Home » సినిమాను చాకి‘రేవ్’పెడుతున్న పార్టీలు!

సినిమాను చాకి‘రేవ్’పెడుతున్న పార్టీలు!

-రేవ్ పార్టీ ఫీజు 50 లక్షలా?
-మత్తుకు సినిమా చిత్తయిందా?
-డ్రగ్స్‌తో అగ్ర నటులకూ లింకులు
-ఖాకీ విచారణ కంటితుడుపేనా?
-స్టార్లతో ఖాకీలు కుమ్మక్కువుతున్నారా?
-నాటి డ్రగ్స్ కేసు అటకెక్కిందా?
-ఆ కేసులో రాజకీయ పార్టీ నేతల హస్తం?
-రేవంత్ ప్రభుత్వం చర్యలు తీసుకోదా?
( అన్వేష్)

సినిమా.. అదో గమ్మతు లోకమే కాదు.. గ‘మత్తు’ లోకం కూడా! హీరోలు, హీరోయిన్లు తేడా ఏమీలేదు. అంతా మత్తుకు దాసాహమే. ఒకప్పుడు కేవలం అందం కోసమని మొదలైన డ్రగ్స్.. ఇప్పుడు మొత్తం సినిమా ఇండస్ట్రీని కమ్మేసింది. స్టార్‌డమ్ కోల్పోయిన బాధలో కొందరు.. ఎంజాయ్ కోసం మరికొందరు డ్రగ్స్‌కు మిత్రులయిపోయారు.

ఇప్పుడు కొత్తగా వచ్చిన కల్చర్… రేవ్ పార్టీ. ఆడా-మగా కలిసి మత్తులో తూగి, ఎవరి ఇష్టం వచ్చిన వారితో ఆనందం అనుభవించే ఈ రేవ్ పార్టీలకు, ఊరి చివరలో ఉండే ఫాంహౌసులే అడ్డాలు. అక్కడికి బలిసిన వారే కాదు. సినిమా తారలూ వస్తున్నారు. కాకపోతే ఈ సినిమా తారలకు, భారీ మొత్తంలో ఫీజులు సమర్పించుకుంటారు. తెలుగు మహానటి హేమ తాజాగా బెంగళూరు శివార్లలో జరిగిన రేవ్‌పార్టీలో అడ్డంగా చిక్కి, రేవ్‌పార్టీలతో సినిమా లింకును బట్టబయలు చేసింది. అసలు తాను రేవ్‌పార్టీకే వెళ్లలేదని వీడియో తీసి బొంకిన హేమ, మహానటి పాత్రను పోలీసుకమిషనర్ ఫొటోతో సహా బయటపెట్టారు.

ఈ రేవ్ పార్టీ నిర్వహకులు చిన్నా చితకా వారేమీ కాదు. సమాజంలో బోలెడంత పలుకుబడి ఉన్న పెద్ద తలలు. మరి ఈ రేవ్ పార్టీలు, డ్రగ్స్ వాడకాలూ పోలీసులకు తెలియనుకుంటే అంతకంటే అమాయకత్వం మరొకటుండదు. హైదరాబాద్‌లో డ్రగ్స్ కేవలం రేవ్‌పార్టీల్లోనే వాడతారనుకుంటే తప్పులో కాలేసినట్లే. పెద్ద పెద్ద పబ్బుల్లోనూ విరివిగా దొరుకుతాయి. కానీ దొరికినోడే దొంగ. దొరకనోడు దొరే! ఎందుకుంటే పోలీసులకు ఇవన్నీ ‘మామూలే’కాబట్టి.

పబ్, ఫాంహౌస్‌లలో జరిగే రేవ్ పార్టీల్లో సినిమా నటులతోపాటు డ్రగ్స్ దొరకడం.. వారిలో పోలీసులు కొందరి అరెస్టును మాత్రమే చూపించడం, మిగిలిన వారిని వదిలేయటం ‘మామూలే’. కేసీఆర్ హయాంలో రాడిసన్‌లో డ్రగ్స్‌తో సహా దొరికిన కేసును నీరుగార్చడంలో, అప్పటి పాలకులు విజయం సాధించారు. పెద్ద హీరో, హీరోయిన్లను విచారణకు పిలిచి హడావిడి చేసిన పోలీసులు, మళ్లీ ఆ కేసు జోలికి ఎందుకు వెళ్లడం లేదన్న ప్రశ్నకు జవాబు సులభం! దానిపై అప్పట్లో సంచలన ఆరోపణలు చేసిన రేవంత్‌రెడ్డి ఇప్పుడు తెలంగాణ సీఎం. అయినా ఆ కేసులో కదలిక లేదు. ఆ కేసు కూడా గుప్పెడు మత్తుబిళ్లలు వేసుకున్నంత సుఖనిద్ర పోవడమే ఆశ్చర్యం.

అసలు హైదరాబాద్‌లో ప్రతిసారీ కెన్యా, ఉగాండా , నైజీరియన్లు డ్రగ్స్‌లో ఎందుకు అరెస్టవుతున్నారు? వారి నుంచి డెలివరీ తీసుకున్న వారిని ఎందుకు అరెస్టు చేయడం లేదు? ఇప్పటిదాక ఒక్క సినీ ప్రముఖుడినైనా డ్రగ్స్ కేసులో అరెస్టు చేసి జైలుకు పంపించారా? అగ్ర హీరోల తనయులలో చాలామంది డ్రగ్స్ వాడుతున్నారని తెలిసినా, ఖాకీలు వారిని ఎందుకు పట్టుకోవడం లేదు? అసలు డ్రగ్స్ దొరికే పబ్బులు ఏమిటి? రేవ్‌పార్టీలు జరిగే ఫాంహౌసులు ఏమిటన్నది పోలీసులకు తెలియదా?.. ఇవీ పౌరసమాజం పోలీసులపై సంధిస్తున్న ప్రశ్నలు.

