం వెదవ పనులు చేయమంటే చేయని అధికారులలో ఒకరైన కుమార్ విశ్వజిత్ ను విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ నుంచి తప్పించి రైల్వే కు బదిలి చేశారు.

అతుల్ సింగ్ కు కూడా ప్రాధాన్యత లేని పోస్టింగ్ ఇచ్చారు. అడిషనల్ డీజీ ర్యాంకు చెందిన రఘురామ కృష్ణంరాజుకు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ చీఫ్ గా జగన్మోహన్ రెడ్డి ఎందుకు నియమించారు… దానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి ఎందుకు రికమండ్ చేశారు. దాన్ని కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి ఎందుకు సపోర్ట్ చేశారు.. ఆ ప్రతిపాదనను ధనుంజయ రెడ్డి, ముఖ్యమంత్రి వద్దకు ఎందుకు చేర్చారు.

వీరందరికి చివరిలో ఒకే రకమైన పేర్లు వస్తున్నాయన్న రఘురామకృష్ణంరాజు, పకీరప్పను విశాఖపట్నం జాయింట్ కమిషనర్ గా నియమించడం పట్ల ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కర్నూలులో సిబిఐ అధికారులు అవినాష్ రెడ్డిని అరెస్టు చేయాలని రంగంలోకి దిగినప్పుడు, వారిని కదలనివ్వకుండా అవినాష్ రెడ్డికి రక్షణ కల్పించిన విశిష్ట పోలీసు అధికారి పకీరప్ప అని పేర్కొన్నారు.

అమిత్ వర్ధన్ అనే అధికారిని సిఐడిలో తప్పు చేయవద్దని చెప్పినందుకు అక్కడి నుంచి లేపి వేశారు. చిత్తూరు జిల్లా ఎస్పీగా పని చేసిన రిశాంత్ రెడ్డి ని ఒక్కరినే ఎందుకనో ప్రాధాన్యత లేని పోస్టులో నియమించారు. చిత్తూరు జిల్లా ఎస్పీగా మంత్రి పెద్దిరెడ్డి చెప్పినట్లు నడుచుకున్నట్లుగా రిశాంత్ రెడ్డికి రికార్డు ఉంది. అయినా ఎందుకిలా వ్యవహరించారన్నది ఆశ్చర్యకరమైన విషయమేనని రఘురామకృష్ణంరాజు అన్నారు.

నేను వైకాపాకు వెన్నుపోటు పొడిచానా?… మాటలు జాగ్రత్త
నేను వైకాపాకు వెన్నుపోటు పొడిచాననడం హాస్యాస్పదంగా ఉంది. నన్ను నాకేసి , నాకున్న పదవులను పీకేసి… ఆ పదవులను వేరే వారికి అప్పగించిన, వారు చివరకు పార్టీని వదిలిపోయారు. నేను మొదటి నుంచి ప్రజల పక్షం వహించాను. ప్రజలకు చేస్తున్న అన్యాయాన్ని గాంధేయ మార్గంలో ఢిల్లీలో కూర్చుని ప్రశ్నించాను.

ప్రజలకు నాలుగు మంచి మాటలు చెబితే తప్పుడు కేసులు బనాయించి అక్రమంగా అరెస్టు చేసి, లాకప్ లో చిత్రహింసలకు గురి చేశారు. అయినా నేను పార్టీకి వెన్నుపోటు పొడిచాననడం పరిశీలిస్తే,ఈ స్క్రిప్టు జూనియర్ సజ్జల రాసి ఇచ్చినట్లుగా ఉంది. అదేదో సాక్షి టీవీలో ప్రసారం చేసుకోక, టీవీ9 లో ప్రసారం చేయించడం ఎందుకు?!. నా శీలాన్ని శంకిస్తే,మీ శిలాలన్నింటినీ బయట పెడతానని రఘురామకృష్ణం రాజు హెచ్చరించారు.

వైకాపా నాయకత్వం వార్ రూమ్ ఒకటి ఏర్పాటు చేశారట. నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, అచ్చం నాయుడు, నందమూరి బాలకృష్ణ లు ఎట్టి పరిస్థితుల్లోనూ రానున్న ఎన్నికల్లో ఓడించాలనేది జగన్మోహన్ రెడ్డి పంతమట. దానికోసం నియోజకవర్గానికి 100 కోట్ల రూపాయలను ఖర్చు పెడతారట. ప్రజలు డబ్బులు తీసుకుని ఓట్లు వేసే పరిస్థితి లేదు. అయినా ప్రజల నుంచి దోచుకున్న డబ్బు, ప్రజలకే చేరుతోంది.

ఇక ఎంపీగా రఘురామకృష్ణం రాజు ఓడించాలని జగన్మోహన్ రెడ్డి కోరుకుంటున్నారట. నాపై పోటీకి ఎవరిని పెడతావో పెట్టుకో చూసుకుందామని ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డికి రఘురామకృష్ణం రాజు సవాల్ చేశారు.

నీవల్ల ఇబ్బందులు పడిన ప్రజలు, దారుణంగా మోసపోయిన మహిళలు, నాసిరకం మద్యం సేవించి ఇబ్బందులు పడ్డ పురుషులు, నిరుద్యోగులు, జీతాలు సకాలంలో అందక అష్ట కష్టాలు పడుతున్న ఉద్యోగులు అందరూ నిన్ను ఓడించడానికి, నన్ను గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారని రఘురామకృష్ణం రాజు అన్నారు. నాపై ఎవరిని పోటీకి దింపుతావో దించమని, చివరకు నువ్వు పోటీ చేసినా నాకు ఎటువంటి అభ్యంతరం లేదన్నారు.

LEAVE A RESPONSE