-రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిన టిఆర్ఎస్ ప్రభుత్వం
-రైతుల భూములతో రియల్ వ్యాపారం తగదు
-కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రెండు లక్షల రుణమాఫీ
-అమ్మహస్తం లాంటి పథకాలకు శ్రీకారం చుడతాం
-నేదునూరు రచ్చబండ కార్యక్రమంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క
కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే రాష్ట్రంలో రైతు రాజ్యం వస్తుందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడానికి కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ ఇచ్చిన రాష్ట్రాన్ని టిఆర్ఎస్ ప్రభుత్వం అప్పుల కుప్పగా మార్చిందని దుయ్యబట్టారు. 2023 లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే రైతులకు ఒకేసారి రెండు లక్షల రుణాన్ని మాఫీ చేస్తామని వెల్లడించారు. శనివారం రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం కందుకూరు మండలం నేదునూరు గ్రామం లో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన రచ్చబండ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సీఎల్పీ నేత భట్టి విక్రమార్క హాజరయ్యారు. ఈ సందర్భంగా రైతులు, ప్రజలతో వరంగల్ లో కాంగ్రెస్ పార్టీ చేసిన డిక్లరేషన్ అంశాలను ముఖాముఖిగా చర్చించారు. అనంతరం కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు లక్ష వరకు వడ్డీలేని రుణం 3 లక్షల వరకు పావలా వడ్డీ రుణాలు ఇచ్చి రైతులను ప్రోత్సహించింది అన్నారు. టిఆర్ఎస్ ప్రభుత్వం లక్ష రుణమాఫీ చేస్తామని ప్రకటించి రైతులను మోసం చేయడం వల్ల లక్ష అప్పు కు బ్యాంకుల్లో ఎనిమిది సంవత్సరాలుగా 5లక్షల అప్పు పెరిగి రైతులకు భారంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు.
తెలంగాణ రాష్ట్ర సంపద ప్రజలందరికీ పంచబడాలని సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చిందన్నారు. కొండ నాలుకకు మందు వేస్తే ఉన్న నాలిక ఊడినట్లుగా ధనిక రాష్ట్రంలో ప్రజలకు సంపద దూరమైందని, పెరిగిన సంపద ఎటు పోతుందని అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో పేదలకు అమ్మహస్తం పథకం ద్వారా తొమ్మిది నిత్యావసర సరుకులను రేషన్ దుకాణాల ద్వారా పంపిణీ చేశామన్నారు. కానీ సంపద పెరిగిన ధనిక రాష్ట్రంలో 9 సరుకులకు 18 సరుకులను పెంచి ఇవ్వాల్సిన ప్రభుత్వం కేవలం బియ్యం మాత్రమే ఇస్తూ బంగారు తెలంగాణ చేశామని గొప్పలు చెప్పుకోవడం సిగ్గుచేటు గా ఉందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కచ్చితంగా అమ్మహస్తం పథకాన్ని తీసుకు వస్తామని వెల్లడించారు. దళితులకు 3 ఎకరాల భూమిని పంపిణీ చేస్తామని ప్రగల్బాలు పలికిన టిఆర్ఎస్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం పంపిణీ చేసిన అసైన్మెంట్ భూములను రియల్ వ్యాపారం చేయడానికి రైతుల నుంచి బలవంతంగా టిఆర్ఎస్ ప్రభుత్వం గుంజుకోవడం సిగ్గుగా ఉంది అన్నారు.
8 సంవత్సరాలుగా ఉద్యోగాలకు నోటిఫికేషన్ వేయకుండా టిఆర్ఎస్ ప్రభుత్వం యువతను మోసం చేసిందని విమర్శించారు. టిఆర్ఎస్ ప్రభుత్వం రైతు బంధు ఇస్తున్నామని గొప్పలు చెప్పుకుంటూ కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులకు ఇచ్చిన అన్ని రాయితీలు ప్రోత్సాహకాలను బందు చేసిందని దుయ్యబట్టారు. ఎకరానికి 5వేల పెట్టుబడి ఇచ్చి సబ్సిడీ విత్తనాలు, ట్రాక్టర్లు, వ్యవసాయ యంత్ర పరికరాలు, వడ్డీ లేని రుణాలు, డ్రిప్పు, స్ప్రింక్లర్లు, పందిరి సాగు కు ఇచ్చే ప్రోత్సాహకాలను బందు చేసిన మాట వాస్తవం కాదా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రైతులు పండించిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేయని అసమర్థ ప్రభుత్వం వల్ల మద్దతు ధర రాక, పండించిన ధాన్యం అమ్ముడు పోకపోవడంతో దిగులు చెంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్న దుస్థితి కి ఈ ప్రభుత్వం కారణం కాదా అని ధ్వజమెత్తారు. వచ్చే 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కచ్చితంగా అధికారంలోకి వస్తుందని, వచ్చిన వెంటనే రైతులకు ఏకకాలంలో రెండు లక్షలు రుణాన్ని మాఫీ చేస్తామని వెల్లడించారు భూమిలేని పేద కుటుంబాలకు ఏడాదికి పన్నెండు వేలు వారి ఖాతాలో జమ చేస్తామని ప్రకటించారు పేదలకు ఉపయోగపడేటువంటి అమ్మ హస్తం, ఇందిరమ్మ ఇళ్లు, తదితర ప్రజా సంక్షేమ పథకాలను తీసుకువచ్చి తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చుతామని అన్నారు.
రచ్చబండలో సమస్యలు ఏకరువు
రచ్చబండ కార్యక్రమంలో గ్రామస్తులు తమ సమస్యలను సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ముందు ఏకరువు పెట్టారు. ధరణి వెబ్సైట్ వల్ల తీవ్రంగా నష్టపోయామని పది మంది రైతులు వారు పడుతున్న ఇబ్బందులను వివరించారు గత ఆరేళ్లుగా 65 సంవత్సరాలు నిండిన వారికి కూడా కొత్త పింఛన్లు రావడం లేదని, కొత్త రేషన్ కార్డు అందలేదని గ్రామస్తులు వెల్లడించారు. గ్రామంలో ఎకరా భూమి 9లక్షలు నుంచి ఇరవై రెండు లక్షలకు ప్రభుత్వ భూముల ధర పెంచినప్పటికీ గ్రామపంచాయతీ కి మాత్రం వీటి వల్ల ఆదాయం ఏమి రావటం లేదని పాలకవర్గ సభ్యులు వాపోయారు. కన్జర్వేషన్ జోన్ లో ఉన్న నేదునూరు గ్రామాన్ని రెసిడెన్షియల్ జోన్ గా మార్చడానికి సహకరించాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్, రంగారెడ్డి జిల్లా పార్టీ అధ్యక్షుడు చల్లా నరసింహారెడ్డి, మహేశ్వరం నియోజకవర్గం నాయకులు దీప భాస్కర్ రెడ్డి, పీసీసీ కార్యదర్శి శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.