ఉడ్తా ‘టాలీవుడ్’

ఇటీవలె టాలీవుడ్‌లో డ్రగ్స్‌ కలకలం రేపుతున్న విషయం తెలిసిందే. రీసెంట్‌గా జరిగిన బెంగళూరు రేవ్ పార్టీలో పాల్గొన్నవారిలో టాలీవుడ్ కి చెందినవారు అనేకమంది ఉన్నట్లు సమాచారం. టాలీవుడ్‌ క్యారెక్టర్ ఆర్టిస్ట్ హేమ పేరు, ఫోటోలను పోలీసులు విడుదల చేశారు. అయితే తాను ఆ రేవ్ పార్టీకి వెళ్లలేదని ..హైదరాబాద్ లోనే ఉన్నానంటూ బుకాయించి మరీ వీడియో రిలీజ్ చేసింది మహానటి హేమ.

ఆరోజు బర్త్ డే పార్టీ పేరుతో ఏర్పాటు చేసిన రేవ్ పార్టీలో పాల్గొన్న వారందరికి డ్రగ్స్ టెస్ట్ చేశారు పోలీసులు. ఇందులో భాగంగానే డ్రగ్స్ టెస్ట్‌లో తెలుగు సినీ నటి హేమకు పాజిటివ్ వచ్చినట్లుగా అధికారులు బయటపెట్టారు. ఇప్పుడు ఈవార్త ఇండస్ట్రీలో దుమారం రేపుతోంది. యాక్టర్ హేమ రక్త నమూనాల్లో డ్రగ్స్ ఉన్నట్టు గుర్తించారు బెంగుళూరు పోలీసులు. మొత్తం 150 మంది రక్తనమూనాలను సేకరించిన పోలీసులు, డ్రగ్స్ టెస్ట్‌లో 84 మందికి పైగా వ్యక్తులకు పాజిటీవ్‌ నిర్ధారణమైంది. అయితే ఆరోజు పార్టీకి వెళ్లిన వారిలో 57 మంది పురుషులు, 27 మంది మహిళలు ఉన్నారు. డ్రగ్ టెస్ట్‌లో పాజిటివ్ వచ్చిన వాళ్లలో మిగతా ప్రముఖుల పేర్లు బయటకు రావాల్సి ఉంది.

గుర్తుందా .. ప్రపంచం మొత్తంగా ఉన్న డ్రగ్స్ సమస్యను అభిషేక్ చౌబే తెరకెక్కించిన విధానం చరిత్రను షేక్ చేసింది. నటీనటులతోనూ, టెక్నీషియన్ల తోనూ దర్శకుడు నిరంతరం ప్రతీసీన్ నీ ఒక యుద్దం లా అనుకుని పని చేసి.. సాహసం చేసాడు అభిషేక్ చౌబే. పాక్ తరహా ముస్లిం దేశాలనుంచి వచ్చే డ్రగ్స్ మాఫియా మొదటి టార్గెట్ అయిన పంజాబ్ లోని చీకటి కోణాల మీద సెర్చ్ లైట్ వేసాడు.

అనుకున్నట్టే సినిమా చుట్టూ ఎన్నో వివాదాలు… చిట్ట చివరికి థియేటర్ లోకి వచ్చింది “ఉడ్తా పంజాబ్”. “ఉడ్తా పంజాబ్” నిజానికి ఒకరికీ ఒకరికీ ఏ సంబందమూ లేదు. ఎవరికి వారుగా ఉన్న వీళ్ళ జీవితాలలో చోటు చేసుకున్న సంఘటనలే ఈ సినిమా. పంజాబ్ యూత్ యూత్ ఐకాన్ గా పేరుతెచ్చుకున్న పాప్ సింగర్ టామీ(షాహిద్ కపూర్) డ్రగ్స్ కి బానిస అయిపోతాడు. చివరికి ఆ మత్తులో ఉంటే తప్ప పాట పాడ లేని స్థికి చేరుకుంటాడు.

ఒకప్పుడు హాకీ ప్లేయర్ అయిన పింకీ (ఆలియా భట్), అనుకోని పరిస్థితుల్లో బీహార్ నుంచి పంజాబ్ కు కూలీగా వలసవెళ్లి మాదకద్రవ్యాల వలలో పడిపోతుంది. డ్రగ్స్ మాఫియా నుంచి లంచాలు తీసుకునే పోలీస్ ఆఫీసర్ సర్తాజ్(దిల్జిత్).. చివరికి ఆ డ్రగ్స్ వల్లే తన సోదరుణ్ణి కోల్పోతాడు. డాక్టర్ ప్రీత్ (కరీనా కపూర్) డ్రగ్స్ బారినపడి సర్వం కోల్పోయి రిహ్యాబిలిటేషన్ సెంటర్ లో చేరిన వారికి సపర్యలు చేస్తూ, మాదకద్రవ్యాల సరఫరాపై తనదైన శైలిలో పోరాడుతుంది. వీరి జీవితాల్లోని ప్రతి అంకం డ్రగ్స్ తో ముడిపడి ఉన్నదే.

