Suryaa.co.in

Telangana

బహుళార్థక సాధక ప్రాజెక్టుల నిర్మాణాల వల్లనే రికార్డు స్థాయిలో వరి ధాన్యం ఉత్పత్తి

– కాళేశ్వరం తో వరి ఉత్పత్తి జరుగుతుందని చెప్పిన బిఆర్ఎస్ ది అసత్య ప్రచారమని తేలిపోయింది
– రాష్ట్ర చరిత్రలో ఎన్నడు లేని విధంగా బడ్జెట్లో వ్యవసాయానికి రూ.72వేల కోట్లు కేటాయించిన ప్రజా ప్రభుత్వం
– దేశంలో ఒకే రోజు రూ.18 వేల కోట్లు రుణమాఫీ చేసి దేశానికి రోల్ మోడల్ గా నిలిచిన తెలంగాణ
– ఇందిరాగాంధీ వ్యవసాయ ప్రతిభా పురస్కారాల అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
– పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తో కలిసి ఇండియా గుండె చప్పుడు ఇందిరా అనే పుస్తకాన్ని ఆవిష్కరించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

హైదరాబాద్: కాళేశ్వరంతో సంబంధం లేకుండా ఈ సంవత్సరం తెలంగాణలో రికార్డు స్థాయిలో వరి ధాన్యం ఉత్పత్తి కావడానికి దూర దృష్టితో ఆనాటి కాంగ్రెస్ పాలకులు నిర్మాణం చేసిన బహుళార్థక సాధక ప్రాజెక్టుల వల్లనే సాధ్యమైందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. ప్రజా పాలన విజయోత్సవాల్లో భాగంగా పిసిసి ఆధ్వర్యంలో నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో నిర్వహించిన ఇందిరా గాంధీ వ్యవసాయ ప్రతిభా పురస్కారాల అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హాజరయ్యారు.

ఆదర్శ రైతులకు, శాస్త్రవేత్తలకు ఈ సందర్భంగా అవార్డులను ప్రధానం చేశారు. ఇండియా గుండె చప్పుడు ఇందిరా అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. అనంతరం సభలో రైతులను ఉద్దేశించి డిప్యూటీ సీఎం మాట్లాడుతూ కాళేశ్వరం వల్లే తెలంగాణలో వరి సాగు పెరిగిందన్న బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తుందని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పిన విషయం నేడు వాస్తవమైందన్నారు.

కాళేశ్వరంలో భాగమైన మేడిగడ్డ కుంగి… నీటిని నిల్వ చేసే పరిస్థితి లేకపోయినా… ఎన్డీఎస్ఎ సూచన మేరకు అన్నారం, సుందిళ్లలో నీటిని నిల్వ చేయకపోయినా ఈ సంవత్సరం వరి ఉత్పత్తి పెరగడానికి ఆనాటి కాంగ్రెస్ పాలకులు కృష్ణా నదిపై నాగార్జునసాగర్, శ్రీశైలం, జూరాల, నెట్టెంపాడు, కోయిల, కల్వకుర్తి ఎత్తిపోతల, గోదావరి నదిపై ఎస్సారెస్పీ, దేవాదుల, శ్రీపాద ఎల్లంపల్లి తదితర బహుళార్థక సాధక ప్రాజెక్టులు నిర్మాణం చేసి రైతులకు సాగునీరు అందించిన ఫలితమే అన్నారు.‌

“దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆహార ధాన్యాల ఉత్పత్తి దేశ ప్రజలకు సరిపోయేత లేవు, ఉత్పత్తి పెరగాలంటే వ్యవసాయం చేసే వాళ్ళు పెరగాలని, భూ సంస్కరణల చట్టం తీసుకొచ్చి కొద్ది మంది చేతుల్లో ఉన్న లక్షల ఎకరాల భూములను పేదలకు పంచి లక్షల మంది రైతులను తయారు చేసిన ఘనత దివంగత ప్రధాని ఇందిరాగాంధీకే దక్కుతుందన్నారు.‌

ప్రపంచంలోని అనేక దేశాలకు ఆహార ఉత్పత్తుల ఎగుమతి చేసే విధంగా పంచవర్ష ప్రణాళికలో వ్యవసాయ రంగాన్ని చేర్చిన ముందు చూపు ఉన్న దార్శనీకురాలు ఇందిరా గాంధీ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, వ్యవసాయ కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE