– సునీల్‌ను ఆయనపై స్థాయి అధికారే విచారించాలి
– ప్రకాశం ఎస్పీతో అది కుదిరేపనికాదు
– అందుకే సునీల్‌ను విచారణకు పిలవడం లేదా?
– రిటైర్డ్ సీనియర్ ఐపిఎస్‌ను విచారణాధికారిగా నియమించవచ్చు
– ఏబీని దర్యాప్తు అధికారిగా పెడితే సరి
– లేకపోతే ప్రకాష్‌సింగ్, విజయకుమార్ బెటర్
( భోగాది వేంకట రాయుడు)
డీజీపీ హోదాలో ఉన్న సునీల్ కుమార్ , యితరుల పై డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు గుంటూరు నగరంపాలెం పోలీసు స్టేషన్ లో పెట్టిన కేసు లో దర్యాప్తు ఒక లాజికల్ ముగింపుకు వచ్చే అవకాశం(ఇప్పట్లో) లేదు.
ఈ కేసు లో ఆయన ఫిర్యాదు చేసింది మామూలు మనుషుల మీద కాదు .
సునీల్ కుమార్ వంటి సీనియర్ మోస్ట్ డీజీపీ స్థాయి అధికారి మీద . పోలీసు శాఖలో అంతకంటే పెద్ద హోదా ఇక ఏమీ లేదు . ఆయనను విచారణకు ఎవరు పిలవాలి ?
మామూలు అదనపు ఎస్పీ గా రిటైర్ అయిన విజయపాల్ అనే ఆయనను విచారించడానికే నగరం పాలెం పోలీసులకు నాలుకలు పిడచ కట్టుకుపోయాయి . ఆపసోపాలు పడ్డారు .
ఇది గమనించిన ప్రభుత్వం/అప్పటి డీజీపీ – ఈ కేసు దర్యాప్తు ను ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్ కు అప్పగించించారు .
విజయపాల్ ను ఆయన విచారించడం , అరెస్టు చేయడం జరిగిపోయాయి . అలాగే , సునీల్ కుమార్ వీర సన్నిహితుడైన తులసిబాబు అనే అతనిని కూడా విచారణకు పిలవడం , చివరకు అరెస్టు చేసి జైల్ కు పంపించడం జరిగిపోయాయి .
మరి ,రఘురామ కృష్ణం రాజు రోజూ నెత్తి,నోరు కొట్టుకుంటున్న డీజీపీ క్యాడర్ పోలీసు అధికారి సునీల్ కుమార్ ని ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్ విచారణకు ఎందుకు పిలవడం లేదు ? ప్రభుత్వం సునీల్ ను ఎందుకు సస్పెండ్ చేయడం లేదు ?
ఎందుకంటే….; ఆయన అనుమానితుడే గానీ , నిందితుడు కాదు . ఈ కేసు దర్యాప్తు అధికారి అయిన ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్ ఆయనను విచారించి ….నిందితుడు అవునా ,కాదా అని తేల్చలేదు .
ఎందుకు తేల్చలేదు ?
ప్రకాశం ఎస్పీ కంటే, సునీల్ కుమార్ కు ఏకం గా నాలుగు ర్యాంకులు ఎక్కువ.
ఎస్పీ, డీ ఐ జీ, ఐ.జీ, అడిషనల్ డీజీపీ…. ఇన్ని ర్యాంకులు దాటితే గానీ, దామోదర్ కు డీజీపీ స్థాయి రాదు .
అందువల్ల , ఆయన …సునీల్ కుమార్ ను విచారించలేరు .
ప్రకాశం ఎస్పీ అనే కాదు . ఈ రాష్ట్రం లో ఎవరూ సునీల్ కుమార్ ను విచారించలేరు . డీజీపీ స్థాయిని మించిన స్థాయి కలిగిన పోలీసు అధికారి రాష్ట్రం లో ఉండరు కదా !
ఆయనను, రఘురామ కృష్ణంరాజు కేసులో నిందితుడిగా విచారించాలంటే ; ఐపీఎస్ లో సునీల్ కుమార్ కంటే సీనియర్ బ్యాచ్ లకు చెందిన అధికారిని ( రిటైర్ అయినా సరే) దర్యాప్తు అధికారిగా నియమిస్తూ ప్రభుత్వం ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేస్తే …పని ఏమైనా జరగవచ్చు .
ఉత్తరప్రదేశ్ క్యాడర్ కు చెందిన 1959 బ్యాచ్ ఐ పీఎస్ అధికారి ప్రకాష్ సింగ్, లేదంటే …1975 బ్యాచ్ కి చెందిన తమిళనాడు క్యాడర్ ఐ పీ ఎస్ ఐన విజయకుమార్ వంటి వారికి( స్మగ్లర్ వీరప్పన్ ను పట్టుకున్నది విజయకుమారే )కేసు దర్యాప్తు అప్పగిస్తే , రఘురామ కృష్ణంరాజు కోరిక నెరవేరుతుంది .
అంత దూరం ఎందుకులే అనుకుంటే , మనకళ్ల ముందే ఉన్న ఏ బీ వేంకటేశ్వర రావు కూడా సునీల్ కుమార్ కంటే నాలుగు బ్యాచ్ లు సీనియర్ . మొన్నీమధ్యే రిటైర్ అయ్యారు .
ఆ కేసు పూర్వాపరాలు ఆయనకు తెలియనివి కావు (తోటి తెలుగు వాడి గా ).
సునీల్ కుమార్ కు కూడా సర్వీస్ కాలం ఎక్కువ ఏమీ లేదు . మరో ఏడెనిమిది నెలలు .
ఆ తరువాత ఆయన కులసంఘం నేతగానో , మతసంఘం నేతగానో మారిపోయేంతమంది అభిమానులు ఆయనకు ఉన్నారు. వారు ఊరికే ఉండరు కదా ! అప్పుడూ ఆయనను విచారించడం పోలీసులకు కుదరదు .
ఈ కేసు లో రఘురామ కృష్ణంరాజు పేర్కొన్న వారినందరినీ పోలీసులు ప్రశ్నిస్తే; దర్యాప్తు ఎక్కడికి వెళ్లి ఆగుతుందో రాజకీయాల్లో ఉన్న వారందరికీ తెలుసు .
కనుక , ఎవరి కోరిక/ అభిమతం / ఆదేశం మేరకు ప్రస్తుత డిప్యూటీ స్పీకర్ ను అప్పటి సీఐడీ పోలీసులు పిచ్చకొట్టుడు కొట్టి , చంపేయాలని చూశారో అనే విషయం ఎప్పటికీ తేలక పోవచ్చు . కనీసం ఇప్పటి కూటమి నేతృత్వం లోని ప్రభుత్వ హయాం లో తేలదు .
అయితే, సునీల్ కుమార్ ను కనీసం సస్పెండ్ చేసేవరకు పట్టువదలని రఘురామ కృష్ణంరాజు ఈ టాపిక్ ను వదిలిపెట్టరు. ఆయన కోరిక/ అభిమతం / డిమాండ్ నెరవేరాలని ఆశిద్దాం .