డ్రగ్స్ మత్తులో చిక్కుకున్న టామీ సింగ్, అదే మాదకద్రవ్యాల కారణం గా చిక్కుల్లో పడ్డ పింకీ తమ ని తాము ఉన్న పరిస్తితుల్లోంచి బయట పడేసుకుంటారా? సర్తాజ్ లాంటి అవినీతి పోలీస్ ఆఫీసర్ తన లాంటి వారితో ఈ దేశం ఎంత నష్ట పోయిందీ అనేది స్పష్టంగా.. సుష్పటంగా చూపించారు. ఇది అభిషేక్ చౌబే తీసిన సినిమా.. కానీ, ఇప్పుడు తెలంగాణను ఉడ్తా తెలంగాణగా మార్చేసింది. కాదు.. కాదు.. చిత్రసీమను మత్తు ముంచేసింది. డ్రగ్స్ పార్టీ.. అని ఎక్కడ వినిపించినా ముందు ఉండేది టాలీవుడ్ ప్రముఖులే. ఒకదశలో విచారణను ఎదుర్కొన్నారు. తాజాగా బెంగళూరు రేవ్ పార్టీలోనూ ప్రముఖుంగా చిక్కింది మళ్లీ తెలుగు ఇండస్ట్రీ వాళ్లే.

కవలల్లా మారాయి

సినిమా పరిశ్రమ- డ్రగ్స్ సయామీ కవలల్లా మారిపోయినట్లుగా తెరకెక్కింది. 2017లో టాలీవుడ్ డ్రగ్స్ దందా గురించి మరువక ముందే మరోసారి నిర్మాత కేపీ చౌదరి అరెస్టు… ఆ తర్వాత మరో నిర్మాత, మరో నటుడు.. ఓ నటుడి ప్రియురాలు.. ఇప్పుడు టాలీవుడ్ప్రముఖులు.. పదేపదే డ్రగ్స్ వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు. ఒక విధంగా డ్రగ్స్టాలీవుడ్ ను ఊపేస్తోంది. డ్రగ్స్కోసం మనోళ్లు ఎక్కడైనా విమానాలు ఎక్కి పరుగు తీసుతున్నారు.

ఏడేళ్లుగా తెలుగు, తమిళ సినీ పరిశ్రమల్లోని పలువురితో డ్రగ్స్ ఫ్లెడ్లర్ కేపీకి దగ్గర సంబంధాలున్నాయి. గోవా, హైదరాబాద్‌ శివారు ఫామ్‌హౌస్‌ల్లో కేపీ ఏర్పాటు చేసిన ప్రయివేటు పార్టీలకు పలువురు నటులు హాజరైనట్టుగా ఫొటోలు సైతం బయటకు వచ్చాయి. కేపీ చౌదరి ఫోన్లలో సినీ రంగానికి చెందిన ఇద్దరు హీరోయిన్లు, నలుగురు నటీమణులు, ప్రముఖ దర్శకుడి ఫోన్‌ నంబర్లు, ఫొటోలను పోలీసులు గుర్తించినట్టు సమాచారం. దీంతో టాలీవుడ్ లో ఆందోళన చెందింది.

క్లీన్చీట్ ఇచ్చినా.. వీడని అనుమానాలు

టాలీవుడ్ లో డ్రగ్స్ వ్యవహారం ఎప్పటికీ కలకలం సృష్టిస్తుంది. గతంలో 12 మంది నటీనటులను అంటిపెట్టుకున్న డ్రగ్స్ కేసు.. ఎట్టకేలకు సిట్ క్లీన్ చీట్ ఇచ్చారు. వీరిలో రవితేజ, పూరీ జగన్నాథ్, ఛార్మి, ముమైత్ ఖాన్, తరుణ్, నవదీప్, తనీష్, సుబ్బరాజు సహా 11 మంది ఉన్నారు. వారందరికీ ఈడీ అధికారులు కూడా నోటీసులు పంపారు.

నోటీసులు అందుకున్నవారిలో రానా, రకుల్ ప్రీత్ సింగ్ కూడా ఉండటంతో టాలీవుడ్ వణికిపోయింది. రవితేజ, పూరి జగన్నాథ్‌, తరుణ్, నవదీప్, చిన్నా, ఛార్మి కౌర్, శ్యామ్ కె నాయుడు, తనీష్‌, నందు, సుబ్బరాజు, ముమైత్ ఖాన్ లాంటి ప్రముఖులతో పాటు రవితేజ డ్రైవర్ శ్రీనివాస్‌ను సైతం స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం(సిట్) విచారించింది. ఈ కేసు విచారణ కోసం అప్పట్లో తెలుగు బిగ్ బాస్ షోలో పాల్గొన్న ముమైత్ ఖాన్‌ను షో నుంచి బయటకు రప్పించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత మెల్లిగా ఈ డ్రగ్ కేసు టాలీవుడ్లో కనుమరుగైంది.

ఎంతో మంది సినీ ప్రముఖులను విచారించిన పోలీసులు, చివరకు ఏం తేల్చారనేది ఎవరికీ తెలియకుండా పోయింది. ప్రజలు కూడా ఆ కేసు గురించి మరిచిపోయారు. కానీ, ఎక్కడైనా టాలీవుడ్ వాళ్లు డ్రగ్స్ పార్టీలో దొరకగానే.. టాలీవుడ్ డ్రగ్ కేసు వివరాలను బయటకు తీస్తున్నారు. అప్పుడు ఈ 12 కేసుల్లో 62 మంది విచారణ టాలీవుడ్ డ్రగ్స్‌ కేసులో మొత్తం 4 చార్జిషీట్లు ఫైల్ చేశారు. తెలుగు సినిమా పరిశ్రమకు సంబంధించిన యాక్టర్లు, డైరెక్టర్లు, ఇతరుతో కలిపి మొత్తం 62 మందిని ఈ కేసులో విచారించారట. వీళ్లలో 12 మంది సినీ పరిశ్రమకు చెందిన వారు, 50 మంది ప్రముఖుల పిల్లలు, కార్పొరేట్ స్కూల్స్‌ విద్యార్థులు ఉన్నట్లు వెల్లడైంది.

ఈ కేసులో విచారణ ఎదుర్కొన్న సినీ ప్రముఖులతో పాటు అందరికీ క్లీన్ చిట్ ఇచ్చినట్లు అధికారులు వెల్లడించారు. డ్రగ్స్ వ్యవహారంలో సినీ ప్రముఖులకు కానీ, ఇతరులకు కానీ ప్రమేయం ఉన్నట్లు ఎలాంటి ఆధారాలు లభించక పోవడంతో అందరినకీ క్లీన్ చిట్ ఇస్తూ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడైంది.

నిజానికి, ఒకప్పుడు బాలీవుడ్‌కు మాత్రమే పరిమితమైన డ్రగ్స్ మాఫియా.. తెలుగుతో పాటు తమిళ, కన్నడ ఇండస్ట్రీకి కూడా పాకింది. ఈ నేపథ్యంలో టాలీవుడ్‌‌లో కొంత మంది నటీనటులు కొంత మంది విదేశీయలు నుంచి డ్రగ్స్ కొనుగోలు చేసినట్టు ఆరోపణలు వచ్చాయి. హైదరాబాద్ మాదక ద్రవ్యాల నిరోధక విభాగం టాలీవుడ్‌కు చెందిన కొంత మంది సినీ ప్రముఖులను నార్కోటిక్స్ విభాగం వారి ఆఫీసుకు పిలిచి విచారించడం, కేసులు నమోదు చేయడం హలచల్గా మారిన విషయం తెలిసిందే.

ఒకప్పుడు ఈ డ్రగ్స్ కేసు టాలీవుడ్‌లో పెద్ద ప్రకంపనలే పుట్టించింది. ఈ కేసులో హీరో రవితేజ కారు డ్రైవరుతో పాటు దర్శకుడు పూరీ జగన్నాథ్, ఛార్మి కౌర్, ముమైత్ ఖాన్, తరుణ్, నవదీప్ సహా పలువురును విచారించారు. మొత్తంగా టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఎక్సైజ్ పోలీసులు మొత్తంగా 12 కేసులు నమోదు చేసి 30 మందికి పైగా అరెస్ట్ చేసారు. అంతేకాదు 27 మందిని విచారించారు. 12 కేసుల్లో ముందుగా 8 కేసుల్లో మాత్రమే పోలీస్ అధికారులు ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు.

ఈ కేసు బయటకు రావడానికి కారణం కూడా డ్రగ్స్ వినియోగదారులే. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణంతో బాలీవుడ్ లో ప్రకంపనలు లేశాయి. ఈ కేసు విచారణ డ్రగ్స్ వ్యవహారం బయటకు వచ్చింది. ఇందులో టాలీవుడ్ తోపాటు శాండిల్ వుడ్ కి చెందిన ప్రముఖుల పేర్లు బయటకు వచ్చాయి. దీంతో ఈ కేసును ఈడీ అధికారులు టేకప్ చేశారు. శాండిల్ వుడ్ నటీమణులు సంజన, రాగిణి డ్రగ్స్ తీసుకున్నట్లు నిర్దారించారు.

దీంతో బాలీవుడ్ లో తీగ లాగితే శాండిల్ వుడ్, టాలీవుడ్ డొంక కదిలింది. ఇక సుశాంత్ కేసు విచారణ సమయంలో కొందరు టాలీవుడ్ ప్రముఖుల పేర్లు, ప్రముఖ నటుల భార్యల పేర్లు కూడా తెరపైకి వచ్చాయి. ప్రముఖల పేర్లు బయటకు రావడంతో అభిమానుల్లో అలజడి నెలకొంది. ఇక ఆ తర్వాత స్తబ్దుగా ఉన్న ఈ వ్యవహారం తిరిగి ఇప్పుడు తెరపైకి వచ్చింది. తాజాగా బెంగళూరులో నిర్వహించిన రేవ్ పార్టీలో మళ్లీ సినీ ప్రముఖులు తెరపైకి వచ్చారు.

మానడం లేదా..?

సినీ పరిశ్రమల్లో మాదక ద్రవ్యాల వినియోగం చాలా మామూలు అయిపోయింది ఇప్పుడు. అది తప్పు, ఇల్లీగల్ అని తెలిసినా కూడా ఎలాగో ఒకలా వాటిని వాడడం, విక్రయాలు చేస్తూనే ఉన్నారు. టాలీవుడ్ లో కూడా ఈ డ్రగ్స్ విషయం చాలా సార్లు కలకలం రేపింది. ప్రముఖ దర్శకుడు, నటులు చాలా మందిని ఈ విషయంలో విచారించడం కూడా జరిగింది. తాజాగా తెలుగు సినీ పరిశ్రమలో మత్తు పదార్ధాల వినియోగం వ్యవహారం మళ్ళీ తెరమీదకు వచ్చింది.

డ్రగ్స్ కేసులో పట్టుబడిన సినీ ఫైనాన్షియర్ కె. వెంకటరత్నారెడ్డి, కాప భాస్కర్ బాలాజీలను టీఎస్ న్యాబ్ పోలీసులు విచారించగా తెలుగు సినీ పరిశ్రమకు, డ్రగ్స్ ముఠాకు ఉన్న సంబంధాలు బయటపడ్డాయి. సినీ పరిశ్రమలో ఉన్నవారు పలువురికి నైజీరియన్లతో సంబంధాలున్నాయిని, వారిదగ్గర నుంచే డ్రగ్స్ సరఫరా అవుతున్నాయిని తెలిసింది.

అప్పుడు విచారణలో చెప్పిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ముగ్గురు నైజీరియన్లను, మహబూబ్ నగర్ మాజీఎంపీ విఠల్ రావు కుమారుడు దేవరకొండ సురేశ్ రావు, దర్శకుడు అనుగు సుశాంత్ రెడ్డి, చిత్ర పరిశ్రమతో అనుబంధం ఉన్న రాంచంద్ మరో ఇద్దర్ని పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి దగ్గర నుంచి 11కోట్ల విలువైన 8 గ్రాముల కొకైన్, 50 గ్రాముల ఎండీఎంఏ, ఎక్టృసీ మాత్రలను స్వాధీనంచేసుకున్నారు.

ఇక హీరో నవదీప్, నిర్మాత ఉప్పలపాటి రవి, హైదరాబాద్ స్నార్ట్ పబ్ యజమాని సూర్యతో పాటూ మరో ఐదుగురు నైజీరియన్లు కూడా చిక్కారు. ఆ తర్వాత బాలాజీ అరెస్ట్ తో వ్యవహారం బయటపడింది. డ్రగ్స్ గురించి ముందుగా బాలాజీ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఇతని ద్వారా మాదాపూర్ లోని ఫ్రెష్ లివింగ్ అపార్ట్ మెంట్ లో రేవ్ పార్టీ నిర్వహిస్తున్న నిర్మాత వెంకటరత్నారెడ్డి, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి మురళిని అరెస్ట్ చేశారు.

తరువాత వారి ఫోన్లలో డేటా, సమాచారాల ఆధారంగా నైజీరియన్ అమోబీ, మైఖేల్, థామస్ లతో పాటూ దేవరకొండ సేరుష్, రాంచంద్ అనే వ్యాపారిని అరెస్ట్ చేశారు. రాంచంద్ ద్వారానే నటుడు నవదీప్ కు డ్రగ్స్ అందాయని తెలుస్తోంది. ప్రస్తుతానికి నవదీప్ వినియోగదారుడిగానే ఉన్నాడు. షాడో నిర్మాత ఉప్పలపాటి రవి, సూర్య, బిస్ట్రో, టెర్రాకేఫ్ యజమాని అర్జున్, విశాఖ వాసి కలహర్రెడ్డిలు కూడా చిక్కారు. వెంకట రత్నారెడ్డి, సందీప్, సూర్య, కలహర్ రెడ్డి, కృష్ణప్రణీత్ లు బాలాజీ నుంచి డ్రగ్స్ తీసుకుని పార్టీలు నిర్వహించేవారని తేలింది.

డ్రగ్స్ ఎలా వస్తున్నాయి?

గతంలో హైదరాబాద్కు చెందిన బ్రోకర్ల ద్వారా డ్రగ్స్ తెప్పించుకున్న సినీ ప్రముఖులు.. ఆ తర్వాత నైజీరియన్లతో సంబంధాలు పెట్టుకుని వారి ద్వారా డ్రగ్స్ దందా నడిపించారు. నైజీరియాకు చెందిన అమోబీ చుక్వుడి బెంగళూరులోని యెలహంక ఫుట్ బాల్ క్లబ్ లో సభ్యుడు. అఖిల భారత నైజీరియా విద్యార్ధి, కమ్యునిటీ సంఘం సభ్యుడిగా కూడా వ్యవహరిస్తున్నాడు. డ్రగ్స్ కేసుల్లో పట్టుబడ్డ తమ దేశస్థులకు బెయిల్ ఇప్పించేందుకు, స్వదేశానికి పంపేందుకు అమోబీ నిధులు సేకరిస్తుంటాడు. అంతేకాదు ఇతను డ్రగ్ డీలర్ కూడా.

మైఖేల్ , థామస్ అనఘా కలూ అనే మరో ఇద్దరు నైజీరియన్లతో కలిసి బెంగళూరు, హైదరాబాద్ లలో పరిచయస్థులకు డ్రగ్స్ అమ్ముతుంటాడు. ఈ ముగ్గురు నైజీరియన్లకు ముందు విశాఖ వాసి రామ్ కిశోర్ అనే డ్రగ్ స్మగ్లర్ తో పరిచయం ఏర్పడింది. ఇతనే నెల్లూరుకు చెందిన కాపా భాస్కర్ బాలాజీకి నైజీరియన్లను పరిచయం చేశాడు. ఆ తర్వాత నుంచి బాలాజీ నైజీరియన్ల దగ్గర డ్రగ్స్ తెచ్చి హైదరాబాద్ లో పార్టీలు నిర్వహించేవాడు. వీటికి టాలీవుడ్ ప్రముఖులు కూడా హాజరయ్యేవారు.

ఈ క్రమంలోనే కిక్, ఢమరుకం, బిజినెస్ మేన్, ఆటోనగర్ సూర్య తదితర సినిమాలకు ఫైనాన్షియర్ గా వ్యవహరించిన గుంటూరుకు చెందిన వెంకటరత్నారెడ్డికి కూడా బాలాజీతో స్నేహం ఏర్పడింది. వెంకట రత్నారెడ్డి కూడా బాలాజీ ద్వారానే డ్రగ్స్ తెప్పించుకునేవాడు. స్నాప్ ఛాట్ లో గాడ్స్ హెడ్ అనే పేరుతో బాలాజీ డ్రగ్స్ విక్రయాలు చేసేవాడు. ఈ మొత్తం వ్యవహారంలో మోడల్ శేత అనే ఆమె కూడా ఉందని విచారణలో తేలింది. ఇలా ఒక్కరి నుంచి మొదలైన డ్రగ్స్ దందా.. నైజీరియన్లతో చాలా మంది సినీ పరిశ్రమకు చెందిన వారితో సంబంధాలు ఉన్నట్లు వెల్లడైంది.

మాదాపూర్లో మళ్లీ…

మదాపూర్ డ్రగ్స్ కేసు కూడా సంచలనం సృష్టించింది. సినీ, రాజకీయ, వ్యాపార వర్గాల్లోని ప్రముఖుల పేర్లు ఒక్కొక్కటిగా బయటపడ్డాయి. మాదాపూర్‌లోని ఫ్రెష్లివింగ్ అపార్ట్‌మెంట్‌లో టీఎస్ న్యాబ్‌ పోలీసులు డ్రగ్స్ పార్టీ భగ్నం చేసిన కేసులో తీగ లాగితే డొంకంతా కదులుతోంది.

ఈ కేసులో అరెస్టయిన ప్రధాన నిందితులు బాలాజీ, కారుమూరి వెంకటరత్నారెడ్డి, దోసకాయలపాటి మురళి.. రిమాండ్‌ రిపోర్టులో సంచలన విషయాల్ని పోలీసులు పొందుపరిచారు. వెంకటరత్నారెడ్డి అలియాస్‌ వెంకట్‌ మోసాలతో కూడబెట్టిన సొమ్ముతో సినీ నిర్మాత అవతారమెత్తాడు. దిల్లీ, ముంబయి, తెలుగు రాష్ట్రాలకు చెందిన యువతులకు సినీ అవకాశాలిప్పిస్తానంటూ వ్యభిచారకూపంలోకి నెట్టేస్తున్నట్టు పోలీసులు నిర్దారించారు. యువతులు, మైనర్లను నగరానికి రప్పించి రేవ్‌పార్టీలో సినీ, రాజకీయ, వ్యాపార వర్గాల్లోని ప్రముఖులకు వల విసురుతున్నట్టు తాజా దర్యాప్తులో గుర్తించారు.

పబ్ పార్టీలకు ప్రత్యేకంగా పిలుపు

వినోదం మాటున కొన్ని పబ్‌ల నిర్వాహకులు మత్తు పదార్థాలు వినియోగిస్తున్నట్లు తేలింది. గచ్చిబౌలి, జూబ్లీహిల్స్‌లోని పబ్‌ల నిర్వాహకులు కల్హర్‌రెడ్డి, అర్జున్, సూర్య వారాంతంలో రేవ్‌ పార్టీలు ఏర్పాటు చేస్తున్నట్టు గుర్తించగా.. వీరంతా సినీ ప్రముఖులను పిలిచేవారు. సినీ నిర్మాతలు, మోడల్స్, పబ్‌ల నిర్వాహకులతో సన్నిహితంగా ఉన్నట్లు ఆధారాలు సేకరించారు.

ఇప్పుడు బెంగళూరు..

తాజాగా బెంగళూరు రేవ్‌ పార్టీకి సంబంధించి సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇందులో 150 మందికి పైగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రముఖులు, కన్నడ, తమిళ సినీ నటులు ఉన్నారని వార్తలు వినిపిస్తున్నాయి. వీరిలో పలువురు నటులు, వ్యాపారవేత్తలు, రాజకీయనేతలు ఉన్నారని టాక్‌ నడుస్తోంది. వీరంతా రెండు రోజులపాటు ఫామ్‌ హౌస్‌ లోనే ఉన్నారని చెబుతున్నారు.

ఇప్పటికే తాము ఈ రేవ్‌ పార్టీలో లేమని ప్రముఖ నటులు శ్రీకాంత్, హేమ, డ్యాన్స్‌ మాస్టర్‌ జానీ మాస్టర్‌ వెల్లడించారు. పోలీసులు మాత్రం హేమ ఉందని అంటున్నారు. బెంగళూరు శివార్లలో హైదరాబాద్‌ కు చెందిన గోపాల్‌ రెడ్డికి చెందిన జీఆర్‌ ఫామ్‌ హౌస్‌ లో రేవ్‌ పార్టీ జరిగిందని పోలీసులు చెబుతున్నారు. ఇందులో పాల్గొన్నవారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారికి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. డాగ్‌ స్క్వాడ్‌ తో తనిఖీలు చేపట్టగా సుమారు 15.56 గ్రా. ఎండీఎంఏ, 6.2 గ్రా. హైడ్రో గంజాయి, కొకైన్‌ లభించాయని పోలీసులు తెలిపారు.

వీటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీంతో ఈ కేసును కర్ణాటక పోలీసులు లోతుగా విచారిస్తున్నారు.హైదరాబాద్‌ లో పోలీసుల తనిఖీలు ఎక్కువగా ఉండటం, డ్రగ్స్, రేవ్‌ పార్టీలపై పోలీసులు ఎక్కువ దృష్టి సారించడంతోనే పార్టీకి బెంగళూరును ఎంపిక చేసుకున్నారని.. అది కూడా ఆ నగర శివార్లలో ఉన్న ఫామ్‌ హౌస్‌ ను ఎంపిక చేసుకున్నారని చెబుతున్నారు. ‘సన్‌సెట్‌ టూ సన్‌ రైజ్‌ విక్టరీ’ పేరుతో ఒక వ్యాపారి తన పుట్టినరోజు సందర్భంగా పార్టీ ఇచ్చినట్టు పోలీసులు ఇప్పటికే నిర్ధారించారు.

ఆదివారం సాయంత్రం నుంచి సోమవారం తెల్లవారుజాము వరకు పార్టీ నిర్వహించాలని ప్రణాళిక వేసుకున్నట్టు తెలుస్తోంది. అయితే బర్త్‌ డే పార్టీ పేరిట రేవ్‌ పార్టీ జరిగిందని.. ఇందులో డ్రగ్స్‌ వినియోగించినట్టు సమాచారం. రేవ్‌ పార్టీ బాధ్యతలను అరుణ్‌ అనే వ్యక్తి నిర్వహించినట్టు తెలుస్తోంది. వాసు బర్త్‌ డే పార్టీకి డ్రగ్‌ పెడ్లర్లు సిద్ధిఖీ, రణధీర్, రాజ్‌ కూడా హాజరయ్యారు. ఈ నేపథ్యంలో రేవ్‌ పార్టీ ఇచ్చిన వాసు గురించి పూర్తి వివరాలను తెలుసుకునే పనిలో పోలీసులు ఉన్నారు.

డ్రగ్‌ ప్లెడ్లర్‌ లతో అతడికి ఉన్న సంబంధాలపైనా ఆరా తీస్తున్నారు. ఇప్పటికే అతడిపై ఉన్న పాత కేసుల వివరాలను కూడా తెలుసుకుంటున్నారు. కాగా రేవ్‌ పార్టీకి సంబంధించి ఇప్పటికే వాసు, అరుణ్, సిద్ధిఖీ, రణధీర్, రాజ్‌ లను పోలీసులు అరెస్ట్‌ చేశారు. రేవ్‌ పార్టీలో పాల్గొన్నవారిని అదుపులోకి తీసుకుని.. వారికి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు.

రేవ్ పార్టీ కోసమే సినీ తారలు..

ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా వినిపిస్తోన్న మాట రేవ్ పార్టీ. బెంగళూరులో జరిగిన ఓ రేవ్ పార్టీలో పాల్గొన్న వారిలో ఎక్కువ మంది తెలుగు వాళ్లే ఉన్నారని.. అందులోనూ రాజకీయ, సినీ ప్రముఖులు ఉన్నారని అక్కడి పోలీసులు తేల్చారు. ఈ క్రమంలో.. రేవ్ పార్టీ కోసమే చిత్రసీమ నుంచి తారలను తీసుకెళ్లినట్లు తేల్చారు.

బెంగళూరు రేవ్ పార్టీలో వంద మందికి పైగా సెలబ్రెటీలు, రాజకీయ నేతల కుమారులు, బడాబాబుల పిల్లలు పాల్గొన్నారని, అందులో తెలుగు రాష్ట్రాలకు చెందిన వ్యక్తులే ఎక్కువగా ఉన్నారని టాక్ నడుస్తోంది. తెలుగు ఇండస్ట్రీకి చెందిన వాళ్లలో నటి హేమ పాల్గొన్నారంటూ పోలీసులు చెప్తుంటే… నేను లేను బాబోయ్ అని ఆమె వీడియోలు విడుదల చేస్తోంది. హీరో శ్రీకాంత్, డ్యాన్స్ మాస్టర్ జానీ కూడా ఉన్నారంటూ వార్తలు వైరల్ అవుతుంటే.. అది మేము కాదు అంటూ వాళ్లు కూడా క్లారిటీ ఇచ్చారు. ఇదంతా పక్కన పెడితే.. టాలీవుడ్సినీ ఆర్టిస్టులను కేవలం రేవ్ పార్టీ కోసమే పిలిచారనేది ఇప్పుడు చెప్తున్న అసలు రహస్యం.

నిజానికి, దేశంలో పాశ్చాత్య సంస్కృతి రోజు రోజుకు పెరిగిపోతుంది. ఈ క్రమంలోనే.. పశ్చిమ దేశాల్లో ఉన్న కల్చర్ ఇక్కడికి కూడా పాకుతోంది. సెలెబ్రిటీలు, డబ్బున్న బడాబాబులు.. అక్కడే చదువుకోవటమో, లేదా తీరిక సమయాల్లో అక్కడికి వెళ్లి తనివితీరా ఎంజాయ్ చేసి వస్తుండటమో జరుగుతోంది. ఇలా అక్కడున్న కొన్ని కల్చర్ల రుచికి అలవాటు పడిన సెలెబ్రిటీలు, ప్రముఖుల పిల్లలు.. అదే ‘ట్రెండ్’ను ఇక్కడ కూడా కొనసాగించే ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగా వచ్చిందే ఈ రేవ్ పార్టీ.

రేవ్ పార్టీ కల్చర్‌ అనేది 1950లో ఇంగ్లండ్‌లో మొదలై.. మెల్లిగా ప్రపంచమంతా వ్యాపించింది. ఈ కల్చర్ ప్రారంభమైన కొత్తల్లో.. క్లోజ్డ్ ఏరియాలో పెద్దగా మ్యూజిక్‌ పెట్టుకోనో, లేదా లైవ్ పర్‌ఫార్మెన్స్ ఇవ్వటమే.. దానికి మైమరిచిపోతూ డ్యాన్స్‌ చేస్తూ ఎంజాయ్‌ చేయటం ఉండేది. ఇక.. పాశ్చత్య దేశాల్లో సాధారణంగానే మద్యం సేవించే అలవాటు ఉండటంతో.. అది కూడా కంటిన్యూ అయ్యేది. కాగా.. రాను రానూ ఈ పార్టీకి అర్థం మారుతూ వస్తోంది. వైల్డ్‌ బిహేవియర్‌తో చేసుకునే పార్టీలకు రేవ్‌ పార్టీలు అని పిలవడం మొదలుపెట్టారు.

క్రమక్రమంగా ఈ రేవ్‌ పార్టీ కల్చర్‌.. చట్ట విరుద్ధమైన కార్యకలాపాలకు వేదికవ్వటం ప్రారంభమైంది. రేవ్ పార్టీలు చాలా గోప్యంగా సాగుతున్నాయి. దానికి కారణం ఈ పార్టీల్లో సెలెబ్రిటీలు, ప్రముఖుల పిల్లలు మాత్రమే పాల్గొనటం ఒక ఎత్తయితే.. ఈ పార్టీల్లో మద్యంతో పాటు డ్రగ్స్, అమ్మాయిలు ఇలా.. చాలానే యవ్వారం జరుగుతుందని టాక్. ముఖ్యంగా యువత ఈ పార్టీల్లో విచ్చలవిడిగా డ్రగ్స్ సేవిస్తూ.. అశ్లీల నృత్యాలు చేయటం.. అదీ హద్దు మీరి శృంగార కార్యకలాపాలు జరుగుతాయని, అన్నింటికీ అన్ని రకాలుగా రెడీ అయిన వాళ్లే ఈ పార్టీల్లో పాల్గొంటారని పోలీసులు తేల్చారు.

అయితే, సాధారణంగానే రేవ్ పార్టీలంటే చాలా ఖరీదైన వ్యవహారం. బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీకి ఎంట్రీ ఫీజే సుమారు 50 లక్షల వరకు వెచ్చించినట్లు అనుమానిస్తున్నారు. ఎందుకంటే ఈ రేవ్ పార్టీలకు సినీ ఆర్టిస్టులను పిలిచి, వారితో అశ్లీల నృత్యాలు చేయించినట్లు పోలీసులు గుర్తించారు. ఈ రేవ్ పార్టీని బడాబాబుల ఫామ్ హౌసులోనో, గెస్ట్ హౌసుల్లోనో నిర్వహించగా.. 24 గంటల నుంచి 3 రోజుల వరకు నిర్వహించే ప్లాన్ చ ఏశారు. అందుకు తగ్గట్టుగానే ఫుడ్‌, కూల్‌డ్రింక్స్, ఆల్కహాల్, సిగరెట్లతో పాటు రకరకాల డ్రగ్స్‌ కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ శృంగార కార్యక్రమాల కోసం ప్రత్యేకంగా గదులు కూడా ఏర్పాటు చేశారని వెల్లడైంది.

మనోళ్లు మారరా?

ఇటు గోవా.. అటు బెంగళూరు.. చెన్నై.. స్థానికంగా హైదరాబాద్.. ఇలా రేవ్ పార్టీలకు మాకం మారుస్తున్నారు. డ్రగ్ ఫ్లెడ్లర్లతో చిత్రసీమకు విడదీయలేని బంధం కొనసాగుతుండటంతో.. ఎక్కడ పార్టీ జరిగినా మన చిత్రసీమే ముందు బయటకు వస్తుంది. ఒక్కరో.. ఇద్దరో కాదు.. పదుల సంఖ్యలో డ్రగ్స్ పార్టీలకు పరుగులు పెడుతున్నారు. కొంతమందిని నిర్వాహకులే పిలుస్తుంటే.. మరికొంతమంది టికెట్లు కొని వెళ్తున్నారు.

ప్రత్యేక ఆకర్షణ కోసం కొందరు చిత్ర పరిశ్రమ అమ్మాయిలను పిలిచి, వారితో నృత్యాలు చేయిస్తున్నారు. డ్రగ్స్ ఇచ్చి.. ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. వీళ్లకు కూడా పార్టీకి పార్టీ.. డబ్బులకు డబ్బులు.. మత్తుకు మత్తు అన్నట్టుగా సాగుతుండటంతో.. రేవ్ పార్టీ అనగానే పరుగులు పెడుతున్నారు. ఇప్పటికే 2017 నుంచి డ్రగ్స్ వ్యవహారంలో సినీ ఇండస్ట్రీ బయటకు రావడం లేదు. క్లీన్ చీట్ ఇచ్చినా.. ఎక్కడో ఓచోట పేర్లు బయటకు వస్తూనే ఉన్నాయి. ఇంత జరుగుతున్నా.. మన చిత్ర పరిశ్రమ మత్తు నుంచి బయటకు రాకపోవడం విచారకరమే.

ఇటీవలె టాలీవుడ్‌లో డ్రగ్స్‌ హంగామా బాగా ఎక్కువయిపోయింది. రీసెంట్‌గా జరిగిన బెంగళూరు రేవ్ పార్టీలో పాల్గొన్నవారిలో టాలీవుడ్ కి చెందినవారు అనేకమంది ఉన్నట్లు సమాచారం. టాలీవుడ్‌ క్యారెక్టర్ ఆర్టిస్ట్ హేమ పేరు, ఫోటోలను పోలీసులు విడుదల చేసింది. అయితే తాను ఆ రేవ్ పార్టీకి వెళ్లలేదని ..హైదరాబాద్ లోనే ఉన్నానంటూ బుకాయించి మరీ వీడియో రిలీజ్ చేసింది మహానటి హేమ.

ఆరోజు బర్త్ డే పార్టీ పేరుతో ఏర్పాటు చేసిన రేవ్ పార్టీలో పాల్గొన్న వారందరికి డ్రగ్స్ టెస్ట్ చేశారు పోలీసులు. ఇందులో భాగంగానే డ్రగ్స్ టెస్ట్‌లో తెలుగు సినీ నటి హేమకు పాజిటీవ్ వచ్చినట్లుగా అధికారులు బయటపెట్టారు. ఇప్పుడు ఈవార్త ఇండస్ట్రీలో దుమారం రేపుతోంది. యాక్టర్ హేమ రక్త నమూనాల్లో డ్రగ్స్ ఉన్నట్టు గుర్తించారు బెంగుళూరు పోలీసులు.

మొత్తం 150 మంది రక్తనమూనాలను సేకరించిన పోలీసులు డ్రగ్స్ టెస్ట్‌లో 84 మందికి పైగా వ్యక్తులకు పాజిటీవ్‌ నిర్ధారణమైంది. అయితే ఆరోజు పార్టీకి వెళ్లిన వారిలో 57 మంది పురుషులు, 27 మంది మహిళలు ఉన్నారు. అయితే డ్రగ్ టెస్ట్‌లో పాజిటివ్ వచ్చిన వాళ్లలో మిగతా ప్రముఖుల పేర్లు బయటకు రావాల్సి ఉంది.

Leave a Reply